అమెరికా 500 శాతం సుంకాలు విధిస్తే ఏమవుతుంది? భారత్ ముందున్న ఆప్షన్లు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం వరకు సుంకాలు విధించే కొత్త బిల్లుపై అమెరికాలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి.
‘రష్యన్ శాంక్షన్స్ బిల్’గా పిలిచే ఈ బిల్లును ‘ది లిండ్సే గ్రాహం బిల్’ అని కూడా అంటున్నారు. ఎందుకంటే, అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే.. భారత్, చైనా వంటి దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికాకు అవకాశం లభిస్తుంది.
దీంతో, ఈ దేశాలు రష్యా నుంచి చౌకగా లభించే చమురు కొనుగోళ్లను ఆపివేస్తాయన్నది అమెరికా పాలకుల ఉద్దేశం.
ఇలాంటి పరిస్థితుల్లో.. భారత్ దగ్గర ఉన్న ఆప్షన్లు ఏంటి?

రెండే ఆప్షన్లు
మొదటి ఆప్షన్: అమెరికా విధించిన 500 శాతం సుంకాలను ఎదుర్కోవడం
రెండో ఆప్షన్: రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపివేయడం.
అమెరికా అధ్యక్షుడు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుండటంతో.. ఆయన దూకుడుకు ఏమైనా పరిమితులు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
సెనేటర్ బ్లూమెంథాల్, మరికొందరితో కలిసి తాను నెలలు తరబడి శ్రమించి రూపొందించిన 'రష్యన్ శాంక్షన్స్ బిల్’కు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గ్రాహం పేర్కొన్నారు. బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.
చౌకగా లభించే రష్యా చమురును కొనుగోలు చేస్తూ, పుతిన్ 'వార్ మిషన్'కు సాయపడుతోన్న దేశాలను శిక్షించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్‌కు ఈ బిల్లు వీలు కల్పిస్తుందని గ్రాహం తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నది వాస్తవం.
కానీ, అమెరికా సుంకాల తర్వాత, విడుదలైన చాలా గణాంకాల్లో.. రష్యా నుంచి భారత చమురు దిగుమతుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది.
ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే.. భారత్‌పై 500 శాతం వరకు సుంకం విధిస్తుందా? ఒకవేళ విధిస్తే, భారత్‌పై దీని ప్రభావమెంత?
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ దీనిపై మాట్లాడుతూ.. ''ఇదిగనుక జరిగితే.. అమెరికాకు భారత ఎగుమతులు ఆగిపోతాయి. అంటే.. అమెరికాకు వెళ్లే 87.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,88,599 కోట్ల) విలువైన భారతీయ ఎగుమతులు ప్రమాదంలో పడతాయి'' అని అన్నారు.
‘‘ఇప్పటి వరకు భారత్‌పై ట్రంప్ సొంతంగా సుంకాలను విధిస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఈ బిల్లును కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందుతుందని అనుకోవడం లేదు. భారత తన విధానాన్ని స్పష్టం చేయాలి. ఒక సార్వభౌమ దేశంగా రష్యా నుంచి చమురును భారత్ కొనుగోలు చేసుకోవాలనుకుంటే, దాన్ని బహిరంగంగా చెప్పాలి. కొనొద్దు అనుకుంటే అది కూడా చెప్పాలి. అమెరికా సుంకాలతో కలిగే నష్టాలను ఎదుర్కొంటూ, రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవడం అనే రెండు పనులు చేయడం మంచిదికాదు'' అని అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.
అమెరికా మీడియా అవుట్‌లెట్ బ్లూమ్‌బర్గ్ పేర్కొన్న వివరాల్లో.. ‘‘ రష్యా నుంచి భారత చమురు దిగుమతులు జూన్ నెలలో రోజుకు 21 లక్షల బ్యారెళ్లతో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. డిసెంబర్ నెలలో 40 శాతం తగ్గాయి. వ్లాదిమిర్ పుతిన్ వార్ మిషన్‌కు చేరుతోన్న క్యాష్ ఫ్లోను నిలిపివేసేందుకు, యుక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ప్రారంభించిన ప్రయత్నాలకు.. దీన్ని ఆయన సాధించిన గణనీయమైన విజయంగా చూడొచ్చు. 2024లో భారత్ 87.4 బిలియన్ డాలర్ల (రూ.7,88,599 కోట్ల) విలువైన ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. దేశ మొత్తం ఎగుమతుల్లో ఇవి సుమారు ఐదో వంతు'' అని తెలిపింది.
అయితే, అమెరికా అధ్యక్షుడి దూకుడు ఇక్కడితో ఆగుతుందా?
న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. గ్లోబల్ పవర్స్‌కు ఏమైనా పరిమితులు ఉన్నాయా? అని ట్రంప్‌ను అడిగినప్పుడు, ‘‘ఎస్, ఒకటుంది. అది నా నైతికత. నా సొంత ఆలోచన. అదొక్కటే నన్ను ఆపగలదు'' అని అన్నారు.
''నాకు అంతర్జాతీయ చట్టం అవసరం లేదు. నేను ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించడం లేదు'' అని ట్రంప్ చెప్పారు.
ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాలను పాటిస్తుందా? అని అడిగినప్పుడు, ''నేను పాటిస్తాను. కానీ, అది నేనే నిర్ణయిస్తాను. అంతర్జాతీయ చట్టానికి మీ నిర్వచనం ఏంటన్న దానిపై అది ఆధారపడి ఉంటుంది'' అని సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా మళ్లీ ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తుందా?
సుంకాలను 500 శాతం పెంచుకునేలా అమెరికాలో ఈ బిల్లును తీసుకురావడంతో పాటు.. భారత నేతృత్వంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఏ) వంటి పలు అంతర్జాతీయ సంస్థల నుంచి తనకు తానుగా అమెరికా వైదొలిగింది.
ఐఎస్ఏ నుంచి వైదొలగాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
భారత్, ఫ్రాన్స్ కలిసి ఈ సంస్థను స్థాపించాయి. 90కి పైగా సభ్య దేశాలున్న ఈ అంతర్జాతీయ సంస్థ.. న్యూదిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది.
భారత్‌లో అమెరికా అంబాసిడర్‌గా ఉన్న సెర్గియో గోర్ ఈ వారం న్యూదిల్లీ రానున్న సమయంలో అమెరికా నుంచి ఈ ప్రకటన వెలువడింది. జనవరి 12 నుంచి భారత్‌లో అమెరికా రాయబారిగా, దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారిగా సెర్గియో గోర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
''దేశాలు పవర్‌ను బ్యాలెన్స్ చేసేందుకు మాత్రమే కాక, వారు ఎదుర్కొనే ముప్పుల ఆధారంగా కూడా కూటములుగా ఏర్పడతాయి. ఒకవేళ అమెరికా ఇలానే హద్దులు లేకుండా సూపర్ పవర్‌గా వ్యవహరిస్తే.. దానికి వ్యతిరేకంగా అధికారాన్ని బ్యాలెన్స్ చేసే మరిన్ని కూటములు ఏర్పడతాయి'' అని అమెరికా నిర్ణయాలపై 'ది హిందూ' ఇంటర్నేషనల్ ఎడిటర్ స్టాన్లీ జానీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.
''అత్యంత దూకుడు నిర్ణయంగా కనిపిస్తున్న ఈ 500 శాతం సుంకాల చట్టాన్ని కనుక అమలు చేస్తే.. అమెరికాతో ఉన్న 'సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి' చెందిన ప్రాథమిక సూత్రాన్ని భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో పున:పరిశీలించాల్సి ఉంటుంది'' అని ఆయన అన్నారు.
వార్తా సంస్థ రాయిటర్స్ కూడా ఒక రిపోర్టులో ఇలాంటి భాగస్వామ్యాలను భారత్ పరిశీలిస్తోందని పేర్కొంది.
ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ నివేదించిన రాయిటర్స్... ప్రభుత్వ కాంట్రాక్టులకు బిడ్డింగ్ వేసే విషయంలో చైనా కంపెనీలపై ఉన్న ఐదేళ్ల నాటి ఆంక్షలను ఎత్తివేయాలని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోందని పేర్కొంది.
2020లో గల్వాన్ లోయలో రెండు దేశాల సైన్యాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్న తర్వాత ఈ ఆంక్షలను విధించింది ప్రభుత్వం.
ఈ నిబంధనల కింద.. చైనా కంపెనీలు భారత ప్రభుత్వ కమిటీ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. బిడ్డింగ్‌కు వెళ్లే ముందే రాజకీయ, భద్రతా అనుమతులు పొందాలి.

ఫొటో సోర్స్, Reuters
భారత్ 500 శాతం సుంకాన్ని ఎదుర్కోనుందా?
ఈ బిల్లుపైనా, అమెరికా వ్యూహంపైనా ఫారిన్ పాలసీ థింక్ ట్యాంక్ అనంత సెంటర్ సీఈఓ ఇంద్రాణి బాగ్చి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు.
‘‘ లిండ్సే గ్రాహం రూపొందించిన ఈ బిల్లు గత తొమ్మిది నెలలుగా నిలిచిపోయింది. యుక్రెయిన్ భవిష్యత్ కోసం యూరోపియన్ యూనియన్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం దీన్ని తీసుకొచ్చారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ రెండూ తమ తుది ప్రతిపాదనను రష్యా ముందు ఉంచేందుకు సిద్ధమవుతున్నాయి'' అని ఇంద్రాణి బాగ్చి రాశారు.
‘‘ఇదంతా భారత్‌కు ప్రతికూలమే. కానీ, అసలైన లక్ష్యం చైనానే. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తే, దానికి ప్రతిఫలంగా.. యుక్రెయిన్‌కు సంబంధించిన డీల్ విషయంలో యూరోపియన్ యూనియన్ అంగీకారం తెలుపుతుండొచ్చు. ఈ డీల్‌లో భాగంగా మాస్కోకు అనుకూలంగా కీయెవ్ కొన్ని భూభాగాల విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది'' అని తెలిపారు.
''భారత విధానం ఎప్పుడూ వాస్తవికత, ఆచరణాత్మక ఆలోచనల ఆధారంగా ఉంటుంది. దీని ఆధారంగా, భారత్ త్వరలోనే రష్యా నుంచి చమురు దిగుమతులను జీరోకు తీసుకు వస్తుందని నమ్ముతున్నా. భారత్ ఇప్పటికే 50 శాతం సుంకంతో ఇబ్బందులు పడుతోంది. 500 శాతం సుంకాలైతే అసలు భరించలేదు'' అని అన్నారు.
డిసెంబర్, జనవరిలో రష్యా నుంచి భారత చమురు దిగుమతులు బాగా తగ్గాయని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె రాశారు.
రష్యా చమురు లేకపోయినా భారత్‌కు ఏమీ కాదని ఇంద్రాణి బాగ్చి అన్నారు. కొనుగోలుదారుగా ఉన్న భారత్‌ను కోల్పోయిన తర్వాత కూడా రష్యా తనకు తాను నిలదొక్కుకోగలదని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు స్థిరంగా ఉండటమే దీనికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.
గత ఏడాది కాలంగా భారత్-అమెరికా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని ఇంద్రాణి అంటున్నారు. మరికొంత కాలం కూడా ఇలానే ఉండే అవకాశం ఉందన్నారు.
500 శాతం సుంకాలు విధించే అమెరికా బిల్లును ఉద్దేశిస్తూ రాసిన ఇంద్రాణి బాగ్చి, '' అమెరికా కాంగ్రెస్ పాస్ చేసే అవకాశం ఉన్న ఈ బిల్లులో, కొన్ని మినహాయింపులు ఇచ్చే అధికారం అధ్యక్షునికి ఉంటుంది. ఏదైనా ట్రాన్స్-అట్లాంటిక్ అగ్రిమెంట్‌లో యూరోపియన్ యూనియన్ కొన్ని ప్రత్యేక మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. అంటే.. యూరోపియన్ యూనియన్ ఎలాంటి ఆంక్షలు లేకుండా రష్యా ఎనర్జీని కొనుగోలు చేయొచ్చు. అమెరికా ఇప్పటికే రష్యా నుంచి యురేనియాన్ని కొంటోంది’’ అని ఇంద్రాణి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా తప్పించుకోగలదా?
‘ఎకనామిక్ టైమ్స్’ ఇటీవల రాసిన కథనంలో ఈ బిల్లు భారత్‌ను ప్రధానంగా లక్ష్యం చేసుకున్నట్లు ఉందని పేర్కొంది. చైనా చాలా వరకు సేఫ్‌గా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యన్ చమురును అత్యధికంగా కొనుగోలు చేసే దేశాలలో ఉన్నాయి. ఈ బిల్లు మూడింటినీ లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటి వరకు రష్యా చమురు కొంటున్నందుకు భారత్‌పై మాత్రమే 25 శాతం సుంకాన్ని పెనాల్టీగా విధించింది అమెరికా. బీజింగ్ ఈ చర్యల నుంచి తప్పించుకుందని ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది.
''ఒకవేళ ఈ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందినా.. ఆచరణలో కేవలం భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. ఇదే సమయంలో చైనా సురక్షితంగా దానికి అందనంత దూరంలో ఉంటుంది'' అని వాణిజ్య నిపుణులు అజయ్ శ్రీవాస్తవ ఆ పత్రిక కథనంలో అభిప్రాయపడ్డారు.
‘‘500 శాతం సుంకం అమెరికాకు ఎగుమతయ్యే భారత వస్తువులు, సేవలను అడ్డుకుంటుంది’’ అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) తన కథనంలో పేర్కొంది.
‘‘మనం ఇప్పటికే 25 శాతం సుంకం చెల్లిస్తున్నాం. ఒకవేళ 500 శాతం సుంకం చెల్లిస్తే, అమెరికాలో ఎవరూ భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను కొనుగోలు చేయలేరు. వీలైనంత త్వరగా మనం ప్రత్యామ్నాయ మార్కెట్లను కనుక్కోవాలి'' అని మాజీ వాణిజ్య కార్యదర్శి అజయ్ దువా సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














