ట్రంప్‌కు వెనెజ్వెలా చమురు కావాలి, మరి ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆర్చీ మిషెల్, నటాలీ షెర్మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాట్లాడుతూ వెనెజ్వెలా చమురు నిల్వలను వెలికితీయడం ప్రారంభిస్తామని చెప్పారు.
అంతేకాదు, వెనెజ్వెలా ప్రభుత్వంలో 'సురక్షితమైన మార్పు జరిగే వరకు అమెరికా ఆ దేశాన్ని నడిపిస్తుంది' అన్నారు.
వెనెజ్వెలాలో ప్రపంచంలోనే భారీ చమురు నిల్వలు ఉన్నాయి, కానీ వాటిలో ఎక్కువ భాగం వాడుకలో లేవు. దీంతో, ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి అమెరికన్ చమురు కంపెనీలు అక్కడ బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని ట్రంప్ కోరుకుంటున్నారు.
తీవ్రంగా దెబ్బతిన్న వెనెజ్వెలా ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ను అమెరికన్ కంపెనీలు బాగు చేసి, దేశానికి తిరిగి డబ్బు సంపాదించడానికి సహాయపడతాయని ట్రంప్ అంటున్నారు.
అయితే, ట్రంప్ ప్రణాళికతో ముడిపడి ఉన్న సవాళ్ల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు వేలాది కోట్లు ఖర్చవుతుందని, చమురు ఉత్పత్తిని పెంచడానికి పదేళ్ల వరకు సమయం పట్టవచ్చని అంటున్నారు.
మరి, వెనెజ్వెలా చమురును అమెరికా నిజంగా తన ఆధీనంలోకి తీసుకోగలదా? ట్రంప్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?


ఫొటో సోర్స్, Reuters
303 బిలియన్ బ్యారెళ్ల చమురు
వెనెజ్వెలా వద్ద దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల నిర్ధారిత చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. అయితే, భూగర్భంలో ఉన్న నిల్వతో పోలిస్తే చాలా తక్కువ చమురును ఆ దేశం ఉత్పత్తి చేస్తోంది.
2000ల ప్రారంభం నుంచి చమురు ఉత్పత్తి బాగా తగ్గింది. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్, తరువాత అధ్యక్షుడు నికోలస్ మదురోలు ప్రభుత్వ చమురు సంస్థ పీడీవీఎస్ఏపై నియంత్రణను పెంచడంతో ఇలా జరిగింది. చాలామంది నైపుణ్యమున్న, అనుభవజ్ఞులైన కార్మికులు ఆ సంస్థ నుంచి బయటికి వెళ్లిపోయారు.
అమెరికా కంపెనీ చెవ్రాన్‌తో సహా కొన్ని పాశ్చాత్య చమురు కంపెనీలు ఇప్పటికీ వెనెజ్వెలాలో పనిచేస్తున్నాయి. మరోవైపు, మదురో ప్రధాన ఆదాయ వనరులలో ఒకటైన చమురు సరఫరాను పరిమితం చేసే ఉద్దేశంతో అమెరికా తన ఆంక్షలను పెంచింది, చమురు ఎగుమతులను పరిమితం చేసింది. దీంతో కంపెనీల కార్యకలాపాలు తగ్గాయి.
ఆంక్షలకు కారణం?
2015లో బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలతో అమెరికా మొదటిసారి వెనెజ్వెలాపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు వెనెజ్వెలాకు విదేశీ పెట్టుబడులు, దాని చమురు పరిశ్రమకు అవసరమైన విడిభాగాలను పొందకుండా నిలిపివేశాయి.
"వెనెజ్వెలా దాని మౌలిక సదుపాయాల విషయంలో అతిపెద్ద సవాలు ఎదుర్కొంటోంది" అని ఇన్వెస్టెక్‌లోని కమోడిటీస్ హెడ్ కల్లమ్ మాక్‌ఫెర్సన్ అంటున్నారు.
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తాజా నివేదిక ప్రకారం, వెనెజ్వెలా నవంబర్‌లో రోజుకు దాదాపు 8.6 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసింది. ఇది పదేళ్ల కింద దేశం ఉత్పత్తి చేసిన దానిలో మూడింట ఒక వంతు, ప్రపంచ చమురు వినియోగంలో 1 శాతం కంటే తక్కువ.
వెనెజ్వెలా చమురు ఎక్కువగా మందంగా ఉండే, పుల్లని ఆయిల్, శుద్ధి చేయడం కష్టం. దీనిని ప్రధానంగా డీజిల్, తారు తయారీకి ఉపయోగిస్తారు. అమెరికా మాత్రం చాలావరకు "తేలికపాటి, తీపి"ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని శుద్ధి చేయడం సులువు, పెట్రోల్ తయారీకి ఉపయోగిస్తుంటారు.
మదురోను అదుపులోకి తీసుకునే ముందు, వెనెజ్వెలా తీరానికి సమీపంలో ఉన్న రెండు చమురు ట్యాంకర్లను కూడా అమెరికా స్వాధీనం చేసుకుంది. అలాగే ఆంక్షలకు గురైన ట్యాంకర్లు దేశంలోకి ప్రవేశించకుండా, బయటికి వెళ్లకుండా దిగ్బంధించాలని ఆదేశించింది.
నిపుణులు ఏమంటున్నారు?
వెనెజ్వెలాలోని చమురు కంపెనీలకు అతిపెద్ద సమస్యలు చట్ట, రాజకీయమైనవని కెప్లర్(డేటా ప్లాట్ ఫామ్)లో సీనియర్ చమురు విశ్లేషకులు హోమయూన్ ఫలక్షాహి అన్నారు.
వెనెజ్వెలాలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోకపోతే కంపెనీలు తవ్వకాలు ప్రారంభించలేవని ఆయన బీబీసీతో చెప్పారు. అధ్యక్షుడు మదురో స్థానాన్ని భర్తీ చేసిన తర్వాతే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ, కంపెనీలు వేలాది కోట్లను పెట్టుబడిగా పెట్టడం పెద్ద రిస్క్ అని, ఎందుకంటే వెనెజ్వెలా కొత్త ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని వారు కచ్చితంగా చెప్పలేరని అన్నారాయన.
'' స్థిరమైన రాజకీయ పరిస్థితిలో కూడా, ఈ ప్రక్రియకు చాలా నెలలు పడుతుంది'' అని ఫలక్షాహి అన్నారు.
ట్రంప్ ప్రణాళికను సద్వినియోగం చేసుకోవాలని ఆశించే కంపెనీలు, వెనెజ్వెలా మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టేముందు, కొత్త ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
'ప్రపంచంలో చమురు కొరత లేదు'
వెనెజ్వెలా చమురు ఉత్పత్తిని మునుపటి స్థాయికి తీసుకురావడానికి లక్షల కోట్ల రూపాయలు, పదేళ్ల వరకు సమయం పడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ చమురు సరఫరా లేదా ధరలపై ట్రంప్ ప్రణాళిక ప్రభావం తక్కువగానే ఉంటుందని క్యాపిటల్ ఎకనామిక్స్‌లో గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ నీల్ షీరింగ్ అన్నారు.
అనేక అడ్డంకులు ఉన్నాయని, ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని, 2026లో చమురు ధరలు పెద్దగా మారే అవకాశం లేదని ఆయన బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు.
వెనెజ్వెలాలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడే వరకు కంపెనీలు పెట్టుబడులు పెట్టవని, అందుకే చమురు ఉత్పత్తి పెరగడానికి చాలా సంవత్సరాలు పడుతుందని షీరింగ్ అభిప్రాయపడ్డారు. వెనెజ్వెలా చమురు పరిశ్రమ దశాబ్దాలుగా తక్కువ పెట్టుబడి, దుర్వినియోగంతో ఇబ్బంది పడుతోందని, అక్కడ చమురును తీయడం చాలా ఖరీదైనదని అన్నారు.
ఉత్పత్తి రోజుకు 30 లక్షల బ్యారెళ్లకు తిరిగి చేరినప్పటికీ, వెనెజ్వెలా అప్పటికీ ప్రపంచంలోని టాప్ 10 చమురు ఉత్పత్తిదారులలో ఉండదన్నారు. ఓపెక్ దేశాలలో చమురు ఉత్పత్తి ఇప్పటికే ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ప్రపంచంలో చమురు కొరత కూడా లేదని షీరింగ్ చెప్పారు.
కార్మికుల భద్రతపైనే దృష్టి : చెవ్రాన్
వెనెజ్వెలాలో ఇప్పటికీ పనిచేస్తున్న ఏకైక అమెరికన్ చమురు కంపెనీ చెవ్రాన్. అమెరికా ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ, 2022లో బైడెన్ హయాంలో కంపెనీ లైసెన్స్ పొందింది. వెనెజ్వెలా చమురులో ఐదో వంతు చెవ్రాన్ ఉత్పత్తి చేస్తుంది.
తన కార్మికుల భద్రతపైనే కంపెనీ ప్రధాన దృష్టి ఉందని, అన్ని చట్టాలు, నియమాలను అనుసరిస్తామని చెవ్రాన్ తెలిపింది. అయితే, ఇతర పెద్ద చమురు కంపెనీలు ఇప్పటివరకు ఈ ప్రణాళిక గురించి బహిరంగంగా మాట్లాడలేదు.
చమురు కంపెనీ అధినేతలు పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలా వద్దా అని ప్రైవేట్‌గా చర్చించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు హోమయూన్ ఫలక్షాహి అభిప్రాయపడ్డారు.
కంపెనీలు సాధారణంగా రాజకీయ స్థిరత్వం, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటాయని ఆయన అన్నారు.
వెనెజ్వెలా రాజకీయ పరిస్థితి చాలా అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ప్రతిఫలం దక్కే అవకాశాలు మెండుగా ఉండడంతో, కంపెనీలు అవకాశాన్ని విస్మరించడం కష్టమని ఫలక్షాహి అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














