గూఢచారులు, డ్రోన్లు, బ్లోటార్చ్‌లు: మదురోను అమెరికా ఎలా పట్టుకుందంటే..

వెనెజ్వెలా, నికోలస్ మదురో, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Truth Social

అమెరికా గూఢచారులు కొన్ని నెలలుగా వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రతి కదలికనూ గమనిస్తున్నారు.

వెనెజ్వెలా ప్రభుత్వానికి చెందిన ఒక వ్యక్తి(సమాచారం అందించే) సహా చిన్న బృందం అన్ని విషయాలనూ గమనిస్తుండేది.

63 ఏళ్ల మదురో ఎక్కడ నిద్రపోతారు, ఏం తింటారు, ఏ దుస్తులు ధరిస్తారు, చివరకు ఆయన పెంపుడు జంతువులు సహా ప్రతి విషయాన్ని గమనించేదని ఉన్నతస్థాయి మిలటరీ అధికారులు చెప్పారు.

అనంతరం, డిసెంబర్ మొదట్లో ''ఆపరేషన్ అబ్జల్యూట్ రిసాల్వ్'' అనే మిషన్‌ను ఆమోదించారు.

కొన్నినెలలపాటు సాగిన కచ్చితమైన ప్రణాళిక, రిహార్సల్స్ ఫలితం ఈ మిషన్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వెనెజ్వెలా, నికోలస్ మదురో, ట్రంప్, అమెరికా
ఫొటో క్యాప్షన్, అర్ధరాత్రి వేళ భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు.

మదురో ఇంటిని పోలిన ఇంటిని నిర్మించి ప్రాక్టీస్

ప్రణాళికలో భాగంగా సుశిక్షుతులైన అమెరికా బలగాలు కారకస్‌లోని మదురో సురక్షితమైన ఇంటిని పోలిన ఇంటిని అచ్చుగుద్దినట్టుగా నిర్మించి, అందులోకి ప్రవేశించే మార్గాలను సాధన చేశాయి.

లాటిన్ అమెరికాలో అమెరికా మిలటరీ అసాధారణ జోక్యానికి సంబంధించిన ప్రణాళిక ఇది. ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి ఇలాంటివి జరగలేదు. దీన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. కాంగ్రెస్‌కు సమాచారమివ్వలేదు. సంప్రదింపులు జరపలేదు. అన్ని ఏర్పాట్లూ చేసుకున్నతర్వాత ఆపరేషన్ చేపట్టడానికి సరైన పరిస్థితుల కోసం ఉన్నతస్థాయి మిలటరీ అధికారులు ఎదురుచూశారు.

ఏమాత్రం ఊహించలేని స్థాయిలో ఇది జరగాలని వారు కోరుకున్నట్టు అధికారులు చెప్పారు. నాలుగు రోజుల క్రితం ట్రంప్ ఆమోదించిన వెంటనే ప్లాన్ అమలు చేయాలనుకున్నప్పటికీ అనుకూల వాతావరణ పరిస్థితుల కోసం వేచివుండాల్సి వచ్చింది.

''క్రిస్మస్, న్యూ ఇయర్ వారాల్లో అమెరికా మిలటరీలోని మహిళా, పురుష సైనికులు ప్లాన్‌ను అమలు చేసేందుకు సన్నద్దంగా ఉండి, సరైన సమయం కోసం, అధ్యక్షుడి ఆదేశాల కోసం సహనంతో నిరీక్షించారు'' అని దేశ అత్యున్నత ర్యాంకింగ్ మిలటరీ అధికారి శనివారం(డిసెంబరు 3)ఉదయం న్యూస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

వెనెజ్వెలా, నికోలస్ మదురో, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Donald Trump / TruthSocial

ఫొటో క్యాప్షన్, ప్లోరిడా ఎస్టేట్ నుంచి ఆపరేషన్‌ను ట్రంప్ ప్రత్యక్ష ప్రసారంలో చూశారు.

'గుడ్ లక్, అనుకున్న పని పూర్తవ్వాలి'

మిషన్ ప్రారంభించాలన్న ఆదేశం ఎట్టకేలకు అధ్యక్షుడి నుంచి శుక్రవారం రాత్రి 10 గంటల 46 నిమిషాలు (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8 గంటల16 నిమిషాలు)కు అందింది.

''నాలుగు, మూడు రోజుల క్రితం, రెండు రోజుల క్రితం ఈ ఆపరేషన్ చేయాలనుకున్నాం. కానీ అకస్మాత్తుగా ఈ అవకాశం వచ్చింది. ఇక మొదలుపెట్టండి అని నేను చెప్పా'' అని ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్‌తో డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

''గుడ్ లక్, దేవుడి ఆశీస్సులతో విజయవంతం కావాలని ఆయన మాతో చెప్పారు. దానికి మేం కృతజ్ఞులం'' అని జనరల్ కెయిన్ చెప్పారు.

కారకస్‌లో అర్ధరాత్రి కాబోయే కాస్త ముందు ట్రంప్ ఆదేశాలు వచ్చాయి. దీంతో చీకట్లో ఆపరేషన్ పూర్తి చేసేందుకు అవకాశం దొరికింది.

ఫలితంగా భూ, సముద్ర, వాయు మార్గాల్లో 2 గంటల 20 నిమిషాల పాటు ఆపరేషన్ సాగింది. వాషింగ్టన్‌తో పాటు మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇంత పెద్ద ఆపరేషన్, ఇంత కచ్చితమైన ఫలితాలు సాధించడం ఇంతకుముందెప్పుడూ జరగలేదు. చాలా దేశాలు తక్షణమే ఈ చర్యను ఖండించాయి. వెనెజ్వెలా నేతను ఈ హింసాత్మక విధానంలో బంధించడం ''మొత్తం అంతర్జాతీయ సమాజానికి మరో అత్యంత ప్రమాదకరమైన ఉదాహరణ'' అని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా వ్యాఖ్యానించారు.

వెనెజ్వెలా, నికోలస్ మదురో, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ నగరం

‘‘టీవీ షో చూస్తున్నట్టు అనిపించింది’’

వైట్ హౌస్ సిట్యువేషన్ రూమ్ నుంచి ట్రంప్ మిషన్‌ను పర్యవేక్షించలేదు. కానీ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న తన మార్-ఎ-లాగో క్లబ్‌లో తన సలహాదారులతో కలిసి ఆపరేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని చూశారు. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ట్రంప్‌తో పాటు ఉన్నారు.

''అది చూడడం అద్భుతమైన విషయం'' అని ట్రంప్ చెప్పారు. ''జరిగినదాన్ని మీరు చూస్తే ఎలా ఉంటుందంటే.. ఓ టీవీ షో చూస్తున్నట్టు నేను దాన్ని చూశా. ఆ ఆపరేషన్ వేగం, హింసను చూసి ఉంటే... అదో అద్భుతమైన విషయం. వారు అద్భుతంగా పనిచేశారు'' అని ట్రంప్ చెప్పారు.

ఇటీవలి నెలల్లో ఆ ప్రాంతంలో వేలాది అమెరికా బలగాలను మోహరించారు. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, పదుల సంఖ్యలో భారీ యుద్ధనౌకలు తరలించారు. కొన్ని దశాబ్దాల తర్వాత భారీ స్థాయిలో జరిగిన మిలటరీ మోహరింపు ఇది. మదురోపై డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో-టెర్రరిజం ఆరోపణలు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఈ చర్యలు చేపట్టారు. డ్రగ్స్ తరలిస్తున్నారని ఆరోపిస్తూ పదుల సంఖ్యలో చిన్నపడవలను తగులబెట్టారు.

వెనెజ్వెలా, నికోలస్ మదురో, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అర్ధరాత్రి రెండుగంటలకు పైగా ఆపరేషన్ సాగింది.

‘‘ఎటు చూసినా చీకటే’’

ఆపరేషన్ అబ్జల్యూట్ రిసాల్వ్ మొదటి సంకేతాలు గగనతలంలో కనిపించాయి. బాంబర్లు, ఫైటర్ జెట్లు, గూఢచార విమానాలు సహా 150కి పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపరేషన్ సమయంలో ఒకేరాత్రి మోహరించారని అమెరికా అధికారులు చెప్పారు.

''అది చాలా కష్టమైన, అతి క్లిష్టమైన ఆపరేషన్. ల్యాండింగ్స్, విమానాల సంఖ్య మొత్తం'' అని ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు. ''అవసరమైన ప్రతి చోటా ఫైటర్ జెట్ ఉంది'' అని తెలిపారు.

కారకస్‌లో స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో భారీ స్థాయిలో పేలుళ్లు వినిపించాయి. నగరం మొత్తం మేఘాల్లా పొగ వ్యాపించింది.

''నేను పెద్ద శబ్దం విన్నా, చాలా పెద్ద శబ్దం'' అని రిపోర్టర్ అనా వనెస్సా హెర్రెరో బీబీసీతో చెప్పారు.

''కిటికీలన్నీ కంపించాయి. వెంటనే భారీగా పొగ మేఘం కనిపించింది. పొగ అలా అలుముకున్న తర్వాత అక్కడేమీ కనిపించకుండాపోయింది.''

''నగరమంతటా విమానాలు, హెలికాప్టర్లు ఎగురుతూ కనిపించాయి'' అని అనా వనెస్సా తెలిపారు.

ఆకాశంలో పెద్దసంఖ్యలో విమానాలున్న వీడియోలు, పేలుళ్ల తర్వాత పరిస్థితికి సంబంధించిన వీడియోలు భారీగా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. వరుసగా హెలికాప్టర్లు కారకస్‌పై తక్కువ ఎత్తులో ఎగురుతున్న దృశ్యం, పేలుళ్ల వల్ల పొగ భారీగా రావడం ఓ వీడియోలో కనిపించింది.

''పేలుళ్ల భారీ శబ్దానికి అర్ధరాత్రి దాదాపు ఒంటిగంట 55 నిమిషాలకు మేం మేలుకున్నాం. కారకస్‌పై విమానాల మోత వినిపిస్తోంది. అంతా చీకటి అలుముకుంది. పేలుళ్లు జరిగినప్పుడు మాత్రమే వెలుగు కనిపించింది'' అని ప్రత్యక్షసాక్షి డేనియెలా బీబీసీతో చెప్పారు.

''ఏం జరుగుతోందో అర్ధం కాక అందరూ గ్రూప్ చాట్‌లో మెసేజ్‌లు చేసుకున్నారు. గందరగోళానికి గురయ్యారు. భయపడ్డారు'' అని ఆమె చెప్పారు.

వెనెజ్వెలా, నికోలస్ మదురో, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోనే భారీ చమురు నిల్వలు వెనెజ్వెలా దగ్గరున్నాయి.

విద్యుత్ సరఫరా నిలిపివేత

కారకస్‌లో కచ్చితంగా ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారో గుర్తించేందుకు పేలుళ్లు, మంటలు, పొగకు సంబంధించిన అనేక వీడియోలను బీబీసీ వెరిఫై పరిశీలించింది.

జనరలిస్సిమో ఫ్రాన్సిస్కో డి మిరాండా ఎయిర్ బేస్, లా కర్లోటాగా పిలిచే విమానాశ్రయం, కరీబియన్ సముద్రానికి వెళ్లేందుకు కారకస్‌కు ప్రధాన మార్గమైన లా గువైరా పోర్టు సహా ఐదు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇప్పటిదాకా బీబీసీ వెరిఫై ధ్రువీకరించింది.

గగనతల రక్షణ వ్యవస్థలు, ఇతర మిలటరీ స్థావరాలు అమెరికా దాడులకు లక్ష్యంగా మారాయని అధికారులు చెప్పారు. మిషన్ ప్రారంభించే ముందు కారకస్‌కు విద్యుత్ నిలిపివేయాలని సూచించినట్లు కూడా ట్రంప్ పేర్కొన్నారు. కానీ, అది ఎలా జరిగిందో ఆయన చెప్పలేదు.

''మాకున్న ప్రత్యేక నైపుణ్యంతో కారకస్‌లో వీలైనంతమేర లైట్లన్నీ ఆపేశాం. అంతా చీకటిగా, ప్రాణాంతంకంగా మారింది'' అని ఆయన అన్నారు.

వెనెజ్వెలా, నికోలస్ మదురో, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, US Navy/Reuters

ఫొటో క్యాప్షన్, ఇటీవలి కాలంలో అమెరికా భారీయెత్తున యుద్ధ నౌకలను, బలగాలను మోహరించింది.

‘‘మేం వస్తున్నామని వారికి తెలుసు’’

కారకస్ చుట్టూ భారీగా దాడులు జరుగుతుండగా అమెరికా బలగాలు నగరంలో ప్రవేశించాయి.

ఆ బలగాల్లో అమెరికా మిలటరీ ఉన్నతస్థాయి స్పెషల్ మిషన్ యూనిట్ అయిన కీలక డెల్టా ఫోర్స్ సభ్యులు కూడా ఉన్నారని బీబీసీ అమెరికా పార్టనర్ సీబీఎస్‌కు సోర్సెస్ తెలిపాయి. వారు భారీగా ఆయుధాలు ధరించారు. మదురో సురక్షితమైన ఇంటి ఇనుప తలుపులు కట్ చేయడానికి వీలుగా వారు బ్లోటార్చ్‌లు కూడా తీసుకెళ్లారు.

స్థానిక కాలమానం ప్రకారం, శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ఒక్క నిమిషానికి (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11 గంటల 31నిమిషాలు) దాడులు మొదలైన వెంటనే బలగాలు మదురో ఇంటికి చేరుకున్నాయని జనరల్ కెయిన్ చెప్పారు.

కారకస్ నడిబొడ్డున ఉన్న మదురో ఇంటిని భారీ రక్షణ ఉన్న సైనిక ''కోట''గా ట్రంప్ అభివర్ణించారు.

''మా కోసం ఎదురుచూస్తూ వారు సిద్ధంగా ఉన్నారు. మేం వస్తామని వారికి తెలుసు'' అని జనరల్ కెయిన్ తెలిపారు.

అమెరికా బలగాలు అక్కడకు చేరుకున్న వెంటనే మదురో సైన్యం కాల్పులు జరిపింది. ఒక అమెరికా హెలికాప్టర్‌ దెబ్బతిన్నప్పటికీ బాగానే ఎగరగలిగింది.

వెనెజ్వెలా, నికోలస్ మదురో, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నికోలస్ మదురో(ఫైల్ ఫోటో)

‘‘తప్పించుకునేందుకు మదురో ప్రయత్నం’’

''ప్రత్యేక బలాలు మదురో ఇంటి కాంపౌండ్‌లోకి వేగంగా, కచ్చితత్వంతో, క్రమశిక్షణతో చొచ్చుకుపోయాయి''అని జనరల్ కెయిన్ తెలిపారు.

''వాళ్లు చొచ్చుకుపోయారు. అవకాశం లేదనుకున్న ప్రాంతాల్లోకి కూడా వారు వెళ్లగలిగారు. రక్షణగా ఏర్పాటు చేసుకున్న ఉక్కు ద్వారాలను కూడా బద్దలుకొట్టారు'' అని ట్రంప్ చెప్పారు.

ఆపరేషన్‌లో భాగంగా మదురో భార్య సిలియా ఫ్లోరెస్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విదేశాంగ మంత్రి రుబియో ఆపరేషన్ గురించి కాంగ్రెస్ సభ్యులకు సమాచారమిచ్చారు. దీనిపై కాంగ్రెస్‌లో కొంతమంది సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'' నికోలస్ మదురో ఓ అక్రమ నియంత అని తెలుసు. కానీ కాంగ్రెస్ అనుమతి లేకుండా, తర్వాత ఏం చేయాలనే స్పష్టమైన ప్రణాళిక లేకుండా మిలటరీ చర్య ప్రారంభించడం నిర్లక్ష్యమైన విషయం'' అని సెనేట్‌లో డెమోక్రటిక్ నేత చక్ షూమర్ అన్నారు.

కాంగ్రెస్‌కు ముందే సమాచారమిస్తే మిషన్ ప్రమాదంలో పడేదని రుబియో న్యూస్ కాన్ఫరెన్స్‌లో రిపోర్టర్లతో అన్నారు. కాంగ్రెస్‌కు సమాచారాన్ని లీక్ చేసే అలవాటు ఉందని, అది మంచిది కాదని ట్రంప్ జోడించారు.

ఇంటి ప్రాంగణంలోకి అమెరికా బలగాలు ప్రవేశించిన తర్వాత మదురో సురక్షిత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని ట్రంప్ చెప్పారు.

''రక్షణ కోసం కొద్ది నెలలుగా క్యూబా బాడీగార్డుల మీద ఆధారపడుతున్న నికోలస్ మదురో సురక్షిత ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అది సురక్షితమైనది కాదు. ఎందుకంటే మేం 47 సెకన్లలో తలుపును పేల్చివేసేవాళ్లం'' అని ట్రంప్ చెప్పారు.

''ఆయన తలుపు దగ్గరకు వెళ్లారు. కానీ దాన్ని మూసివేయలేకపోయారు. అమెరికా బలగాలు మదురో దగ్గరకు అంత వేగంగా దూసుకెళ్లాయి. అందుకే ఆయన తలుపు వేయలేకపోయారు'' అని ట్రంప్ అన్నారు.

వెనెజ్వెలా, నికోలస్ మదురో, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2013 నుంచి ముదరో వెనెజ్వెలా అధ్యక్షునిగా ఉన్నారు.

‘‘ప్రతిఘటిస్తే హతమార్చేవారా?’’

అరెస్టును మదురో ప్రతిఘటించి ఉంటే మదురోను చంపి ఉండేవారా అని అడిగితే ''అదే జరిగి ఉండేది'' అని ట్రంప్ చెప్పారు.

అమెరికా బలగాల్లో ఇద్దరు గాయపడ్డారని, ప్రాణనష్టం లేదని ట్రంప్ తెలిపారు. వెనెజ్వెలాలో మృతులను అక్కడి అధికారులు ఇంకా నిర్ధరించలేదు.

మదురో అరెస్టు కోసం సమాచారమందిస్తే 50 మిలియన్ డాలర్ల రివార్డిస్తామని అమెరికా గతంలో ప్రకటించింది.

శనివారం స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల 20 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటా 50 నిమిషాలకు మదురోను, ఆయన భార్యను తీసుకుని హెలికాప్టర్లు వెనెజ్వెలా గగనతలాన్ని వీడాయి. వారిద్దరినీ అమెరికా న్యాయశాఖ కస్టడీలోకి తీసుకుని న్యూయార్క్ తరలించింది. వారు క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొనే అవకాశముంది.

మదురోను అదుపులోకి తీసుకున్న విషయాన్ని దాదాపు గంట తర్వాత ట్రంప్ ప్రకటించారు. ''మదురోను, ఆయన భార్యను త్వరలోనే అమెరికా న్యాయవ్యవస్థ విచారిస్తుంది'' అని ట్రంప్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)