నోబెల్ శాంతి బహుమతి: ఎవరీ మరియా కోరీనా మచాదో, వెనెజ్వెలాలో ఆమె చేస్తున్న పోరాటం దేనికోసం?

వెనెజ్వెలా, మచాదో, నోబెల్ శాంతి బహుమతి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డేనియల్ పార్డో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వెనెజ్వెలా ప్రతిపక్ష నాయకురాలు, ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్త మరియా కొరీనా మచాదో 2025 సంవత్సరానికిగానూ నోబెల్ శాంతి బహుమతి లభించింది.

ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికాలో అసాధారణ ధైర్యసాహసాలకు ఉదాహరణగా మచాదో నిలిచారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. వెనెజ్వెలా ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం మచాదో అవిశ్రాంతంగా పోరాడుతున్నారని కొనియాడింది.

వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో మొరోస్‌కు వ్యతిరేకంగా మచాదో ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. మదురో 12ఏళ్ల పాలనను చాలా దేశాలు చట్టవిరుద్ధమైనదిగా చూస్తాయి.

నికోలస్ మదురో పాలనను చావిస్టా పాలనగా పిలుస్తారు. దశాబ్దాలుగా వెనెజ్వెలా ఈ పాలనలోనే ఉంది. ఈ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్షాలకు 58 ఏళ్ల మచాదో ప్రధాన గొంతుకగా నిలిచారు.

నికోలస్ మదురో వెనెజ్వెలా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ను అనుసరిస్తారు. ఆయన సామాజిక, రాజకీయ సిద్ధాంతాన్ని సింపుల్‌గా చావిస్మోగా పిలుస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వెనెజ్వెలా, మచాదో, నోబెల్ శాంతి బహుమతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హ్యూగోచావెజ్, నికోలస్ మడూరో పాలనను మచాదో తీవ్రంగా వ్యతిరేకిస్తారు.

వెనెజ్వెలా ప్రతిపక్షనాయకురాలు

మచాదోను అధికారపార్టీకి ప్రధాన శత్రువుగా చూస్తారు. చావిస్మో బలంగా ఉన్న కాలంలో సైతం ఆమె హ్యూగోచావెజ్‌ను, ఆయన ప్రభుత్వ వ్యవస్థను తీవ్రంగా తప్పుపడుతూ బలమైన ప్రతిపక్షనాయకురాలిగా నిలిచారు.

ఆ క్రమంలో ఆమెపై అధికారులు ఆంక్షలు పెంచారు. ఆమె దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. జాతీయ అసెంబ్లీ నుంచి ఆమెను తొలగించారు. ఏ ప్రభుత్వ పదవిని స్వీకరించకుండా నిషేధించారు. అమెరికా సామ్రాజ్యవాదశక్తులతో ఆమెకు సంబంధాలున్నాయని ఆరోపించారు.

అయినా మచాదో వెనకడుగు వేయలేదు. తన రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తూ అంతిమంగా వెనెజ్వెలాలో బలమైన, తిరుగులేని ప్రతిపక్ష నాయకురాలిగా ఎదిగారు.

రోడ్ల దిగ్బంధనాలు, విమానాలు రద్దు, ఆమె కారు మీద జంతువుల రక్తం చల్లడం వంటివి చేసినా చలించకుండా, 2023,2024 మధ్యన ఆమె రెండుసార్లు వెనెజ్వెలా అంతటా ప్రయాణించారు. 2024 చివర్లో ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయింది.

ఆమె పర్యటనలో వీధుల నిండా జనం పోటెత్తేవారు. పెద్దసంఖ్యలో ప్రజలు ఆమెకు జపమాలలిచ్చారు. వాటిని పేర్లు, స్థలాలు, డేట్లు వంటి లేబుళ్లను తగిలించి తన మెడచుట్టూ ధరించేవారు.

భారీ ర్యాలీల్లో ఆమె దాదాపు 10 జపమాలలు వేసుకుని కనిపించేవారు.

‘‘ప్రతి జపమాలతో తానేం చేయాలి, ఎందుకు చేయాలి, ఎంతమంది ప్రార్థనలు తన పోరాటాన్ని ప్రోత్సహిస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకుంటానని’’ ఈప్రతిపక్ష నేత చెప్పారు. 2024 జులై ఎన్నికల తరువాత ఆమె ఈ ప్రసంగం చేశారు. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నప్పటికీ నికోలస్ మదురోను విజేతగా ప్రకటించారు.

వెనెజ్వెలా, మచాదో, నోబెల్ శాంతి బహుమతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మచాదోను వెనెజ్వెలాలో ఐరన్ లేడీగా పిలుస్తారు.

‘గెలవడానికి సమయం పట్టింది, గెలిచామనిపించుకోవడానికీ సమయం పడుతుంది’

అంతర్జాతీయ సమాజం నుంచి డిమాండ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ అనుకూల ఎన్నికల సంస్థ అయిన జాతీయ ఎన్నికల కౌన్సిల్(సీఎన్ఈ) మదురో విజయానికి సంబంధించిన ఫలితాలను ఎప్పుడూ బయటపెట్టలేదు.

మదురో ఎన్నికల్లో గెలిచినట్టు సీఎన్ఈ ప్రకటించిన గంటలోపే తన అభ్యర్థి ఎడ్ముండో గోంజాలెజ్ ఉర్రుతియా ఎన్నికల్లో విజయం సాధించినట్టు మచాదో ప్రకటించారు. ఈ విజయాన్ని నిరూపించడానికి తన దగ్గర ఆధారాలున్నాయన్నారు.

ఎన్నికల పరిశీలనా సంస్థల్లో పనిచేయడం ద్వారా తన రాజకీయ కెరీర్‌ను ఆరంభించిన మచాదో ఈ సారి ఇతర ప్రతిపక్షనేతలతో కలిసి ఓటింగ్ వ్యవస్థను పర్యవేక్షించారు.

దీనివల్ల తమ సాక్షుల సహాయంతో భద్రంగా ఉంచిన అధికారిక డాక్యుమెంట్ల ఆధారంగా, ప్రత్యామ్నాయంగా ఓట్లను లెక్కించుకునే అవకాశం వారికి కలిగింది.

మదురో అక్రమాలకు పాల్పడ్డారని దీని ఆధారంగా ప్రతిపక్షం ఆరోపించింది. భారీగా ఉన్న ఈ సాక్ష్యాల ఆధారంగా అమెరికా వంటి దేశాలు గోంజాలెజ్ ఉర్రుతియాను విజేతగా గుర్తించాయి.

''గెలవడానికి చాలా కాలం పట్టింది. గెలిచామనిపించుకోవడానికి కూడా చాలా సమయం పట్టొచ్చు''అని తన మద్దతుదారులకిచ్చిన భావోద్వేగ సందేశంలో మచాదో వ్యాఖ్యానించారు.

''మనం పోరాటాన్ని కొనసాగించాలి. ప్రజలకు దగ్గరగా ఉండాలి. వాళ్లను వదిలిపెట్టబోమని చెప్పాలి. ఎందుకంటే మనం చివరిదాకా పోరాడతాం'' అని ఆమె అన్నారు.

‘‘చివరివరకూ ’’అనేది ఆమె పోరాట నినాదంగామారింది. ప్రజలకు ఆమె రక్షణ కల్పించే వ్యక్తిలా కనిపించారు. ప్రతిపక్షాలు ఆమెపై అభిప్రాయాన్ని మార్చుకున్నాయి. మదురో ప్రభుత్వంతో చర్చలను, ఎన్నికల ప్రక్రియను వ్యతిరేకించడం, అంతర్జాతీయ మిలటరీ జోక్యానికి అనుకూలంగా ఉండడం వంటివాటి విషయాలపై చాలాకాలం నుంచి ప్రతిపక్షాలు ఆమెకు మద్దతివ్వలేదు. కానీ చివరి వరకూ పోరాటం అనే నినాదం ఆమెను ప్రతిపక్ష సంకీర్ణనాయకురాలిగా మార్చింది.

లక్షలాది మంది వెనెజ్వెలా ప్రజలు మారినట్టుగానే తాను మారానని 2023 నవంబరులో ఇచ్చిన ఇంటర్వ్యూలో మచాదో చెప్పారు.

తన మద్దతుదారులిచ్చిన జపమాలలు మెడలో వేసుకోవడం మచాదోకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

వెనెజ్వెలా, మచాదో, నోబెల్ శాంతి బహుమతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2005లో జార్జ్‌బుష్‌ను కలవడంపై ఇప్పటికీ విమర్శలు వ్యక్తమవుతుంటాయి.

‘అమెరికాతో సంబంధాలపై ఆరోపణలు’

మరియా కొరీనా మచాదో పారిస్కాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నలుగురు అక్కా చెలెళ్లలో ఆమె పెద్దవారు.

మచాదో తండ్రి స్టీల్ పరిశ్రమలో పేరుగాంచిన వ్యాపారవేత్త. ఆయన కంపెనీలను మాడురోకు ముందున్న హ్యూగో చావెజ్ ప్రభుత్వం జాతీయం చేసింది. ఆమె తల్లి ప్రసిద్ధ మానసిక వైద్యురాలు, టెన్నిస్ క్రీడాకారిణి.

మరియా కొరీనా ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ చదివారు. ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ చేశారు. వ్యాపార రంగంలో కొన్నిరోజులు పనిచేశాక, కొన్ని సామాజిక సంస్థలలో పనిచేశారు.

తరువాత ఆమె అమెరికాలో ఉంటూ అక్కడి రిపబ్లికన్ పార్టీకి దగ్గరయ్యారు. ఆమె ఆ రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారు.

చావిస్మో (చావెజ్ వర్గం) ఆమెను ఎప్పుడూ "సామ్రాజ్యవాదుల మద్దతుతో జరిగే కుట్రలకు సాయపడే వ్యక్తిగా'' చూసింది.

అమెరికన్ ఫౌండేషన్ల నుంచి చట్టవిరుద్ధంగా నిధులు పొందారని ఆమెపై అభియోగాలు మోపారు. దీనివల్ల విదేశీప్రయాణాలు చేయకుండా ఆమెపై మూడేళ్లపాటు నిషేధం విధించారు.

మచాదో 2010లో స్వతంత్ర ప్రతినిధిగా జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ప్రజల ముందుకు వచ్చారు. 2012లో ప్రతిపక్ష అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో హెంక్ కాప్రిల్స్ చేతిలో ఓడిపోయారు.

తనపై విధించిన ఆంక్షల కారణంగా, ఎటువంటి పదవీ లేకుండానే పదేళ్ల నుంచి ఆమె విపక్షవాణిని వినిపిస్తున్నారు. 'మదురోను తొలగించాలి' అనే ఉద్యమాన్ని 2014లో ఆమె లియోపోల్డో లోపెజ్‌తో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత 2017, 2019లలో జరిగిన ప్రజాపోరాటాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.

మదురో ప్రభుత్వాన్ని ''నిరంకుశపాలన''అని తొలిసారి అభివర్ణించిన వ్యక్తి మచాదోనే. మదురోను తొలగించాలనే తన వాదనను గట్టిగా కొనసాగించారు. ఆమె, ఇతర ప్రధాన ప్రతిపక్షాలను కూడా విమర్శించారు. "ఇవన్నీ అధికార పక్షానికి సహకరిస్తున్న పార్టీలే" అని ఆరోపించారు.

అరెస్ట్ అవుతారనే భయాలు ఉన్నా ఆమె తొణకకుండా దేశంలోనే ఉండటంతోపాటు, బహుశా ఆమె కుటుంబానికి ఉన్న స్టీలు పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని ఆమెను 'ఐరన్‌లేడీ' అని పిలుస్తుంటారు.

కాప్రిలెస్‌, లోపెజ్‌, గుయాడో లాంటి నేతల ప్రభావం తగ్గుతుండగా, మాడురోను నిజంగా ఎదుర్కొనే చివరి ఆశగా మచాదో ఎదిగారు.

అమెరికాలోని సంస్థల నుంచి నిధులు అక్రమంగా స్వీకరించారన్నది చానిస్టా ప్రభుత్వం ఆమెపై పెట్టిన మొదటి కేసు. అలానే, ఆమె 2005లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌ను కలిశారనే విషయం కూడా అప్పట్లో విమర్శలకు తావిచ్చింది.

వెనెజ్వెలా, మచాదో, నోబెల్ శాంతి బహుమతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్నికల్లో మదురో గెలవలేదని మచాదో ఆరోపిస్తున్నారు.

వెనెజ్వెలా రాజకీయాల్లో మచాదో ఎలా ఎదిగారంటే...

వెనెజ్వెలా రాజకీయాలను పరిశీలించే వారు, అక్కడి ప్రజలలో కౌడిలిస్టా సంస్కృతి బలంగా ఉందని నమ్ముతారు. శక్తిమంతమైన నాయకునిపై గాఢమైన నమ్మకం, అన్నింటికీ ఆయనే మార్గదర్శి అనే రాజకీయ భావనను కౌడిలిస్టా సంస్కృతి అంటారు.

ఈ ధోరణి సిమోన్ బొలివార్ కాలం నుంచే కనిపిస్తుంది. 19వ, 20వ శతాబ్దాల్లో వ్యక్తిగతారాధన, నాయకుడిని తండ్రి పాత్రలోచూసే భావజాలాలు రాజకీయాలపై ప్రభావం చూపించాయి.

ఈ సంస్కృతికి మూలాలు అంతకు ముందే ఉన్నా, చమురు అన్వేషణ, తదుపరి జరిగిన జాతీయీకరణ దీనికి మరింత బలాన్నిచ్చినట్లు భావిస్తారు. ప్రభుత్వమే అన్నింటినీ చూసుకోగలదనే 'మ్యాజికల్ స్టేట్' భావన ప్రజలలో బలంగా నాటుకుపోవడానికి ఈ ధోరణే కారణం. హ్యూగోచావెజ్ తనదైన కారణాలతో దానిని మరింతగా కొనసాగించారు.

ఇప్పడు హ్యూగోచావెజ్‌కు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మరియా కొరీనా మచాదో ఈ ధోరణిని కొత్తపద్ధతిలో వినియోగించుకుని ప్రజలతో ఓ ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.

ఆమె 2024లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇది స్పష్టంగా కనిపించింది. ఊరూవాడా ఆమెపేరు మారుమోగింది. అన్ని సామాజిక వర్గాలలోని మహిళలు, పురుషులు, పిల్లలు ఆమెను తమ మనిషిగా చూశారు. ఆమెను ఆలింగనం చేసుకుని, ఆమె చేతులు, మొహాన్ని ఆప్యాయంగా ముద్దాడారు. ఆమెను ఓ కూతురిలా, ఓ తల్లిలా,బామ్మలానూ చూశారు. ఆమెపై దేవుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.

ధైర్యంగానూ, స్థిరంగానూ ఉండే ఆమెపై అగ్గిబరాటా అంటూ ప్రేమ, గౌరవాన్ని చూపుతున్నారు.

ఇదంతా చూస్తే, మరియా కొరీనా ప్రజలతో బంధం కల్పించుకున్న తీరు, ఆ దేశ రాజకీయ సంస్కృతిలో ఓ కొత్త అధ్యాయం లాంటిదిగా చెప్పుకోవచ్చు.

వెనెజ్వెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ 2012 జనవరి 13న జాతీయ అసెంబ్లీ ఎదుట దేశ స్థితిగతులపై తన వార్షిక ప్రసంగం చేస్తున్న రోజు.

ప్రజా ప్రతినిధులు ప్రశ్నల పరంపర సంధిస్తున్న వేళ 44 ఏళ్ల వయసున్న ప్రతిపక్ష సభ్యురాలు ఒకరు, గట్టిగా, నిర్భయంగా ఓ ప్రశ్న సంధించించారు.

"ప్రైవేట్ రంగాన్ని గౌరవించాలని మాట్లాడుతున్నారు , కానీ మీరు చేసింది అన్నీ స్వాధీనం చేసుకోవడమే కదా, దానిని 'దొంగతనం' అంటారు" అని నిలదీశారు మరియా కోరీనా మచాదో.

దీనిపై చావెజ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. తరువాత అధికారపక్షం నుంచి అరుపులు కేకలు వినిపిస్తుండగా ఆయన మాట్లాడుతూ ''ముందు మీరు ఎన్నికల్లో గెలవండి. మీరు నాతో వాదించే స్థాయిలో లేరు'' అన్నారు. అయినా ''గద్దలు ఈగలను వేటాడవు'' అని చావెజ్ అన్నారు.

పన్నెండేళ్ల తరువాత మరియా కొరీనా మచాదో ప్రతిపక్ష ప్రాథమిక ఎన్నికల్లో 95 శాతం ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత గోంజాలెజ్ ఉర్రుతియా తో కలసి ఏర్పాటైన కూటమి ద్వారా అధ్యక్ష ఎన్నికల్లోనూ 70 శాతం ఓట్లు పొందారు. ఇవి ఆమె ప్రపంచం ముందు ఉంచిన అధికారిక గణాంకాలు.

"వెనెజ్వెలా ప్రజల విముక్తి కోసం ఏళ్లతరబడి అంకితభావంతో పోరాడినందుకు" ఆమెకు నార్వే నోబెల్ కమిటీ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది.

ఒకనాటి ఈగ నేడు గద్దగా మారింది. ఇప్పడామె ఎక్కువమంది వెనెజ్వెలా ప్రజల గుండెల్లో ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)