ట్రంప్‌కు దక్కని నోబెల్ శాంతి బహుమతి.. ఎవరిని వరించిందో తెలుసా?

మరియా కొరీనా మచాదో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మరియా కొరీనా మచాదో

2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారం వెనెజ్వెలాకు చెందిన రాజకీయ నాయకురాలు మరియా కొరీనా మచాదోను వరించింది.

వెనెజ్వెలా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం అలుపెరగకుండా శ్రమించినందుకు, నియంతృత్వాన్ని ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యం కోసం శాంతియుతంగా పోరాటం చేసినందుకు గాను మరియా కొరీనా మచాదోను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై ఎంతో ఆసక్తి నెలకొంది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తాను నోబెల్ శాంతి పురస్కారానికి పోటీపడుతున్నట్లు అనేక సందర్భాల్లో చెప్పారు.

ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో సైనిక ఘర్షణలను పరిష్కరించి, శాంతిని తీసుకొచ్చినట్లు ట్రంప్ కొన్నాళ్లుగా క్లెయిమ్ చేసుకుంటున్నారు.

ఇటీవలే గాజాలో ఇజ్రాయెల్‌, హమాస్ మధ్య కాల్పుల విరమణ తొలి దశను ప్రకటించారు.

మరియా కొరీనా మచాదో

ఫొటో సోర్స్, Getty Images

నోబెల్ కమిటీ ఏం చెప్పింది?

2025 నోబెల్ శాంతి బహుమతి ‘చీకట్లు కమ్ముకున్న ప్రాంతంలో ప్రజాస్వామ్య జ్వాలను ఆరిపోకుండా వెలిగేలా చేస్తున్న మహిళ’కు దక్కుతోంది అని కమిటీ తన ప్రకటనలో తెలిపింది.

లాటిన్ అమెరికాలో ఇటీవల కాలంలో అత్యంత అసాధారణమైన ధైర్యసాహసాలకు ఒక ఉదాహరణగా నోబెల్ శాంతి గ్రహీత మరియా కొరీనా మచాదో నిలిచినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది.

ఆల్ఫ్రెడ్ నోబెల్

ఫొటో సోర్స్, Getty Images

నోబెల్ పురస్కారాలను ప్రతి ఏటా ఫిజిక్స్, కెమిస్ట్రీ, వైద్యం, సాహిత్యం, శాంతి రంగాలలో కృషి చేసినవారికి ఇస్తారు.

బహుమతి ప్రధానానికి 12 నెలల ముందు కాలంలో "మానవాళికి మెరుగైన సేవలు" అందించిన వారికి ఈ నోబెల్ శాంతి బహుమతిని ఇస్తారు.

డైనమైట్‌ను కనుగొన్న స్వీడిష్ వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాను అనుసరించి ఈ బహుమతిని అందిస్తున్నారు.

1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ చనిపోగా, ఆ తరువాత అయిదేళ్లకు అంటే 1901లో తొలిసారి నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)