‘పరిశోధన నాది...కానీ నోబెల్ ప్రైజ్ నా బాస్ తీసుకున్నారు’: ఓ ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆరోపణ

- రచయిత, డ్రాఫ్టింగ్
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
పండిన పండ్లను చాలా రోజులు తినకుండా అలానే పెట్టడం వల్ల వాటిపై ఈగలు, కీటకాలు చేరతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు.
కానీ, తొలిసారి తాను మైక్రోస్కోప్‌లో పండుపై వాలే ఈగను చూసినప్పటి నుంచి దాని గురించే ఫ్రెంచ్ రీసర్చర్ బ్రూనో లుమెటే ఆలోచిస్తూ ఉన్నారు.
‘‘బయాలజీ చదవడం ప్రారంభించినప్పుడు కణాలు, అణువులపైనే అధ్యయనం చేసేవాడిని. కానీ, మైక్రోస్కోప్‌లో ఈ పండ్లపై చేరే ఈగను చూసినప్పుడు, ఇది అద్భుతం, ఆశ్చర్యకరం అనిపించింది’’ ఆయన బీబీసీ అవుట్‌లుక్ ప్రొగ్రామ్‌లో చెప్పారు.
లుమెటే గుర్తించిన ఈ ఈగే ఆయన అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ పరిశోధనకు దారితీసింది.
టోల్ లాంటి గ్రాహకాలుగా పిలిచే జన్యువులు శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించి, వాటిపై పోరాడేందుకు రోగనిరోధక శక్తిని ఎలా క్రియాశీలకంగా మారుస్తున్నాయో తెలుసుకునేందుకు దోహదపడింది.
ఈ పరిశోధన సైంటిఫిక్ కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారింది. దీనికి 2011లో వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం వచ్చింది.
పరిశోధనను చేసిన లుమెటే కు బదులు, సైంటిఫిక్ స్టడీని రాసిపెట్టడంలో సాయం చేసిన యూనిట్ హెడ్‌కు ఈ క్రెడిట్ దక్కింది.
ఈ సంఘటన తర్వాత నార్సిసిస్టిక్ వ్యక్తిత్వాలపై అధ్యయనం చేయడంపై దృష్టిపెట్టారు లుమెటే.
‘‘యాన్ ఎస్సే ఆన్ సైన్స్ అండ్ నార్సిసిజం’’ అనే పేరుతో పుస్తకాన్ని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతీది ఆసక్తికరమైన విషయమే
చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతీది తెలుసుకోవడంలో ఎన్‌సైక్లోపెడిస్ట్ మాదిరిగా ఉండాలని తాను చిన్నప్పుడు అనుకునేవాడినని లుమెటే గుర్తుకు చేసుకున్నారు.
‘‘శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. దానిపై చాలా ఆసక్తి నాకు. తొలుత ఖగోళశాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం గురించి అన్నీ తెలుసుకోవాలనుకున్నా. కానీ, అన్నీ తెలుసుకోవడం అసాధ్యమని ఒక దశలో అనిపించింది. అందుకే ఒక అంశంపైనే దృష్టిపెట్టాలని భావించా.’’ అని లుమెటే చెప్పారు.
ఒక పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగిన లుమెటే, కీటకాలవంటి పలురకాల జీవులను సేకరించేందుకు ఎక్కువ సమయం గడిపేవాడినని తెలిపారు.
‘‘కీటకాలపై నాకున్న ఆసక్తి నన్ను చాలామందికి పరిచయం చేసింది. నా కుటుంబం నన్ను చూసి గర్వించేది. నా ఫ్రెండ్స్‌కు నా రూమ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందులో అనేక రకాల రాళ్లు, కీటకాలు ఉండేవి.’’ అని లుమెటే తెలిపారు.
ఇదే ఆసక్తి ఆయన్ను పారిస్‌కు నడిపించింది. అక్కడ సైన్స్‌లో మరిన్ని విషయాలను తెలుసుకున్నారు.
పారిస్ నగరానికి చేరుకున్న తర్వాత తనకు ఎదురైన ఇబ్బందులను గురించి మాట్లాడటం తనకు ఇప్పటికీ కష్టంగా ఉందని లుమెటే చెప్పారు.
‘‘దీన్ని ఎలా చెప్పాలో నాకు అర్ధం కావడం లేదు. ఫ్రెంచ్ యూనివర్సిటీల్లో పరిశోధనా విధానం చాలా క్లిష్టంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్‌లో చాలా లేయర్లు ఉంటాయి’’ అని తెలిపారు.
‘‘ ఇక్కడి ప్రొఫెసర్లు మంచి విద్యార్ధులనే ఎంచుకోవాల్సిన అవసరం లేదని నాకు అర్ధమైంది. కొన్నిసార్లు ఆ ప్రొఫెసర్లు ల్యాబ్‌లలో వారి భార్యలనే నియమించుకునేవారు. చాలాచోట్ల పక్షపాతం కనిపిస్తుంది. బహుశా నేను దాని విషయంలో నేను సెన్సిటివ్ అనుకుంటా.’’అని తెలిపారు. ఉద్యోగం కోసం, గుర్తింపు కోసం, అధికారం కోసం చాలా పోరాడినట్లు చెప్పారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే, ఈగలపై అధ్యయనం చేసేందుకు ఇంటర్న్ కోసం చూస్తోన్న పరిశోధకుల బృందాన్ని తాను కలుసుకున్నట్లు తెలిపారు.
అక్కడ నుంచి ఆయన తన హాబీ మీదనే పరిశోధన చేయడం ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లోని డాక్టర్ మైఖేల్ అష్‌బర్నర్ టీమ్‌తో కలిసి పనిచేశారు. అక్కడే పీహెచ్‌డీ పొందారు.
అంతేకాక, ఆ సమయంలో లెబనీస్ సంతతికి చెందిన ఒక యువతి పరిచయమైంది. ఆమెను పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈగలు, పురుగులు
డ్రోసోఫిలా ఫ్లైలో దాదాపు 1500 జాతులు ఉన్నాయి. వీటినే మనం ఈగలు(ఫ్రూట్ ఫ్లయిస్) అని పిలుస్తుంటాం. మనం పెంచే పండ్లపై పెరిగే కీటకం ఇది. నోబెల్ ఫౌండేషన్ వీటిపై పరిశోధనను గుర్తించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబోరేటరీలలో డ్రోసోఫిలా మెలానోగాస్టర్‌పై పరిశోధనలు చేపట్టారు. చాలా మంది నోబెల్ పురస్కార గ్రహీతల పరిశోధనల్లో ఇది ఒక భాగంగా మారింది.
ల్యాబోరేటరీల్లో డ్రోసోఫిలాకు చాలా సానుకూలతలు ఉన్నాయి. వాటిలో సంతానోత్పత్తి సులభం, చాలా చౌక. అంతరిక్ష నౌకలో కూడా దీన్ని ఉత్పత్తి చేసి, మానవ రోగనిరోధక వ్యవస్థపై అంతరిక్ష నౌక ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకునేందుకు ఉపయోగించారు.
పారిస్‌లోని శివారుల్లో ప్రొఫెసర్ జూల్స్ హాఫ్‌మాన్ వద్ద ఒక చిన్న ప్రయోగశాలలో పని చేసేందుకు ప్రొఫెసర్ లుమెటే వెళ్లారు. ఈగల రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలు చేయడం ప్రారంభించారు.
‘‘నాకున్న పరిజ్ఞానంలో జెనెటిక్స్ ముఖ్యమైనవి. ఇతర కణజాలాన్ని అర్థం చేసుకునేందుకు జెనెటిక్స్ చాలా శక్తివంతమైనవని నాకు తెలుసు. నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఇక్కడ నువ్వేదో ఒకటి సాధిస్తావని నాకు నేను చెప్పుకున్నా. సైన్స్ ఎప్పుడూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. ఒక అంశంపై పనిచేస్తున్న తొలి వ్యక్తి ఎప్పటికీ మీరే కాకపోవచ్చు. మిమ్మల్ని ప్రభావితం చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. సరికొత్త విధానంలో సమాచారాన్ని కనుగొనే వారికి ఎప్పటికీ ప్రత్యేకంగా ఒక పేరు ఉంటుంది. నా పని జెనెటిక్స్‌ను ఉపయోగించి ఇన్‌ఫెక్షన్లకు ఈగలు ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకోవడం’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిశోధన ఫలితాలు
ప్రయోగశాలలో అంత ఎక్కువ గుర్తింపు, పేరు రానప్పటికీ, ఈగలు ఇన్‌ఫెక్షన్లకు ఎలా స్పందిస్తాయో అధ్యయనం చేస్తూ చాలా విషయాలను లుమెటే తెలుసుకున్నారు.
ల్యాబ్‌లో తొలి ఏడాది చాలాసార్లు ఫెయిలయ్యారు. ఈ వైఫల్యాల సమయంలో, ప్రయోగశాలలోని జెనెటిక్స్ టీమ్‌పై ఆయనకు నమ్మకం తగ్గిపోయింది.
దీంతో, లుమెటే తన సహోద్యోగులతో పనిచేయడం మానేశారు. తాను కనుగొన్న అంశాలపై తనలో తానే చర్చించుకోవడం మొదలు పెట్టారు.
ఈ టీమ్‌లకు ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ హాఫ్‌మాన్ కాస్త స్వయం ప్రతిపత్తి ఇచ్చారని చెప్పారు.
కొన్ని ఈగల నుంచి టోల్ గ్రాహకాలను తొలగించిన తర్వాత, వాటి రోగనిరోధక వ్యవస్థలు ఇన్‌ఫెక్షన్లను గుర్తించడం లేదని, దీంతో అవి చనిపోతున్నాయని గుర్తించారు. తాను చాలా కీలకమైన అంశాన్ని కనుగొన్నట్లు ఆయన గుర్తించారు.
‘‘ ఈ పరిశోధనలో నేను లీడ్ రోల్ పోషించానని చెప్పగలను’’. అన్నారాయన.
జర్మనీలోని పరిశోధకులు టోల్స్‌ను(టోల్ టైప్ గ్రాహకాలను) ఎప్పుడో కనుగొన్నారు. ఈ రంగంలో అత్యంత ప్రముఖ మహిళ కేథరీన్ ఆండెర్సన్ పరమాణువుల లక్షణాలను రూపొందించారు. అయితే, తాను, తన టీమ్ కలిసి రోగనిరోధక వ్యవస్థ పనితీరులో టోల్స్ పాత్రను చూపించాలనుకున్నామని లుమెటే చెప్పారు.
‘‘ మొదట నా సహోద్యోగుల సాయంతో పరిశోధన ఫలితాలను రాశాను. కానీ మరింత మెరుగ్గా రాయడంలో నా బాస్ కీలక పాత్ర పోషించారు. రాయడంలో సమస్యలున్నప్పుడు, ఎవరైనా ఇలా సాయం చేయడం నాకు నచ్చుతుంది.’’ అన్నారు లుమెటే. వారి అధ్యయనం సెల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఫొటో సోర్స్, Getty Images
నోబెల్ బహుమతి
రోగనిరోధక వ్యవస్థలో టోల్స్ పాత్రపై తాము చేసిన అధ్యయనం, 15 ఏళ్ల తర్వాత ఇతర క్షీరదాల్లో ఈ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలకు పనికొచ్చింది.
లుమెటే సొంతంగా పరిశోధన చేసేందుకు హాఫ్‌మాన్ ల్యాబోరేటరీని వదిలేసి బయటకు వచ్చారు. అయితే, రోగనిరోధక వ్యవస్థలో టోల్స్ పాత్రను ఎవరు కనుగొన్నారు అన్న దానిపై ఇప్పటికీ సైంటిఫిక్ కమ్యూనిటీలో అస్పష్టత ఉంది.
మెడిసిన్‌లో నోబెల్ బహుమతి గ్రహీత జూల్స్ హాఫ్‌మాన్ అని ప్రకటించినప్పుడు, ‘‘ఈ నోబెల్ బహుమతులలో ఎంత రాజకీయం ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఈగలపై అధ్యయనానికి నోబెల్ ఇస్తున్నప్పుడు, ఈ రంగంలో నేను చేసిన పనిని అంతా ఒప్పుకున్నారు. ఈ అవార్డు గురించి నేను విన్నప్పుడు నా మనసు కాస్త తేలికపడింది. కానీ అదే సమయంలో బాధపడ్డాను కూడా’’ అని తెలిపారు లుమెటే.
‘‘ఆయన కంటే ఎక్కువగా నేను దీనిపై అధ్యయనం చేసినప్పటికీ, నోబెల్ పురస్కారం హాఫ్‌మాన్ అందుకున్నారని భావించాను. కాకపోతే , నా పరిశోధన ప్రపంచమంతా తెలిసేలా చేయడంలో ఆయన సాయం చేశారు.’’ అని అన్నారు.
జూల్స్ హాఫ్‌మాన్‌ను ఈ విషయంపై అవుట్‌లుక్ ప్రొగ్రామ్ సంప్రదించినప్పుడు, వేరొకరి పనిని తాను క్రెడిట్ తీసుకున్నాననిగానీ, లుమెటే కృషిలో జోక్యం చేసుకున్నాననిగానీ ఆయన ఒప్పుకోలేదు.
శాస్త్రవేత్తల పురోగతి గురించి తాను తెలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉండేదన్నారు. తన వద్ద పనిచేసే 50 మందికి పైగా శాస్త్రవేత్తలు ఏమేం చేస్తున్నారో ఎప్పటికప్పుడు ఇద్దరు చీఫ్ రీసెర్చర్లు తనకు తెలియజేసేవారని అన్నారు.
ఈగల పరిశోధనలను నేరుగా లుమెటే చేపట్టినట్లు ఆయన గుర్తించారు. అవార్డు ప్రసంగంలో కూడా లుమెటే పేరును హాఫ్‌మాన్ ప్రస్తావించారు. అయితే, అది సరిపోదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అనుమానాలేంటి?
ఈ అవార్డు ప్రకటించినప్పుడు, సహోద్యోగుల నుంచి లుమెటేకు కాల్స్ వచ్చాయి. వారు కూడా తమ పరిశోధనలను గుర్తుకు చేసుకున్నారు.
‘‘ఒక ఇంగ్లీష్ వ్యక్తి నాతో మాట్లాడారు. నోబెల్ ప్రైజ్ అడ్వయిజర్‌గా వారు ఉన్నట్లు చెప్పారు. ఈ బహుమతిలో చాలా అనుమానాలున్నాయని ఆయన ఒప్పుకున్నారు. జూల్స్ హాఫ్‌మాన్ నామినేషన్‌ను ప్రతి ఒక్కరూ అంగీకరించలేదన్నారు. ఆయన ఎప్పుడూ ఒక పరిశోధకుడిగా కనిపించలేదు’’ అని చెప్పినట్లు లుమెటే గుర్తుకు చేసుకున్నారు.
‘‘ఈ పరిశోధన ప్రక్రియలో నా సహకారాన్ని వివరిస్తూ.. ఒక బ్లాగ్ రాయమని సూచించారు, ప్రోత్సహించారు. నేను బ్లాగ్ పబ్లిష్ చేశా. నా జీవితంలో అత్యంత ఒత్తిడిని ఎదుర్కొన్న కాలం. పూర్తి అధికారాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు నాకు సరిపడినంత బలం లేదు. కానీ, ఈ పరిశోధనలో వాస్తవాలను తెలియజేస్తూ బ్లాగ్ రాశాను’’ అని లుమెటే తెలిపారు.
ఇది సైంటిఫిక్ కమ్యూనిటీలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో, హాఫ్‌మాన్, లుమెటే మధ్య సంబంధాలు తెగిపోయాయి. కానీ, లుమెటేకు ఇది చాలా అవసరం.
‘‘చివరికి నాకు కొంత గుర్తింపు లభించింది. స్విట్జర్లాండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యాను. కానీ, ఎలాంటి గుర్తింపు పొందని వారు చాలామంది ఉన్నారు’’ అని లుమెటే చెప్పారు.
నార్సిసిస్టిక్ వ్యక్తిత్వాలకు చెందిన మానసిక పరిస్థితులపై పరిశీలన జరిపిన తర్వాత, తాను ఎదుర్కొన్న పరిస్థితులు గురించి కాస్త అర్థమైందని తెలిపారు.
‘‘ఇలాంటి అనుభవాలను పొందినప్పుడు, సైన్స్‌లోని సైకాలజీ లాంటి ఇతర అంశాలను మీరు అన్వేషించి, మెరుగ్గా అర్థం చేసుకోవాలి. దాని వల్ల మీ మనసుకు కాస్త శాంతి దొరుకుతుంది. నేను నిరాశకు గురైనప్పటికీ, కాస్త గుర్తింపు లభించింది’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
- హెపటైటిస్: మొత్తం కేసులలో 11 శాతం భారత్‌లోనే.. అసలేమిటీ వ్యాధి, ఎందుకొస్తుంది, చికిత్స లేదా?
- SRH vs DC: ఏంటా కొట్టుడు! భయంతో హెల్మెట్లు పెట్టుకున్న బాల్ బాయ్స్..
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














