‘నాది అప్పుడే పుట్టిన శిశువులను కాపాడే అరుదైన ‘నియో’ రక్తమని తెలిసిన రోజు ఎలా అనిపించిందంటే’

విల్లో పాప

ఫొటో సోర్స్, HAYLEY BEAN

ఫొటో క్యాప్షన్, చిన్నారి విల్లో
    • రచయిత, కాథరీన్ స్నోడాన్
    • హోదా, బీబీసీ న్యూస్

రక్తదానం చేయడాన్ని నేనెప్పుడూ గర్వకారణంగా భావిస్తుంటాను. నాది అరుదైన బ్లడ్ గ్రూప్(బీ-).

నా రక్తం చాలా విలువైనదని ఇటీవలే నేను తెలుసుకున్నాను. ఎందుకంటే, నవజాత శిశువులకు నా రక్తాన్ని ఇవ్వొచ్చు.

నేను అంతకుముందు రక్తదానం చేయడానికి వెళ్లినప్పుడు, నా చేతికి సూది గుచ్చి రక్తం తీసుకునే డోనర్ కేరర్, ‘‘నియో అయినందుకు మీరు కచ్చితంగా గ్రేట్‌గా భావిస్తున్నారు కదా?’’ అని అడిగారు.

ఆ సమయంలో నేను నా ముఖాన్ని అయోమయంగా పెట్టాను. నా రక్తాన్ని తీసుకునేందుకు ఒక గిన్నెలో పెట్టి ఉంచిన మెరుస్తున్న బ్లూ ట్యాగ్ బ్యాగ్‌ను ఆమె నాకు చూపించారు.

ఆ బ్యాగ్‌పైన ‘నియో’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ‘‘మీ రక్తం చాలా ప్రత్యేకమైనది. అప్పుడే పుట్టిన శిశువులకు ఈ రక్తం సాయం చేస్తుంది’’ అని ఆమె వివరించారు.

‘నియో’ అంటే నియోనాటల్. 28 రోజుల వయసున్న పిల్లల, చిన్నారుల గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడుతుంటారు.

నేను రక్తదానం చేసిన తర్వాత రక్తాన్ని ఎలా పరీక్షిస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నాను.

నవజాత శిశువులతో పాటు కొందరు రోగులకు ఈ ప్రత్యేక రక్తం ఎంతో అవసరం ఉంటుంది.

నియో రక్తం

ఫొటో సోర్స్, NHSBT

ఫొటో క్యాప్షన్, నియో రక్తం

నాకు దీని గురించి మరింత తెలుసుకోవాలనిపించింది. దీంతో ఎన్‌హెచ్ఎస్ బ్లడ్, ట్రాన్స్‌ప్లాంట్‌లో హెమటాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ కన్సల్టెంట్‌గా పనిచేసే డాక్టర్ ఆండీ చార్టన్‌తో మాట్లాడాను.

దానం చేసిన రక్తంనంతటికీ హెచ్ఐవీ, హెపటీటిస్ బీ, సీ, ఈ, అలాగే సిఫిలిస్ వంటి పరీక్షలు చేపడతామని ఆండీ చార్టన్ వివరించారు.

ఒకసారి ఆ పరీక్షలు పూర్తయిన తర్వాత, రోగులకు అవసరం మేరకు ఆ రక్తం సరిపోతుందా అనేది తెలుసుకోవడం కోసం కొన్ని శాంపిల్స్‌ తీసుకుని మరిన్ని పరీక్షలను, ప్రక్రియలను చేపడతామని చెప్పారు.

ఉదాహరణకు, కొందరి వ్యక్తులకు అంతకుముందు రక్తమార్పిడి సమయంలో వచ్చిన అలర్జిక్ రియాక్షన్ల ప్రొటీన్లు తొలగించిన తర్వాత రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుందని తెలిపారు.

విల్లో

ఫొటో సోర్స్, HAYLEY BEAN

ఫొటో క్యాప్షన్, విల్లోకు ప్రస్తుతం నాలుగేళ్లు

కామన్‌గా ఉండే వైరస్‌ను పరీక్షిస్తారు

నవజాత శిశువులకు, ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్లకు(రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న రోగులకు), గర్భిణులకు, గర్భాశయంలో ఎదిగే పిండానికి ఎక్కించే రక్తానికి తప్పనిసరిగా సైటోమెగాలోవైరస్(CMV) అనే వైరస్‌కు సంబంధించి పరీక్షించాల్సి ఉంటుంది.

ఇది హెర్పస్ వైరస్ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ చాలా సాధారణం. ఇది హానికరమైనది కాదు. స్వల్పంగా ఫ్లూ వంటి లక్షణాలను లేకపోతే ఎలాంటి లక్షణాలను ఇది కలిగి ఉండదు. కానీ, కొందరికి మాత్రం ఇది ప్రమాదకరం.

ఈ వైరస్ వల్ల పిల్లలకి మూర్ఛ రావొచ్చు, కళ్ల మసకబారడం, వినికిడి సమస్యలు తలెత్తవచ్చు.

అలాగే కిడ్నీ, ప్లీహాన్ని దెబ్బతీయొచ్చు. చాలా అరుదైన కేసుల్లో ఇది ప్రాణాంతకం కావొచ్చు.

బ్రిటన్‌లో పెద్ద వారికి 50 నుంచి 80 శాతం మధ్యలో సీఎంవీ ఉన్నట్లు అంచనాలున్నాయి. ఇంగ్లాండ్‌లో కేవలం 2 శాతం అర్హత కల జనాభా మాత్రమే రక్తదానం చేయొచ్చు. ఈ వైరస్ బారిన పడని దాతలను గుర్తించడం అత్యంత కీలకం.

అంతకుముందు నేను ఇచ్చిన రక్తాన్ని పరీక్షించారు. సీఎంవీ కోసం అవసరమైన యాంటీబాడీలు నా రక్తంలో ఉన్నట్లు తేలింది. అంటే, నేను ఈ వైరస్ బారిన పడలేదు. నా రక్తానికి స్పెషల్ ట్యాగ్ వచ్చింది.

నేను రక్తదానం చేసిన ప్రతిసారి కూడా ఈ వైరస్ పరీక్షలు చేస్తారు. అంటే, మధ్యలో ఎప్పుడూ కూడా నేను ఈ వైరస్ బారిన పడలేదని నిర్ధరించుకునేందుకు రక్తాన్ని పరీక్షిస్తారు.

ఈ వైరస్‌ రోగనిరోధక శక్తి ఎల్లప్పుడూ నా తెల్లరక్తకణాల్లో ఉంటుంది. ఒకవేళ ఈ వైరస్ కనుక నాకు సోకితే, ఈ రోగులకు నా రక్తాన్ని ఇవ్వడం ఇక కుదరదు.

ఇంగ్లాండ్‌లో సీఎంవీ లేని, బీ- బ్లడ్ గల 10,916 మంది యాక్టివ్ డోనర్లలో నేను ఒకడిని. గత ఏడాది 1,53,801 యూనిట్ల సీఎంవీ నెగిటివ్ బ్లడ్ కావాలని ఆస్పత్రుల నుంచి అభ్యర్థనలు వచ్చాయి.

‘‘ప్రత్యేకమైన రక్త నమూనాలకు’’ డిమాండ్ బాగా పెరుగుతుందని, ఈ రక్తం ఉన్న ప్రజలు ముందుకు వచ్చి దానం చేయాలని డాక్టర్ చార్టన్ కోరారు.

‘‘దాతలకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు’’ అని ఆయన అన్నారు. ‘‘ప్రతి రక్తదానం కూడా ఒకరికి జీవితాన్ని ఇచ్చినట్లే. ఒక్కోసారి ఒకరుకంటే ఎక్కువ మందిని రక్షించవచ్చు’’ అని చెప్పారు.

కూతురు విల్లోతో హేలీ బీన్

ఫొటో సోర్స్, HAYLEY BEAN

ఫొటో క్యాప్షన్, కూతురు విల్లోతో హేలీ బీన్. విల్లోకు పుట్టిన తర్వాత వెంటనే రక్తమార్పిడి చేశారు.

పిల్లలకు జీవితాన్ని ఇచ్చేవారు

హేలీ బీన్ కంటే ఎక్కువగా ఎవరూ కూడా రక్తదాన ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే, సీఎంవీ రహిత రక్తాన్ని ఎక్కించిన తర్వాతనే ఆమె కూతురు విల్లో ప్రాణాలను కాపాడారు.

గర్భవతిగా ఉన్నప్పుడు, హేలీకి వాసా ప్రీవియా వ్యాధి సోకింది. బొడ్డు తాడు లేదా మావికి చెందిన రక్తనాళాలు బర్త్ కెనాల్‌ను బ్లాక్ చేస్తాయి. దానివల్ల గర్భాశయం నుంచి బిడ్డ బయటికి రాలేక, సహజ జననం ఇబ్బంది అవుతుంది.

32 వారాల సమయంలోనే వైద్యుల పర్యవేక్షణ కోసం హేలీ బీన్ ఆస్పత్రిలో చేరారు. 35 వారాలకు ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీయాలనుకున్నారు.

ఆపరేషన్ చేసే సమయంలో చిన్నారి విల్లో రక్తనాళాలు దెబ్బతిన్నాయి. తీవ్రంగా రక్తస్రావమై, ఆ పాప జీవితం ప్రామాదంలో పడింది.

‘‘ అన్ని అలారమ్‌లు ఆగిపోయాయి. నా చుట్టూ వైద్యులు హడావుడిగా పరిగెడుతున్నారు’’ అని హేలీ ఆపరేషన్ రోజు సంగతిని గుర్తుకు చేసుకున్నారు.

‘‘విల్లో బయటికి రాగానే, పాప ఏడుపు వినేందుకు నేను చాలా ఎదురు చూశాను. నా జీవితంలో అదే దారుణమైన క్షణం. పాప శ్వాస తీసుకోవడం లేదు. షాక్‌లోకి వెళ్లింది. నియోనాటల్ టీమ్ పాపను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పది నిమిషాల తర్వాత నా ప్రాణం లేచొచ్చేలా నా బిడ్డ ఏడుపును విన్నాను’’ అని హేలీ బీన్ గుర్తుకు చేసుకున్నారు.

పుట్టిన వెంటనే విల్లోను ఇంటెన్సివ్ కేర్‌లో పెట్టారు. పాపను తనకు చూపించేందుకు నర్సు ఒక ఫోటో తీసి తీసుకొచ్చినట్లు చెప్పారు.

ఇంటెన్సివ్ కేర్‌లో విల్లో పాప

ఫొటో సోర్స్, HAYLEY BEAN

ఫొటో క్యాప్షన్, పుట్టిన తర్వాత విల్లోను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు.

విల్లో పుట్టిన 12 గంటల తర్వాత హేలీ ఆమెను తొలిసారి చూడగలిగారు.

ప్రస్తుతం విల్లోకు నాలుగేళ్లు. తన కూతురు పొందిన చికిత్స విషయంలో హేలీ ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతారు.

ఐదు రోజుల పాటు పాప ఇంటెన్సివ్ కేర్‌లో ఉంది. పాపకు ఎక్కించిన రక్తాన్ని దానం చేసిన వారికి హేలీ కృతజ్ఞతలు చెప్పారు.

ఒక తెలియని వ్యక్తి నుంచి ఈ సాయం అందకపోతే పాప ఇవాళ బతికేది కాదు. ఎవరో, ఎక్కడి వారో రక్తదానం చేయడం వల్లనే, ఈ రోజు విల్లో ఇలా ఇక్కడ ఆడుకోగలుగుతుందని, వారికి కృతజ్ఞతలు అని ఆమె చెప్పారు.

నియో రక్తాన్ని దానం చేసిన కొన్ని రోజుల తర్వాత, నేను వేచిచూస్తున్న మెసేజ్ వచ్చింది. నా రక్తాన్ని అస్పత్రి వారికి అందించినట్లు ఆ మెసేజ్‌లో ఉంది. ఆ మెసేజ్ చూసి మనసారా ఒక నవ్వు నవ్వి, చిన్నారి జీవితం బాగుండాలని కోరుకున్నాను.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)