తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?

- రచయిత, మాయకృష్ణన్
- హోదా, బీబీసీ కోసం
ఆగ్రాలోని యమునా నది తీరాన 17వ శతాబ్దంలో నిర్మించిన సమాధి తాజ్ మహల్.
తమ బిడ్డకు జన్మినిస్తూ మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించారు. తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా కనిపిస్తుంది. ప్రేమ గురించి ఆలోచన వస్తే చాలా మంది తాజ్ మహల్ గురించే మాట్లాడుకుంటారు.
కానీ, తాజ్ మహల్ కంటే ముందే తమిళనాడులో ఒక ‘ప్రేమ చిహ్నం’ నిర్మితమైంది.
చోళ ఖ్యాతిని ఇనుమడింపజేసిన రాజేంద్ర చోళుడి ధైర్యసాహసాల గురించి మనకు తెలిసిందే. అయితే, తన ప్రియురాలు పరవై నంగె కోరిక మేరకు ఆయన ఒక ప్రేమ చిహ్నం కట్టించారు. అదే తిరువారూర్‌లో నిర్మించిన ఆలయం.

రాజేంద్ర చోళుడు - పరవై నంగె ప్రేమ
రాజరాజ చోళుని కుమారుడు రాజేంద్ర చోళుడు క్రీ.శ. 1012 నుంచి 1044 వరకు పాలించారు. ఆయన్ను కడారంను జయించినవాడు అని అంటారు. తిరువారూర్‌కు చెందిన నర్తకితో రాజేంద్ర చోళుని ప్రేమాయణం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
అన్నా ఆర్ట్స్ కాలేజీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ రమేష్ ఈ విషయం గురించి బీబీసీకి వివరించారు.
''చోళ దేశంలోని ప్రముఖ వ్యాపారి గోవలన్‌కి, అందగత్తె అయిన నర్తకి మాధవికి మధ్య ఆంతరంగిక ప్రేమ వ్యవహారాన్ని శిల్పాదికారం కావ్యం వివరిస్తుంది. వారి ప్రేమ గురించి సాహితీవేత్తలు వివరించినా, సాహిత్యంలో పేర్కొన్న ఈ ప్రేమికులు నిజంగా ఉన్నారో, లేదో ఎవరికీ తెలియదు'' అన్నారు.
"కానీ, 11వ శతాబ్దపు చోళ చరిత్రలో, ఒక రాజు, నర్తకి ప్రేమలో పడడం ద్వారా ప్రేమ పరిమళాలు వ్యాప్తి చేశారు. పరవై నంగె అయ్యర్- చోళ సామ్రాజ్యాన్ని సముద్ర తీర ప్రాంతమంతా విస్తరించిన గొప్ప వీరుడు రాజేంద్ర చోళుని ప్రేమికురాలు" అని ప్రొఫెసర్ రమేష్ అన్నారు.
"మొదటి రాజేంద్రన్ గంగై, కడారం రాజ్యాలను జయించడంతోపాటు ఎన్నో విజయాలు సాధించారు. కానీ, ప్రపంచాన్ని జయించిన ఆ రాజు మనసు గెలుచుకుంది ఆయన ప్రియురాలు. ఆమె తిరువారూరుకు చెందిన నాట్య సుందరి పరవై నంగె. ఆమె నృత్యంతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండేవారు.
చోళ చరిత్రలో రాజేంద్ర చోళుడికి ఎంతటి విశిష్ట స్థానముందో, ఆయన మనసులో పరవై నంగెకి ఎంత ప్రత్యేక స్థానముందో, రాజేంద్ర చోళుని కుమారులు వారి విగ్రహాలకు పూజలు చేయడం ద్వారా మనం గ్రహించవచ్చు'' అన్నారాయన.

ఇటుకలతో కట్టిన ఆలయం రాతి కోవెలగా మార్పు
రాజేంద్ర చోళుని కాలంలో, ప్రియురాలు పరవై నంగె కోరిక మేరకు ఇటుకలతో నిర్మించిన ఆలయాన్ని రాతి కోవెలగా మార్చారని, అదే తిరువారూర్ త్యాకేసర్ ఆలయం అని ప్రొఫెసర్ రమేశ్ తెలిపారు.
"పరవై నంగె కోరిక మేరకు రాజేంద్ర చోళుడు తన 16వ పాలనా సంవత్సరం, 1028లో రాతి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. 18వ పాలనా సంవత్సరం 1030లో పూర్తి చేశారు. రాతి ఆలయాన్ని ఆకర్షణీయంగా నిర్మించేందుకు రెండేళ్లు వెచ్చించారు. ఇది ఆయన కాలంలో వేయించిన శాసనంలో ఉంది’’ అని చెప్పారు.
‘‘పాత ఆలయాన్ని రాతి మందిరంగా నిర్మించడమే కాకుండా, ఆలయం వెలుపలి కలశం దగ్గరి నుంచి ఆలయం అంతర్భాగం వరకూ బంగారం పూత పూయించారు. గర్భగుడి తలుపులు, ఆలయ స్తంభాలకు రాగి ఫలకాలను ఏర్పాటు చేయించారు. అందుకోసం 20,643 కలంజుల(1 కలంజు = 5.4 గ్రాములు) బంగారం, 42,000 పాలం(తులం) రాగి వినియోగించారు'' అని శాసనం చెబుతోంది.
"పూజాది కార్యక్రమాల కోసం 28 దీపం కుందులు, 36 వజ్రాలు, ముత్యాలు పొదిగిన వేల బంగారు ఆభరణాలు, కెంపులు, పచ్చలు, వెండిపాత్రలు కూడా బహూకరించారు. పరవై నంగె కోరికతో పూర్తయిన ఆలయానికి సంప్రోక్షణ జరిగింది. అప్పుడు చోళరాజు రాజేంద్రుడు వచ్చిన రథంలో ఆయన పక్కన ఆమె కూర్చున్నారు. వారిద్దరూ స్వామిని దర్శించుకున్న ప్రదేశానికి గుర్తుగా ఆమె అక్కడ దీపం వెలిగించారు. ఈ శాసనంలో 'వడయార్ శ్రీ రాజేంద్ర చోళ దేవా, ప్రియురాలు పరవై నంగె' అని రాసి ఉంది. అందులో 'డాగర్ ల్యాంప్' ప్రస్తావన కూడా ఉంది’’ అని ప్రొఫెసర్ రమేశ్ వివరించారు.

ప్రొఫెసర్ రమేశ్ కథనం ప్రకారం- "తిరువారూర్ ఆలయంలో రాజేంద్ర చోళునితోపాటు పరవై నంగెకి నిత్యం పూజలు నిర్వహించేందుకు రాజాధిరాజ భూములు దానంగా ఇచ్చినట్లు తిరువారూర్ శాసనం చెబుతోంది. ఆ శాసనం నేటికీ ఉంది. అందులో తలపై కిరీటం, మధ్యలో వస్త్రం, మెడలో ఆభరణాలు ధరించి రాజేంద్రుడు నిల్చుని ఉండగా, ఆయన పక్కన అందమైన దుస్తులు ధరించిన పరవై, ఒంగి నమస్కరిస్తున్నట్లుగా ఉంది.
ఇదంతా రాజేంద్ర చోళుడికి తన ప్రియురాలు పరవై నంగెపై ఉన్న అపారమైన ప్రేమను చాటుతోంది. ఆయన తర్వాత వచ్చిన ఆయన కొడుకులు కూడా వారి ప్రేమకు ముగ్దులయ్యారు.''
నర్తకిపై చోళ చక్రవర్తి ప్రేమ కారణంగా తిరువారూర్ ఆలయం రాతి మందిరంగా మారిందని ఆయన స్పష్టంగా చెప్పారు.

గ్రామానికి ప్రియురాలి పేరు
రాజేంద్రుడు ఆలయానికి మాత్రమే కాకుండా, గ్రామానికి కూడా తన ప్రియురాలి పేరు పెట్టారని మైలదుత్తురైలోని సందల్మేడు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాల చరిత్ర విభాగాధిపతి కళైసెల్వన్ అదనపు సమాచారం చెప్పారు.
''పరవై నంగెపై తనకున్న అమితమైన ప్రేమను తెలియజేసేందుకు రాజేంద్రుడు విల్లుపుర సమీపంలోని ఒక గ్రామానికి పరవైపురం అని పేరు పెట్టారు. ఇప్పుడు దానిని పనయ్యపురంగా పిలుస్తున్నారు.
ఈ గ్రామాన్ని పనయూర్ రాజ్యంలోని పరవైపురంగా శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడి ఆలయంలో దేవుడు పరవై ఈశ్వరన్‌గా దర్శనమిస్తారు.''
తండ్రి, ఆయన ప్రియురాలి విగ్రహాలు చేయించిన రాజాధిరాజ
"తన తండ్రి రాజేంద్ర చోళుడు, పరవై నంగె మరణం తర్వాత కూడా వారికి రాజేంద్రుడి కుమారుడు రాజాధిరాజ తగిన గౌరవం ఇచ్చారు. తిరువారూర్ ఆలయంలో వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు'' అని కళైసెల్వన్ చెప్పారు.
అలాగే, "రాజాధిరాజ తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన రెండో రాజేంద్రుడు కూడా తన తండ్రి రాజేంద్ర చోళుడు, ఆయన ప్రియురాలు పరవైని తన తల్లిగా భావించి, ఇద్దరి విగ్రహాలు చేయించి ఈశ్వరముడయార్ ఆలయంలో ప్రతిష్ఠించారు."
"వారి పుట్టిన రోజు నాడు అక్కడ వేడుకలు, దానధర్మాలు జరిగేవి. అతని తర్వాత వచ్చిన వీర రాజేంద్ర చోళుడు కూడా పరవై పేరుతో అనేక భూదానాలు చేశారు. ఆయన కుమారులు, అత్తిరాజేంద్రుడు, తరువాత వచ్చిన మొదటి కులోత్తుంగ చోళుడు కూడా పరవైపురం ఈశ్వరాలయానికి అనేక దానాలు చేశారు.''

''ఆ కాలంలోనూ నిజమైన ప్రేమకు ఎంత విలువనిస్తారో చెప్పేందుకు ఇదొక గొప్ప ఉదాహరణ'' అని కళైసెల్వన్ అన్నారు.
అలాగే మదురై-దిండిగల్ రోడ్డులో పరవై నాన్కైనల్లూర్ అనే పట్టణం ఉండేది. ఆమె తదనంతరం ఆ ఊరికి ఆ పేరు పెట్టారు. ప్రస్తుతం దీనిని పరవై అని పిలుస్తున్నారు. పరవై సరస్సులో దొరికిన పురాతన శాసనాలు పరవై నాన్కైనల్లూర్ పేరును ధ్రువీకరిస్తున్నాయి.
పరవై నంగె గురించిన శాసనాలు చిదంబరం, తిరువారూర్, పనయ్యపురంలలోనూ లభ్యమయ్యాయి.
రాజేంద్ర చోళుడు, పరవై నంగె మరణానంతరం రాజేంద్ర చోళుడి కుమారులు వారిద్దరి విగ్రహాలు ప్రతిష్టించి, వారి పూజల కోసం భూమిని దానంగా ఇచ్చినట్లు తిరువారూర్‌లోని మొదటి రాజాధిరాజ చోళుడి 24వ పాలనా సంవత్సరం(1042)లో వేసిన శాసనం వివరిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- భారత మాజీ నేవీ అధికారుల విడుదలలో షారుక్ ఖాన్ పాత్ర ఉందా? ఈయన పేరు ఎందుకు ట్రెండ్ అయ్యింది?
- స్పీడ్ డేట్:ప్రేమికుల రోజుని వ్యతిరేకించే వారికి నిరసనగా మొదలైన ఈ కొత్త ట్రెండ్ ఏంటి?
- పుల్వామా దాడికి అయిదేళ్లు : కశ్మీర్ ఎలా విడిపోయింది, వారికి ఏం కావాలి?
- రైతులు రెండేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు 'చలో దిల్లీ' అంటూ నిరసన బాట పట్టారెందుకు?
- బెల్లం తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














