రైతులు రెండేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు 'చలో దిల్లీ' అంటూ నిరసన బాట పట్టారెందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏడాది కాలంపాటు సుదీర్ఘ ఉద్యమం చేసి, నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేయడంలో సఫలీకృతులైన రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం మరోసారి కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు.
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతు సంఘాలు యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఫిబ్రవరి 13న 'దిల్లీ మార్చ్'కి పిలుపునిచ్చాయి.
అలాగే, ఫిబ్రవరి 16న ఒకరోజు గ్రామీణ భారత్ బంద్‌కు యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.

ఫొటో సోర్స్, EPA
రెండేళ్ల కిందట దిల్లీ శివారులో రైతు ఉద్యమం ఉధృతంగా సాగడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ''ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ - 2020(వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం), ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ ఎస్యూరెన్స్ అండ్ అగ్రికల్చరల్ సర్వీసెస్ యాక్ట్ 2020(ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతు ఒప్పంద చట్టం)''లను ఆమోదించాల్సి వచ్చింది. అలాగే, ''ఎసెన్షియల్ కమెడిటీస్ ఎమెండ్‌మెంట్ యాక్ట్ 2020(నిత్యవసర వస్తువుల సవరణ చట్టం)''ని రద్దు చేయాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చట్టాలతో కొన్ని పంటలకు కనీస మద్దతు ధర నిబంధనను రద్దు చేసి, వ్యవసాయంలో కార్పొరేటీకరణను ప్రోత్సహించే అవకాశం ఉందని, అవి అమల్లోకి వస్తే బడా కార్పొరేట్ కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందారు.
వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో రైతులు కూడా తమ ఉద్యమాన్ని విరమించుకున్నారు. కనీస మద్దతు ధర కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానితో పాటు మరికొన్ని డిమాండ్లు నెరవేరుస్తామన్న హామీ కూడా ఉంది.
ఆ డిమాండ్లను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు రైతులు మరోసారి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 13న 'దిల్లీ చలో' నినాదం కూడా ఆ వ్యూహాంలో భాగమే.

ఫొటో సోర్స్, Getty Images
రైతుల డిమాండ్ ఏమిటి?
''మా డిమాండ్లు నెరవేర్చాలని 'దిల్లీ చలో' మార్చ్‌కు పిలుపునివ్వలేదు. రైతులు ఆందోళనలను విరమించుకుని రెండేళ్లు అవుతోంది. అప్పుడు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం'' అని యునైటెడ్ కిసాన్ మోర్చా నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ బీబీసీతో అన్నారు.
''కనీస మద్దతు ధర కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానితో పాటు ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని కూడా చెప్పింది. అలాగే, లఖింపూర్ ఖేరి ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, గాయపడిన వారికి పది లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు'' అని డల్లేవాల్ చెప్పారు.
2021లో, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న సిక్కు రైతులపైకి కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనికి చెందిన ఎస్‌యూవీ కారు దూసుకెళ్లగడంతో నలుగురు రైతులు చనిపోయారు.
''రైతులకు కాలుష్య చట్టాల నుంచి విముక్తి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చేసిన అతిపెద్ద వాగ్దాగం ఏమిటంటే, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు అందజేయడం. కానీ, ఈ హామీల్లో ఒక్కదానిని కూడా నెరవేర్చలేదు'' అని డల్లేవాల్ చెప్పారు.
పంట సాగుకు అయిన ఖర్చుకు ఒకటిన్నర రెట్లు రైతులకు చెల్లించాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇదే సరైన సమయమని భావించారా?
గతంలో సుదీర్ఘ కాలం కొనసాగిన రైతు ఉద్యమం హఠాత్తుగా ఏమీ ఆగిపోలేదని పరిస్థితులను గమనిస్తూ వస్తున్న వారు చెబుతున్నారు. ఆ సమయంలో ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చాలని రైతులు ఒత్తిడి తెస్తున్నారు.
''మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. హామీల అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇదే సరైన సమయమని రైతులు భావిస్తున్నారు. ఒకరకంగా దీనిని వ్యూహాత్మక చర్యగా భావించవచ్చు'' అని రైతు ఉద్యమ నేత, జర్నలిస్ట్ మన్‌దీప్ పూనియా అభిప్రాయపడ్డారు.
''ప్రస్తుత కనీస మద్దతు ధర విధానంలో రైతులకు చెల్లిస్తున్న ధరలకు సంబంధించి, వారి ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. స్వామినాథన్ సిఫార్సుల మేరకు, అంటే సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధరగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత విధానంలో సాగు ఖర్చు ఆధారంగానే ప్రభుత్వం ధర నిర్ణయిస్తోంది, ఇందులో కూలీలకు అయ్యే ఖర్చులను కలపడం లేదు'' ఆయన అన్నారు.
''ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఎన్నికలు వస్తున్నాయి. ఒకవేళ కొత్త ప్రభుత్వం వస్తే మేం ఎలాంటి హామీలు ఇవ్వలేదని చెబుతుంది. కాబట్టి ప్రభుత్వ హామీలు గుర్తు చేసేందుకు ఇదే సరైన సమయం'' అని డల్లేవాల్ అన్నారు.
''ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించిన ప్రభుత్వం, ఆయన అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయకపోవడం విడ్డూరం. వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఆయన సిఫార్సు చేసినా ప్రభుత్వ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది'' అని డల్లేవాల్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
సన్నద్ధమవుతున్న రైతులు, ప్రభుత్వ పటిష్ట చర్యలు
హరియాణా, పంజాబ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలకు సన్నద్ధమవుతున్నారు. ఇంటింటికీ తిరిగి ఆహారానికి అవసరమైన వస్తువులను సేకరిస్తున్నారు. ట్రాక్టర్ ట్రాలీలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఒకవేళ ఫిబ్రవరి 12న ప్రభుత్వంతో చర్చలు విఫలమైతే ఫిబ్రవరి 13న రైతులు పెద్దయెత్తున దిల్లీ వైపు నిరసనగా వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు రైతుల నిరసనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పంజాబ్, హరియాణాల మధ్యనున్న శంభు సరిహద్దును సిమెంట్ బ్యారికేడ్లు, ముళ్ల కంచెలతో మూసివేస్తున్న చిత్రాలు మీడియాలో కనిపిస్తున్నాయి.
హరియాణా నుంచి దిల్లీ వైపు ట్రాక్టర్లు రాకుండా హరియాణాలోని ఘగ్గర్ నదిపై వంతెనను అధికారులు మూసేశారు. నది ఎండిపోయి ఉన్న ప్రాంతాల్లో జేసీబీలతో తవ్వుతున్నారు.
గత రైతు ఉద్యమ సమయంలో బ్రిడ్జిపై అడ్డంకులు సృష్టించడంతో, ఈ దారుల గుండానే రైతులు ట్రాక్టర్లతో దిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు.

ఫొటో సోర్స్, ANI
ఆందోళనల్లో పాల్గొనవద్దని రైతులపై ఒత్తిడి తెస్తున్నారని డల్లేవాల్, పూనియా చెబుతున్నారు. పోలీసు వాహనాలు గ్రామాలకు వెళ్తున్న వీడియోలు, పోలీసులు రైతులను హెచ్చరిస్తున్న వీడియోలు కనిపిస్తున్నాయి. ఆందోళనల్లో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులను హెచ్చరిస్తున్నట్లు ఆ వీడియోల్లో ఉంది. అయితే, ఆ వీడియోలను బీబీసీ ధ్రువీకరించలేదు.
''ఈ ఆందోళనల్లో రైతులు పాల్గొనవద్దని హరియాణా పోలీసులు చెబుతున్నారు. ఇళ్ల ముందు హెచ్చరికల పోస్టర్లు అతికిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లు, భూముల రికార్డులు అడుగుతున్నారు. రైతులకు డీజిల్ పోయొద్దని పెట్రోల్ బంకు యజమానులకు చెబుతున్నారు. రైతులు ట్రాక్టర్లతో బయటకు వెళ్తే వాటిని సీజ్ చేస్తున్నారు. వారి పాస్‌పోర్టులు జప్తు చేస్తున్నారు'' అని డల్లేవాల్ అన్నారు.
''భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతారు. మరోవైపు ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమిస్తున్న రైతులను బెదిరిస్తున్నారు. మేం కొత్త డిమాండ్లు చేయడం లేదు, పాత హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం'' అన్నారు డల్లేవాల్.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వంతో చర్చలు
రైతులతో చర్చించేందుకు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌లతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మంత్రులు ఫిబ్రవరి 12న చండీగఢ్‌లో రైతులతో చర్చలు జరుపుతున్నారని, అవి విఫలమైతే 13న రైతులు దిల్లీ వైపు మార్చ్ చేస్తారని డల్లేవాల్ చెప్పారు.
ఫిబ్రవరి 8న మంత్రులు మొదటి దశ చర్చలు జరిపారని, 12న మరోసారి చర్చలు జరుపుతున్నారని డల్లేవాల్ తెలిపారు.
అయితే, చర్చలకు ముందు రైతులకు ఇబ్బందికర వాతావరణం సృష్టించడం మానుకోవాలని, దాని వల్ల రైతుల్లో అసహనంతో శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉందని రైతు నాయకులు అంటున్నారు.
''ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు వినియోగదారుల వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. 2011-12 నాటి ఇదే కమిటీ రైతుల కోసం చేసిన సిఫార్సులు ఇప్పటికీ అమలు కావడం లేదు'' అని ఆయన అన్నారు.
''ఫిబ్రవరి 8న మంత్రులు తొలిసారి రైతులతో చర్చలు జరిపినప్పుడు ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందో తమకు తెలియదని చెప్పారు. ప్రభుత్వ హామీల గురించి మంత్రులకే అవగాహన లేకపోవడం విడ్డూరం'' అని జగ్జీత్ సింగ్ డల్లేవాల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- రేవంత్ రెడ్డి X కేసీఆర్: ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడొచ్చా? నేతల దిగజారుడు భాషను ఎలా చూడాలి?
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














