అన్నమయ్య ప్రాజెక్టు: వరద బాధితుల జీవితాల్లో రెండేళ్ల తరువాతైనా మార్పు వచ్చిందా? బాధితులు ఏమంటున్నారు, ఎమ్మెల్యే ఏం చెప్పారు

సుధామణి

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

ఫొటో క్యాప్షన్, ఆ విధ్యంసానికి రెండేళ్లయినా తాము సర్టిఫికెట్ల కోసం ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని పులపత్తూరుకు చెందిన సుధామణి చెప్పారు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయి రెండేళ్లు పూర్తయింది.

2021 నవంబర్ 19న జరిగిన ఆ ప్రమాదంలో కొన్ని గ్రామాలను నీళ్లు ముంచెత్తాయి. ఎంతో మంది ఇళ్లు, ఆస్తులు పోగొట్టుకొని నిలువ నీడ లేని వారయ్యారు.

రాజంపేట మండలంలోని పులపత్తూరు, తొగురుపేట, మందపల్లి, రామచంద్రాపురం గ్రామాలను పూర్తిగా నీళ్లు ముంచెత్తాయి.

ఆ వరదల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 33 మంది మృతి చెందారు. పొలాల్లో ఇసుక భారీగా మేటలు వేసి సాగుకు పనికి రాకుండా పోయాయి.

ఆరు నెలల్లో ఇళ్లు కట్టించి ఇస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినా ఇప్పటికీ ఆ మాట నెరవేరలేదని బాధితులు చెబుతున్నారు.

అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోయి ఏడాది పూర్తయిన సందర్భంగా నాడు బాధితులను పలకరించిన బీబీసీ, రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మరొకసారి వారితో మాట్లాడింది. మరి వారు ఏం అంటున్నారు?

అన్నమయ్య డ్యాం విధ్వంసం

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

ఇంకా అరకొరగానే ఇళ్లు...

బాధితులకు ఇళ్లు కట్టించే పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పులపత్తూరులో ఏడు కుటుంబాలకు ఇళ్లు మంజూరు అయ్యాయి.

కానీ జ్యోతి అనే మహిళ ఇంటికి మాత్రమే శ్లాబ్ పడింది.

ఆరు నెలలకే ఇళ్లు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ, రెండేళ్లు అయినా కాలేదని జ్యోతి అన్నారు.

‘‘మా ఒక్క ఇల్లు మాత్రమే పూర్తయింది. అది కూడా శ్లాబ్ నుంచి నీళ్లు కారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలలకే అన్నీ పూర్తి చేస్తామన్నారు. కానీ ఇప్పుడు రెండేళ్లు అయిపోయినా ఇళ్లు అలాగే ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా రెడీ కాలేదు’’ అని జ్యోతి చెప్పారు.

‘‘ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ అది సరిపోదు. మేస్త్రికి రూ.1,000, పని వాళ్లకు రూ.700 అవుతుంది. బిల్లు పెట్టినా ఒక్కసారి డబ్బు ఇవ్వరు. ప్రభుత్వం వాళ్లే ఉత్తరాది వాళ్లను ఎవరినో తీసుకొచ్చి ఇవి కట్టిస్తున్నారు. వాళ్లకు మేం చెప్పే భాష అర్థం కాదు, మాకు వాళ్లు చెప్పేది అర్థం కాదు. మేం ఒకటి చెప్తే వాళ్లు ఒకటి చేస్తున్నారు’’ అని ఆమె అన్నారు.

నీటి సమస్యల వల్ల నిర్మాణంలో ఉన్న ఇళ్ల నాణ్యత దెబ్బతింటోందని జ్యోతి చెబుతున్నారు.

‘‘ఇక్కడ నీళ్ల సమస్య తీవ్రంగా ఉంది. ట్యాంకులు పెట్టారు.. కానీ నీళ్లు సరిగా రావడం లేదు. వాళ్లకు చెబితే వచ్చి చూసి పోతారు. పట్టడానికి నీళ్లు లేకపోవడంతో బేస్ మట్టం పాడై పోయింది. మాకు కట్టి ఇచ్చిన ఇళ్లలో ఎక్కడా నాణ్యత లేదు. ఇళ్లన్నీ కారుతున్నాయి. మొదట కాంక్రీట్ వేశారు. దానిపైన మళ్లీ కాంక్రీట్ వేశారు. మాకిచ్చిన ఐదు సెంట్ల భూమిలో ఒక గది కట్టి అందులోనే అన్ని పెట్టారు’’ అని ఆమె చెప్పారు.

తమలో కొంతమందికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వలేదని పులపత్తూరుకు చెందిన ప్రసాద రెడ్డి అన్నారు.

‘‘రెండేళ్లు అయినా కొంతమందికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వలేదు. వారిలో నేను ఒకడిని మా ఇంట్లో మూడు పట్టాలు రావాల్సి ఉంటే.. ఇంకా రెండు రాలేదు’’ అని ఆయన తెలిపారు.

జ్యోతి

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

ఫొటో క్యాప్షన్, ఆరు నెలలకే ఇళ్లు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ, రెండేళ్లు అయినా కాలేదని జ్యోతి అన్నారు

ఒకప్పటి రైతులు.. నేడు కూలీలు

బాధిత గ్రామాల్లో ఒకప్పుడు ఎన్నో ఎకరాల్లో భూములను సాగు చేసుకుంటూ జీవించిన రైతులు ఇప్పుడు ఇతరుల పొలాల్లో కూలి పనులకు వెళ్తున్నారు.

రెండు మూడేళ్ల అవసరాలు తీరేలా తిండి గింజలు పండించుకుని, ఇంటి నిండా మూటలు వేసుకున్న వారు ఇప్పుడు రేషన్ షాపుల దగ్గర గంటలపాటు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.

రెండేళ్లయినా తాము సర్టిఫికెట్ల కోసం ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని పులపత్తూరుకు చెందిన సుధామణి చెప్పారు.

‘‘మేం కూలినాలి చేసుకొని బతకాలి. మాకు నలుగురు పిల్లలు. మా మామ వరదల్లో చనిపోయాడు. బట్టలు కూడా లేకుండా అన్ని కొట్టుకుపోయాయి. అప్పటినుంచి వాళ్లు వీళ్లు ఇచ్చింది ఏదో తీసుకుని బతుకుతున్నాం. భూములు కూడా అలాగే వదిలేశాం. ఇప్పుడు ఇతరుల పొలాల దగ్గరకు పోయి కూలి చేసుకొని బతుకుతున్నాం. సర్టిఫికెట్ల కోసం తిరుగుతూనే ఉన్నాం. ఇంతవరకు రాలేదు. అప్పుడు ఇళ్లు ఉండేవి, భూముల్లో పంటలు పండేవి.. కానీ అన్నీ కొట్టుకుపోయాయి’’ అని ఆమె తెలిపారు.

బగిడిపల్లికి చెందిన సుబ్బమ్మది కూడా ఇలాంటి కథే. ఒకప్పుడు సొంత పొలంలో వరి, పసుపు, వేరుశనగ లాంటి పంటలు పండిస్తూ జీవించిన ఆమె కుటుంబం ఇప్పుడు రేషన్ బియ్యం తెచ్చుకుని వాటితోనే కడుపు నింపుకోవాల్సిన పరిస్థితిలో పడింది.

ఒకప్పుడు ఎన్నో పంటలు పండిన తమ పొలాల్లో మట్టిని తొలగించి, సాగు చేయడానికి కావాల్సిన డబ్బులు లేకపోవడంతో కూలికి పోతున్నామని ఆమె చెప్పారు.

‘‘మా రెండు ఎకరాల భూమిలో ఇసుక మేటలే ఉన్నాయి. వాటిని తీసే శక్తి లేక అలాగే ఉంచేశాం. ప్రభుత్వం ఇచ్చే బియ్యం తెచ్చుకొని తింటున్నాం. ఇసుక ఎత్తిన చోట ఎక్కడైనా కూలి ఉంటే అక్కడకు పోయి పనిచేస్తున్నాం. మా పొలాల్లో మట్టి తొలగిస్తే, సాగుకు పనికి వస్తాయి. కానీ అంత డబ్బు లేక అలానే వదిలేశాం’’ అని ఆమె అన్నారు.

అన్నమయ్య డ్యాం విధ్వంసం

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

ఇలానే చాలా మంది పొలాల్లో ఇసుక తీయలేక సాగు చేసుకోలేకపోతున్నారని ప్రసాద రెడ్డి చెప్పారు. బిల్లులు ఇస్తారని చెబితే కొంతమంది సొంత డబ్బులు పెట్టి ఇసుక తీయించినా, వారికి ఇప్పటివరకూ డబ్బు ఇవ్వలేదన్నారు.

‘‘కొంతమంది పొలాల్లో ఇసుకను ప్రభుత్వ సిబ్బంది తొలగించారు. మరి కొంతమందికి మాత్రం మీరే డబ్బులు పెట్టి తీసేసుకోండి, బిల్లు ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మా పొలాల్లో ఇసుక ఇంకా అలాగే ఉంది. మావి మూడు సార్లు పండే భూములు. మా కుటుంబాల్లో ఎవరూ రేషన్ బియ్యం తిన్నది లేదు. అలాంటిది ఈరోజు మేం రేషన్ షాపు దగ్గర నిలబడాల్సి వస్తోంది’’ అని ప్రసాద రెడ్డి అన్నారు.

పొలాల్లో సాగు చేసిన పంట నష్టానికి పూర్తిగా బీమా డబ్బులు కూడా మాకు అందలేదని చెప్పారు ప్రసాద రెడ్డి. ఒక్క పసుపుకు మాత్రమే పరిహారం మొత్తం ఇచ్చారని, మిగతా ఏ పంటకూ ఒక్క రూపాయి కూడా అందలేదని తెలిపారు.

‘‘డ్యాం తెగిన సమయంలో వరి కోతలు పూర్తయ్యాయి. రెండు మూడేళ్లకు సరిపడా వడ్లు మూటలు మా ఇంట్లో ఉండేవి. అవన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయి. దీంతో రేషన్ బియ్యమే తినాల్సిన పరిస్థితిలో పడిపోయాం’’ అని ఆయన ఆవేదన చెందారు.

అన్నమయ్య డ్యాం విధ్వంసం

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

‘‘రుణాలైనా మాఫీ చేయాలి’’

రెండేళ్లైనా మా పొలాల్లో ఇసుక ఉందని చెబితే ఎవరైనా నవ్వుతారని, కొంత భూమిలో తామే సొంత డబ్బు పెట్టుకుని ఇసుక తీసి సాగు చేసుకుంటున్నామని ప్రసాదరెడ్డి అన్నారు.

‘‘మాకు 13 ఎకరాల సాగు భూమి ఉంది. అందులో నాలుగు బోర్లు ఉండేవి. ఆ నాలుగు బోర్లు పాడైపోయాయి. వాటికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. భూములకు ఒక నయా పైసా కూడా అందలేదు. రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ మా నాలుగు ఎకరాల భూమిలో ఇంకా ఇసుక ఉంది. 8 ఎకరాల్లో మేమే సొంతంగా డబ్బు పెట్టి ఇసుక తీసి సాగు చేసుకుంటున్నాం. మిగిలిన పొలంలో ఇంకా ఇసుక అలాగే ఉంది’’ అని ఆయన చెప్పారు.

సాయం కోసం తాము తిరగని ఆఫీసు లేదని బాధితులు చెబుతున్నారు. మరోవైపు తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి ఒత్తిడి కూడా తీవ్రమైందని ప్రసాదరెడ్డి తెలిపారు.

‘‘రెండేళ్లలో మేం తిరగని ప్రభుత్వ కార్యాలయమంటూ లేదు. తీసుకున్న లోన్లు కట్టాలని బ్యాంక్ నుంచి ఒత్తిడి ఉంది. వడ్డీ కట్టండని ఒత్తిడి చేస్తున్నారు. మా సొంత డబ్బులతో వాటిని రెన్యువల్ చేశాం. కనీసం భూమి మీద తీసుకున్న మా రైతు రుణాలైనా మాఫీ చేయమని ప్రభుత్వాన్ని అడిగాం. దానికి కూడా స్పందన లేదు’’ అని ప్రసాద రెడ్డి అన్నారు.

మల్లికార్జున రెడ్డి

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

ఫొటో క్యాప్షన్, 1,200 ఎకరాల్లో ఇసుక మేటలు తీయించిన ప్రభుత్వం.. ఆ పొలాలను సాగులోకి తీసుకొచ్చిందని ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి అన్నారు

ప్రభుత్వం ఏం చెబుతోంది?

కడుతున్న ఇళ్లు నాసిరకంగా ఉన్నాయనే బాధితుల ఆరోపణలపై ప్రశ్నించినపుడు, ప్రభుత్వం ఎవరికీ ఇళ్లు కట్టించి ఇవ్వడం లేదని రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి అన్నారు.

‘‘చిన్న చిన్న కాంట్రాక్టర్లను ఇచ్చి, వారి చేత ఇళ్లు కట్టించుకోమని బాధితులకు చెప్పాం. అలా బాధితులే తమ ఇళ్లను కట్టించుకుంటున్నారు. ఏవైనా లోపాలు ఉంటే అధికారులు టెస్ట్ చేసి వాటిని మారుస్తారు. నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు’’ అని ఎమ్మెల్యే చెప్పారు.

‘‘డ్యాం తెగిన ఘటనలో దాదాపు 500 వరకూ ఇళ్లు దెబ్బతిన్నాయి. మంచి కాలనీ ఏర్పాటు చేసి దాదాపు 446 మందికి ఇళ్లు మంజూరు చేయించాం. కొంతమంది సొంతంగా కట్టుకుంటున్నారు. కట్టుకోలేక ఇబ్బంది పడిన వారికి ఒక వ్యక్తిని పెట్టి 186 ఇళ్లను కట్టిస్తున్నాం. వాటిలో దాదాపు 102 ఇళ్ల శ్లాబ్‌లు పూర్తయ్యాయి. త్వరలో గృహప్రవేశాలు కూడా జరుగుతాయి. చనిపోయిన వారికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున పరిహారం చెల్లించాం’’ అని ఎమ్మెల్యే తెలిపారు.

సుమారు 1,200 ఎకరాల్లో ఇసుక మేటలు తీయించిన ప్రభుత్వం.. ఆ పొలాలను సాగులోకి తీసుకొచ్చిందని ఆయన అన్నారు.

‘‘పొలాల్లోకి బాగా ఇసుక వచ్చేసింది. కొన్ని భూముల్లో 10 మీటర్ల ఎత్తున ఇసుక పోగు పడింది. భూమి గుర్తుపట్టడానికి ఆనవాళ్లు లేకుండా పోయాయి. దాదాపు 1,200 ఎకరాల్లో ఇసుక మేటలు తీయించి సాగుకు అనువుగా మార్చాం. ఏళ్లుగా కొందరు రైతులు నదీ పరివాహక ప్రాంతాల్లో సాగు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ల దగ్గర ఎలాంటి పత్రాలూ లేవు. అలాంటి వారి పొలాల్లో ఇసుక తొలగించడానికి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి’’ అని ఆయన తెలిపారు.

వీడియో క్యాప్షన్, అన్నమయ్య డ్యామ్ బాధితుల జీవితాల్లో రెండేళ్ల తరువాతైనా మార్పు వచ్చిందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)