కామారెడ్డి: ‘అప్పు కట్టాలన్నందుకే ఒకే కుటుంబంలో ఆరుగురిని చంపేశాడు. ఎవరి హత్యకు ఎలా పథకం వేశాడంటే..’

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఓ యువతి హత్య కేసును ఛేదించే క్రమంలో తెలంగాణ పోలీసులు మరో ఐదు హత్యలను కూడా కనుగొన్నారు. యువతి సహా మొత్తం ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.
అప్పు తీర్చాలని ఒత్తిడి చేసినందుకే కుటుంబం మొత్తాన్ని నమ్మించి హత్య చేశాడని చెబుతూ పోలీసులు ఒక యువకుడిని, అతడికి సహకరించారనే ఆరోపణలున్న మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
డిసెంబర్ 14న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూంపల్లి శివార్లలో 25 ఏళ్ల యువతి శవం పూర్తిగా కాలిన స్థితిలో పోలీసులకు లభ్యం అయింది. హత్య చేసి ఆ తర్వాత శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా వారు గుర్తించారు.
ఈ కేసులో సదరు యువతితోపాటు మరో ఐదుగురు వ్యక్తులు హత్యకు గురైనట్టుగా గుర్తించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మేదాడి ప్రశాంత్ (25) తోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిని డిసెంబరు 19న పోలీసులు అరెస్ట్ చేశారు.
కేసు నిందితుల్లో ఒక జువైనల్ కూడా ఉన్నాడు.

ప్రధాన నిందితుడు మృతుడి స్నేహితుడే
నిజామాబాద్ జిల్లాలో మండల కేంద్రమైన మాక్లూరుకు చెందిన పూనె ప్రసాద్ (39), అదే గ్రామానికి చెందిన మేడిద ప్రశాంత్ (25) స్నేహితులు.
పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం- 2018లో ఓ యువతి ఆత్మహత్య కు కారణమయ్యాడని ప్రసాద్‌పై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో అతను దుబాయ్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతనిపై కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసు వివరాలను ఎప్పటికప్పుడు ప్రసాద్ తన స్నేహితుడు ప్రశాంత్ ద్వారా కనుక్కుంటూ ఉండేవాడు.
ఈ క్రమంలో తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రసాద్ నుంచి 3.5 లక్షల రూపాయలను ప్రశాంత్ అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బును ప్రసాద్ దుబాయ్ నుంచి పలుదఫాలుగా పంపాడు.
ఈ నేపథ్యంలో అక్టోబరు 2022లో ప్రసాద్ ఇండియాకు తిరిగి రావడంతో అతన్ని మాక్లూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ప్రసాద్ బెయిల్ పై బయటకు వచ్చాడు.

ఫొటో సోర్స్, UGC
ఈ క్రమంలో గ్రామస్థుల నుంచి వచ్చిన ఒత్తిడితో ప్రసాద్ తన కుటుంబాన్ని కామారెడ్డి జిల్లా పాల్వంచకు మార్చారు. ప్రసాద్ తో పాటు అతని భార్య శాన్విక (29), తల్లి సుశీల, కవల పిల్లలు చైత్రిక(8), చైత్రిక్(8) , చెల్లెళ్లు స్వప్న (26), శ్రావణి (23) ఉన్నారు.
జైలు నుంచి రావడం, ఊళ్ళో ఉండనీయకపోవడం, కొత్త ప్రదేశంలో కాపురం పెట్టడం తదితర కారణాల వలన ప్రసాద్‌కు అప్పులు పెరిగాయి.
అప్పులు తీర్చేందుకు తన స్వగ్రామం మాక్లూర్ లోని ఇల్లు , స్థలం కుదవ పెట్టి డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించినా గ్రామస్థులు ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో గతంలో తన దగ్గర తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వాలని ప్రసాద్, ప్రశాంత్‌ను అడగ్గా, ప్రశాంత్ కాలయాపన చేశాడు.

‘ఆస్తి నా పేరుపైన మార్చితే లోను ఇప్పిస్తా’
అప్పులబాధ ఎక్కువ అవడం, తన పేరుమీద అప్పు పుట్టని పరిస్థితుల్లో ఆస్తిని బ్యాంకులో తాకట్టు పెడితే రుణం వస్తుందని ప్రసాద్‌కు ప్రశాంత్ సలహా ఇచ్చాడని పోలీసులు చెప్పారు.
‘‘ఆస్తిని తన పేరు మీద బదలాయిస్తే బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో మే నెలలో ఇల్లు, భూమిని ప్రశాంత్ పేరు మీద రిజిస్టర్ చేశాడు ప్రసాద్. నెలలు గడుస్తున్నా బ్యాంకు లోన్ రాకపోవడం, అడిగితే కాలయాపన చేస్తుండటంతో తన ఆస్తిని తిరిగి తన పేరు మీద బదలాయించాలని ప్రసాద్, ప్రశాంత్ మీద ఒత్తిడి పెంచారు.
ప్రసాద్‌ను గ్రామస్థులు ఎలాగూ ఊరిలోకి రానివ్వరని తెలిసి, ఆ ఆస్తిని దక్కించుకోవాలని, ఈ క్రమలో ఆ కుటుంబాన్ని మొత్తం చంపివేస్తే అతని గురించి అడిగే దిక్కే ఉండదని ప్రశాంత్ భావించాడు. తన ప్లాన్‌లో భాగంగా దుర్గానగర్ కు చెందిన తన పరిచయస్తులు బానోత్ వంశీ, గుగులోత్ విష్ణు లతో 60 వేల రూపాయలకు హత్య ఒప్పందం కుదుర్చున్నాడు.

ఫొటో సోర్స్, UGC
తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లు పూర్తయ్యాక ప్రసాద్‌ను హత్య చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు.
అయితే డబ్బుల కోసం అతని నుండి ఒత్తిడి పెరగడంతో పోలింగ్‌కు ముందే నవంబర్ 29న ప్రసాద్‌ను అద్దె కారులో నిజామాబాద్‌కు తీసుకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో మాక్లూర్ మండలం మదనపల్లి శివారు అటవీ ప్రాంతంలో మద్యం తాగించి ఆ తర్వాత కర్రలు, రాళ్లతో తలపై కొట్టి చంపేశారు.
పొదల్లో శవాన్ని దాచారు. మధ్య రాత్రి పలుగు, పారలతో వచ్చి అక్కడే గొయ్యి తీసి శవాన్ని పాతిపెట్టారు” అని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు.

ఫిర్యాదు చేయకూడదనే వరుస హత్యలు: ఎస్పీ
ప్రసాద్ కనబడని విషయం ఎలాగూ పోలీసులకు ఫిర్యాదు చేస్తారని ఊహించిన ప్రశాంత్ హత్యకు పాల్పడిన రెండో రోజు (డిసెంబర్ 1) పాల్వంచ లోని తన స్నేహితుడు ప్రసాద్ కుటుంబ సభ్యులను కలిశారని ఎస్పీ చెప్పారు.
‘‘పాత కేసు విషయంలో పోలీసులు ప్రసాద్‌ను అరెస్ట్ చేసేందుకు తిరుగుతున్నారని, దాంతో అతను ఒక రహస్య ప్రదేశంలో ఉన్నాడని, అతనిని కలిసేందుకు తనతో రావాలని భార్య శాన్విక, చెల్లెలు శ్రావణిని తనతో నిజామాబాద్‌కు తీసుకెళ్ళారు.
ఈ క్రమంలో చెల్లెలు శ్రావణిని నిజామాబాద్‌లో ఒక ప్రదేశంలో ఉంచి, ప్రసాద్ భార్య శాన్వికను భర్త దగ్గరికి తీసుకెళ్తున్నట్టుగా నమ్మించి కారులో తీసుకువెళ్లాడు.
దారిలో వెనక నుంచి తాడుతో శ్రావణి గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం బాసర గోదావరి బ్రిడ్జిపై నుంచి శవాన్ని నదిలోకి విసిరేశాడు.
తర్వాత నిజామాబాద్‌లో శ్రావణి ఉన్న ప్రాంతానికి తిరిగి వచ్చి, ఆమె అన్న, వదినలను కలిపామని తననూ అక్కడికి తీసుకెళ్తామని చెప్పి శ్రావణిని కూడా కారులో తీసుకువెళ్లారు. కారులో వెళ్తున్న క్రమంలో గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. అనంతరం మెదక్ జిల్లా వడియారం శివార్లలో జాతీయ రహదారి-44 పక్కన శవంపై పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడి నుంచి తిరిగి స్వగ్రామం మాక్లూర్ వెళ్లిపోయారు.
ఆ మరుసటి రోజు పాల్వంచలో ఉన్న ప్రసాద్ తల్లి సుశీల, చెల్లి స్వప్న, ఇద్దరు పిల్లలను కలిసి పాత కేసు విషయంలో పోలీసులు పట్టుకెళ్తారని భయపెట్టారు. ప్రసాద్, అతని భార్య, మరో చెల్లి నిజామాబాద్ లో సేఫ్‌గా ఉన్నారని చెప్పి, అందరిని కారులో నిజామాబాద్ తీసుకెళ్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ లాడ్జ్ లో ఉంచారు’’ అని సింధు శర్మ వివరించారు.

ఫొటో సోర్స్, UGC
తల్లినీ రంగంలోకి దించిన ప్రశాంత్
‘‘ఈ క్రమంలో తన ప్రవర్తనపై ప్రసాద్ కుటుంబానికి అనుమానం రాకుండా ఉండాలని ప్రశాంత్ తన తల్లి వడ్డమ్మ (60)ను నేరంలో భాగస్వామిని చేశారు. జరిగిన విషయం తల్లికి చెప్పి తనకు సహకరించాలని నిజామాబాద్ లాడ్జ్‌కు తీసుకొచ్చి ప్రసాద్ కుటుంబంతో ఉంచారు.
డిసెంబర్ 4న ప్రసాద్ పిల్లలను చూడాలని అడుగుతున్నాడని చెప్పి ప్రసాద్ తల్లి సుశీల , మరో చెల్లి స్వప్నను అక్కడే లాడ్జిలో దింపి, తన తల్లి వడ్డమ్మను కాపలాగా ఉంచి పిల్లలు చైత్రిక్, చైత్రికలను కారులో నిర్మల్ వైపు తీసుకెళ్లి మార్గమధ్యలో ఇద్దరి గొంతు నులిమి శవాలను గోనె సంచుల్లో కట్టి సోన్ గ్రామ సమీపంలో బ్రిడ్జి పై నుండి గోదావరి నదిలోకి విసిరేసి వెళ్లిపోయారు. ఇద్దరు పిల్లల హత్యలో ప్రశాంత్ తన తమ్ముడు (జువైనల్ ) సహకారం తీసుకున్నాడు.
పిల్లలను హత్య చేసిన తర్వాత లాడ్జికి వెళ్ళి ప్రసాద్, అతని భార్యా పిల్లలందరు ఒకే చోట రహస్య ప్రాంతంలో ఉన్నారని, త్వరలో వారి దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి అంతవరకూ లాడ్జీలోనే ఉండాలని ప్రసాద్ తల్లి సుశీల, చెల్లెలు స్వప్నలకు తోడుగా తన తల్లి వడ్డమ్మను అక్కడే ఉంచాడు’’ అని ఎస్పీ చెప్పారు.

చివరి హత్య
డిసెంబర్ 13న ప్రశాంత్ మైనర్ అయిన తమ్ముడితోపాటు వంశీ అనే మరో వ్యక్తి సహాయంతో లాడ్జ్‌లో ఉన్న ప్రసాద్ చెల్లి స్వప్నను కారులో ఎక్కించుకుని, గాంధారీ ఎక్స్ రోడ్‌లో భూంపల్లి శివార్లలో గొంతు నులిమి హత్య చేసి, రోడ్డు పక్కన ఉన్న గుంతలో శవాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారని ఎస్పీ తెలిపారు.
‘‘లాడ్జిలో ఉన్న ప్రసాద్ తల్లి సుశీలను చంపేస్తే, ఇక అందరి అడ్డు తొలగుతుందని అనుకున్నారు. అయితే సుశీల వారి నుంచి తప్పించుకుని పోయింది. సుశీల పాల్వంచకు వెళ్ళి ఉంటుందని భావించి అటువైపు కారులో వస్తుండగా నిందితుడు ప్రశాంత్‌తోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిని గాంధారీ ఎక్స్ రోడ్ లో అరెస్ట్ చేశాం’’ అని ఆమె వివరించారు.
ఈ వరుస హత్యల ఘటనలో సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నెంబర్.249/2023 , ఐపిసీ U/s 302, 364, 201, 379R/W 109 కింద కేసు నమోదైంది.
అదే సమయంలో డిసెంబర్ 4న మెదక్ జిల్లా చేగుంట, డిసెంబర్ 8న నిజామాబాద్ జిల్లా మెండోరా, డిసెంబర్ 14 న కామారెడ్డి జిల్లా సదాశివనగర్, డిసెంబర్ 17 న నిజామాబాద్ జిల్లా మెండోరా పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి.
విచారణలో నిందితులు మేడిద ప్రశాంత్ తో పాటు అతనికి సహకరించిన గుగులోత్ విష్ణు, బానోత్ వంశీ, వడ్డమ్మతోపాటు జువైనల్‌ను సంబంధిత కోర్టులో హాజరు పరుస్తామని ఎస్పీ తెలిపారు.
నిందితుల నుంచి హత్యలకు వాడినట్టుగా భావిస్తున్న కారు, బైకు, భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు, 30 వేల నగదు, 5 సెల్ ఫోన్లు, హత్యలు చేసేందుకు వాడిన తాడు, పెట్రోల్ బాటిళ్లు, పలుగు, పారలను కామారెడ్డి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- ‘80 ఏళ్ల వయసులో మళ్లీ సెక్సువల్ రిలేషన్ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు’
- గవదబిళ్లలు : పిల్లలను ఇబ్బంది పెట్టే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, లక్షణాలేంటి?
- వయసు పెరుగుతున్నకొద్దీ సెక్స్ కోరికలు ఎవరిలో పెరుగుతాయి? దీనికి ఎలాంటి పరిస్థితులు కావాలి....
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














