తులసి: ‘పాకిస్తాన్‌లో ఏ హిందూ యువతీ క్రీడల్లో ఇంత దూరం రాలేదు’

- రచయిత, షుమైలా ఖాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఇప్పటివరకు ఏ హిందూ యువతి కూడా ఆటల్లో ఇంత దూరం రాలేదు. ఇక్కడి హిందువుల పిల్లలను ఎక్కువగా చదివించరు, కానీ నాకు మంచి పేరెంట్స్ దొరికారు, నేను అదృష్టవంతురాలిని'' అని సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ పాకిస్తాన్ జాతీయ చాంపియన్, ఆ దేశంలోని మొదటి హిందూ క్రీడాకారిణి తులసి మేఘవార్ అన్నారు.
21 ఏళ్ల తులసి పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో కోత్రి నగరంలోని సాధు మొహల్లాలో నివసిస్తున్నారు.
2016లో ఆరో తరగతిలో ఉండగా పాఠశాలలో స్పోర్ట్స్ క్యాంప్ నిర్వహించారని, అందులో చాలా మంది బాలికలు పాల్గొన్నారని తులసి మేఘవార్ గుర్తుచేసుకున్నారు. ఆ శిబిరంలో తులసి కూడా పాల్గొని, ఎంపికైంది.

'బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ అటలని కూడా తెలియదు'
“పాకిస్తాన్‌లో ఎక్కువగా క్రికెట్ ఆడతారు. బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ ఎలా ఆడతారో కూడా నాకు తెలియదు, స్పోర్ట్స్ క్యాంపులో పాల్గొన్నప్పుడు, అది అమెరికా జాతీయ క్రీడని, ప్రపంచ స్థాయిలో ఆడతారని తెలిసింది'' అని తులసి తెలిపారు.
బేస్‌బాల్ నేషనల్ గేమ్స్, రెండు సింధ్ గేమ్స్, మూడు లోకల్ ఒలింపిక్స్ టోర్నీల్లో పాల్గొన్నారు తులసి మేఘవార్. స్వర్ణం, కాంస్యంతో సహా అనేక పతకాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
'అబ్బాయిల మధ్యలోనే ప్రాక్టీస్'
కోత్రి సింధ్ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం. అక్కడ పచ్చదనం, గడ్డితో కూడిన ఒక మైదానం ఉంటుంది. ఆడుకోవడానికి క్రీడాకారులు, సేదతీరడానికి సామాన్యులు ఆ మైదానంలోకే వస్తుంటారు.
సూర్యాస్తమయానికి ముందు వరకు ఈ మైదానంలో క్రికెట్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడుతుంటారు. సాయంత్రం వేళ ఆ స్థలం కుటుంబాలకు పార్కుగా మారుతుంది.
‘‘ఇక్కడ ఆడపిల్లలకు ప్రత్యేకంగా గ్రౌండ్ లేదు. అబ్బాయిలు ఆడుకునే గ్రౌండ్‌లోనే ప్రాక్టీస్ చేయాలి. వాళ్ల మధ్యలో ప్రాక్టీస్ ఇబ్బందిగా ఉంటుంది. జాతీయ క్రీడలకు వెళ్లాలంటే ప్రాక్టీస్ అవసరం, కాబట్టి ఏదో ఒక విధంగా సాధన చేస్తాం" అని తులసి అంటున్నారు.
గ్రౌండ్ కాకుండా తులసి తన సోదరితో కలిసి ఇంటి వద్ద కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ ఆటలు నేర్చుకోవడానికి ఇంటర్నెట్, యూట్యూబ్ ఉపయోగిస్తుంటారు.
"నేను టీవీలో చూస్తాను, ఇంటర్నెట్‌లో బేస్‌బాల్ మ్యాచ్‌ల వీడియోలు వెతుకుతాను. అమ్మాయిలు ఆడటం చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలా చూసే, వారెలా ఆడుతున్నారు? ఆట నిబంధనలేంటనేది అర్ధం చేసుకుంటాను. వారిలా ఆడటానికి ప్రయత్నిస్తుంటాను" అని తులసి తెలిపారు.

చాలామంది నన్ను గౌరవించలేదు: తులసి తండ్రి
తులసి తండ్రి హర్జీ మేఘవార్. ఆయనొక జర్నలిస్టు. కొన్నేళ్ల క్రితం వరకు ఆయన హిందూ కమ్యూనిటీ వార్తాపత్రిక అయిన 'సందేశ్'ను నడిపేవారు. ఆర్థిక సంక్షోభం కారణంగా దాన్ని కొనసాగించలేకపోయారు.
కూతుళ్లకు చదువు చెప్పిస్తున్నపుడు కొందరు హిందువులు తనకు గౌరవం ఇవ్వలేదన్నారు హర్జీ.
ఆడపిల్లలు అదుపులో ఉండరని చెప్పారని, అయితే ఎవరినీ పట్టించుకోలేదని హర్జీ తెలిపారు.
తులసి, ఆమె ఇద్దరు అక్కలు చదువుతోపాటు ఇంట్లో కుట్టు పని, ఎంబ్రాయిడరీ పనులు చేస్తుంటారు. ప్రోడక్టులు ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంటారు.
ప్రాక్టీస్ కోసం తులసి బైక్‌పై మైదానం వరకు వెళతారు.
ఆడటానికి వెళ్లినపుడు కొందరు హిందువులు ప్రశంసిస్తుండేవారని, మరికొందరు విమర్శిస్తుండేవారని తులసి గుర్తుచేసుకున్నారు.
“పాకిస్తాన్‌లో క్రీడల్లో ఇంతదూరం వచ్చిన మొదటి హిందూ అమ్మాయంటూ కొందరు హిందువులు ప్రశంసించారు. మరికొంతమందేమో ఈ ఒంటరి అమ్మాయి అలా ఎలా బయటకు వెళుతోంది? వాళ్ల అమ్మానాన్న ఇలా వదిలేస్తే ఎలా? అనేవారు" అని గుర్తుచేసుకున్నారు హర్జీ.
"నేను వారి మాటలను ఒక చెవితో విని, మరో చెవితో వదిలిపెడతాను. నన్ను నేను నిరూపించుకోవాలి. నేను దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. నేను ఇప్పటివరకైతే సింధ్ లెవల్‌లోనే ఉన్నాను. నేను అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని నా తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు" అని తులసి అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- రజినీకాంత్ మెడలో కోరలు తీయని పాము.. అదెలా జరిగింది? ఆయన ‘స్నేక్ సెంటిమెంట్’ ఏమిటి?
- ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం: రెండు దేశాల పరిష్కారం అంటే ఏంటి... అది ఎందుకు అమలు కాలేదు?
- అన్నా మణి: ఈ భారతీయ ‘వెదర్ వుమన్’ గురించి మీకు తెలుసా?
- బిగ్ బజార్: రిటైల్ కింగ్ కిశోర్ బియానీ సామ్రాజ్యం ఎలా దివాలా తీసింది...
- మెహందీ పెట్టుకుంటే కొందరికి అలర్జీ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














