మెహందీ పెట్టుకుంటే కొందరికి అలర్జీ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కళావాణి పన్నీరుసెల్వం
- హోదా, బీబీసీ కోసం
ఈ స్పెషల్ డే కోసం మహతి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇంటికి బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. చేతులకు అందమైన డిజైన్లతో మెహందీ(గోరింటాకు) కూడా పెట్టుకున్నారు.
మెహందీ అంటే మహతికి చాలా ఇష్టం. ఇది ఎంత బాగా పండితే అంత మంచి భర్త వస్తారని స్నేహితులు అంటుంటే ఆమె మురిసిపోయారు. అక్కడకు వచ్చిన వారంతా ఒక్కొక్కరు ఒక్కో డిజైన్‌లో గోరింటాకు పెట్టుకున్నారు.
అయితే, కొంత సేపటికి మహతి చేయి దురదపెట్టడం మొదలైంది. కానీ, అందరూ పాటలు, డ్యాన్స్‌లతో సరదాగా ఉండటంతో ఆ విషయాన్ని ఆమె పెద్దది చేయాలని అనుకోలేదు.
డ్యాన్స్ వల్ల బాగా అలసిపోవడంతో మహతీకి త్వరగా నిద్ర పట్టేసింది. ఆ మరుసటి రోజు నిద్ర లేవకముందే చేతులు, కాళ్లలో నొప్పి రావడం మొదలైంది. కళ్లు తెరచి చూసే సరికి మెహందీ పెట్టుకున్న చోట చర్మం వాచిపోయినట్లుగా కనిపించింది.

ఫొటో సోర్స్, DR VANATHI
పెళ్లి రోజున నొప్పితో
నీటితో మెహందీ కడిగేసుకున్న తర్వాత, తనకు అలర్జీ వచ్చిందని మహతీకి అర్థమైంది. ఆమెను చూసేందుకు వచ్చిన వారంతా చేతికి వేపాకు, పసుపు ముద్దను పెట్టుకోవాలని సూచించారు. వెంటనే ఆమె ఆ ముద్దను పెట్టుకున్నారు. అయితే, దాని వల్ల దురద మరింత ఎక్కువైంది.
ఆ రోజు సాయంత్రానికి మహతీ చేతులపై వాపు మరింత ఎక్కువైంది. అప్పుడే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోందని ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె డెర్మటాలజిస్టును కలిశారు.
ఆమెకు యాంటీ-అలర్జీ పిల్స్, ఆయింట్‌మెంట్లను వైద్యులు ఇచ్చారు. అయితే, మరుసటిరోజ ఉదయమే పెళ్లి ముహూర్తం. పెళ్లి పీటలపై కూర్చొన్న ఆమె చేతిలో కొన్ని వస్తువులను పూజారి పెట్టారు. వాటిని అగ్ని గుండంలో వేయమన్నారు.
అయితే, అవి అగ్ని గుండంలో వేసేటప్పుడు చేతి కట్టును తొలగించాలని, లేదంటే చేతికి మంటలు అంటుకునే ప్రమాదం ఉందని సూచించారు. అయితే, ఆ కట్టు తీసిన తర్వాత, చేతిపై పుండ్లు, అలర్జీని చూసి పెళ్లి కొడుకు విస్మయానికి గురయ్యారు. విషయం తెలుసుకుని ఆమెకు అండగా నిలిచారాయన.
ఆ తర్వాత నెమ్మదిగా ఆమె చేతిపై పుండ్ల నుంచి రక్తం లాంటి ద్రవం కారడం మొదలైంది. దీని వల్ల వారి హనీమూన్ కూడా అనుకున్నట్లుగా జరగలేదు. పర్యటక ప్రాంతాలకు బదులుగా వీళ్లు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు అలర్జీ వస్తుంది?
చాలా మంది మెహందీ కోన్లు చూసి ఇది వట్టి గోరింటాకే అనుకుంటారు. కానీ, దీనిలో పారాఫినైలిన్‌డయామైన్ (పీపీడీ)గా పిలిచే ఒక రసాయనం కూడా కలుపుతారు. ఊదా రంగులో ఉండే దీనితో చేతులు మరింత ఎర్రగా మారతాయి.
పీపీడీతో చాలా మందికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని, కానీ, కొంతమందికి దీనితో అలర్జీ వచ్చే అవకాశం ఉంటుందని చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెర్మటాలజిస్టుగా పనిచేస్తున్న వానాతి చెప్పారు.
‘‘కొన్ని ఔషధాలు చాలా మంది ప్రాణాలను నిలబెడతాయి. అవే ఔషధాలు మరికొందరికి ప్రాణాంతకంగానూ మారతాయి. అలానే ప్రతి శరీరమూ కొన్ని ఔషధాలను తిరస్కరించొచ్చు’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గోరింటాకు...
ప్రాచీన కాలంలో శరీరంపై బొమ్మలు వేసేందుకు గోరింటాకు ఉపయోగించేవారు. పెళ్లికి ముందు కూడా అందరూ ఈ ఆకులను మెత్తగా రుబ్బుకొని చేతులకు పెట్టుకునేవారు.
మరోవైపు దీపావళి, సంక్రాంతి, ఇతర పండుగల సమయంలోనూ ఇంట్లోని మహిళలు, పిల్లలు ఎక్కువగా ఈ గోరింటాకును పెట్టుకునేవారు. భారత్‌తోపాటు అరబ్ దేశాల్లోనూ ఇలాంటి సంప్రదాయం కనిపిస్తుంది.
గోరింటాకులో నిమ్మకాయ రసం, టీపొడి లాంటివి కూడా కొంతమంది కలుపుతుంటారు. దీని వల్ల చేతులు మరింత ఎర్రగా పండుతాయని భావిస్తుంటారు.
గోరింటాకు కోసం నదులు, చెరువుల పక్కనుండే గోరింటాకు చెట్ల దగ్గరకు వెళ్లి యువతులు, పిల్లలు ఆకులు కోసేవారు. అప్పట్లో డిజైన్ అంటే చేతి మధ్యలో చందమామలా గుండ్రంగా డిజైన్ పెట్టుకోవడం, దాని చుట్టూ చుక్కలు పెట్టడమే.
అయితే, నేడు చాలా డిజైన్లు మన ముందు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూర్ణంగా చేసిన గోరింటాకును ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి కోన్‌లా చేతికి పెట్టుకుంటున్నారు.
కొంతమందికి గోరింటాకు అంత ఎర్రగా పండదు. ముఖ్యంగా నారింజ లేదా లేత ఎరుపు రంగులో ఇది కనిపిస్తుంది. అయితే, ఎర్రగా పండకపోవడానికి మంచి భర్త కాన్సెప్ట్‌తో ముడిపెట్టడంతో వారు కాస్త చిన్నబోయేవారు.
దీంతో ఆ తర్వాతి కాలంలో అందరి చేతులు మరింత బాగా పండేందుకు రసాయనాలను కూడా కలపడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు చేయి ఎలా పండుతుంది?
గోరింటాకుతో చేయి ఎలా పండుతుందో డాక్టర్ వానాతి బీబీసీకి వివరించారు. ‘‘గోరింటాకు శాస్త్రీయ నామం లాసోనియా ఇనెర్మిస్. దీనిలోని లాసోన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది మన చర్మంలోని కొన్ని కణాలతో చర్యలు జరుపుతుంది. ఫలితంగా చేయి ఎర్రగా పండుతుంది’’ అని ఆమె చెప్పారు.
‘‘పీపీడీలాంటి రసాయనాలు కూడా ఇలానే చర్మంలోని కణాలతో చర్యలు జరుపుతాయి. దీని వల్ల మన చేయి ఎర్రగా పండుతుంది. ఎక్కువసేపు అలానే వదిలేస్తే నల్లగా కూడా అవుతుంది’’ అని అన్నారు.
ఈ రసాయనాలను ఇంకా ఎవరు ఉపయోగిస్తుంటారు? ఈ ప్రశ్నపై వానాతి మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా తెల్లజుట్టుకు వేసుకునే రంగును తయారుచేసే సంస్థలు ఈ రసాయనాన్ని ఉపయోగిస్తుంటాయి. అయితే, మొత్తం పరిమాణంలో ఇది రెండు శాతానికి మించకూడదు. కానీ, చాలా సంస్థలు దీన్ని చాలా ఎక్కువగా కలిపేస్తుంటాయి. బట్టలకు రంగులు వేసే సంస్థలూ ఈ రసాయనాన్ని ఉఫయోగిస్తుంటాయి. రబ్బరు పరిశ్రమల్లోనూ దీన్ని వాడుతుంటారు’’ అని చెప్పారు.
అయితే, చర్మం, కళ్లు, నోరు లాంటి మార్గాల ద్వారా శరీరంలోకి ఇది వెళ్లినప్పుడు కొన్ని చర్యలు జరుపుతుంది.
‘‘కాస్త ముదురు రంగుల్లో ఉండేవారికి చర్మంలో ఉండే మెలనిన్ వల్ల పెద్దగా సమస్యలు ఉండవు. కానీ, కాస్త తెల్లగా ఉండేవారికి కొన్ని ఇబ్బందులు కలగొచ్చు’’ అని వానాతి అన్నారు.
అయితే, క్రమం తప్పకుండా జుట్టుకు వేసుకునే రంగులతోనూ కొన్ని దుష్ప్రభావాలు ఉండొచ్చని వానాతి చెప్పారు. ‘‘మీలో అలర్జీలకు ఆ రంగే కారణమని చెప్పినప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తంచేస్తుంటారు. మేం పదేళ్ల నుంచీ అదే బ్రాండును ఉపయోగిస్తున్నామని అంటారు. కానీ, ఒక రసాయనాన్ని తరచూ చర్మంపై పడేలా చేసినప్పుడు, ఆ చర్మం సెన్సిటివ్‌గా మారుతూ వస్తుంది. దీని వల్ల అలర్జీలు, జుట్టు ఊడిపోవడం, తెల్లమచ్చలు లాంటి సమస్యలు కూడా రావచ్చు’’ అని ఆమె తెలిపారు.
‘‘జుట్టుకు వేసుకునే రంగుతో ఎలా అలర్జీలు వస్తాయో.. మెహందీలో వాడే రసాయనాలతోనూ అంతే’’ అని చెప్పారు.
‘‘మొదటిసారి వేసుకున్నప్పుడు అలర్జీ రాలేదు కదా అని, కొంతమంది పదేపదే దీన్ని పెట్టుకుంటారు. దీని వల్ల ఏదో ఒక రోజు వారికి చర్మ సమస్య రావచ్చు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మరింత అప్రమత్తంగా ఉండాలి’
‘‘హెయిర్ డై అలర్జీ సమస్య ఉండే ఒక పేషెంట్ ఇలానే అమెరికా వెళ్లేటప్పుడు వద్దని చెప్పినా రంగు వేసుకున్నారు. అయితే, ఆ తర్వాత అక్కడ ఎండలోనూ ఎక్కువసేపు గడిపారు. ఫలితంగా ఇక్కడకు వచ్చిన తర్వాత పది రోజులు హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది’’ అని వానాతి చెప్పారు.
కొంతమంది ఎరుపుకు బదులుగా నలుపు లేదా భిన్నమైన మెహందీలను ఎంచుకుంటారు. అయితే, వీటిలో మరింత ఎక్కువ రసాయనాలు ఉండొచ్చని వానాతి హెచ్చరించారు.
పచ్చబొట్ల విషయంలోనూ మనం అప్రమత్తంగా ఉండాలని వానాతి చెప్పారు. ‘‘పచ్చబొట్లలోనూ ఇలాంటి రసాయనాలే కలుపుతుంటారు. వీటి వల్ల గ్రాన్యులోమా లాంటి సమస్యలు రావచ్చు. అంటే చర్మంపై ఎర్రని మచ్చలు వస్తాయి. మరోవైపు అదే సూదిని పదేపదే ఉఫయోగించడంతో హెచ్ఐవీ, టీబీ లాంటి సమస్యలు కూడా రావచ్చు’’ అని ఆమె అన్నారు.
పీపీడీతో కొన్నిసార్లు తీవ్రమైన వాపు, గొంతు నొప్పి, కడుపునొప్పి, వాంతులు, కిడ్నీల సమస్యలు కూడా రావొచ్చని చెప్పారు.

ఫొటో సోర్స్, DR VANATHI
మరి సురక్షితంగా వేసుకోవడం ఎలా?
అయితే, వీటిని దృష్టిలో పెట్టుకొని పెళ్లిళ్లలో మెహందీ వేడుకలకు అసలు వెళ్లొద్దని తాను చెప్పడంలేదని వానాతి అన్నారు.
‘‘ముందు ఒక చుక్క మెహందీని చేతికి పెట్టుకొని చూడండి. ముఖ్యంగా చేతి వెనక, లేదా మోచేయి లోపలి వైపు లాంటి సున్నితంగా ఉండే ప్రాంతాల్లో పెట్టుకొని చూడండి. ఏమైనా దురద వస్తుందేమో గమనించండి. ఏమీ కాకపోతే హాయిగా చేతికి మెహందీ పెట్టుకోవచ్చు’’ అని ఆమె చెప్పారు.
కానీ, ఎప్పుడూ ప్యాకెట్ మెహందీ కంటే ఇంట్లో రుబ్బుకొని పెట్టుకునే గోరింటాకు సురక్షితమని ఆమె సూచించారు.
ఇవి కూడా చదవండి..
- నేపాల్‌లో తొలి స్వలింగ సంపర్కుల పెళ్ళి రిజిస్ట్రేషన్
- LGBT లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్... ఈ పదాలకు అర్థం ఏంటి?
- పాకిస్తాన్ నుంచి మనుషుల అక్రమ రవాణా ఎలా జరుగుతోంది? బీబీసీ అండర్ కవర్ రిపోర్టర్‌తో స్మగ్లర్ ఆజం చెప్పిన సీక్రెట్స్...
- రష్యా నుంచి అర్జెంటీనాకు చేరుకుంటున్న వేలమంది గర్భిణులు, అరెస్టు చేస్తున్న పోలీసులు, ఎందుకు?
- ఇలా పోపట్: 50 ఏళ్లుగా భారత్ లో ఉంటున్నా, ప్రపంచంలో ఏ దేశానికీ చెందని మహిళ ఈమె
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















