పాకిస్తాన్ నుంచి మనుషుల అక్రమ రవాణా ఎలా జరుగుతోంది? బీబీసీ అండర్ కవర్ రిపోర్టర్‌తో స్మగ్లర్ ఆజం చెప్పిన సీక్రెట్స్...

- రచయిత, రెహా కన్సారా, సమ్రా ఫాతిమా, జాస్మిన్ డయ్యర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
పాకిస్తాన్ నుంచి మనుషులను అక్రమంగా రవాణా చేసే క్వెట్టాకు చెందిన స్మగ్లర్ పేరు ఆజం. మనుషుల అక్రమ రవాణా వ్యాపారం జరిగే తీరు గురించి ఆయన బీబీసీ అండర్ కవర్ (పరిశోధక జర్నలిస్ట్) రిపోర్టర్‌కు వివరించారు.
25 లక్షల పాకిస్తానీ రూపాయలకు (భారత కరెన్సీలో రూ. 7.5 లక్షలు) ఒక వ్యక్తిని మూడు వారాల్లో సురక్షితంగా, ఆరోగ్యంగా యూరప్‌కు పంపవచ్చని వారు చెబుతున్నారు.
అలాంటి వ్యక్తి మొదట కాలినడకన ఇరాన్‌లో అడుగుపెట్టాల్సి ఉంటుందన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తుర్కియేకు, ఇటలీకి చేరుకుంటారు.
యూరప్ వెళ్లాలనుకునే వ్యక్తి "తనతో అల్పాహారం తీసుకువెళ్లాలి. నాణ్యమైన బూట్లు ఉండాలి. రెండు, మూడు జతల బట్టలుండాలి. క్వెట్టాలో నీరు కొనుక్కోవచ్చు. క్వెట్టా చేరుకున్న తర్వాత కాల్ చేస్తే, మా వ్యక్తి వచ్చి ఆయనను రిసీవ్ చేసుకుంటారు" అని ఆజం అన్నారు.
ప్రతిరోజూ వందలాది వలసదారులు పాకిస్తాన్ సరిహద్దు దాటి ఇరాన్‌లోకి ప్రవేశిస్తున్నారని ఆయన తెలిపారు.
బీబీసీ అండర్‌కవర్ రిపోర్టర్ తన సోదరుడిని యూకేకు పంపాలని కోరుతూ ఆ వ్యక్తిని కలిశారు. ఆ తరువాత అతను ఈ వ్యవహారం ఎలా సాగుతుంతో వివరించారు.

ప్రజలు పాకిస్తాన్‌ను ఎందుకు విడిచిపెడుతున్నారు?
పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం పెరగడం, రూపాయి విలువ పడిపోవడంతో చాలామంది దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నారు.
2023లో మొదటి 6 నెలల్లో దాదాపు 13 వేల మంది పాకిస్తానీలు లిబియా, ఈజిప్టులకు తరలి వెళ్లారని పాక్ అధికారులు బీబీసీకి తెలిపారు.
గత ఏడాది వీరి సంఖ్య దాదాపు 7 వేలుగా ఉంది. అయితే, ఇలాంటి జాగ్రత్తలు లేని ప్రయాణాలు ప్రమాదానికి దారితీస్తున్నాయి.
2023 జూన్‌లో గ్రీస్ తీరంలో చేపలు పట్టే చిన్న పడవ మునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వందలాది వలసదారులు మరణించారు. ఆ పడవలో కనీసం 350 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు అంచనా.
''ఒకవేళ దారిలో దొరికిపోయినా వారు తిరిగి ఇంటికి రావల్సిందే. వారిని ఎవరూ కిడ్నాప్ చేసి డబ్బులు అడగరు’’ అని ఆజం తెలిపారు.
కానీ, లిబియా గుండా ప్రయాణిస్తే మిలీషియా, క్రిమినల్ ముఠాల చేతుల్లో చిక్కే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదాలను పెద్దగా లెక్కచేయడం లేదు ఆజం.
ఇటలీకి వెళ్లడానికి మానవ స్మగ్లర్ల సహాయం తీసుకున్నానని మాకు ఒక పాకిస్తానీ తెలిపారు. అయితే, లిబియాలో తనను కిడ్నాప్ చేసి 3 నెలల పాటు జైలులో ఉంచారని బీబీసీకి చెప్పారాయన.
అతని కుటుంబం రూ.2 లక్షలు చెల్లించిన తర్వాతే విడుదల చేసినట్లు సయీద్ (పేరు మార్చాం) మాకు చెప్పారు. యూరప్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా లిబియాలో కిడ్నాప్‌కు గురయ్యానని ఆయన అన్నారు.

అక్రమ రవాణా కోసం డంకీ, గేమ్
పాకిస్తాన్‌లోని చాలామంది మానవ అక్రమ రవాణాదారులు ఫేస్‌బుక్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు. వారి అకౌంట్‌లో వేలాదిగా ఫాలోవర్లు ఉన్నారు.
మానవ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న ఈ సోషల్ మీడియా ఖాతాలను 2023 మే నెల నుంచి బీబీసీ పరిశీలిస్తోంది.
ఈ సమయంలో మానవ అక్రమ రవాణాదారులు ప్రయాణాలు, చెల్లింపులన్నీ మెసేజ్‌లు, వాట్సాప్ ద్వారా నిర్వహిస్తారని మేం కనుగొన్నాం.
ఈ అక్రమ వ్యాపారాల కోసం 'డంకీ', 'గేమ్' వంటి పదాలు వాడుతున్నారు.
పడవలో ప్రయాణాన్ని పూర్తి చేయించడానికి 'డంకీ', ఒక వ్యక్తి విజయవంతమైన రాకను చెప్పడానికి 'గేమ్' పదం వాడుతారు.
ఐరోపా, తుర్కియే, ఇరాన్, లిబియాలకు చేరుకోవడానికి పాకిస్తాన్ నుంచి మూడు మార్గాలు ఉన్నాయి. వీటినే వలసదారులు ఎక్కువగా ఉపయోగిస్తారు.
గ్రీస్‌లో 'వలస పడవ ప్రమాదం' తర్వాత స్మగ్లర్‌లను మేం ట్రాక్ చేసినపుడు వాళ్లు 'టాక్సీ గేమ్' పద్దతికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది.
తూర్పు ఐరోపా గుండా వెళ్లే చిన్న రహదారి ద్వారా ఈ రవాణా జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎదురయ్యే సమస్యలేంటి?
అడవుల్లో దాక్కున్న వలసదారుల గుంపులు మినీ వ్యాన్‌లలో వెళ్లిపోతున్న వీడియోలను స్మగ్లర్లు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తారు.
ఈ పోస్టులపై ఏజెంట్ల పేర్లు, మొబైల్ నంబర్లు పేర్కొంటున్నారు. కస్టమర్‌లు, ఏజెంట్లు వందలాది మంది సభ్యులతో తదుపరి 'గేమ్' గురించి వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసుకుంటారు.
ఆజం 'టాక్సీ గేమ్స్'లో నిపుణులు. సముద్ర మార్గాల కంటే 'టాక్సీ గేమ్' సురక్షితమైనదని ఆయన అంటున్నారు. కానీ రహదారి మార్గం ప్రమాదాలకూ దారితీస్తుంది.
చలికాలంలో చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా వలసదారులు కాలినడకన సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తారని, రోడ్డు ప్రమాదాలు సంభవించే ప్రమాదం కూడా ఉందని, దీనివల్ల మరణాలు సంభవిస్తాయని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ (UNHCR) గతంలోనే హెచ్చరించింది.
మరో ఐదుగురు మానవ అక్రమ రవాణాదారులు కూడా 'టాక్సీ మార్గాన్ని' సిఫార్సు చేశారు బీబీసీ రహస్య రిపోర్టర్‌కు. వారిలో ఒకరు వెయ్యి పౌండ్లకు ఫ్రాన్స్ నుంచి యూకేకి ఎవరినైనా తీసుకురావొచ్చని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు బీబీసీ ఫిర్యాదు
మానవ స్మగ్లింగ్‌పై ఆధారాలను మెటాకు ఇచ్చింది బీబీసీ. ఫేస్‌బుక్, వాట్సాప్, టిక్‌టాక్ యాప్‌లకు మెటా పేరెంట్ కంపెనీ.
అక్రమ రవాణా ప్రచారానికి మెటా ప్లాట్‌ఫారమ్స్ ఉపయోగించుకుంటున్నారని మేం కంపెనీకి ఫిర్యాదు చేశాం.
ఈ ఫేస్‌బుక్ గ్రూపులు, పేజీలలో స్మగ్లింగ్‌కు సంబంధించిన అన్ని లింక్‌లను మెటా తొలగించింది, కానీ ప్రొఫైల్‌లను తీసివేయలేదు.
ఇది వాట్సాప్ గ్రూపులను కూడా తొలగించలేదు. ఎందుకంటే దాని ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానం 'గోప్యతను రక్షిస్తుంది, మోడరేషన్‌ను అనుమతించదు'.
మరోవైపు స్మగ్లింగ్ వివరాల లింక్స్‌ను అకౌంట్స్ నుంచి టిక్ టాక్ తొలగించింది. మానవ అక్రమ రవాణాను ప్రోత్సహించే కంటెంట్‌ను కంపెనీ ప్రోత్సహించబోదని తెలిపింది.
కంపెనీ పాలసీలను ఉల్లంఘించిన ఖాతాలు, కంటెంట్‌ను తొలగించింది.

ఫొటో సోర్స్, Getty Images
'వారు చెప్పేదంతా అబద్దం'
సయీద్ ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. పాక్ అధీనంలోని కశ్మీర్‌లో నివసించేవారు సయీద్. అక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఘర్షణలూ ఎక్కువైపోయాయి, దీంతో ఏడాది క్రితం ఆయన ఇటలీ వెళ్లారు.
ఆయన ఇల్లు భారత్, పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖకు సమీపంలో ఉంది. గత 10 నెలలుగా ఇటలీలో ఉంటున్నారాయన.
ఆన్‌లైన్‌లో టిక్‌టాక్ వీడియోలు చూశానని, కొన్ని నెలల ముందు పాకిస్తాన్ నుంచి వెళ్లిన ఒక స్నేహితుడి ద్వారా యూరప్‌కు రావాలనుకున్నానని సయీద్ చెప్పారు.
"ఇక్కడికి రావడం చాలా సులభం, దాదాపు 20 రోజులు పడుతుందని నేను విన్నాను. కానీ అదంతా అబద్ధం. నాకు 7 నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది" అని తెలిపారు సయీద్.
ఇటలీలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు సయీద్. ఆ దరఖాస్తుపై ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నారాయన.
'అక్రమ మార్గం' ద్వారా వచ్చినందుకు పశ్చాత్తాపపడుతున్నానని సయీద్ చెప్పారు. అదో 'మృత్యు ప్రయాణం' అంటున్నారు సయీద్.
ఇటలీలో తన కొత్త జీవితానికి సంబంధించిన వీడియోలను టిక్‌టాక్‌లో క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉన్నారు సయీద్.
ఆజంను బీబీసీ అండర్ కవర్ రిపోర్టర్ మొదట సంప్రదించిన రెండు వారాల తర్వాత మళ్లీ కాల్ చేశారు.
ఈసారి మేం బీబీసీ జర్నలిస్టునని ఆయనకు చెప్పారు. అక్రమ మార్గాల్లో తలెత్తే ప్రమాదాల గురించి అజాంకు చెబుతుంటే ఆయన ఫోన్ కట్ చేశారు.
ఇవి కూడా చదవండి
- గాజా: ‘ఆకలితో ఉన్నాం... మాకు మరో దారి లేదు’
- ఖతార్‌లో మరణశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులను ఆదుకోగలమా... భారత్ ముందున్నసవాళ్లేంటి?
- 'దమ్ మారో దమ్' హిప్పీలు ఏమయ్యారు?
- ఆంధ్రప్రదేశ్: కులగణన పై ఏపీ సర్కార్ తొందరపడుతోందా, వలంటీర్ల పాత్రపై విమర్శలు ఏమిటి?
- పులి గోరును ధరించిన ‘బిగ్‌బాస్’ పోటీదారును ఎందుకు అరెస్ట్ చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














