రష్యా నుంచి అర్జెంటీనాకు చేరుకుంటున్న వేలమంది గర్భిణులు, అరెస్టు చేస్తున్న పోలీసులు, ఎందుకు?

అర్జెంటీనా

ఫొటో సోర్స్, Getty Images

ఇటీవల రష్యా నుంచి దాదాపు అయిదు వేల మందికి పైగా గర్భిణులు అర్జెంటీనాకు చేరుకున్నారు. గురువారం ఒక విమానంలో 33 మంది గర్భిణులు అర్జెంటీనాకి చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. అర్జెంటీనా నేషనల్ మైగ్రేషన్ ఏజెన్సీ ప్రకారం ఈ మహిళలందరూ ప్రసవాలకు దగ్గరలో ఉన్నారు.

వీరంతా అర్జెంటీనాలో తమకు డెలివరీ కావాలనుకుంటున్నారు. దానివల్ల పుట్టిన పిల్లలకు ఇక్కడి పౌరసత్వం దక్కుతుంది.

ఇటీవలి రోజుల్లో అర్జెంటీనాకు వచ్చే రష్యన్ గర్భిణీల సంఖ్య పెరిగింది. యుక్రెయిన్‌లో యుద్ధం కారణంగానే వీరంతా ఇలా వలసబాట పట్టారని స్థానిక మీడియా పేర్కొంది. యుద్ధం నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఇక్కడికి వస్తున్నారని చెప్పింది.

గురువారం రష్యా నుంచి 33 మంది గర్భిణులు ఒకే విమానంలో అర్జెంటీనా రాజధానికి చేరుకున్నారు. అయితే 'వీసా పేపర్లలో కొన్ని లోపాల' కారణంగా ముగ్గురికి అధికారులు దేశంలోకి ప్రవేశం ఇవ్వలేదు.

అర్జెంటీనా

అర్జెంటీనా పౌరసత్వం కోసం 'ట్రిక్'!

మైగ్రేషన్ ఏజెన్సీ అధిపతి ఫ్లోరెన్సియా కెరిగ్నానో 'లా నాసియోన్' అనే వార్తాపత్రికతో మాట్లాడుతూ ''ఇంతకుముందు వచ్చిన ముగ్గురు మహిళలను ప్రశ్నించగా, తాము అర్జెంటీనాకు టూరిస్టులుగా వచ్చామని చెప్పారు.

కానీ, వారు ఇక్కడికి పర్యటకులుగా రాలేదని విచారణలో తేలింది'' అని తెలిపారు. ఆ తర్వాత ఈ విషయాన్ని వారు అంగీకరించారని కూడా చెప్పారు.

''ఈ మహిళలు తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అర్జెంటీనా పాస్‌పోర్టులో రష్యన్ పాస్‌పోర్టు కంటే ఎక్కువ మినహాయింపులు ఉన్నాయి. సమస్య ఏంటంటే ఈ మహిళలు ఇక్కడకు రావడం. వారు తమ పిల్లలను అర్జెంటీనా పౌరులుగా చేసి, వెళ్లిపోతున్నారు" అని కెరిగ్నానో అంటున్నారు.

''ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన పాస్‌పోర్ట్‌లలో మా పాస్‌పోర్ట్ ఒకటి. ఇక్కడ పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 171 దేశాలలో వీసా ఫ్రీ ఎంట్రీ అందుబాటులో ఉంది. రష్యన్ పాస్‌పోర్ట్ 87 దేశాలలో మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీని ఇస్తుంది. అర్జెంటీనాలో ఒక బిడ్డ పుట్టడం వల్ల వారి తల్లిదండ్రులకు కూడా పౌరసత్వం మంజూరు చేసే ప్రక్రియ వేగవంతం అవుతుంది'' అని ఆమె వివరించారు.

యుక్రెయిన్ యుద్ధం ప్రారంభం తర్వాత అర్జెంటీనా వెళ్లే రష్యన్ యాత్రికుల సంఖ్య పెరిగింది

ఫొటో సోర్స్, BBC/GOKTAY KORALTAN

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధం ప్రారంభం తర్వాత అర్జెంటీనా వెళ్లే రష్యన్ యాత్రికుల సంఖ్య పెరిగింది

నకిలీ పర్యాటకులంటున్న పోలీసులు

గతేడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. దీని తరువాత పాశ్చాత్య దేశాలకు వెళ్లడం రష్యన్‌లకు కష్టంగా మారింది.

2022 సెప్టెంబరులో యూరోపియన్ యూనియన్, రష్యా మధ్య వీసా ఫెసిలిటేషన్ ఒప్పందం రద్దయింది.

దీని తరువాత రష్యన్లు యూరప్ వీసా కోసం అదనపు పత్రాలు సమర్పించాల్సి వచ్చింది.

వీసా ప్రాసెసింగ్ సమయం కూడా పెరిగింది. జారీ నిబంధనలను కూడా పెంచింది.

యూరోపియన్ యూనియన్ దేశాలతో సహా పలు ఇతర దేశాలు ప్రస్తుతం రష్యన్‌లకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశాయి

అర్జెంటీనాకు చేరుకోగానే నిర్బంధంలోకి తీసుకున్న ముగ్గురు రష్యన్ మహిళల తరపు న్యాయవాది క్రిస్టియన్ రూబిలార్ ''తమ క్లయింట్లను అన్యాయంగా నిర్బంధించారని" వాదించారు. వారిపై 'నకిలీ పర్యటకులు' అంటూ ఆరోపణలు చేస్తున్నారన్నారు.

లాయర్ మాట్లాడుతూ "వారిని తప్పుడు పర్యటకులు అని పిలుస్తున్నారు. కానీ, ఈ పదం మన చట్టంలో లేదు. ఈ మహిళలు ఎలాంటి నేరం చేయలేదు, ఏ ఇమ్మిగ్రేషన్ చట్టాన్నీ ఉల్లంఘించలేదు. వారిని అక్రమంగా కస్టడీలో ఉంచారు. వారి స్వేచ్ఛను హరిస్తున్నారు'' అని అన్నారు.

అయితే, తర్వాత ఈ మహిళలు విడుదలయ్యారు.

అర్జెంటీనా

ఫొటో సోర్స్, Reuters

యుక్రెయిన్ యుద్ధం తర్వాత....

యుక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యా నుంచి ఇక్కడికి వచ్చే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందని 'లా నేషియన్' వార్తా సంస్థ చెబుతోంది.

ప్రజలు యుద్ధంలో చిక్కుకోకుండా పారిపోవడమే కాదు, అర్జెంటీనాలో వీసా ఫ్రీ ఎంట్రీని కూడా ఉపయోగించుకుంటున్నారు.

ఇక్కడ నాణ్యమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రులు కూడా బాగున్నాయి, చాలా ఆప్షన్లు ఉన్నాయి.

'బర్త్ టూరిజం' కోసం రష్యన్ పౌరుల రాక అర్జెంటీనా ఆసుపత్రులకు లాభదాయకం. ఇది చాలా కాలంగా ఇక్కడ జరుగుతోంది.

అర్జెంటీనాలో ప్రసవించే మహిళల కోసం అనేక రకాల ప్యాకేజీలను అందించే రష్యన్ భాషా వెబ్‌సైట్‌లు ఉన్నట్లు బీబీసీ దృష్టికి వచ్చింది.

ఈ వెబ్‌సైట్ డెలివరీ ప్రణాళికలు, ఎయిర్‌పోర్ట్-పికప్, స్పానిష్ బోధించడానికి కోర్సులు, అర్జెంటీనా రాజధానిలోని ఉత్తమ ఆసుపత్రుల్లో డెలివరీపై తగ్గింపులను ప్రచారం చేస్తుంది.

వెబ్‌సైట్ ప్రకటనలో 'ఎకానమీ క్లాస్' నుంచి 'ఫస్ట్ క్లాస్' సర్వీస్ వివరాలు ఇచ్చింది.

ఎకానమీ క్లాస్ సర్వీస్ ధర రూ.4 లక్షలు , ఫస్ట్ క్లాస్ సర్వీస్ ధర రూ.12 లక్షలుగా నిర్ణయించింది.

ఆ వెబ్‌సైట్ డేటా ప్రకారం 'ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బర్త్ టూరిజం సౌకర్యాన్ని అందిస్తున్నారు. వారు 2015 నుంచి ప్రజలకు ఇమ్మిగ్రేషన్ హెల్ప్ అందజేస్తున్నారు. కంపెనీ తనను తాను 100 శాతం అర్జెంటీనాగా అభివర్ణించుకుంటుంది.'

అర్జెంటీనా

ఫొటో సోర్స్, Reuters

పోలీసుల నిఘా

ఈ మిలియన్ డాలర్ల వ్యాపారం, అక్రమ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా అర్జెంటీనా పోలీసులు ప్రచారం ప్రారంభించారని శనివారం 'లా నేషియన్' నివేదించింది.

ఈ అక్రమ నెట్‌వర్క్‌లు నకిలీ పత్రాలతో గర్భిణీలను, వారి భాగస్వాములను అర్జెంటీనాకు తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అర్జెంటీనాలో స్థిరపడే పత్రాలు వారికి చాలా తక్కువ సమయంలోనే అందుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ పని కోసం ఆయా ముఠాలు రష్యన్ ప్రజల నుంచి రూ.29 లక్షల వరకు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు.

అయితే కొన్ని ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొన్ని మైగ్రేషన్ పేపర్లు, నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)