స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్: రాత్రిళ్లు స్మార్ట్‌ఫోన్ చూస్తే కళ్లు పోతాయా? హైదరాబాద్ యువతి సమస్యపై డాక్టర్ ట్వీట్ వైరల్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌కు చెందిన ఓ 30 ఏళ్ల యువతికి కళ్లకు సంబంధించిన ఒక సమస్య వచ్చింది. ఆమెకు నిద్ర నుంచి లేవగానే కాసేపు అంతా చీకటిగా ఉండేది. కళ్లు కనిపించేవి కాదు. కంటి డాక్టర్ల దగ్గరకు వెళ్తే అన్ని పరీక్షలూ చేసి అంతా బాగానే ఉందన్నారు. న్యూరాలజీ స్పెషలిస్ట్‌కు చూపించమన్నారు.
ఆమె న్యూరాలజీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. ఆయన కంటి నరాలకు సంబంధించి అన్ని పరీక్షలు చేశారు. ఎలాంటి సమస్యా లేదని తేల్చారు. మరి ఆమెకు ఆ సమస్య ఎలా వచ్చింది? అనేది తెలుసుకోవటానికి ఆ డాక్టర్ ప్రయత్నించారు. ఆ క్రమంలో తెలిసిన విషయాలను ఆయన ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమస్యపై చర్చ మొదలైంది. ఈ విషయం గురించి బీబీసీ మరింత లోతుగా తెలుసుకునేందుకు ఆ డాక్టర్‌తో మాట్లాడింది. అసలు ఆ యువతికి ఈ సమస్య ఎలా వచ్చిందనే విషయాన్ని ఆయన వివరించారు.
డాక్టర్ సుధీర్‌కుమార్ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో న్యూరాలజీ విభాగంలో పనిచేస్తున్నారు.
‘‘నా వద్దకు నెల రోజుల కిందట 30 ఏళ్ల మహిళ ఒకరు కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చారు. తను చూస్తున్నప్పుడు ఫ్లోటర్స్ (నల్లచుక్కలు రావడం), జిగ్‌జాగ్ లైన్స్ కనిపించడంతోపాటు మసకమసకగా ఉంటోందని చెప్పారు. ఆమెకు దాదాపు ఏడాదిన్నరగా ఈ లక్షణాలు ఉన్నాయి’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter
‘‘ప్రతి 15-20 నిమిషాలకోసారి అలా జరుగుతుండేదట. రెండు, మూడు నిమిషాల తర్వాత మళ్లీ మామూలుగా అయ్యేది. గత రెండు నెలల ముందు నుంచి రాత్రి పూట బాత్‌రూంకు వెళ్లేప్పుడు నిద్రలోంచి లేవగానే రెండు, మూడు నిమిషాలపాటు ఏమీ కనిపించేది కాదు’’ అని ఆయన చెప్పారు.
ఆ మహిళ మొదట కంటి వైద్యుడ్ని సంప్రదించారు. కంటికి సంబంధించి అన్ని పరీక్షలు చేసి ఎలాంటి సమస్య లేదని చెప్పారు. కంటి వైద్యుల సలహా మేరకు న్యూరాలజీ (నరాల సంబంధిత) వైద్యుడిగా ఉన్న సుధీర్‌కుమార్‌ను కలిశారామె.
ఆయన కంటి నరాలకు సంబంధించి అన్ని పరీక్షలు చేశారు. చివరిగా ఎలాంటి సమస్యా లేదని తేల్చారు.
కంట్లో సమస్య లేదు.. నరాల పనితీరు సరిగానే ఉంది.. అయినా చూపు విషయంలో సమస్య ఎందుకు వచ్చింది? అని డాక్టర్ సుధీర్ కుమార్ విచారించారు. ఉదయం లేచినప్పట్నుంచి రాత్రి వరకు ఆమె ఏం చేస్తుంటారు? ఆమె దైనందిన జీవన విధానం ఏమిటి? అని ఆరా తీశారు.
‘‘ఆమె గతంలో బ్యూటీషియన్‌గా పనిచేసేవారు. కుటుంబ అవసరాల కోసం ఉద్యోగం మానేశారు. భర్త ఉదయమే ఆఫీసుకు వెళితే రాత్రి వరకు ఇంటికి తిరిగి రారు. ఈ క్రమంలో ఆమెకు స్మార్ట్‌ఫోన్ చూడటం వ్యవసనంగా మారింది. ఇంట్లో పనులు అయ్యాక ఉదయం నుంచి రాత్రి వరకు స్మార్ట్‌ఫోన్‌లో ఏదో ఒకటి చూస్తూ గడిపేవారు‘‘ అని సుధీర్‌కుమార్ బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Alamy
రాత్రిళ్లు పడుకున్నాక, లైట్లు ఆపేశాక కూడా రెండు గంటలపాటు ఫోన్ చూసేవారు. అలా రోజుకు 10-12 గంటల పాటు స్మార్ట్‌ఫోన్ చూడటం వ్యవసనంగా మారింది.
''ఇలాంటి కేసు ఒకటి గతేడాది కూడా వచ్చింది. ఇలాంటి వారిలో నరాల వ్యవస్థలో ఎక్కడా సమస్య ఉండదు. కేవలం గంటల తరబడి ఫోన్ చూడటం, రాత్రి చీకట్లోనూ ఫోన్ చూస్తూ గడపడం కారణంగా కంటి చూపుపై ప్రభావం పడుతుంది. అందుకే ఆమెకు ముందుగా నెల రోజులపాటు స్మార్ట్‌ఫోన్ వాడటం తగ్గించమని చెప్పా. ఆ తర్వాత కూడా సమస్య తగ్గకపోతే మరిన్ని వైద్య పరీక్షలు చేద్దామని సలహా ఇచ్చి పంపించాం'' అని అన్నారు సుధీర్‌కుమార్.
కేవలం టైంపాస్ కోసమే ఫోన్ చూస్తున్నాననీ, నెల రోజుల్లో ఫోన్ చూడటం తగ్గించుకుని వస్తానని చెప్పి వెళ్లారామె. ఆ తర్వాత ఇటీవల మళ్లీ ఆమె రివ్యూ కోసం వచ్చారు.
''డాక్టర్.. స్మార్ట్‌ఫోన్ చూడటం తగ్గించిన రెండు, మూడు రోజులకే సమస్య తగ్గింది. వారం రోజుల తర్వాత ఆ సమస్య పూర్తిగా పోయింది'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్?
స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వాడుతున్న వారిలో కొన్నేళ్లుగా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్, ల్యాప్‌టాప్ విజన్ సిండ్రోమ్, డిజిటల్ విజన్ సిండ్రోమ్‌లు ఒక రకం అని వైద్యులు చెబుతున్నారు.
డిజిటల్ స్ర్కీన్ ఎక్కువ సేపు చూడటం లేదా స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తుండటం వల్ల ఈ సమస్య వస్తుంది.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎలాంటి వెలుతురు లేకుండా చీకట్లో ఫోన్ చూడటంతో కంటిచూపుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నట్లు అధ్యయనాలలో తెలుస్తోందని వైద్యులు చెబుతున్నారు.
ఎక్కువ సేపు కళ్లు ఒకే చొట చూస్తుంటే కండరాలు బలహీనం అవుతాయి. కంటికి అనుసంధానంగా ఉండే ఎక్స్‌ట్రా ఆక్యులర్ మజిల్స్ (కండరాలు) బలహీనంగా మారతాయి. దీనివల్ల కొన్నిసార్లు డబుల్ విజన్ (రెండుగా కనిపించడం) కూడా వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల నుంచి విడుదలయ్యే వేడి ప్రభావం...
స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ దగ్గర నుంచి చూస్తుండటంతో వాటి నుంచి ఉత్పత్తి అయ్యే వేడి కంటిపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కళ్లు పొడిబారుతుంటాయి. కరోనా సమయంలో ఇంట్లో ఉంటూ ఈ తరహా సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడ్డారు.
''స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తుంటే మన కళ్లలో తేమ తగ్గి పొడిబారుతుంటాయి. మంటగా అనిపిస్తాయి. నొప్పి అనిపిస్తుంది. రాత్రిపూట చీకట్లో ఫోన్ ఎక్కువ సేపు చూస్తే ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఎందుకంటే చుట్టూ చీకటిగా ఉండడంతో ఫోన్ స్క్కీన్ నుంచి వచ్చే కాంతి కంటిని ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తుంది. దీనివల్ల నిద్ర లేవగానే కాసేపు కళ్లు కనిపించవు'' అని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన కంటి వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్ చెప్పారు.
ఈ తరహా కేసుల్లో పూర్తిగా కళ్లు కనిపించకపోవడం జరగదు. కానీ అది కంటి ఆరోగ్యానికి ఎప్పటికైనా సమస్యే అని అంటున్నారు.
దీనికి వైద్యులను సంప్రదించి ల్యూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడాలని సూచిస్తున్నారు.
ఏం చేయాలంటే..
డిజిటల్ స్ర్కీన్‌పై పనిచేసే వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు సుధీర్‌కుమార్
- ఏదైనా స్క్రీన్ చూస్తున్నపుడు మధ్యమధ్యలో బ్రేక్ (విరామం) తీసుకోవాలి.
- 20:20:20 రూల్ పాటించాలి. దీని ప్రకారం ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్లు స్ర్కీన్ చూడకుండా బ్రేక్ ఇవ్వాలి. అది కూడా 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడాలి.
- స్క్రీన్‌ని మరీ దగ్గరగా చూడకూడదు
- కనుగుడ్లను అటూ.. ఇటూ కదిలిస్తూ చిన్నపాటి వ్యాయామాలు చేస్తుండాలి.
అసలు వ్యసనంగా ఎందుకు మారుతుంది..?
స్మార్ట్ ఫోన్ అనేది అసలు ఎందుకు వ్యసనంగా మారుతోంది. దీనికి ఎన్నో కారణాలు చెబుతున్నారు మీనా హరిహరన్.
ఇంట్లో కూడా మనుషుల మధ్య పరస్పర అనుసంధానం తగ్గటం ఒక కారణమని అంటున్నారు. తోటి వారితో మాట్లాడకుండా స్మార్ట్‌ఫోన్‌కే పరిమితం అవుతునున్నారని అంటున్నారు.
అలాగే నలుగురిలో ఉన్నపుడు బిడియంతో ఇతరులతో మాట్లాడకుండా తమలోనే తాము మాట్లాడుకునే క్రమంలో ఫోన్‌కు అలవాటు పడుతున్నారు.
ఎస్కేపిజం (తప్పించుకునే ధోరణి)తోనూ స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడుతున్నారు.
తమకు ఉన్న ఖాళీ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం తెలియక ఫోన్‌ను వ్యవసనంగా మార్చుకుంటున్నారు.

వ్యసనం నుంచి బయటపడేదెలా?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ తప్పకుండా కనిపిస్తుంది. ఇది ప్రజల రోజూవారీ పనుల్లో ఒక భాగంగా మారింది.
''స్మార్ట్‌ఫోన్ వ్యసనం వదిలించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎవరికివారు ఫోన్‌కి దూరంగా ఉండాలనే నియమం పెట్టుకోవాలి. దానికి బలమైన సంకల్పం ఉండాలి'' అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హెల్త్ సైకాలజీ ప్రొఫెసర్ మీనా హరిహరన్ బీబీసీతో చెప్పారు.
ఈ వ్యసనం నుంచి బయట పడేందుకు కొన్ని సలహాలు సూచించారు.
- స్మార్ట్‌ఫోన్ ఉపవాసం పాటించాలి. వారంలో ఒక రోజు పూర్తిగా స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి.
- రోజులో ఫోన్ కాల్స్ మాట్లడటం తప్ప ఇతరత్రా విషయాలకు చూడకూడదని అనుకోవాలి. మేసేజస్ చూసేందుకు ఒక సమయం పెట్టుకోవాలి.
- పుస్తకాలు చదవడం, రాయడం వంటి ఇతరత్రా విషయలవైపు మన ధ్యాస మళ్లించుకోవాలి.
- వాకింగ్ వెళుతున్నప్పుడో.. గుడికి వెళుతున్నప్పుడో.. ఫోన్ తీసుకెళ్లకూడదని అనుకోవాలి.
నిద్రపై ప్రభావం ఉంటుందా..?
''నిద్రపోయే సమయంలో పడక గదిలో ఫోన్ ఉండటం మంచిది కాదు.. నిద్ర పోయేందుకు మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అదే నిద్రపోయేప్పుడు మన పక్కనే ఫోన్ పెడితే.. దాని నుంచి వచ్చే రేడియేషన్‌తో మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది'' అని మీనా హరిహరన్ చెప్పారు.
నిద్రపోయేప్పుడు స్మార్ట్‌ఫోన్ పక్కన ఉంటే, నిద్రపై ప్రభావం పడుతుందని పలు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయని అన్నారామె. నిద్రపోయే రెండు గంటల ముందు నుంచీ ఫోన్ చూడకపోవడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
కంటి ఆరోగ్యానికి ఏం తినాలి..?
కంటి చూపును కాపాడుకునేందుకు మంచి ఆహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు సయ్యదా సనా.
విటమిన్-ఎ ఉండే ఆహారం తింటే కళ్ల ఇన్‌ఫెక్షన్, కళ్లు పొడిబారడం, క్యాటరాక్ట్, గ్లకోమా, కంట్లోని రెటీనా సంబంధిత సమస్యలు రావు.
విటమిన్-ఎ వల్ల రోడోప్సిన్ ఉత్పత్తి జరిగి రెటీనా పనితీరు పెరుగుతుంది.
ఆకుకూరలు, క్యారెట్, బొప్పాయి వంటి వాటిల్లో విటమిన్-ఎ లభిస్తుంది.
విటమిన్-సి ఉండే ఆహారం తీసుకుంటే యాంటీ-ఆక్సిడెంట్ల లభిస్తాయి. వాటి వల్ల చూపు బాగుంటుంది. ఇది నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ...
- ఆరోగ్యవంతమైన ఆహారం: ఈ ‘సూపర్ ఫుడ్స్’ మనకు చాలా చౌకగా దొరుకుతాయి.. తింటున్నారా? లేదా?
- లిథియం: జమ్మూకశ్మీర్‌లో బయటపడ్డ ఈ నిక్షేపాలతో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఊపందుకుంటుందా?
- కోటె ప్రసన్న వెంకటరమణ ఆలయం: ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?
- గుజరాత్: మామను, బావను చంపిన హంతకుడిని ఈ ట్రక్కు వెనక రాసిన అక్షరాలే పట్టించాయి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














