లిథియం: జమ్మూకశ్మీర్‌లో బయటపడ్డ ఈ నిక్షేపాలతో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఊపందుకుంటుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చెర్రిలాన్ మోలాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో లిథియం నిల్వలు పెద్ద ఎత్తున కనుగొన్నట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది.
లిథియం అనేది ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల బ్యాటరీలలో ఉపయోగించే ఒక రకమైన ఖనిజం. లిథియం కోసం ఆస్ట్రేలియా, అర్జెంటీనా వంటి దేశాలపై భారత్ ఇప్పటి వరకూ ఆధారపడుతోంది.
రీఛార్జింగ్ బ్యాటరీలలో లిథియం వాడుతున్నారు.
స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్నింటిలోనూ ఈ బ్యాటరీలను ఉపయోగిస్తారు. డీజిల్, పెట్రోల్ వాహనాల వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది చాలా కీలకమైంది.
గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ఈ లిథియం నిల్వలు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
ఈ నిల్వలతో 2030 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ 30 శాతం పెరగవచ్చు.
జమ్మూకశ్మీర్‌లో లిథియం ఎక్కడ కనుగొన్నారు?
భారత గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లా సలాల్ హేమ్నా బ్లాక్‌లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ లిథియం నిక్షేపాన్ని కనుగొంది. ఈ ప్రాంతం చీనాబ్ నదిపై నిర్మించిన 690 మెగావాట్ల సలాల్ పవర్ స్టేషన్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
లిథియం నిల్వలు గల సలాల్ ప్రాంతం పరిసరాల్లో ప్రజలు నివాసం ఉండటం లేదు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి అమిత్ శర్మ లిథియం నిల్వల గురించి వివరాలు తెలిపారు.
బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ మోహిత్ కంధారీతో అమిత్ మాట్లాడుతూ "భారతదేశం జీ-20 దేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ సమయంలో దేశం లిథియం నిల్వలను కనుగొనడం యాదృచ్చికం, సంతోషకరం కూడా. ఇది జమ్మూ కశ్మీర్‌కే కాదు, తయారీ పరిశ్రమ, ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ పరిశ్రమలలో కూడా గేమ్‌చేంజర్‌గా నిలుస్తుంది" అని వ్యాఖ్యానించారు.
బొలీవియా, అర్జెంటీనా, చిలీ, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల నుంచి భారత్‌కు లిథియం దిగుమతి తగ్గనుందని, గ్రీన్ ఇండియా, ఎకో ఫ్రెండ్లీ ఇండియాగా మార్చాలనే కలను సాకారం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన దశగా మైనింగ్ శాఖ కార్యదర్శి అమిత్ శర్మ అభివర్ణించారు.

ఫొటో సోర్స్, OLIVIER GUERRIN
సలాల్‌కోట్ సర్పంచ్ మొహిందర్ సింగ్‌ను కూడా బీబీసీ సంప్రదించి దీనిపై మరింత సమాచారం సేకరించింది.
లిథియం నిల్వల ఆవిష్కరణ మొత్తం ఆ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చగలదని, స్థానికులకు ఉపాధి అవకాశాలను సృష్టించగలదని సర్పంచ్ ఆశాభావం వ్యక్తంచేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గత సంవత్సరం ఈ ప్రాంతంలో పరిశోధన ప్రారంభించారని మొహిందర్ సింగ్ అంటున్నారు.
లిథియం వెలికితీత, ఉత్పత్తికి ఎంత సమయం పడుతుంది? దీని కోసం జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఏ ప్రణాళికను సిద్ధం చేసిందని అమిత్ శర్మను ప్రశ్నించగా "ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. భారత ప్రభుత్వం జీ3 అధ్యయనం నివేదికను మాకు సమర్పించింది. జీ2 ముందస్తు అధ్యయనాలు, జీ1 అధ్యయనం ఇంకా జరగాల్సి ఉంది. ఆ తర్వాతే ఇ-వేలం గురించి మాట్లాడగలం'' అని చెప్పారు.
త్వరలో టైమ్ టేబుల్‌ని సిద్ధం చేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జి2, జి1 అధ్యయనాలను పూర్తి చేస్తామని అమిత్ శర్మ వెల్లడించారు.
ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అశాభావం వ్యక్తంచేశారు. జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని, ఖనిజాలు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లోని ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి సాధిస్తుందని కూడా అమిత్ అభిప్రాయపడ్డారు.
స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఖనిజాలకు సంబంధించి భారత ప్రభుత్వ ప్రణాళికను అమలు చేయడంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆలస్యం చేయబోదని అమిత్ శర్మ అన్నారు.
స్థానిక నివాసితులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, వారికి ముందుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
లిథియం ప్రత్యేకత ఏమిటి?
లిథియం అయాన్ బ్యాటరీలలో ఉపయోగించే తేలికపాటి ఖనిజం.ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే 74 శాతం బ్యాటరీలలో లిథియం ఉపయోగిస్తారు. ఇది కాకుండా సిరామిక్స్, గ్లాస్, లూబ్రికేటింగ్ గ్రీజు, పాలిమర్ల ఉత్పత్తిలో కూడా దీనిని వాడతారు.
2030 నాటికి లిథియం డిమాండ్ 3 మిలియన్ టన్నుల వరకు ఉంటుందని అంచనా.
కర్ణాటకలో కూడా లిథియం నిల్వలు
2021 సంవత్సరంలో కర్ణాటకలో ఇలాంటి లిథియం నిక్షేపాలే కనుగొన్నారు. అయితే అది పరిమాణంలో చిన్నదే. లిథియం వంటి అరుదైన ఖనిజాల సరఫరాను పెంచే మార్గాలను పరిశీలిస్తున్నామని ప్రభుత్వం అంటోంది.
తద్వారా కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని అభిప్రాయం వ్యక్తంచేసింది. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మింట్ వార్తాపత్రికతో మాట్లాడుతూ "ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం పరిశోధనలు ముమ్మరం చేసింది" అని అన్నారు.
ఇటీవలి కాలంలో ముఖ్యంగా కరోనా తర్వాత భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ లిథియంకు డిమాండ్ పెరిగింది. మరోవైపు వాతావరణ మార్పుల వేగాన్ని తగ్గించడానికి చాలా దేశాలు గ్రీన్ ఎనర్జీని స్వీకరించే దిశగా కదులుతున్నాయి. ఇందులో కూడా లిథియం పాత్ర చాలా ముఖ్యమైనది.

ఫొటో సోర్స్, Getty Images
లిథియం మైనింగ్‌లో చైనా దూకుడు
ఇటీవలె చైనా ఖనిజ నిక్షేపాల కోసం బొలీవియాతో ఒక బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గనుల్లో 21 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయని అంచనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం రిజర్వ్ అని భావిస్తారు.
వాతావరణ మార్పుల్లో వేగాన్ని తగ్గించే లక్ష్యాన్ని చేరుకోవడానికి 2050 నాటికి లిథియం వంటి ఖనిజాల మైనింగ్‌ను 500 శాతం పెంచాల్సిన అవసరం ఉంటుందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది.
అయితే లిథియం మైనింగ్ ప్రక్రియ పర్యావరణానికి అనుకూలమైనది కాదని నిపుణులు భావిస్తున్నారు.
లిథియం ఉప్పగా ఉండే రిజర్వాయర్లు, భూమి లోపల గట్టి రాళ్ల నుంచి సేకరిస్తారు. ఇది ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా వంటి దేశాలలో పెద్ద మొత్తంలో కనిపిస్తుంటుంది.
లిథియం తవ్విన తర్వాత మైనింగ్ కోసం మినరల్ ఆయిల్ ఉపయోగిస్తారు. దీని కారణంగా ఆ ప్రదేశాన్ని పొడి బారుస్తుంది, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇది కాకుండా గని నుంచి వెలికితీసే ప్రక్రియలో భాగంగా నీటిని ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. ఇది వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది.
అర్జెంటీనాలో లిథియం మైనింగ్‌లో పెద్ద మొత్తంలో నీటిని వాడుతున్నందున స్థానికులు లిథియం మైనింగ్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు.
ఇటువంటి మైనింగ్ కార్యకలాపాల వల్ల సహజ వనరులు క్షీణిస్తాయని, భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడుతుందని వారు వాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- తుర్కియే భూకంపం: 15 ఇళ్లలో కేవలం ముగ్గురు మాత్రమే బతికారు.. అంతా అపార్ట్మెంట్ కింద సమాధయ్యారు
- రక్తహీనత: మన శరీరంలో రక్తం ఎందుకు తగ్గిపోతుంది, మళ్లీ పెరగాలంటే ఏం చేయాలి?
- ఎల్జీబీటీ: గే, ట్రాన్స్‌జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి?
- బెలూన్: ఆకాశంలో 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరితే ఏమవుతుంది? ఇలాంటి బెలూన్ల తయారీకి ఎంత ఖర్చవుతుంది
- దావూదీ బోహ్రా ముస్లింల కార్యక్రమానికి నరేంద్ర మోదీ ఎందుకు వెళ్లారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













