ఎల్జీబీటీ: గే, ట్రాన్స్‌జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి ?

ముకుందమాల, అంజలి

ఫొటో సోర్స్, Vishnu, Mala

ఫొటో క్యాప్షన్, ముకుందమాల, అంజలి
    • రచయిత, ఆలమూరు సౌమ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నాకు నా బిడ్డ కన్నా ఏదీ ముఖ్యం కాదు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్నాం. ఇప్పుడు తను గే అని తెలిస్తే వదిలేస్తామా? తన లైంగిక అస్తిత్వం ఏదైనా తను నా బిడ్డ. మనం కాదు, కూడదు అంటే తను మానసికంగా కుంగిపోతాడు. ఏ అఘాయిత్యమైనా తలపెడితే నేను తట్టుకోలేను."

"నాకు అబ్బాయి కాదు అమ్మాయే పుట్టింది అనుకుంటున్నా. నేను నా బిడ్డను అమ్మయిగానే సంబోధిస్తాను. తను మగపిల్లాడు అన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. నా బిడ్డ తన శరీరం గురించి తాను తెలుసుకుంది. తన జెండర్ అస్తిత్వం ఇదీ అని చెబుతోంది. అందులో తప్పేముంది? దాన్ని మనం అంగీకరించాలి. తల్లిదండ్రులుగా మనం వాళ్లతో నిలబడాలి. మరింత ప్రేమ అందించాలి. నేనొక ట్రాన్స్‌జెండర్ వ్యక్తికి తల్లినని గర్వంగా చెప్పుకుంటాను."

ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు వ్యక్తుల తల్లులు చెప్పిన మాటలవి. తమ పిల్లలు తమ లైంగిక లేదాజెండర్ అస్తిత్వాన్ని బయటపెట్టినప్పుడు మొదట భయపడినా, తరువాత అంగీకరించామని, అక్కున చేర్చుకున్నామని చెబుతున్నారు. ఎల్జీబీటీ వ్యక్తుల విషయంలో ముందుగా తల్లిదండ్రులకే కౌన్సిలింగ్ అవసరమని అంటున్నారు.

విష్ణు తేజ తన తల్లి అంజలితో..

ఫొటో సోర్స్, Vishnu Teja

ఫొటో క్యాప్షన్, విష్ణు తేజ తన తల్లి అంజలితో..

'మా అబ్బాయి చెప్పలేదు, నేనే తెలుసుకున్నా..'

విష్ణు తేజ తనను తాను గే వ్యక్తిగా పరిచయం చేసుకుంటారు. విష్ణు లైంగిక అస్తిత్వం బయటపడినప్పుడు చాలా కంగారుపడ్డానని వాళ్లమ్మ అంజలి చెప్పారు.

"మా అబ్బాయి తనంతట తాను నాకేమీ చెప్పలేదు. తను పది, ఇంటర్ చదువుతున్నప్పుడు ఎప్పుడూ అబ్బాయిలతోనే తిరిగేవాడు. వాళ్లతో క్లోజ్‌గా ఉండేవాడు. నేనది గమనించాను. కాలేజీకి వచ్చాక ఫేస్‌బుక్‌లో రాసేవాడు, ఈవెంట్స్‌కి వెళ్లేవాడు. అప్పుడు నాకు తన విషయం పూర్తిగా అర్థమైంది" అన్నారు అంజలి.

ఈ విషయంలో కులం, మతం కూడా ముఖ్య పాత్ర వహిస్తాయని, ఆ ఉచ్చుల్లోంచి బయటపడడం అంత తేలిక కాదని అంటున్నారు.

"మొదట్లో చాలా భయపడ్డాను. మా కులం, కుటుంబం, పరువు మర్యాద ఇవన్నీ ఆలోచించాను. అందరూ మావైపు వేలెత్తి చూపిస్తారని బాధపడ్డాను. ఒక్కడే పిల్లాడు, పెళ్లి చేసుకోకపోతే వారసత్వం పోతుంది అని ఆందోళనపడ్డాను. అలాగే, మా అబ్బాయి ట్రాన్స్ వ్యక్తిగా మారతాడేమోనని భయపడ్డాను. అమ్మాయిలా మారితే నేను ఒప్పుకోగలనా, లేదా అనే సందేహం కూడా వచ్చింది. కానీ, ట్రాన్స్‌జెండర్‌కు, గే వ్యక్తులకు వ్యత్యాసం తెలుసుకున్నాను. ఈ కమ్యూనిటీలో ఎన్ని వ్యత్యాసాలు ఉంటాయో ఇప్పుడు స్పష్టంగా తెలుసు" అన్నారామె.

ముకుందమాల

ఫొటో సోర్స్, Mukundamala

ఫొటో క్యాప్షన్, ముకుందమాల

'మొదట గే అని చెప్పాడు, తరువాత ట్రాన్స్‌జెండర్ అని తెలుసుకుంది..'

ముకుందమాల ఒక ట్రాన్‌జెండర్ వ్యక్తికి తల్లి. ఒక వ్యక్తి తన జెండర్ అస్తిత్వం మారుతోందని తెలుసుకున్నప్పుడు చాలా మానసిక వేదన పడతరాని, తనకు తల్లిదండ్రుల మద్దతు చాలా అవసరమని అంటున్నారామె.

"మా అమ్మాయి (అప్పటికి అబ్బాయి) ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చాను. తను ఆశ్చర్యపోయింది. ఇది జరగదు అని చెప్పి వెళ్లిపోయింది. నేను, మా అమ్మాయి చాలా క్లోజ్‌గా ఉంటాం. నాతో అన్ని విషయాలు పంచుకుంటుంది. అబ్బాయిలను చూస్తూ.. ఆ అబ్బాయి కళ్లు బావున్నాయి, ఈ అబ్బాయి నుదురు బావుంది అని చెప్పేది. తను ఎప్పుడూ అబ్బాయిల గురించే మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చింది. నువ్వు అబ్బాయి అయి ఉండి, అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని అడిగాను. నాకు అమ్మాయిల మీద ఆసక్తి లేదు అంది. కంగారుపడ్డాను. ఒకరోజు నాతో వివరంగా మాట్లాడింది. తనకు అబ్బాయిలంటేనే ఇష్టం కలుగుతోందని, తను గే అని చెప్పింది. అప్పటికి తనను తాను గే అనే అనుకొంది" అంటూ తన కథ చెప్పుకొచ్చారు ముకుందమాల.

సాహితి (పేరు మార్చాం) చాలాకాలం వరకు తన జెండర్ అస్తిత్వం గురించి గందరగోళంలో ఉన్నారు. కొన్నేళ్లు గే అనుకున్నారు. కానీ, తను ట్రాన్స్‌వుమన్ అని తెలుసుకున్నారు. గే గా ఉన్నప్పుడు, ట్రాన్స్‌వుమన్‌గా మారిన తరువాత కూడా ముకుందమాల ఆమెకు అండగా నిలబడ్డారు.

"అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన తరువాత తన గురించి తనకు కొత్త విషయం తెలిసింది. తను గే కాదు ట్రాన్స్ అన్న విషయన్ని తెలుసుకుంది. మన దేశం వచ్చినప్పుడు నాకు చెప్పింది. కొన్నాళ్లు చాలా కంఫ్యూజ్ అయింది. తన అస్తిత్వం ఏమిటో తెలుసుకోవడానికి కష్టపడింది. తను ట్రాన్స్ అని తెలుసుకున్నాక నన్ను పట్టుకుని ఏడ్చేసింది. నువ్వు ఏడవడానికి వీల్లేదు. నీ అసలైన అస్తిత్వం ఏమిటో నువ్వు తెలుసుకున్నావు. సంతోషించాలి. నువ్వు జీవితంలో నిలబడాలి, నీ హక్కులు నువ్వు సాధించుకోవాలి అని చెప్పాను."

"ఆ సమయం నాకు అత్యంత క్లిష్ట సమయం. అప్పటి నుంచి ఏడాది పాటు తను ట్రాన్సిషన్‌లో ఉంది. ఆ సమయంలో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. గందరగోళంగా ఉంటుంది. చాలా మానసిక వేదన ఉంటుంది. బిడ్డ నాకు దూరంగా ఉంది. తనను ఎలాగైనా కాపాడుకోవాలన్నదే నా తపన. దూరంగా ఉన్నా, తనను కంటికి రెప్పలా కాచుకున్నాను. రోజు తను పడుకునేటప్పుడు తప్ప వీడియో ఆన్ చేసుకునే ఉండేదాన్ని. నిరంతరం తనతో మాట్లాడుతూనే ఉండేదాన్ని. తను వేదన పడుతోందని నాకు తెలుసు. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందని చాలా భయపడ్డాను. నా బిడ్డ డిప్రెషన్‌కు లోను కాకుండా కాపాడుకోవడమే నా లక్ష్యంగా ఉండేది."

"ఇన్ని చిరాకులు తట్టుకుని, మా అమ్మాయి నిలబడింది. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తోంది. నాకు అబ్బాయి కాదు, అమ్మాయే పుట్టిందనుకుంటాను" అన్నారు ముకుందమాల.

ఎల్జీబీటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎల్జీబీటీ

ఎల్జీబీటీ పిల్లల తల్లులుగా వారి ప్రయాణం ఎలా సాగింది?

సాహితి చెప్పకముందు తనకు ఇవేవీ తెలీవని, అప్పుడే మొదటిసారి ఈ మాటలు విన్నానని చెప్పారు ముకుందమాల.

"గే, ట్రాన్స్‌జెండర్.. ఈ పేర్లు కూడా ఎప్పుడూ వినలేదు. గే అని చెబితే, నాకేమీ అర్థం కాలేదు. అప్పుడే మొదటిసారి నాకు ఎల్జీబీటీ కమ్యూనిటీ గురించి తెలిసింది. ఇది 2005 నాటి సంగతి. జీవితంలో ఎప్పుడూ వినని విషయాలు ఆ రోజు విన్నాను. అప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ, తరువాత గొప్ప దుఃఖం వచ్చింది. నా బిడ్డ జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతుందేమోనని బాధపడ్డాను. లోలోపల కుంగిపోయాను. కానీ, నా బిడ్డను పల్లెత్తు మాట అనలేదు. తనకు ఒకటే చెప్పాను.. నువ్వెవరైనా సరే నా బిడ్డవే. నేను నీకు సపోర్ట్ చేస్తాను. ముందు బాగా చదువుకో. ఎంబీబీఎస్ పూర్తి చెయ్యి అని చెప్పాను."

సాహితి తన తల్లికి ఎల్జీబీటీకి సంబంధించిన ఆర్టికల్స్ చూపిస్తూ ఉండేవారు. ఆమెకు ఆసక్తి లేకపోయినా సాహితి కోసం అన్నీ చదివేవారు. మెల్లగా విషయాలన్నీ బోధపడ్డాయని చెప్పారు ముకుందమాల.

కానీ, విష్ణు తల్లి అంజలికి దీని గురించి ముందే అవగాహన ఉంది.

"నేను సైన్స్ చదువుకున్నాను. దీని గురించి నాకు అవగాహన ఉంది. అలాగే, పుస్తకాలు, పేపర్లు చదువుతూ ఉంటాను. కాబట్టి, నాకు తెలుసు. ఇది కొత్త విషయంగా అనిపించలేదు" అన్నారామె.

తండ్రుల తీరు వేరు...

విష్ణు తండ్రి తన బిడ్డ గే అన్న విషయాన్ని ఎప్పటికీ ఒప్పుకోలేదు.

"విష్ణు వాళ్ల నాన్న చాలా కోపిష్టి. బాబు గే అన్న విషయం తెలిస్తే పరువుపోతుందని చిందులేస్తారు. అందుకే విష్ణు సంగతి తెలిశాక కూడా నేను మౌనంగా ఉన్నాను. కొంతకాలానికి వాళ్ల నాన్నకు విషయం తెలిసింది. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆయన బాబును కొట్టి, గోల చేసి చదివించనని చెప్పేశారు. అలా బాబుకి ఒక ఏడాది వేస్ట్ అయింది. తరువాత నేనే కొంత డబ్బు ఏర్పాటు చేసి మా ఆయనకు తెలియకుండా బాబుని కాలేజీలో చేర్చాను. వాళ్ల నాన్న కాలేజీ మాన్పించినప్పుడు ఏడాది పాటు విష్ణు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఏమీ తినేవాడు కాదు. బాగా ఏడ్చేవాడు. నేను కూడా సపోర్ట్ చేయకపోతే ఏమైపోతాడో అనుకున్నా. బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం" అన్నారు అంజలి.

సాహితి తండ్రి మాత్రం తన బిడ్డ జెండర్ అస్తిత్వాన్ని వెంటనే అంగీకరించారు.

"నాకు విషయాలు బోధపడ్డాక, మా ఆయనకు చెప్పాను. ఆయనకు ఈ విషయాలపై అవగాహనపై ఉంది. వెంటనే అర్థం చేసుకున్నారు. ఇప్పుడేం చేయలేం, మౌనంగా ఉండమని నాకు చెప్పారు" అన్నారు ముకుందమాల.

ఎల్జీబీటీ

ఫొటో సోర్స్, Getty Images

'ఒకే ఒక్క పిచ్చి ప్రశ్న అడిగాను.. '

సాహితిని అక్కున చేర్చున్నారు కానీ, ముకుందమాలకు ఇంకా కొన్ని సందేహాలు ఉండేవి.

"ఒకసారి మా అమ్మాయిని ఒక పిచ్చి ప్రశ్న అడిగాను. పెళ్లి వద్దులేగానీ, నువ్వు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండొచ్చు కదా అన్నాను. మా అమ్మయి ఒకటే మాట చెప్పింది... పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కావాలి అని నాకు ఆశలుండవా? అని అడిగింది. నాకు ఆ దెబ్బకి అన్ని సందేహాలూ తీరిపోయాయి" అన్నారామె.

విష్ణు తల్లి అంజలి కూడా మొదట్లో విష్ణును పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నించారు. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కానీ, తరువాత తన తప్పు తెలుసుకున్నానని ఆమె చెప్పారు.

"మరీ ఒత్తిడి చేస్తే విష్ణు ఆరోగ్యానికి ప్రమాదం అనిపించింది. నా బిడ్డ అస్తిత్వాన్ని పూర్తిగా అంగీకరించాను" అన్నారామె.

'మొదట్లో నా బిడ్డ గే అని చెప్పుకోడానికి భయపడ్డాను.. '

సాహితి ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు తన అస్తిత్వం గురించి సమాజానికి చెప్పాలనుకున్నారు. కానీ వద్దని ఆమె తల్లి వారించారు.

"తన చదువు ఆగిపోతుందేమోనని భయపడ్డాను. అందుకే చెప్పొద్దన్నా. ఎలాగోలా ఎంబీబీఎస్ పూరిచేసింది. ఆ తరువాత తన అస్తిత్వాన్ని బయటకి చెప్పుకోవడం ప్రారంభించింది. అప్పుడే మొదటిసారి నన్ను ప్రైడ్ సమావేశానికి తీసుకెళ్లింది. అంతమంది ఎల్జీబీటీ వ్యక్తులను చూడడం అదే మొదటిసారి. అయినప్పటికీ, నా బిడ్డ గే అని బయటకి చెప్పుకోవడానికి భయపడ్డాను. అప్పటికి నేనింకా ఉద్యోగం చేస్తున్నాను."

"ఒకరోజు మా అమ్మాయి ఏమందంటే.. అమ్మా, నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావు. అది మంచిదే కానీ, నాకు పూర్తి సంతోషం కాదు. నువ్వు నా కమ్యూనిటీ కోసం నిలబడ్డప్పుడు నాకు పూర్తి ఆనందం కలుగుతుంది. గర్వంగా ఉంటుంది అని చెప్పింది. ఆ తరువాత నా భయలన్నీ వదిలి, నా బిడ్డ గే అని చెప్పుకోవడం మొదలుపెట్టాను" అన్నారామె.

ఎల్జీబీటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

బంధువులు, స్నేహితులు దూరమయ్యారు..

తమ పిల్లల లైంగిక, జెండర్ అస్తిత్వాలు బయటపెట్టిన తరువాత సమాజంలో అందరూ తమకు దూరం జరిగారని అంజలి, ముకుందమాల చెప్పారు.

"మా ఆయన ఉన్నంతవరకూ బాగా గొడవలు జరిగాయి. ఆయన పోయాక నా బిడ్డకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాను. తనకు నచ్చినట్టు ఉండమన్నాను. బంధువులు అందరూ దూరమయ్యారు. నాకేం నష్టం లేదు. నా బిడ్డ కోరుకున్న జీవితం తనకు దక్కాలి" అన్నారు అంజలి.

ముకుందమాల కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు.

"మెల్లమెల్లగా నా చుట్టూ ఉన్న జనం నాకు దూరమవ్వసాగారు. 'నీ బిడ్డ గే, కానీ అది ఎందుకు బయటకి చెప్పుకోవడం?' అని సన్నితులు ఒకరు అడిగారు. నేనొక్కటే జవాబు ఇచ్చాను.. మన దేశానికి స్వతంత్రం సంపాదించడం కోసం ఎంతోమంది ఎన్నో విధాల పోరాటం చేశారు. ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. నా బిడ్డ లాంటి వాళ్ల కోసం నేను పోరాటం మొదలెట్టాలనుకుంటున్నాను. ఎక్కడో ఒకచోట ఆరంభం కావాలి. వాళ్ల హక్కులు వాళ్లకు దక్కాలి. వాళ్లు దేనికీ భయపడకుండా, గౌరవంతో బతకాలి అన్నాను."

"మా బంధువులు స్నేహితులు నాకు సలహాలివ్వడం మొదలెట్టారు. బిడ్డ తప్పుగా ఆలోచిస్తోందని, తల్లిగా నేను సరిదిద్దాలని అన్నారు. నా బిడ్డ తన శరీరం గురించి తను తెలుసుకుంది. ఈ అంశంపై చాలా చదువుకుంది. నేను కూడా చాలా చదివాను. పరిశోధన చేశాను. మీరు చదివారా? ఏమైనా తెలుసుకున్నారా? తెలుసుకుని అప్పుడు రండి, చర్చిద్దాం అని వాళ్లకు చెప్పేదాన్ని.

నా కలీగ్స్, స్నేహితులు, బంధువులు అందరూ మాకు దూరమయ్యారు. ఈ దేశంలో నా బిడ్డకి రక్షణ ఉండదనిపించింది. విదేశాలకు వెళ్లమని సలహా ఇచ్చాను. నన్ను పిరికిదానిలా పారిపోమంటావా, నేనిక్కడే ఉండి నా హక్కులు సాధించుకుంటాను అంది సాహితి. నాకు చాలా గర్వం కలిగింది. అయితే, పైచదువుల కోసం విదేశాలకు వెళ్లింది. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తోంది" అని చెప్పారామె.

ఎల్జీబీటీ స్నేహితులతో అంజలి

ఫొటో సోర్స్, Vishnu Teja

ఫొటో క్యాప్షన్, ఎల్జీబీటీ స్నేహితులతో అంజలి

'తల్లిదండ్రులు మారాలి, వాళ్లకు కౌన్సిలింగ్ అవసరం'

గే వ్యక్తుల కోసం 'అస్తిత్వం ఫౌండేషన్' అనే సంస్థను విష్ణు ప్రారంభించారు. దీనికి వనరులను అంజలి సమకూర్చారు. తన బంగారం గొలుసు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఇచ్చారు.

"మా అబ్బాయి వాళ్ల కమ్యూనిటీ కోసం ఏదో చేస్తున్నాడు. తనకు నా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మా అబ్బాయి ఫ్రెండ్స్, ఎల్జీబీటీ కమ్యూనిటీలో వాళ్లు మా ఇంటికి వస్తుంటారు. అందరినీ ప్రేమగా దగ్గరకు తీసుకుంటాను. వాళ్ల వేడుకలకు వెళుతుంటాను. ఇంతమంది ఉన్నారా ఈ కమ్యూనిటీలో అని ఆశ్చర్యమేస్తుంది" అన్నారు అంజలి.

ఎల్జీబీటీ వ్యక్తులు పట్ల సమాజంలో చిన్నచూపు ఉందన్నారామె.

"ఇప్పుడిప్పుడే ఈ వర్గం పట్ల కొంత అవగాహన పెరుగుతోంది. ఇంకా చాలా మారాలి. పిల్లలు తమ లైంగిక, జెండర్ అస్తిత్వాల గురించి కచ్చితంగా బయటపెట్టాలి. దాచిపెట్టడం తప్పు. కొంతమంది తమ గే అస్తిత్వాన్ని దాచిపెట్టి, పెళ్లి చేసుకుంటారు. పిల్లల్ని కంటారు. కానీ, ఈ ప్రపంచంలో వాళ్లు ఇమడలేరు. వాళ్ల ప్రపంచం వేరు. రెండు ప్రపంచాల్లో బతుకుతుంటారు. ఇది నరకం. పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూడా అన్యాయం చేసినట్టు. ఇది చాలా తప్పు."

"అయితే, తల్లిదండ్రుల్లూ అర్థం చేసుకోవాలి. వాళ్లకూ కౌన్సిలింగ్ అవసరం. వాళ్లతో మాట్లాడడానికి నేను సిద్ధం. మా అబ్బాయికి చెబుతుంటాను.. ఎవరైనా ఉంటే నా దగ్గరకు తీసుకురా, నేను మాట్లాడతాను, వాళ్లకు అవగాహన కల్పిస్తానని చెప్తాను . నా వరకు నేను చేసే ప్రయత్నం ఇదే. తల్లిదండ్రులకు కూడా ఇది అనవసర ఒత్తిడి. మదనపడి తల్లిదండ్రులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన కేసులు చూశాను. ఎందుకు ఇంత బాధ? తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విషయంలో ఏదైనా చేయాలనుకుంటున్నాను" అన్నారు అంజలి.

అంజలి తన కొడుకుతో పాటు ఎల్జీబీటీ ఫంక్షన్లకు, వేడుకలకు వెళుతుంటారు. మనస్పూర్తిగా వారి ఆనందంలో పాలుపంచుకుంటారు.

"నేను వెళితే ఎంతో సంతోషిస్తారు. మా అమ్మనాన్న రాలేదుగానీ మీరొచ్చారని కొందరు కన్నీళ్లు పెట్టుకుంటారు."

"కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను డాక్టర్ల దగ్గరకు తీసుకెళతారు. కొందరు డాక్టర్లు కూడా బలవంతంగా వాళ్లను మార్చడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా తప్పు. ముందు ఇది 'అసహజం' అనుకోకూడదు. 2018లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ, సమాజంలో వివక్ష చాలా ఎక్కువగా ఉంది" అంటున్నారామె.

విష్ణు పెళ్లి చేసుకుంటే సంతోషిస్తానని చెబుతున్నారు.

"మా అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటే నేను చాలా హ్యాపీ. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా నాకు తేడా లేదు. వాళ్లిద్దరూ జీవిత భాగస్వాములు. కోడలు కాదు, అల్లుడు అనుకుంటాను. బాగా చూసుకుంటాను. గే అయినా, లెస్బియన్ అయినా, ట్రాన్స్ అయినా.. ఏ వ్యక్తి అయినా ముందు మనిషి. తరువాతే మిగతావన్నీ. ఎవరినైనా ముందు మనుషుల్లా చూడాలి, గౌరవించాలి" అన్నారు అంజలి.

"ఎల్జీబీటీ వర్గం ఒంటరిగా లేదా విడిగా ఉండకూడదు. కుటుంబం నుంచి దూరం కాకూడదు. అమ్మ, నాన్న గే జంట, లేదా లెస్బియన్ జంట అందరూ కలిసి కుటుంబంలా ఉండాలి. అప్పుడే ఇది సాధారణం అవుతుంది. ఈ నార్మలైజేషన్ చాలా ముఖ్యం" అన్నారామె.

ట్రాన్స్‌జెండర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'ఎల్జీబీటీ వ్యక్తులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందాలి.. '

ప్రభుత్వం ఎల్జీబీటీ కోసం పథకాలు తీసుకురావాలని, వాళ్లకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలని అంజలి కోరుకుంటున్నారు.

"వాళ్ల ఓట్లు తీసుకుంటున్నప్పుడు, వాళ్లకు గుర్తింపు ఎందుకు ఇవ్వరు?" అని ప్రశ్నిస్తున్నారు.

"తల్లిదండ్రులు చాలా మంది ఎల్జీబీటీ పిల్లలని ఇంటి నుంచి గెంటేస్తారు. లేదా పిల్లలే వచ్చేస్తారు. వాళ్లు ఎలా బతకాలి? ప్రభుత్వం వాళ్లకి జీవనోపాధి కల్పించాలి. రక్షణ కల్పించాలి" అన్నారామె.

ఎల్జీబీటీ వ్యక్తులు కూడా ఈ సమాజంలో భాగమేనని, వారి పట్ల సమాజానికి బాధ్యత ఉంటుందని అంటున్నారు ముకుందమాల. ట్రాన్స్ వ్యక్తుల కోసం ఆమె సోషల్ వర్క్ చేస్తున్నారు.

"ఎల్జీబీటీ కమ్యూనిటీ పట్ల నాకు బాధ్యత ఉంది అనిపించింది. మొదట్లో ఎల్జీబీటీ వర్గానికి చెందిన కాలేజీ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని. బాగా చదువుకోమని చెప్పేదాన్ని. సంపాదన వచ్చాక, మీ అస్తిత్వం గురించి మీరు బయటపెట్టుకోవచ్చు. ముందు మీ కాళ్ల మీద మీరు నిలబడాలి, ఎలాంటి అఘాయిత్యం చేసుకోకూడదు అంటూ వారికి కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని. తరువాత, ఒక క్రిస్టియన్ సొసైటీతో కలిసి ట్రాన్స్ వ్యక్తుల కోసం పనిచేయడం ప్రారంభించాను. కానీ, ఇది అంత సులువు కాదు. చాలా ఓపిక ఉండాలి."

"ట్రాన్స్ వ్యక్తుల కోసం ఒక ప్రభుత్వ పోర్టల్ ఉందని తెలిసింది. ఎవరూ వాడకపోతే దాన్ని తొలగించే అవకాశం ఉంది. వెంటనే నేను మా అమ్మాయికి ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డు కోసం అప్లయి చేశా. కానీ, విచిత్రమేమిటంటే, ఇలాంటి పోర్టల్ ఉందని ప్రభుత్వ అధికారులకే తెలీదు. రెండు మూడు నెలలు పట్టిందిగానీ అధికారులు కోపరేట్ చేశారు. మా అమ్మాయికి ట్రాన్స్ కార్డు వచ్చింది. మరికొందరు ట్రాన్స్ వ్యక్తులకు ఈ కార్డు పొందడంలో సహాయం చేశాను. ఇలాంటి పోర్టల్ ఉందని అందరికీ తెలియాలి."

వీడియో క్యాప్షన్, LGBTQ: ‘నన్ను ఎప్పుడు, ఎక్కడ చంపుతారో చెప్పండి ప్లీజ్.. టైమ్‌కి వచ్చేస్తా’

"ట్రాన్స్ వ్యక్తులకు పెన్షన్, హౌసింగ్ లాంటివన్నీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాధికారులను కలిశాను. కానీ, పెన్షన్ లాంటివి పాలసీ విధానాలు. అవి అంత తొందరగా పరిష్కారం కావు. కాబట్టి, జీవనోపాధి కోసం ఏదైనా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ అధికారులు మాటిచ్చారు. జూట్ బ్యాగ్ తయారుచేసే చిన్న ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేశారు. కొందరు ట్రాన్స్ వ్యక్తులను అందులో చేర్పించాం. ఒక ఏడాది ట్రైనింగ్. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు రెండో బ్యాచ్ నడుస్తోంది."

"కరోనా సమయంలో ఆధార్ కార్డ్ ఉంటే తప్ప వ్యాక్సీన్ ఇవ్వరు. వీళ్లకు ఆధార్ కార్డులు లేవు. ఎంత కష్టమో ఆలోచించండి. దాని కోసం ప్రభుత్వ అధికారులకు అభ్యర్థనలు చేశాం. చివరికి, ట్రాన్స్ వ్యక్తులకు ఆధార్ కార్డు లేకపోయినా వ్యాక్సీన్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి నోటీసు వచ్చింది. ట్రాన్స్ వ్యక్తుల కోసం ఇంకా చాలా చేయాలి. ఎంతోమంది దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. వాళ్లకు ఎలాంటి ఐడెంటిటీ కార్డులు ఉండవు. అవి తెచ్చుకోవాలంటే చాలా శ్రమపడాలి."

"ట్రాన్స్ వ్యక్తులకు ఆధార్ కార్డు కావాలని మాలాంటి వాళ్లంతా ఎంతో శ్రమించాం. చివరికి అది జరిగింది. ఇప్పుడు ఆధార్ కార్డ్ పోర్టల్‌లో ట్రాన్స్‌జెండర్ క్యాటగిరీ కూడా ఉంది. వాళ్లకు పాస్‌పోర్ట్ కూడా ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ పని జరుగుతోంది" అని చెప్పారు ముకుందమాల.

ఎల్జీబీటీ వ్యక్తుల తల్లిదండ్రులకు మద్దతుగా, వారికి అవగాహన కల్పించడం కోసం ముకుందమాల 'క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్' అనే సంస్థను మొదలుపెట్టారు.

"తల్లిదండ్రులకే అవగాహన ముఖ్యం. తమ ఎల్జీబీటీ పిల్లలను వాళ్లు అంగీకరించాలి. వాళ్లకు మద్దతుగా నిలబడాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి స్మైల్ ప్రాజెక్ట్ రానుంది. దీని వల్ల ట్రాన్స్‌జెండర్లకు ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నా" అన్నారామె.

ఫిబ్రవరి 'ఎల్జీబీటీ హిస్టరీ మంత్'. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్ లాంటి దేశాల్లో దీన్ని ఘనంగా జరుపుకుంటారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)