సెక్స్ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారిన డాక్టర్ అనుభవాలేంటి?

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, భార్గవ పరీఖ్
    • హోదా, బీబీసీ కోసం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

''ఈ సమాజం నుంచి మీరు సానుభూతిని, ప్రేమను ఆశిస్తే... ద్వేషం దొరుకుతుంది. అందుకే నేను మహిళ నుంచి పురుషుడిగా మారాలనుకున్నా. మారాను. కానీ, నన్ను అంగీకరించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు''

మహిళగా పుట్టి పురుషుడిగా మారిన భవేశ్ భాయ్ (పేరు మార్చాం) చెప్పిన మాటలు ఇవి. ఆయన ప్రభుత్వ వైద్యుడు. పురుషుడిగా మారిన తర్వాత ఆయన ఓ సామాజిక పోరాటం చేస్తున్నారు.

స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తర్వాత ఆయనను సమాజం ట్రాన్స్‌జెండర్‌గానే చూసింది. కానీ, తనను పురుషుడిగా గుర్తించాలని కోర్టును ఆశ్రయించి, ఆ హక్కును సాధించుకున్నారు భవేశ్.

''కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితి మెరుగుపడుతోంది. నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేస్తాను. విదేశాలకు వెళ్లి చదువుకుంటాను'' అని ఆయన అన్నారు.

గృహహింస

ఫొటో సోర్స్, Getty Images

'అమ్మాయినో, అబ్బాయినో అర్థం కాలేదు'

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఓ చిన్న గ్రామంలో భవేశ్ పుట్టారు.

17 మంది సభ్యులున్న పెద్ద ఉమ్మడి కుటంబం ఆయనది. వారి ఇంట్లో పిల్లలే తొమ్మిది మంది ఉండేవారు. వారిలో ఐదుగురు అబ్బాయిలు. నలుగురు అమ్మాయిలు.

చిన్నప్పుడు భవేశ్ అబ్బాయిలతో స్నేహం చేయడాన్ని ఇష్టపడేవారు. శారీరకంగా అమ్మాయినైనా, మానసికంగా అబ్బాయినని అప్పటికి తనకు ఇంకా తెలియలేదని ఆయన అన్నారు.

''మాది చిన్న ఊరు. అక్కడే చదువుకునేవాడిని. పదో తరగతి వచ్చే వరకూ నాకు నేను అబ్బాయినా, అమ్మాయినా అన్న విషయం తెలియలేదు. చిన్నప్పుడు నా జట్టు పొడవుగా ఉండేది. మొదట్లో నాది ఈ లింగమన్న భావనేదీ నాకు లేదు. ఆ తర్వాత తర్వాత పరిస్థితి మారింది. నాకు అమ్మాయిలు నచ్చేవారు. అలా అని వారితో కలిసి ఉండటమో, ష్యాషన్ గురించి ముచ్చటించడమో నచ్చేది కాదు'' అని భవేశ్ వివరించారు.

''నా ప్రవర్తన అమ్మాయిల్లా ఉండేది కాదు. దీంతో కొందరు విసుక్కునేవారు. మా అక్కలు, ఇంట్లో ఉండే ఆడవాళ్లు అమ్మాయిలా ఎలా ఉండాలో నాకు నేర్పించేవారు. కానీ, నాకు అంతా అయోమయంగా ఉండేది. ఏదో తేడా ఉన్నట్లు అనిపించేది. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అందరూ నన్ను దూరం పెట్టేవారు. కానీ, ఏమీ పట్టించుకోకుండా బాగా చదువుకున్నా. మంచి ర్యాంకు తెచ్చుకుని, మా కుటుంబం కోరుకున్నట్లుగా వైద్య కళాశాలలో సీటు సంపాదించా'' అని ఆయన చెప్పారు.

గృహహింస

ఫొటో సోర్స్, Getty Images

సర్టిఫికెట్లలో మార్పు కోసం పోరాటం

ఆ తర్వాతే తన అసలు పోరాటం మొదలైందని భవేశ్ చెప్పారు.

''నా సర్టిఫికెట్లన్నింటిలోనూ నా లింగం స్త్రీ అనే ఉంది. ప్రభుత్వ కళాశాల నిబంధనల ప్రకారం నేను బాలికల హాస్టల్‌లో ఉండాలి. నేను మెడిసిన్ చదువుతున్నా. నా లోపల ఏం జరుగుతుందో నాకు తెలుసు. హాస్టల్‌లో నాకు ఒంటరిగా అనిపించేది. హార్మోన్ చికిత్స చేయించుకోవడం మొదలుపెట్టా. నా శరీరం మారడం మొదలైంది. హాస్టల్‌లో ఉండటం కష్టమైంది. నెమ్మదిగా నాకు మీసాలు, గడ్డం కూడా వచ్చాయి'' అని భవేశ్ చెప్పారు.

''నేను బాలుర హాస్టల్‌లో ఉంటానని కళాశాలకు వ్యతిరేకంగా గొంతు ఎత్తా. అమ్మాయిలు నన్ను 'అంటరాని వ్యక్తి'గా చూశారు. అబ్బాయిలు నన్ను అంగీకరించేందుకు సిద్ధపడలేదు'' అని అన్నారు.

ఆ తర్వాత దిల్లీలోని ఓ సామాజిక సంస్థను భవేశ్ ఆశ్రయించారు. అప్పుడు ఆయనకు బాలుర హాస్టల్‌లో ఉండేందుకు అనుమతి దొరికింది.

''నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. శారీరకంగా అమ్మాయిగా ఉన్నా, మానసికంగా నేను అబ్బాయినని నాకు బలంగా అనిపించేది. కళాశాలలో నాతోపాటు చదువుతున్న ఓ అమ్మాయి నన్ను బాగా అర్థం చేసుకుంది. నువ్వు ఏ బట్టలు వేసుకున్నా ఏమీ కాదని తను నన్ను సముదాయించేది. నాకు అండగా నిలిచేది'' అని భవేశ్ వివరించారు.

గృహహింస

పెళ్లి, వృద్ధాప్యం గురించి ఆందోళన

''ఓ రోజు నా తండ్రితో కలిసి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లా. మా నాన్నకు నేనంటే చాలా ప్రేమ. కానీ, సమాజం గురించి భయపడేవారు. నా పెళ్లి గురించి ఆయన ఆందోళనపడేవారు. 'అబ్బాయిగా మారితే ఎవరిని పెళ్లి చేసుకుంటావు? వృద్ధాప్యం వచ్చాక నిన్ను ఎవరు చూసుకుంటారు?'... ఇలా అనుమానాలు వ్యక్తం చేసేవారు. దీనికి నేను ఒకే సమాధానం చెప్పేదాన్ని. చేసుకున్న వ్యక్తి చివరి దాకా తోడుంటారని, వృద్ధాప్యంలో పిల్లలు మనల్ని బాగా చూసుకుంటారని గ్యారంటీ ఉందా అని ఎదురుప్రశ్నించేదాన్ని. నా వాదన సహేతుకమేనని ఆయనకు అర్థమైంది'' అని భవేశ్ చెప్పారు.

తన తండ్రి కుమారుడిగా తనను చూసినప్పుడు చాలా సంతోషపడ్డానని భవేశ్ వివరించారు. శస్త్ర చికిత్స చేయించుకుని తాను అబ్బాయిగా మారానని చెప్పారు.

శస్త్రచికత్స తర్వాత ఎదురైన అనుభవాలను కూడా ఆయన వివరించారు.

''శస్త్ర చికిత్స తర్వాత నా ముఖం నాకు నర్సు చూపించారు. నా ముఖంలో ఏ భావనా లేదు. 'శస్త్ర చికిత్స తర్వాత చాలా మంది బాగా ఉద్విగ్నతకు గురవుతారు. మీరు ప్రశాంతంగా కనిపిస్తున్నారేంటీ?' అని ఆమె అడిగారు. 'నా ఆత్మకు సరైన శరీరం దొరికింది. ప్రశాంతంగా అనిపిస్తోంది' అని చెప్పా. నేను అనుకున్నది జరిగింది. జనాలు నన్ను ప్రేమించాలని నేను ఈ శస్త్ర చికిత్స చేయించుకోలేదు. నాపై నాకున్న ప్రేమతో చేయించుకున్నా'' అని భవేశ్ అన్నారు

గుజరాత్ హైకోర్టు

ఫొటో సోర్స్, Kalpit Bhachech

న్యాయం కోసం హైకోర్టుకు...

శస్త్ర చికిత్స తర్వాత భవేశ్ రెండో పోరాటం మొదలైంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఆయన అనుకున్నారు. అందుకోసం ఆయన తన బర్త్ సర్టిఫికేట్, స్కూల్-కాలేజీ సర్టిఫికేట్లు, పాస్‌పోర్టుల్లో తన లింగాన్ని పురుషుడిగా మార్చుకోవాల్సి వచ్చింది.

అయితే, తాను పురుషుడినని సర్టిఫికేట్ తెచ్చుకునేందుకు భవేశ్ ఎంత ప్రయత్నించా, ఫలితం లేకపోయింది. ఆయనకు ట్రాన్స్‌జెండర్‌ అన్న సర్టిఫికేట్ మాత్రమే ఇచ్చారు.

దీంతో భవేశ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

భవేశ్ భాయ్ చిన్నప్పటి నుంచి జెండర్ డిస్ఫోరియా సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన సర్టిఫికేట్ ఆయనకు కేసులో కీలకమైంది.

భవేశ్‌కు ఎలాంటి నేరచరిత్రా లేదని, చదువుకునేందుకు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.

వీటన్నింటిని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏజే దేశాయ్ భవేశ్‌ను పురుషుడిగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.

''భవేశ్ జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్నట్లు తెలిశాక ఆయనకు బాలుర హాస్టల్‌లో చేర్చుకున్నాం. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేస్తున్నాం'' అని భావ్‌నగర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ మహిపత్ సింగ్ చావ్డా చెప్పారు.

ఒకానొక సమయంలో చనిపోదామన్న ఆలోచన కూడా తనకు వచ్చిందని, కానీ మనసు మార్చుకుని పోరాటంలోకి దిగానని భవేశ్ అన్నారు.

''నాకు ఇదివరకే విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్ వచ్చింది. కోర్టు ఆదేశాలు వచ్చాయి కాబట్టి, నేను ఎప్పుడైనా వెళ్లొచ్చు. కానీ ఇప్పుడు నేను ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సేవ చేస్తున్నా. కరోనా పోయిన తర్వాత విదేశాలకు వెళ్లి చదువుకుంటా'' అని ఆయన చెప్పారు.

తనకు ఇప్పుడు సామాజిక పంజరం నుంచి బయటపడి, ఆకాశంలో విహరిస్తున్న పక్షిలా అనిపిస్తోందని భవేశ్ అన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)