ఆంధ్రప్రదేశ్: ఏడాదిన్నర కిందట అడవిలో తప్పిపోయిన పసివాడు.. తిరిగి తల్లి ఒడికి చేరాడు

ఫొటో సోర్స్, Chand Pasha
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
"బాబు ప్రాణాలతో ఉంటే చాలు.. ఎప్పటికైనా చూస్తాం" అంటూ మూడేళ్ల సంజు ఆచూకీ కోసం తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు. అడవిలో తప్పిపోయిన ఆ పసివాడు ఏడాదిన్నర దాటిపోయిన తర్వాత తిరిగి తల్లిదండ్రుల ఒడికి చేరుకున్నాడు.
సంజూ 2021 జూన్ చివర్లో తప్పిపోయాడు. మేకలు మేపుతున్న తండ్రి వెనుక వెళ్లిన బాలుడు మళ్లీ వెనక్కి రాలేదు. ఆందోళన చెందిన ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల పాటు ఎంత గాలించినా దొరకలేదు.
అడవిని డాగ్ స్క్వాడ్ తో జల్లెడ పట్టారు. డ్రోన్లతో శోధించారు. సమీప గ్రామాలంతా పోస్టర్లతో ప్రచారం చేశారు. టీవీలలో చూపించారు. కానీ ఏడాదిన్నరగా బిడ్డ ఆచూకీ మాత్రం దొరకలేదు. పది, పదిహేను రోజులు ఎదురుచూసిన తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ కనిపించకపోయేసరికి డీలా పడ్డారు.

"అప్పటి వరకు ఆడుకున్నాడు. వాళ్ల నాన్న గొర్రెలిప్పుకుపోయాడు. నవకోటి ధాన్యాలు వస్తే నేను తీసుకుని ఇంట్లో పెట్టడానికి పోయా. గంటయినా నాకాడికి రాలా. ఏంటీ పిల్లాడు ఇంకా రాలేదని ఇక్కడల్లా తిరిగా. యాడా లేడు. వాళ్ల నాయిన దగ్గరకి పోయాడని అడవిలోకి పోయా. అక్కడ కూడా లేడు. ఎనిమిది దినాలయ్యింది. నా బిడ్డ ఏడ ఉన్నాడో. మీ కాళ్లు పట్టుకుంటా మాకైనా అప్పగించండి.. లేదంటే అనాధాశ్రమనికివ్వండీ" అంటూ నాడు కన్నీరు పెట్టుకున్నారు తల్లి దండు వరలక్ష్మి.
ఇదంతా జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం ఉయ్యాపల్లిలో. తీరా ఇప్పుడు 20 నెలలు తిరిగిన తర్వాత అనూహ్యంగా బాబు ఆచూకీ దొరకడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక తిరిగిరాడనుకున్న వాడు తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు.
అడవిలో తప్పిపోయిన పసివాడు ఇప్పటివరకూ ఎక్కడున్నాడు? తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడు?

ఎలా తప్పిపోయాడు?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయ మండలం ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన దండు బుచ్చయ్య, వరలక్ష్మి దంపతుల కొడుకు సంజు 2021 జూన్ 29 నుంచి కనిపించకుండా పోయాడు. అడవిలో తప్పిపోయాడు.
అప్పుడు ఆ బాబుకు మూడు సంవత్సరాలు. ఆ బాబుకు అమ్మా, నాన్న అనడం తప్ప ఇంకా మాటలు కూడా పూర్తిగా రావు.
బుచ్చయ్య తనకున్న 20 గొర్రెలను మేపుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. ఉదయాన్నే వాటిని తీసుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తూ ఉంటారు.
ఉదయాన్నే ఇంటి దగ్గర బయలుదేరే సమయంలో బుచ్చయ్యతో పాటుగా సంజు కూడా కొంతదూరం వరకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. బుచ్చయ్య గొర్రెలతో అడవిలోకి వెళ్లగా సంజు వెనక్కి వచ్చేసేవాడు.

ఆరోజు తండ్రితో వెళ్లలేదు..
నిత్యం తండ్రితో గొర్రెల వెనుక కొంత దూరం వెళ్లి తిరిగివచ్చే సంజు ఆ రోజు ఉదయం తండ్రితో వెళ్లలేదు.
పిల్లలతో ఆడుకుంటూ ఉండిపోయాడని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ కొంతసేపటి తర్వాత ఒంటరిగా అడవి దారిలో ముందుకెళ్లిన సంజు ఆ తర్వాత మళ్లి వెనక్కి రాలేదు.
వారం రోజులుగా తమ బిడ్డ కోసం బుచ్చయ్య, వరలక్ష్మి దంపతులతో పాటుగా వారి బంధువులు కూడా ఎదురు చూస్తున్నారు.
"ఇక్కడే ఎక్కడో ఉంటాడులే అనుకున్నాం. కానీ ఎంతకూ రాకపోవడంతో చుట్టూ వెదికి పోలీసుల దగ్గరకు వెళ్లాం. ఆ రోజు నుంచి గాలిస్తున్నారు. పిల్లాడు అడవిలోకి వెళ్లడం గాయాజ్, చిన్నయ్య అనే వాళ్లు చూశారట. కానీ ఎవరో తెలియక వదిలేశామని చెప్పారు. ఎటు పోయాడో తెలియదు. ఎవరికైనా దొరికితే అప్పగించమని మొక్కుకుంటున్నాం" అంటూ వరలక్ష్మీ బీబీసీతో అన్నారు.

డ్రోన్లు, డాగ్ స్క్వాడ్తో గాలింపు
సంజు జాడ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. జూన్ 29న ఫిర్యాదు అందుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తొలుత పోలీసులు అటవీ ప్రాంతమంతా గాలించారు. అడవిలోకి వెళుతుండగా బాలుడిని చూసినట్టు చెప్పిన వారి నుంచి వివరాలు సేకరించారు.
ఆ తర్వాత డ్రోన్లు కూడా ఉపయోగించారు. సమీప అటవీ ప్రాంతమంతా శోధించారు. డాగ్ స్క్వాడ్ కూడా రంగంలో దిగింది. డాగ్ కూడా అడవిలో కొంత దూరం వెళ్లి వెనక్కి వచ్చేసింది.
అది ఒక గుట్ట దగ్గర ఆగడంతో అనుమానం వచ్చిన పోలీసులు అక్కడ కూడా పూర్తిగా పరిశీలించారు. అయినా ఎటువంటి ఆచూకీ దొరకలేదు.

గ్రామ వలంటీర్ల ద్వారా ప్రయత్నిస్తున్నాం..
"అడవి అంతా కూంబింగ్ చేశాం. 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో తిరిగాం. చిన్న క్లూ కూడా దొరకలేదు. మాటలు కూడా రావు , వివరాలు చెప్పలేడు కాబట్టి రోడ్డు మీద వెళ్లేవారు ఎవరైనా పెంచుకోవడానికి తీసుకెళ్లి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. టవర్ డంప్ అనాలిసిస్ రావాల్సి ఉంది" అని కలవాయి ఎస్సై ఆంజనేయులు నాడు బీబీసీకి తెలిపారు.
కలవాయి మండలంతో పాటుగా సమీప కడప జిల్లాలో కూడా సంజు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.
"గ్రామ వలంటీర్లందరికీ సమాచారం ఇచ్చాము. వారి పరిధిలోని 50 కుటుంబాలలో కొత్తగా ఎవరైనా చిన్న పిల్లలు వస్తే చెప్పాలని అడిగాము. కొద్దిరోజుల్లోనే ఫలితం ఆశిస్తున్నాం. అడవిలో చిన్న ఆధారం కూడా దొరకలేదు. పిల్లాడు ఏమయ్యాడనేది అంతుబట్టడం లేదు" అని అన్నారాయన.
అయితే, సంజూ కోసం సమీపంలోని తెలుగు గంగ కాలువలో కూడా గాలించినా ఆనవాలు దొరకలేదు. దీంతో అన్ని యత్నాలు మానుకున్నారు.

ఫొటో సోర్స్, Chand Pasha
అనూహ్యంగా ఆచూకీ లభ్యం...
దాదాపు 20 నెలలు గడిచిపోయాయి. అనూహ్యంగా ప్రకాశం జిల్లా పామూరు మండలం కృష్ణాపురంలో ఆ బాలుడి ఆచూకీ లభించింది. వైఎస్సార్ జిల్లా తోపుగుంటకి చెందిన వారి ద్వారా.. సంజూ కృష్నాపురంలో ఉన్నట్లు తల్లిదండ్రులకి చేరిందని చెబుతున్నారు.
దీంతో ఆ ఊరికి వెళ్లి తమ బిడ్డను తెచ్చుకున్నామని తల్లిదండ్రులు చెప్పారు. ‘‘కృష్ణాపురంలో ఉన్నాడని తెలిసి వెళ్ళాము. ఎవరో తమకి అమ్మినట్టు వారు చెప్పారు. మా బిడ్డ ఆనవాళ్లు చెప్పడంతో అప్పగించారు. ఇక లేడని అనుకున్న మా బాబు ఇంటికి వచ్చాడు మాకు అంతే చాలు’’ అంటూ సంజూ తల్లి వరలక్ష్మి తెలిపారు.
చాలాకాలానికి మళ్లీ తల్లి ఒడికి చేరిన సంజయ్‌ని చూసి గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా అప్పట్లో ఆచూకీ లభించకుండా పోయిన నేపథ్యంలో అసలేం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













