బిహార్: 'అతడు' తప్పిపోయిన కుమారుడినంటూ 41 ఏళ్లు ఓ కుటుంబాన్ని మోసం చేశాడు, ఆస్తులన్నీ అమ్మేశాడు

బిహార్

ఫొటో సోర్స్, NIRAJ SAHAI/BBC

ఫొటో క్యాప్షన్, బిహార్
    • రచయిత, నీరజ్ సహాయ్
    • హోదా, బీబీసీ కోసం

ఇది 'అతడు' సినిమా కథ కాదు. బిహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన యదార్ధ సంఘటన. దయానంద్ గోసైన్ అనే వ్యక్తి 41 సంవత్సరాల పాటు ఒక కుటుంబాన్ని మోసం చేసి కొడుకుగా చెలామణి అయ్యారు. మరి నిజం ఎలా బయటపడింది?

దయానంద్ గ్రామంలో స్థిరాస్తులు అధికంగా ఉన్న కుటుంబాన్ని 41 సంవత్సరాల పాటు మోసం చేశారు. ఆ కుటుంబంలో తప్పిపోయిన కొడుకునని చెబుతూ వారింట్లో చేరారు.

చివరకు ఈ వారసత్వ కేసులో పాట్నా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు చాలా మందిని విస్మయానికి గురి చేసింది.

ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న మోసం, కుటుంబీకుల మనోభావాలతో ఆడిన చెలగాటం, ఆస్తి కోసం ఆశపడటం అన్నీ చూస్తుంటే సినిమా కథను తలపిస్తున్నాయి. కానీ, మోసం చేసిన వ్యక్తికి కేవలం మూడేళ్లే జైలు శిక్ష పడింది. నలంద జిల్లా అదనపు చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ మన్ వేంద్ర మిశ్రా తీర్పు వెలువరించారు.

అసలేం జరిగింది?

ఈ కథ నలంద జిల్లాలోని మోర్ గావ్ లో సిలావ్ పోలీసు స్టేషన్ దగ్గర మొదలైంది. కామేశ్వర్ సింగ్ అనే వ్యక్తికి సంబంధించిన ఆస్తి తగాదా ఇది. ఆయనకు గ్రామంలో దాదాపు 50 ఎకరాల భూమి ఉంది.

అయితే, ఆయన కొడుకు కన్హయ్య సింగ్ 1977లో మెట్రిక్ పరీక్ష రాసేందుకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియలేదు. ఆయన గురించి చాలా రోజులు వెతికిన తర్వాత సిలావ్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది.

కొడుకు కోసం ఎదురు చూస్తూ నాలుగేళ్లు గడిచాయి.

ఒక రోజు అకస్మాత్తుగా ఒక సన్యాసి రూపంలో కన్హయ్య సింగ్ ప్రత్యక్షమయ్యారు.

బిహార్

ఫొటో సోర్స్, NEERAJ SAHAI/BBC

సన్యాసిగా ఎలా మారారు?

1981లో కేశోపూర్ గ్రామానికి ఒక యువ సన్యాసి వచ్చారు. ఆయనే కన్హయ్య అని చెప్పుకుంటూ ఉండేవారని పోలీసులు చెప్పారు.

కొన్ని రోజులకు ఈ వార్త పక్క గ్రామానికి చేరింది. అప్పటికి కామేశ్వర్ సింగ్ బ్రతికే ఉన్నారు.

ఆ సన్యాసి చెబుతున్న మాటలను నమ్మి ఆయనను ఇంటికి తీసుకుని వచ్చారు. అయితే, ఆయన భార్య మాత్రం ఆ సన్యాసి తన కొడుకని నమ్మలేదు. గ్రామస్థుల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఆమె మౌనంగా ఉండిపోయారు.

వీడియో క్యాప్షన్, నితీశ్‌కుమార్‌కు ఇవి చివరి ఎన్నికలా? ఆయన ప్రస్థానం ఎలా సాగింది?

కన్హయ్య సింగ్‌ అని చెప్పుకుంటూ దయానంద్ గోసైన్ కుటుంబంతో కలిసి జీవించడం మొదలుపెట్టారు. రామ్ సఖి దేవి మాత్రం ఆయనను కొడుకుగా ఆమోదించలేదు. ఆమె అతనిని నమ్మలేదు.

నవంబరు 1981లో దయానంద్‌కు వ్యతిరేకంగా సిలావ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

నవంబరు 1991లో పాట్నా జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఇంతలో 1995లో కామేశ్వర్ సింగ్, ఆయన భార్య రామ్ సఖి దేవి కూడా మరణించారు.

బిహార్

ఫొటో సోర్స్, Getty Images

కేసును కొనసాగించిన కూతురు

తల్లి మరణం తర్వాత ఆ కేసును కొనసాగించే బాధ్యతను ఆమె కూతురు విద్య దేవి తీసుకున్నారు.

ఈ మేరకు బీబీసీ విద్య దేవిని సంప్రదించాలని ప్రయత్నించింది, కానీ, ఆమె నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు.

ఇదంతా ఆస్తి కోసమే జరిగిందని ఆమె తరుపున వాదించిన న్యాయవాది రాజేష్ కుమార్ చెప్పారు.

"కామేశ్వర్ సింగ్ ఇంట్లో 40 ఏళ్ల పాటు నివసించిన దయానంద్ కొంత భూమిని కూడా అమ్మేశారు. పొలంలోపైపు లైను వేసినందుకు పరిహారం కూడా తీసుకున్నారు. ఇంతలో ఆయన పెళ్లి కూడా చేసుకున్నారు" అని రాజేష్ కుమార్ చెప్పారు.

"నిజానికి ఈ కేసును కన్హయ్య తల్లి నమోదు చేశారు. కన్హయ్య తలపై గాయం మానిన మచ్చ ఉంటుంది. అయితే, అటువంటి మచ్చ దయానంద్‌కు లేదని ఆమె కేసులో సాక్ష్యం ఇచ్చారు. దయానంద్ డీఎన్ఏ పరీక్షకు కూడా హాజరు కాలేదు" అని రాజేష్ వివరించారు.

దయానంద్

ఫొటో సోర్స్, Getty Images

డీఎన్ఏ పరీక్షకు నిరాకరించారు

ప్రభు గోసైన్ అనే వ్యక్తికి దయానంద్ మూడవ కుమారుడని వారి సొంత జిల్లా జాముయ్‌కి చెందిన మరొక వ్యక్తి కోర్టులో సాక్ష్యం చెప్పారు.

దయానంద్ గోసైన్ మరణించినట్లు ధృవీకరిస్తూ ఒక పత్రాన్ని కూడా ఆయన కోర్టుకు సమర్పించారు. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఆ పత్రంలో దయానంద్ గోసైన్ 1981లో మరణించినట్లుగా ఉంది. కానీ, ఆ ధ్రువీకరణ పత్రాన్ని 2014లో జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు దాని పై విచారణ చేయగా అది నకిలీ పత్రం అని తేలింది.

పాట్నా జిల్లా కోర్టు నుంచి ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసు పునర్విచారణ మొదలయింది.

ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కోర్టు దయానంద్ గోసైన్‌కు మూడేళ్ళ జైలు శిక్షతో పాటు జరిమానాను విధించింది.

"కోర్టు 2014 నుంచి డీఎన్ఏ పరీక్ష చేయించమని అడుగుతున్నప్పటికి వారు అంగీకరించలేదు. ఈ పరీక్షకు ఒప్పుకునేది లేదని నిందితులు 2022లో లిఖిత పూర్వకంగా కోర్టుకు తెలియ చేశారు. నిందితుడు1977 - 1981 మధ్య కాలంలో ఎక్కడున్నారో కోర్టుకు చెప్పలేకపోయారు" అని నలంద జిల్లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్ రాజేష్ కుమార్ పాఠక్ బీబీసీకి చెప్పారు.

"ఎవరైతే ఈ తీర్పు విని సంతోషించేవారో వారిక బ్రతికి లేరు. ఈ విషయం ఎలా అయినా బయట పెట్టాలని మా అమ్మ కోరిక. మేము నిజాన్ని వెలికి తీసి అందరి ముందు బయట పెట్టాలని అనుకున్నాం. ఇందులో వేరే విధమైన ఆశ లేదు" అని విద్య దేవి చెప్పారు.

"ఇదంతా ఆస్తి కోసమే చేశారు. అక్క చెల్లెళ్ళందరూ కలిసి ఆస్తి పై కన్ను వేశారు. అందుకే ఇలా చేశారు" అని దయానంద్ గోసైన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

వీడియో క్యాప్షన్, "మా బాబుకు ఆటిజం ఉందని చెప్పడానికి డాక్టర్లే భయపడ్డారు"

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)