ఇసాక్ ముండా: రోజువారి కూలీ యూట్యూబ్ స్టార్.. 8 లక్షల సబ్‌స్క్రైబర్లు, 10 కోట్లకు పైగా వ్యూస్.. ఇదంతా ఎలా సాధ్యమైందంటే..

ఫొటో సోర్స్, Isak Munda
- రచయిత, సందీప్ సాహు
- హోదా, బీబీసీ
ఒడిశాకు చెందిన ఒక కూలీ యూట్యూబ్ స్టార్‌గా ఎదిగారు. ఆయన పేరు ఇసాక్ ముండా. ఒకప్పుడు ఆయన రోజువారి కూలీ. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్.
ఇసాక్ గతంలో భవన నిర్మాణ రంగంలో కూలీగా పని చేసేవారు. కోవిడ్ రావడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో నిర్మాణ రంగంలో పనులు నిలిచిపోయాయి. ఆయనకు ఉపాధి కరువైంది. తిండికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు.
ఆయన పిల్లలు యూట్యూబ్‌లో కార్టూన్ వీడియో చూస్తున్నప్పుడు వచ్చిన ఒక యాడ్ ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసి డబ్బులు సంపాదించొచ్చన్న ప్రకటన ఆయన చెవిలో పడింది. దాంతో తానెందుకు ప్రయత్నించి చూడకూడదని ఆయన అనుకున్నారు.
టిప్స్ కోసం యూట్యూబ్‌లో వెతికారు. ఆయన సింపుల్ ఫుడ్ వీడియోలు చేయడం మొదలుపెట్టారు.
2020 మార్చిలో ఇసాక్ ముండా తన తొలి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.

మొదటి వీడియోలో ఇసాక్ తన ప్లేట్‌లో ఆహారం అంటే అన్నం, పప్పు, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి పెట్టుకున్నారు. ప్రేక్షకులను పలకరించిన తర్వాత మౌనంగా తినేశారు.
కానీ ఈ వీడియోకు ఆయన అనుకున్న విధంగా వ్యూస్ రాలేదు.
'దాదాపు వారం వరకు నా వీడియోను ఎవరూ చూడలేదు' అని ఆయన చాలా నిరుత్సాహంగా చెప్పారు.
మరో ప్రయత్నం చేసి చూద్దామనుకున్నారు. సాయం కోసం, టిప్స్ కోసం మరోసారి యూట్యూబ్‌లో వెతికారు. చాలామంది యూట్యూబర్లు తమ వీడియోలను ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రమోట్ చేసుకుంటున్నారని గుర్తించారు.
'నేను ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేశాను. అందులో నా వీడియోలను షేర్ చేశాను. ఈసారి ఇది వర్కవుట్ అయింది. పది, పన్నెండు మంది నా వీడియోలను చూశారు' అని ఆయన తెలిపారు.
త్వరలోనే ఆయన చేసిన ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన 'బాసి పఖాలా' తింటూ కనిపిస్తారు. ఇది ఒడిశాలో చాలా పాపులర్ వంటకం.
'కొన్ని రోజుల్లోనే ఈ వీడియో నాకు 20వేల సబ్‌స్క్రైబర్లను తీసుకొచ్చింది. అమెరికా, బ్రెజిల్, మంగోలియా సహా ప్రపంచం నలుమూలల నుంచి నా వీడియోలను చూశారు' అని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆయనకు కావాల్సింది కూడా ఇదే. రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన చానల్ 'ఇసాక్ ముండా ఈటింగ్'కు ఇప్పుడు 8లక్షల కంటే ఎక్కువ మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఆయన వీడియోలను 10 కోట్ల కంటే ఎక్కువసార్లు చూశారు.
'విలేజ్ చికెన్ పార్టీలు' నిర్వహిస్తున్నప్పుడు ఇసాక్ ఇప్పుడు కెమేరా ముందు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోగలుగుతున్నారు.
గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఇసాక్ ముండాను ప్రశంసించారు.
'అప్పుడు నాకు ఆనందంతో గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది. నా చానల్ సబ్‌స్ర్ర్కిప్షన్లు కూడా పెరిగాయి' అని ఇసాక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Isak Munda
యూట్యూబ్‌లో నేర్చుకుని యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి..
ఇసాక్ ముండా చేసే వీడియోలు యూట్యూబ్‌లో 'ముక్బాంగ్ జానర్' కిందికి వస్తాయి. ఈ వీడియోల్లో యూట్యూబర్లు ఆహార పదార్థాలను ప్లేట్‌లో పెట్టుకుని తింటూ, కొన్నిసార్లు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతుంటారు.
సుమారు 2010లో దక్షిణ కొరియా, జపాన్‌లో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత ఇది క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ముక్బాంగ్ చానెల్స్‌కు లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
ఒంటరిగా భోజనం చేస్తున్నప్పుడు ఇలాంటి వీడియోలను చూసుకుంటూ తింటామని ముక్బాంగ్ వీడియోలు చూసేవారు చెప్పారు. ఇలా చేయడం వల్ల ఒంటరితనం తగ్గినట్టు అనిపిస్తుందని తెలిపారు.
కానీ వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పుడు ఇసాక్ ముండాకు ఈ విషయాలేవీ తెలియవు. ఆయన అనేక రకాల వీడియోలు చూసిన తర్వాత చివరికి ఫుడ్ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే తన భార్య సాయంతో తాను వంట చేయగలనని ఆయన అనుకున్నారు.
ఆహారం ద్వారా మా జీవితాలు ఎలా ఉంటాయో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారని ఇసాక్ ముండా చెప్పారు.
ఆయన గురువు యూట్యూబే. ఏ కెమేరా కొనాలి? ఎలా షూట్ చేయాలి? వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి? వంటి అన్ని విషయాలను ఆయన యూట్యూబ్‌లోనే నేర్చుకున్నారు. చివరికి తను తినడానికి ఎలాంటి వంటలు చేసుకోవాలో కూడా ఆయన కొన్నిసార్లు యూట్యూబ్‌లోనే వెతుకుతారు.
దాచుకున్న డబ్బుల్లో 3 వేల రూపాయలు డ్రా చేసి ముందుగా ఆయన ఒక స్మార్ట్ ఫోన్ కొన్నారు. ఫోన్ డబ్బులను వాయిదా పద్ధతిలో చెల్లించారు.
ఆయన పెద్దగా చదువుకోలేదు. ఇంగ్లిష్ కూడా పెద్దగా రాదు. కానీ ఈమెయిల్ ఎలా వాడాలో సొంతగా నేర్చుకున్నారు. తన చానల్ గురించి ప్రచారం చేసేందుకు సోషల్ మీడియా వాడటం నేర్చుకున్నారు. తన వీడియోలకు సబ్ టైటిల్స్ కోసం గూగుల్ ట్రాన్స్‌లేట్ వాడటం కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు వీడియోలు తీయడంపై కాస్త పట్టు వచ్చింది.
మొదటి వీడియోలో ఆయన కేవలం తింటూ కనిపిస్తారు. ఆ వీడియోను సింగిల్ టేక్‌లో రికార్డ్ చేశారు. 'హలో ప్రెండ్స్.. ఈ ప్లేట్‌లో కనిపిస్తున్న వాటిని నేను తినబోతున్నాను' అని ఆయన హిందీలో చెప్పారు. ఆ తర్వాత వాటి గురించి కొద్దిగా వివరించారు. అనంతరం ఆహారం తినేశారు.
కానీ 2022 ఫిబ్రవరి నాటికి ఆయన చేసే వీడియోలు భిన్నంగా మారిపోయాయి. ఆయన ప్రతి రోజు లేదా ప్రతి భోజనాన్ని చిత్రీకరించరు. అలా కాకుండా ప్రత్యేక సందర్భాల్లో అంటే విలేజ్ పార్టీల్లాంటివి జరిగినప్పుడు మాత్రమే వీడియో చిత్రీకరించి అప్‌లోడ్ చేస్తారు.
చాలామంది ఆయన వీడియోలకు కామెంట్లు పెడతారు. వాళ్లు తమ ఇంట్లో చేసుకునే వంటలను ఆయన ఆహారంతో పోల్చి కామెంట్లు పెడుతుంటారు.
ఎలాంటి కృత్రిమత్వం లేకుండా ఆయన తన జీవితాన్ని ప్రేక్షకుల ముందు ఎలా పెడుతున్నారన్న విషయంలో చాలామంది ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు.
'వాళ్ల విందులు చూడ్డానికి చాలా సరదాగా ఉంటాయి' అని ఒకరు కామెంట్ పెట్టారు.
'ఆయనకు ఆహారం విలువ తెలుసు. దాన్ని ఎలా గౌరవించాలో కూడా తెలుసు' అని మరొకరు రాశారు.
క్రమంగా ఇసాక్ ముండా చేసే వీడియోల విస్తృతి పెరిగింది. తనకు నచ్చిన వంటలు చేయడంతో పాటు ప్రేక్షకులు కోరిన వంటలు చేసి తినడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు ఫుడ్ చాలెంజ్ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు.
కూలీగా పని చేసినప్పుడు ఇసాక్ ముండా రోజుకు 250 రూపాయలు సంపాదించేవారు. నెలలో 18 నుంచి 20 రోజులు పని దొరికేది. తల్లిదండ్రులతో కలిపి ఆరుగురు సభ్యులుండే కుటుంబాన్ని పోషించేందుకు ఈ డబ్బు ఏమాత్రం సరిపోయేది కాదు.
ఆయన చానల్ ప్రజాదరణ పొందడంతో ఆయన నెల ఆదాయం 3 లక్షల రూపాయలకు పెరిగింది.
అయితే, వ్యూస్ తగ్గితే ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఆయన నెలకు 60 నుంచి 70వేల రూపాయలు సంపాదిస్తున్నారు.
ఇప్పటి వరకు సంపాదించిన డబ్బులతో ఒకప్పుడు పూరి గుడిసె ఉన్న చోట ఆయన రెండతస్తుల ఇల్లు కట్టుకున్నారు. దీని కోసం ఆయన 2 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
తన పిల్లల చదువు కోసం ఆయన డబ్బు దాచి పెడుతున్నారు. సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారు. తన వీడియోలు ఎడిట్ చేయడానికి ఒక లాప్‌టాప్ కొన్నారు.
స్థానికంగా ఆయనొక సెలబ్రిటీ అయిపోయారు. గ్రామస్థులకు తరచూ చికెన్ వంటకాలతో మంచి విందులు ఇస్తుంటారు.
తన పిల్లలను సమీపంలోని నగరంలో ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చేర్పించడం ఇప్పుడు ఇసాక్ ముండా ముందున్న లక్ష్యం.
'వాళ్లకు వీలైనంత మంచిగా చదువు చెప్పించాలనుకుంటున్నాను. నాకున్న అరకొర చదువుతోనే నేను ఇంత చేయగలుగుతున్నానంటే.. వాళ్లు బాగా చదువుకుంటే ఇంకా చాలా ఎక్కువే చేయగలరు' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- ఒక్క రోజే 81 మందికి మరణ శిక్ష అమలు.. ఏడాది పొడవునా అమలు చేసిన వాటికంటే ఇదే ఎక్కువ
- తమిళనాడు: కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకుంటున్న 'చదివింపుల విందు'
- యుక్రెయిన్ సంక్షోభం: ఆకాశంలో ఆయుధాల గర్జన, మంటల్లో నగరాలు - ఇవీ యుద్ధ చిత్రాలు
- ‘సేవ్ ఖాజాగూడ రాక్స్’: ఈ బండ రాళ్లను ఎందుకు కాపాడాలి? వీటికోసం నిరసన దీక్షలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















