‘సేవ్ ఖాజాగూడ రాక్స్’: ఈ బండ రాళ్లను ఎందుకు కాపాడాలి? వీటికోసం నిరసన దీక్షలు ఎందుకు?

- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
సయీద్ ఇఫ్టేకర్ ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. చాలామంది తోటి ఉద్యోగుల లాగానే ఉరుకుల పరుగుల జీవితం. కానీ, సమయం దొరికినప్పుడల్లా ఖాజాగూడ రాక్స్‌కు చేరుకుంటారాయన. ''బoడ రాళ్లు కూడా తమకంటూ ఒక కథ ఉంది వినమని, తమ మీద కాసేపు అలా హాయిగా సేద తీరమని అంటాయి. అది నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది'' అన్నారు సయీద్.
''ఈ బండ రాళ్ల మీద నిల్చుంటే హైదరాబాద్ పరుగెడుతోంది, కానీ నేను విశ్రాంతి తీసుకుంటున్నా అన్న ఫీలింగ్ వస్తుంది'' అని ఆయన తన భావాలను వివరించారు.
హైదరాబాద్ లోని ఖాజాగూడ దగ్గర రాళ్ల అమరిక చూసిన వారందరికీ.. ఎవరో కళానైపుణ్యం ఉన్నవారు, ఈ బండ రాళ్లని అలా అందంగా తీర్చిదిద్దారేమో అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, @sanjayborra
అంత పెద్ద పెద్ద రాళ్లు ఇంత చిన్న రాళ్ళ సహాయంతో అలా కదలకుండా స్థిరంగా శతాబ్దాలుగా ఎలా నిలబడ్డాయో అని అనిపించక మానదు. ఇంది ఆ పెద్ద రాళ్ల గొప్పదనమా లేక చిన్నగా కనిపించే రాళ్లకు అంత బలముందా అని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇక్కడ చాలా రాళ్లు చిత్రమైన ఆకృతిలో కనిపిస్తుంటాయి.
''ఈ రాళ్లు ఒకరికి షూ లాగా కనిపిస్తే అదే మరొకరికి నాలుక లాగా కనిపిస్తుంది'' అంటారు సందర్శకులు.
ఆహ్లాదంగా ఉండే ఫక్రుద్దీన్ గుట్ట లేక ఖాజాగూడ రాక్స్ అని పిలుచుకునే ఈ ప్రాంతం నెమ్మదిగా మాములు రోడ్ లాగానే తయారవుతోందని, దీనిని కాపాడుకోవాలంటూ కొందరు నిరసనలు చేపట్టారు. అందుకే 'సేవ్ ఖాజాగూడ రాక్స్' ఆందోళన మొదలుపెట్టారు.

రాళ్లనెందుకు కాపాడాలి?
చెట్లు, నీటి వనరుల్లాగే రాళ్లు కూడా ప్రకృతిలో భాగం. లక్షల కోట్ల ఏళ్ల క్రితం భూమి పుట్టుక సమయంలో ఏర్పడిన రాళ్లు కూడా ఉంటాయి. భూమి ఖగోళ చరిత్రలకు సంబంధించిన అధ్యయనాలకు రాళ్లే కీలకం.
చాలా పశ్చిమదేశాల్లో అందమైన రాళ్లు ఉన్న చోట ప్రత్యేకమైన జియో పార్కులు ఏర్పాటు చేస్తారు. కర్నూలు పట్టణ శివార్లలలో కూడా ఇలాంటి రాక్ పార్క్ ఉంది. హైదరాబాద్ కూడా ఎన్నో అరుదైన రాతి నిర్మాణాలకు నిలయం అంటున్నారు నిపుణులు.
ప్రస్తుతం ఖాజాగూడ లో ఉన్న రాళ్లు సుమారు 2400 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవని సేవ్ ఖాజాగూడ రాక్స్ వారు చెబుతున్నారు. ''హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న రాళ్లు గ్రానైట్ రాళ్లు. అవి చూడటానికి ఎంతో అందంగా అమర్చినట్టుగా ఉంటాయి'' అని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వీరమణి తివారి బీబీసీతో అన్నారు.

''విదేశాలలో లాగానే ఇండియాలో కూడా ఇలాంటి ప్రాంతాలను జియో పార్కుల్లాగా తయారు చేయవచ్చనే ఆలోచన కూడా ఉంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జబల్పూర్‌లో అలాoటి ఒక ప్రదేశాన్ని గుర్తించారు'' అని తివారి వెల్లడించారు.
'' రాళ్లను మట్టిగా మార్చడానికి కొన్ని గంటలు పడతాయి. కానీ రాళ్లు ఏర్పడడానికి కొన్ని కోట్ల ఏళ్లు పడుతుంది. అందుకే సేవ్ రాక్స్ అంటున్నాం'' అని ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి సంగీత వర్మ అంటున్నారు. ''రాళ్లను కాపాడండి, ఎందుకంటే అవి తిరిగి మొలకెత్తలేవు'' అన్నది ఆ సంస్థ నినాదం.
ఈ గుట్టకి చాలా మంది సరదాగా పర్వతారోహణం చేయడానికి, వాకింగ్ కి, కొంత మంది కేవలం ప్రకృతిని ఆస్వాదించడానికి వస్తుంటారు. అయితే 10 ఏళ్ల క్రితం తాను వచ్చ్చినప్పటికీ ఇప్పటికి చాలా బండ రాళ్ళూ బుల్డోజర్ల దాడికి బలయిపోయాయని, ఇంకా అవుతునే ఉన్నాయని చెబుతున్నాడు సయీద్. తాను ఇక్కడకి వచ్చినప్పుడు తనలాంటి ఆలోచన ఉన్న వారు మరి కొంత మంది ఉన్నారు అని తెలుసుకొని సేవ్ ది రాక్స్ అనే సంస్థ తో చేతులు కలిపాడు.
ఈ రాళ్ళని పరిరక్షించాలి అని అనుకునే వారు ఎంతో మంది అధికారులని కలిసి వారికి వినతి పత్రాలు అందచేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేక పోవడంతో ఫిబ్రవరి 6న ఇక్కడ సుమారు 100 మంది కలిసి నిరసన కూడా చేపట్టారు.

ఫొటో సోర్స్, @GermanyChennai
హెచ్ఎండీఏ డబుల్ గేమ్ ఆడిందా?
ఒకప్పుడు ఈ స్థలాన్ని హెరిటేజ్ సైట్ అని గుర్తించిన హెచ్‌ఎండీఏ, తరువాత ఆ గుర్తింపు వెనక్కి తీసుకుంది. ఒకప్పుడు వారసత్వ స్థలంగా కనిపించిన ప్రదేశం, ఇప్పుడు ఎందుకు చెత్తగుట్టలా కనిపిస్తోందనేది సేవ్ రాక్స్ ప్రశ్న.
''సిటీ విస్తరణలో భాగంగా ఎన్నో రాళ్లను పగలగొట్టి రోడ్ల విస్తీర్ణానికి, బిల్డింగులకి ఆ స్థలాలను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని వారసత్వ కట్టడాలు ఎలా ఉంటాయో, అలాగే వారసత్వ ప్రాకృతిక ఆవరణలు కూడా ఉంటాయి. వాటిని పోగొట్టుకోవడం అంటే ఆధునీకరణ, అభివృద్ధి పేరుతో మనం మన మూలాలను తెగ నరుక్కున్నట్టే'' అని ఈ సంస్థ ప్రతినిధులు వాదిస్తున్నారు.

ఇది వరకు ప్రాకృతిక వారసత్వ సంపద అన్న హెచ్‌ఎండీఏ, హఠాత్తుగా దాన్ని ఎందుకు వెనక్కి తీసేసుకుంది అన్నది పెద్ద ప్రశ్న.
హెచ్ఎండీఎ ఈ ప్రాంతంలో నిర్మాణాలకు ప్రయత్నాలు చేస్తుండగా, ఆందోళనకారులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతానికి గుట్టకు ఎటువంటి హానీ కలిగించకుండా చూడాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా, బుల్డోజర్లతో రాళ్లు, మట్టి తెచ్చి వాటి చుట్టూ పోస్తూ, ఆ రాళ్లను పగలగొడుతూ తమ పని తాము చేసుకు పోతున్నారు కాంట్రాక్టర్లు. ఒకప్పుడు పెద్ద పెద్ద రాళ్లున్న ప్రాంతంలో ఇప్పుడు 80 అడుగుల ఎత్తు మట్టి పోసి, రోడ్డు కోసం చదును చేస్తున్నారు
ఈ గుట్టపై ఒకవైపు దర్గా ఉంటే, మరోవైపు పద్మనాభ స్వామి గుడి ఉంది. ప్రశాంతత కోసం చాలామంది ఇక్కడికి వస్తుంటారు. అయితే, దర్గాను, గుడిని మరింత విస్తరించాలన్న పేరుతో గుట్టను తవ్వి రోడ్డు పనులు చేస్తున్నారని సేవ్ రాక్స్ ప్రతినిధులు ఆరోపించారు.

ప్రభుత్వం ఏమంటోంది?
గతంలో కూడా ఇలాంటి 26 వారసత్వ ఆవరణాలను కాపాడుకోవాలని చెప్పిన అధికారులు, ప్రభుత్వమే ఇప్పుడు వీటిని పట్టించుకోవడం లేదన్నది 'సేవ్ ఖాజాగూడ రాక్స్' వారి వాదన. ప్రభుత్వమే స్వయంగా ఈ గుట్టను చెడగొట్టే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు. ఇదే విషయంపై హెచ్‌ఎండీఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నం చేసినా, ఆయన స్పందించ లేదు.
ఖాజాగూడ రాక్స్ వ్యవహారం వివాదం కావడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. విషయం ఏంటో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తీసుకుని అక్కడ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఖాజాగూడ గుట్టలకు సరిహద్దులను గుర్తించడంతోపాటు, అక్కడ ఇప్పటి వరకు పోసిన మట్టికుప్పలను తొలగించాలని సేవ్ ఖాజాగూడ రాక్స్ ప్రతినిధులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: రూ. 2.56 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్, కేటాయింపులు ఇలా...
- భావన మేనన్: లైంగిక దాడికి గురైన అయిదేళ్లకు గొంతు విప్పిన నటి, ఆమె ఏం చెప్పారంటే...
- మాచ్‌ఖండ్ విద్యుత్ ప్లాంట్ ఎప్పుడు ఎలా మొదలైంది
- యుక్రెయిన్ సైన్యంలో చేరి రష్యాతో పోరాడుతున్న తమిళనాడు విద్యార్థి
- తెలంగాణ: 80,039 ఉద్యోగాల భర్తీకి నేడే నోటిఫికేషన్ - కేసీఆర్
- భారత్‌లో పెటర్నిటీ లీవ్ తీసుకునేవారు పెరుగుతున్నారా? పిల్లల పెంపకంలో తండ్రుల పాత్రను ప్రభుత్వాలు గుర్తిస్తున్నట్లేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











