యుక్రెయిన్‌ సైన్యంలో చేరి రష్యాతో పోరాడుతున్న తమిళనాడు విద్యార్థి

సాయి నికేష్

ఫొటో సోర్స్, Sai Nikesh

ఫొటో క్యాప్షన్, సాయి నికేష్

ఇంజనీరింగ్ చదవటానికి యుక్రెయిన్ వెళ్లిన ఓ తమిళనాడు విద్యార్థి.. యుక్రెయిన్ పారామిలటరీ బలగాల్లో చేరి రష్యాతో యుద్ధం చేస్తున్నాడు.

సాయి నికేష్ స్వస్థలం కోయంబత్తూరు జిల్లాలోని తుడియలూర్‌. 2018లో పాఠశాల విద్య పూర్తిచేసిన నికేష్.. భారత సైన్యంలో చేరటానికి రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు.

ఆ తర్వాత అమెరికా సైన్యంలో చేరటం గురించి వాకబు చేశాడు. అది కూడా ఫలించలేదు. దీంతో యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్‌లో నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నాడు.

ఇప్పుడు యుక్రెయిన్‌ మీద రష్యా దాడిచేయటంతో యుద్ధం మొదలుకాగానే భారత విద్యార్థులు ఖార్కియెవ్ వీడి స్వదేశానికి వచ్చేస్తున్నారు. కానీ సాయి నికేష్ అక్కడే ఉండిపోయాడు. ఇంటికి వచ్చేయాలని అతడి కుటుంబం, స్నేహితులు కోరినా అతడు ససేమిరా అంటున్నాడు.

వరుసలో కుడివైపు సాయి నికేష్

ఫొటో సోర్స్, Sai Nikesh/fb

ఫొటో క్యాప్షన్, వరుసలో కుడివైపు సాయి నికేష్

ఈ విషయంపై తాము మీడియాతో మాట్లాడగలిగే మానసిక స్థితిలో లేమని అతడి కుటుంబం చెప్పింది. సాయి నికేష్ బంధువు ఒకరు తన పేరు వెల్లడించరాదన్న షరతుతో బీబీసీతో మాట్లాడారు.

''సైన్యంలో చేరాలన్నది సాయి నికేష్‌కి ఎప్పటి నుంచో ఉన్న కల. కానీ ఇండియాలో అతడి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అతడి తల్లిదండ్రులు సాయి నికేష్‌ను ఇంజనీరింగ్ చదువు కోసం యుక్రెయిన్ పంపించారు. కానీ ఆర్మీలో చేరాలన్న అతడి కోరిక అలాగే మిగిలిపోయింది.తాను ఒక గేమింగ్ కంపెనీలో చేరినట్లు సాయి నికేష్ తన తల్లిదండ్రులతో చెప్పాడు. కానీ సైన్యంలో చేరాలన్న అతడి కోరిక ఇంకా ఇంత బలంగా ఉందని ఎవరికీ తెలియలేదు'' అని వివరించారు.

అతడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ తెలీదని, పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా మాత్రమే అతడి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసిందని చెప్పారు.

''ఆ తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి, రక్షణ మంత్రిత్వశాఖ నుంచి అధికారులు అతడి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను విచారించారు'' అని ఆ బంధువు తెలిపారు.

సాయి నికేష్ కుటుంబం చాలా ఒత్తిడిలో ఉందని, మీడియాతో మాట్లాడటానికి సుముఖంగా లేదని చెప్పారు.

''అతడిని ఊరకే కాంటాక్ట్ చేయొద్దని ఆ కుటుంబానికి నేను చెప్పాను. ఈ పరిస్థితిలో అతడిని అక్కడి నుంచి ఎలా బయటకు తేవాలో మాకెవరికీ తెలీదు'' అన్నారు.

''మీడియాలో ఈ వార్త ప్రచురితమయ్యాక, మేం అతడిని కాంటాక్ట్ చేయలేకపోయాం. దేని గురించీ భయపడొద్దని, ఎలాంటి పరిస్థితినైనా మనం చూసుకోవచ్చునని భరోసా చెప్తూ వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పంపించాను. సాయి నికేష్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మాత్రమే ఇప్పుడు మేం కోరుకుంటున్నాం'' అని ఆ బంధువు తెలిపారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధం: ‘నా పులుల్ని వదిలేసి భారత్‌కు రాలేను’ అంటున్న తెలుగు డాక్టర్

పోలీస్ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగాన్ని బీబీసీ సంప్రదించగా.. మీడియాలో ప్రచురితమైన సమాచారం కన్నా తమ దగ్గర అదనపు సమాచారం ఏమీ లేదని వారు చెప్పారు.

''అయితే ఆ విద్యార్థి తన సొంత ఇష్టంతోనే అక్కడ పారామిలటరీలో చేరినట్లు కనిపిస్తోంది. అతడిని మేం కాంటాక్ట్ చేయలేకపోయాం. కాబట్టి అక్కడ పరిస్థితి ఏమిటో మాకు తెలీదు. మేం మరింత సమాచారం సేకరిస్తున్నాం'' అని ఒక అధికారి తెలిపారు.

''యుక్రెయిన్ సైన్యంతో కలిసి పోరాడాలని ఆ దేశాధ్యక్షుడు జెలియెన్‌స్కీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో వివిధ నగరాల్లో ప్రజలకు యుద్ధం చేయటానికి ఆయుధాలు ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా కూడా ఇలాగే చేసింది'' అని మాజీ సైనికాధికారి కల్నల్ ఆర్ హరిహరన్ బీబీసీతో చెప్పారు.

''ఇది తప్పా, ఒప్పా అని మనం చర్చించలేం. యుద్ధం అనేదే తప్పు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

జెలియెన్‌స్కీ యూరప్ దేశాల సాయం కోరారని, ఆ దేశాలు యుక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేశాయని కల్నల్ హరిహరన్ ఉటంకించారు.

''ఆ విద్యార్థి జార్జియాకు చెందిన ఒక వలంటీర్ బృందంలో చేరాడు. సైన్యంలో చేరాలనే కోరిక అతడికి ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి దీనిని కేవలం అతడి వ్యక్తిగత నిర్ణయంగా మాత్రమే చూడొచ్చు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)