యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీబీసీ న్యూస్
- హోదా, ముండో
ఎనిమిదేళ్లుగా రష్యా, యుక్రెయిన్‌లు ఘర్షణ పడుతూ, ఆ రెండు దేశాల ప్రజలనే కాకుండా అంతర్జాతీయ సమాజాన్ని కూడా భయాందోళనలకు గురి చేశాయి.
చాలా ప్రపంచ దేశాల మాదిరిగానే ఈ రెండు ఇరుపొరుగు దేశాల మధ్య సాంస్కృతిక బంధం ఉంది. ఇది వారిని ఎంతగా కలుపుతుందో అంతగా విడదీస్తుంది కూడా.
ఈ రెండు దేశాల మధ్య బంధం ఈనాటిది కాదు. 9వ శతాబ్దం నుంచి వీరి మధ్య సంబంధాలున్నాయి. ప్రస్తుత యుక్రేనియన్ రాజధాని కీయెవ్‌ను మొదటి స్లావిక్ రాష్ట్రంగా స్కాండినేవియాకు చెందిన ‘రస్’ అని పిలిచే గ్రూప్ ఏర్పాటు చేసింది.
కీయెవిన్ రస్ అనే మధ్యయుగ రాజ్యం యుక్రెయిన్, రష్యాలకు మూలం. రష్యా ప్రస్తుత రాజధాని మాస్కో 12వ శతాబ్దంలో ఏర్పడింది.
988లో కీయెవ్‌కు చెందిన వ్లాదిమిర్- I లేదా సెయింట్ వ్లాదిమిర్ స్వ్యాతోస్లావిచ్ దిగ్రేట్ ప్రస్తుత రష్యా, యుక్రెయిన్, బెలారుస్ నుంచి బాల్టిక్ సముద్రం వరకు రష్యా రాజ్యాన్ని ఏకీకృతం చేశారు.
తూర్పు స్లావిక్ భాషా మాండలికాల నుంచి యుక్రెనియన్, బెలారసియన్, రష్యన్ భాషలు అభివృద్ధి చెందాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అనుబంధం గురించే ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. '' రష్యన్లు, యుక్రేనియన్‌లు ఒకే ప్రజలు, ఒకే మతం'' అని ఆయన పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య అనుబంధం నిజమే అయినప్పటికీ, గత తొమ్మిది శతాబ్దాలలో యుక్రేనియన్ల అనుభవం భిన్నంగా ఉంది. ఎందుకంటే వారి విధిని.. దేశాన్ని విభజించిన అనేక శక్తులు నిర్దేశించాయి.
''ఈ రెండు దేశాల మధ్య సమగ్రమైన బంధం అనడం కంటే ఒక షిఫ్టింగ్ పజిల్‌లాగా చూడటం ముఖ్యం'' అని యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో యుక్రేనియన్ స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్. ఆండ్రూ విల్సన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పజిల్
13వ శతాబ్దం మధ్యకాలంలో, రస్ రాజ్యాల సమాఖ్యను మంగోల్ సామ్రాజ్యం జయించింది. 14వ శతాబ్దం చివరలో, మంగోల్ శక్తి క్షీణతను సద్వినియోగం చేసుకొని, మాస్కో గ్రాండ్ ప్రిన్సిపాలిటీ, లిథువేనియా గ్రాండ్ డచీ (తరువాత పోలాండ్‌లో చేరింది)అనేవి రష్యా నుంచి విడిపోయాయి.
కీయెవ్, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలు పోలిష్-లిథువేనియన్ కామన్‌వెల్త్ పాలనలో ఉన్నాయి. అప్పట్లో పునరుజ్జీవం, సంస్కరణ భావాలకు ఇక్కడి ప్రజలు ప్రభావితమయ్యారు.
ఇక పశ్చిమ యుక్రెయిన్‌లోని గలీసియా లేదా కార్పాతియన్ గలీసియా ప్రాంతం హబ్స్‌బర్గ్ సామ్రాజ్యంలో భాగంగా చాలాకాలం కొనసాగింది. దాని సాంస్కృతిక ముద్రలు ఇప్పటికీ కనిపిస్తాయి.
యుక్రెయిన్ పశ్చిమ భాగం, రష్యా, దాని ప్రభావంపై ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన జాఫరీ హోస్కింగ్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. బీబీసీ హిస్టరీ ఎక్స్‌ట్రాతో మాట్లాడుతూ ''ఇది తూర్పు ప్రాంతం నుంచి భిన్నమైన చరిత్రను కలిగి ఉంది''అని అన్నారు.
యుక్రెయిన్‌లో పశ్చిమభాగంలో ఎక్కువమంది యునియేట్ చర్చ్ లేదా తూర్పు క్యాథలిక్ చర్చ్‌లకు చెందిన వారు. ఈ విభాగం పోప్‌ను తమ మతాధిపతిగా గుర్తిస్తుంది.
నేటి యుక్రెయిన్‌లో చాలా భిన్నమైన గతం ఉన్న మరొక భాగం క్రైమియా. దీనికి గ్రీకు, టాటర్ రాజ్యాలతో పాటు, ఓటోమన్, రష్యాల పాలనలో కూడా ఉంది.

రెండు తీరాలు
17వ శతాబ్దంలో, పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్, రష్యా జార్‌డమ్ (జార్ చక్రవర్తుల అధికారం) మధ్య జరిగిన యుద్ధం ద్నైపర్ నదికి తూర్పున ఉన్న భూభాగాలను ఇంపీరియల్ రష్యా నియంత్రణలోకి తెచ్చింది. ఆ ప్రాంతాన్ని "లెఫ్ట్ బ్యాంక్" యుక్రెయిన్ అని పిలిచేవారు .
అదే శతాబ్దంలో, ప్రస్తుత యుక్రెయిన్‌లోని మధ్య, వాయువ్య ప్రాంతాలలో యుక్రేనియన్ కోసాక్ రాష్ట్రం ఉండేది. అయితే 1764లో రష్యన్ రాణి కేథరీన్ ది గ్రేట్ దానిని అంతం చేసి, పోలాండ్ ఆధినంలో ఉన్న యుక్రేనియన్ భూభాగాలను స్వాధీనం చేసుకున్నారు.
తరువాతి సంవత్సరాలలో, రూసిఫికేషన్ అని పిలిచే ఒక విధానం యుక్రేనియన్ భాష వినియోగాన్ని, అధ్యయనాన్ని నిషేధించింది. అక్కడి ప్రజలను రష్యన్ ఆర్థడాక్స్‌లోకి మారాల్సిందిగా ఒత్తిడి చేసింది.
అయితే, పశ్చిమ ప్రాంతంలోని ప్రజలకు జాతీయాభిమానం పెరిగింది. చాలామంది ప్రజలు తమను తాము యుక్రేనియన్లుగా పిలుచుకోవడం ప్రారంభించారు.
కానీ, 20వ శతాబ్దంలో రష్యన్ విప్లవం పుట్టింది, సోవియట్ యూనియన్ ఏర్పడింది. ఇది యుక్రేనియన్ పజిల్‌ను పునర్వ్యవస్థీకరించింది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యన్ సామ్రాజ్యంలోకి...
రెండవ ప్రపంచ యుద్ధం చివర్లో పశ్చిమ యుక్రెయిన్‌ను పోలాండ్ నుండి సోవియట్ రష్యా నాయకుడు జోసెఫ్ స్టాలిన్ స్వాధీనం చేసుకున్నారు. 1950లలో క్రైమియాను యుక్రేనియన్ రిపబ్లిక్‌కు మాస్కో స్వయంగా బదిలీ చేసింది. అయితే, అప్పటికి ఆ ప్రాంతం రష్యాతో బలమైన సంబంధాలను కొనసాగిస్తోంది.
ఇక సోవియట్ యూనియన్ ప్రభుత్వం యుక్రెయిన్‌ను మునుపెన్నడూ లేనంతగా కట్టడి చేసింది. చాలాసార్లు భారీగా మూల్యం చెల్లించుకుంది. 1930లలో అప్పటికే యుఎస్ఎస్ఆర్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్) భాగమైన లక్షలాది మంది యుక్రేనియన్లను సామూహిక వ్యవసాయంలో చేరాలని జోసెఫ్ స్టాలిన్ బలవంతం చేశారు. ఈ క్రమంలో ఏర్పడిన క్షామం కారణంగా లక్షలమంది మరణించారు.
తూర్పు ప్రాంతాన్ని రష్యా మయం చేయడానికి స్టాలిన్ అనేకమంది పౌరులను ఇక్కడికి దిగుమతి చేశారు. వీరిలో చాలామందికి యుక్రేనియన్ భాష తెలియదు. కేవలం ఇక్కడ రష్యన్ జనాభాను పెంచడమే లక్ష్యంగా స్టాలిన్ ఈ పని చేశారు.
అయినప్పటికీ, సోవియట్ మాస్కో ఎప్పుడూ యుక్రెయిన్‌పై సాంస్కృతికంగా ఆధిపత్యం సాధించలేకపోయింది. ఆర్థిక,రాజకీయ, సైనిక నిర్ణయాలు కేంద్రం నుండి వచ్చేవని హోస్కింగ్ వివరించారు. ''సంస్కృతి, విద్యలో యుక్రెయిన్ ఒక నిర్దిష్ట స్వయంప్రతిపత్తిని కలిగి ఉంది" అని హోస్కింగ్ అన్నారు.
రష్యన్ భాష ఆధిపత్య భాష అయినప్పటికీ, ప్రాథమిక పాఠశాలలో పిల్లలు యుక్రేనియన్ నేర్చుకున్నారు. అనేక పుస్తకాలు ఈ భాషతో వెలువడ్డాయి. 20వ శతాబ్దం రెండవ భాగంలో యుక్రేనియన్ భాష చదివినవారు సోవియట్ యూనియన్‌లో బలమైన యుక్రేనియన్ జాతీయవాద ఉద్యమాన్ని ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
లోతైన లోపాలు
1991లో సోవియట్ యూనియన్ కూలిపోయింది. 1997లో రష్యా, యుక్రెయిన్ మధ్య ఒప్పందం యుక్రెయిన్ సరిహద్దుల సమగ్రతను నిర్ధరించింది. కానీ, దేశంలోని వివిధ ప్రాంతాలలోని విభిన్న వారసత్వాలు తరచుగా అగాధాల్లా కనిపించే లోపాలను మిగిల్చాయి. ద్నైపర్ నదికి రెండువైపులా ఈ వ్యత్యాసాలు ఉన్నాయి.
తూర్ప ప్రాంతానికి మాస్కోతో సంబంధాలు బలంగా ఉన్నాయి. దాని జనాభా ఆర్ధడాక్స్ మతాన్ని అవలంబిస్తూ రష్యన్ భాష మాట్లాడటానికి మొగ్గు చూపేవారు.
పశ్చిమ ప్రాంతం ఎక్కువ కాలం పోలాండ్, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం వంటి ఐరోపా శక్తుల పాలనలో శతాబ్దాలుగా కొనసాగడం వల్ల కాథలిక్ మతాన్ని అవలంబిస్తారు. వారికి సొంత భాష కూడ ఉంది.
ఇక్కడ ప్రతి ఒక్కరికి సొంత కల ఉంది: కొందరు తమ మాతృభూమిగా భావించే ప్రాంతంలో తిరిగి కలవాలని కోరుకుంటారు; మరికొందరు మాత్రం స్వతంత్రంగా ఉండాలని భావిస్తారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- పాశ్యాత్య దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా ఇబ్బందులు పడుతుందా? వాటి ప్రభావం ఎంత?
- ‘యుక్రెయిన్‌కు చిక్కిన నా కొడుకును విడిపించమని ఎవరిని అడగాలి’ - రష్యా సైనికుడి తల్లి
- యుక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు: కొందరు రాత్రంతా నడిచి బోర్డర్ చేరుకున్నారు, మిగతావారు ఏమయ్యారు
- పుతిన్ న్యూక్లియర్ బటన్ నొక్కుతారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















