వ్లాదిమిర్ పుతిన్: యుక్రెయిన్‌తో ఆగుతారా లేక NATO దేశాలపైనా దండయాత్ర చేస్తారా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, స్టీవ్ రోజెన్‌బర్గ్
- హోదా, బీబీసీ న్యూస్
‘‘ప్రేక్షకులను వీలైనంతమేర గందరగోళానికి గురిచేయాలి. ఒకవైపు ఉత్కంఠ మరోవైపు గందరగోళంతో వారిని ఉక్కిరిబిక్కిరి చేయాలి’’అని బ్రిటిష్ ప్రముఖ సినీ దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకసారి చెప్పారు.
హిచ్‌కాక్ సినిమాలను పుతిన్ ఎక్కువగా చూస్తారు కావొచ్చు. యుక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందా? ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఐరోపాలో విస్తరించిన రక్షణ కూటమి నాటోకి తూట్లు పొడుస్తుందా? అని నెలల పాటు ప్రపంచ దేశాలను ఆయన ఆందోళనకు గురిచేశారు.
తూర్పు యుక్రెయిన్‌లో రెండు భాగాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించడం ద్వారా చాలా మందిని ఆయన ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు? అని ఆందోళన కలిగించారు. చివరగా తూర్పు యుక్రెయిన్‌కు బలగాలను పంపి దాడి చేస్తున్నట్లు స్పష్టంచేశారు.
ప్రజల్లో ఉత్కంఠను రేపడం అంటే పుతిన్‌కు చాలా ఇష్టమని ‘‘పుతిన్స్ రష్’’ పుస్తకాన్ని రాసిన లిలియా షెవెట్సోవా వ్యాఖ్యానించారు.
‘‘నిప్పు పెట్టేది ఆయనే. దాన్ని చల్లార్చేదీ ఆయనే. ఈ చర్యలతో ఆయన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆయన తన లాజిక్‌ను ఉపయోగిస్తే, పూర్తి దాడికి దిగరు. అయితే, ఆయన ముందు చాలా మార్గాలున్నాయి. సైబర్ దాడులను చేపట్టొచ్చు. యుక్రెయిన్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టొచ్చు. లేదా డొనెట్స్‌క్ లేదా లుహాన్సెక్‌లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఆయన పిల్లితో ఓ ఎలకలా ఆడుకోవచ్చు’’అని లిలియా అన్నారు.
ఈ పరిస్థితిని ఎంతవరకు రష్యా తీసుకెళ్తుందో కనిపెట్టడం చాలా కష్టం. పుతిన్ బుర్రలో ఏముందో తెలుసుకోవడమూ అంతే.

ఫొటో సోర్స్, EPA
పుతిన్ ప్రణాళికలు..
పుతిన్ వ్యాఖ్యలు, ప్రసంగాలను గమనిస్తే, ఆయన ఏం అనుకుంటున్నారో కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తీరుపై నిస్సందేహంగా ఆయన కోపంగా ఉన్నట్లు వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రచ్ఛన్న యుద్ధం ముగింపుతో సోవియట్ యూనియన్ పతనమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా తూర్పు యూరప్‌కూ నాటో విస్తరించడంపై పుతిన్ ఆగ్రహం మరింత ఎక్కువైంది.
ప్రస్తుతం ఏదేమైనా యుక్రెయిన్‌ను తమ బాటలోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్నట్లు పుతిన్ కనిపిస్తున్నారు. దీని కోసం ఆయన తన శక్తినంతా ధారపోస్తున్నారు.
‘‘రష్యా అధ్యక్షుడిగా కంటే ఆయన ఒక మతపెద్దలా వ్యవహరిస్తున్నారు. చరిత్రలో తన కంటూ ఒక స్థానం కోసం ఆయన తన పాత కాలం పద్ధతులనే నమ్ముకుంటున్నట్లు కనిపిస్తోంది. అన్ని పనులూ ఆయన ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నారు. మొదట వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా గుర్తిస్తున్నారు. ఆ తర్వాత అక్కడకు సైన్యాన్ని పంపిస్తున్నారు. తర్వాత ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు. చివరగా స్థానిక మిలిటరీ ఆపరేషన్‌తో తన సరిహద్దులను విస్తరిస్తారు. 2014లో ఆయన ఇదే చేశారు’’అని లండన్ యూనివర్సీ కాలేజీలో సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ వ్లాదిమిర్ పస్తుఖోవ్ వివరించారు.
‘‘ఆటను తను అనుకున్నట్లుగా ఆడటానికి ఆయనకు ఏ అడ్డూఅదుపు లేకపోతే, ఆయన ఎంతవరకైనా వెళ్తారు. ఆయన చిన్న మంటపై మాంసం వండినట్లుగా పనులు చేసుకుంటూ వెళ్తారు. కొత్త ఆంక్షలతో పరిస్థితులు అదుపులోకి వస్తాయని పశ్చిమ దేశాల నాయకులు ఆశిస్తున్నారు. కానీ, పుతిన్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు’’అని పస్తుఖోవ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
రష్యా ఏమంటోంది?
‘‘పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు అన్యాయమైనవి. ఏళ్ల నుంచీ మేం ఇలాంటి ఆంక్షలను ఎదుర్కొంటున్నాం. సమయం దొరికిన ప్రతిసారీ పశ్చిమ దేశాలు ఆంక్షల పేరుతో మా అభివృద్ధి అట్టుకుంటున్నాయి. వారు ఆంక్షలు విధిస్తారు. మేం ఏం చేసినా చేయకపోయినా.. ఆ ఆంక్షలు తప్పవు’’అని రష్యా విదేశాంగ శాఖ అధాకార ప్రతినిధి మరియా జఖరోవా బీబీసీతో చెప్పారు.
తమ గురించి పశ్చిమ దేశాలు ఏమనుకుంటున్నాయో తాము ఎప్పుడూ పట్టించుకోమని ఆమె వివరించారు. రష్యాను దురాక్రమణకు తెగబడే దేశంగా పశ్చిమ దేశాలు పరిగణించడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘పశ్చిమ దేశాల సంగతేంటి? వారి చరిత్ర కూడా రక్తంతోనే తడిసింది’’అని ఆమె అన్నారు.
ఐరోపా యూనియన్ ఆంక్షలు విధించిన వ్యక్తుల జాబితాలో మరియా కూడా ఒకరు.
హిచ్‌కాక్ సినిమాలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచొచ్చు. కానీ యుక్రెయిన్‌పై పుతిన్ చర్యలు రష్యాన్లలో ఆందోళన కలిగిస్తున్నాయి.
రష్యా ప్రజలు ఏం అంటున్నారు?
రష్యాలో చాలామంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకూడదని అనుకుంటున్నారని ప్రజాభిప్రాయాలు సేకరించే లెవాడా పబ్లిక్ ఒపీనియన్ ఏజెన్సీకి చెందిన డేనిస్ వోల్కోవ్ చెప్పారు. ‘‘యుద్ధం గురించి వారు భయపడుతున్నారు. యుద్ధం వస్తుందని సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది అభిప్రాయం వ్యక్తంచేశారు. దీనికి సంబంధిచిన వార్తలు వారు వినాలని అనుకోవడం లేదు.’’
కొంతమంది రష్యన్లు బహిరంగంగానే ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. బాధ్యతారాహిత్యమైన, అనైతిక యుద్ధాన్ని నిలిపివేయాలని కొందరు ప్రముఖ మేధావులు ప్రభుత్వానికి ఓ పిటిషన్ కూడా పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
అలా పిటిషన్‌పై సంతకం చేసినవారిలో ప్రొఫెసర్ ఆండ్రేయి జుబోవ్ ఒకరు. రష్యా ప్రభుత్వాన్ని లేదా పార్లమెంటును ప్రజలు అడ్డుకోలేకపోతున్నారని ఆయన వివరించారు. ‘‘కానీ, నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ఆ పిటిషన్‌పై నేను సంతకం పెట్టాను’’అని జుబోవ్ వివరించారు. ‘‘అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలను ఉల్లంఘిస్తున్న కొందరు రష్యా మేధావుల నుంచి మేం దూరం పాటిస్తున్నాం.’’
అయితే, యుక్రెయిన్ మళ్లీ రష్యా గూటికి తప్పకుండా చేరుతుందని మాజీ సోవియట్ యూనియన్ కమాండర్ అలెక్సీ అభిప్రాయపడ్డారు. ‘‘యుక్రెయిన్ మాత్రమే కాదు. పోలండ్, బల్గేరియా, హంగరీ కూడా తిరిగి వస్తాయి. ఇవన్నీ ఒకప్పుడు మావే’’’అని ఆయన అన్నారు. 1990లనాటి ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుతూ.. నేడు రష్యా తన కాళ్లపై తాను నిలబడగలదని వివరించారు.
‘‘పిల్లలకు జబ్బు చేసినప్పుడు వారిలో వ్యాధితో పోరాడే శక్తి పెరుగుతుంది. అలానే 1990ల్లో రష్యాకు జబ్బు చేసింది. అయితే, ఆ జబ్బు రష్యాను మరింత దృఢంగా చేసింది. మేం నాటోకు దూరంగా ఉండాలని డిమాండ్ చేయాల్సిన పనిలేదు. నాటో తనకు తానుగానే తప్పుకుంటుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- తిరుపతి పుట్టిన రోజు: ఈ నగరానికి రామానుజాచార్యులు శిలాఫలకం వేశారా, దీనిపై ఇంత చర్చ ఎందుకు
- పుష్ప: తగ్గేదే లే.. అంటూ బాలీవుడ్‌కు పోటీ ఇస్తున్న దక్షిణాది సినిమా
- రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు
- యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ఖాన్ రష్యా ఎందుకు వెళ్లారు, భారత్‌పై చూపే ప్రభావమేమిటి?
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













