యుక్రెయిన్ సంక్షోభం: ‘రష్యా నుంచి వెంటనే వచ్చేయండి’.. పౌరులకు యుక్రెయిన్ హెచ్చరిక

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ తమ దేశ ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేసింది.
'ఎవరూ రష్యాకు వెళ్లకండి. ఇదివరకే అక్కడికి వెళ్లిన వాళ్లు వెంటనే వచ్చేయండి' అని తమ దేశ పౌరులకు సూచించింది యుక్రెయిన్.
రష్యా పర్యటనలకు దూరంగా ఉండాలని యుక్రెయిన్ తమ దేశ ప్రజలను కోరింది. 'యుక్రెయిన్ మీద రష్యా దురాక్రమణ తీవ్రమయితే, రష్యాలో ఉన్న యుక్రెయిన్ ప్రజలకు తాము సాయం చేయలేం' అని పేర్కొంది.
రష్యాలో ఉన్న లక్షలాది మంది యుక్రెయిన్లపై ఇది ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిజాయితీగా జరిగే చర్చలకు మేం సిద్ధం-పుతిన్
యుక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలతో దౌత్యపరమైన పరిష్కారాలు చేసుకోడానికి రష్యా ఇప్పటికీ సిద్ధంగానే ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
అయితే, రష్యా ప్రయోజనాలు, తమ పౌరుల భద్రతపై రాజీ పడేది లేదని ఆయన చెప్పారు.
రష్యా డిఫెండర్ ఆఫ్ ది ఫాదర్‌లాండ్ డే సందర్భంగా వీడియో ప్రసంగంలో 'నిజాయితీగా జరిగే చర్చ'లకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు.
రష్యా సైనిక దళాల యుద్ధ సన్నద్ధతను కూడా ఆయన ప్రశంసించారు. దేశ ప్రయోజనాల కోసం వారు నిలబడతారని తనకు కచ్చితంగా తెలుసన్నారు.
రష్యా సైనిక బలగాలు ఇంకా యుక్రెయిన్ సరిహద్దుల సమీపంలోనే ఉన్నాయి. పశ్చిమ రష్యాలో కొత్తగా దళాలను మోహరించినట్లు గత 24 గంటలుగా తీసిన ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్ మీద మరో 24 గంటల్లో రష్యా పూర్తి స్థాయి దాడి చేయొచ్చు-ఆస్ట్రేలియా ప్రధాని
యుక్రెయిన్ మీద ఇప్పటికే దురాక్రమణ ప్రారంభమైందన్న అమెరికా మాటలనే ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పునరుద్ఘాటించారు.
"యుక్రెయిన్ మీద పూర్తి స్థాయి దాడికి రష్యా సిద్ధంగా ఉంది. అది మరో 24 గంటల్లోనే జరిగే అవకాశం ఉంది. షెల్లింగ్ లాంటివి జరుగుతున్నట్లు వస్తున్న రిపోర్టులు, దురాక్రమణ ఇప్పటికే మొదలైందని చెబుతున్నాయి" అని ఆయన చెప్పారు.
తమ దారిలోనే వెళ్లాలనుకునే నిరంకుశ దేశాలను అడ్డుకోడానికి ప్రజాస్వామ్య దేశాలన్నీ కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
బ్యాంకులు, రవాణా, ఇంధనంపై ఆస్ట్రేలియా ఆంక్షలు
బ్యాంకులు, రవాణా, చమురు, సహజ వాయువు, టెలీ కమ్యూనికేషన్ లక్ష్యంగా రష్యాపై ఆస్ట్రేలియా వివిధ ఆంక్షలు విధించింది.
"రష్యా తన పొరుగు దేశంపై దండెత్తడాన్ని వ్యతిరేకించే మా మిగతా భాగస్వాములందరితో కలిసి మేం రష్యాను ఎదిరించి నిలబడతాం" అని స్కాట్ మోరిసన్ ఆస్ట్రేలియాలో మీడియాతో అన్నారు.
యుక్రెయిన్ నుంచి ఆస్ట్రేలియా రావాలనుకుంటున్న వారి వీసా దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ప్రధాని స్కాట్ మోరిసన్ ఇమిగ్రేషన్ శాఖను ఆదేశించారు.
ప్రస్తుతం విద్యార్థుల వీసాలు, ఫ్యామిలీ వీసాలన్నీ కలిపి తమ దగ్గర దాదాపు 430 దరఖాస్తులున్నట్లు ఆయన చెప్పారు.
ఆస్ట్రేలియాలో యుక్రెయిన్ సంతతికి చెందిన 38 వేల మంది నివసిస్తున్నారు. ప్రస్తుతం యుక్రెయిన్‌లో 1400 మంది ఆస్ట్రేలియా పౌరులు ఉన్నట్టు తెలుస్తోందని మోరిసన్ చెప్పారు.

ఫొటో సోర్స్, SATELLITE IMAGE 2022 MAXAR TECHNOLOGIES via EPA
ఉపగ్రహ ఫొటోలు విడుదల చేసిన మాక్సర్ టెక్నాలజీస్
పశ్చిమ రష్యాలో కొత్తగా సైనిక బలగాలను, పరికరాలను మోహరించినట్లు అమెరికా స్పేస్ టెక్నాలజీ కంపెనీ మాక్సర్ టెక్నాలజీస్ చాలా ఉపగ్రహ ఫొటోలను విడుదల చేసింది.
ఈ ఫొటోల్లో యుక్రెయిన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న దక్షిణ బెలారస్‌లో వందకు పైగా వాహనాలు కూడా కనిపిస్తున్నాయని ఆ సంస్థ చెప్పింది.

ఫొటో సోర్స్, SATELLITE IMAGE 2022 MAXAR TECHNOLOGIES via EPA
రష్యా, బెలారస్ ఇటీవల బెలారస్ భూభాగంలో భారీ సైనిక విన్యాసాలు చేశాయి. మాక్సర్ ఫొటోలపై ఈ రెండు దేశాలూ ఇంకా స్పందించలేదు.
రష్యాపై తాజాగా ఆంక్షలు విధించిన జపాన్
యుక్రెయిన్‌లో రష్యా చర్యలకు వ్యతిరేకంగా ఆ దేశంపై జపాన్ కూడా పలు ఆంక్షలు విధించింది.జపాన్‌లో రష్యా బాండ్ల జారీని నిషేధిస్తున్నామని, కొంతమంది రష్యా పౌరుల విసాలను నిషేధించి, వారి ఆస్తులు ఫ్రీజ్ చేస్తామని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా చెప్పారు.
"తూర్పు యుక్రెయిన్‌లోకి వెళ్లాలని తమ సైన్యాన్ని ఆదేశిస్తూ రష్యా తీసుకున్న నిర్ణయం యుక్రెయిన్ సౌర్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే" అని కిషిదా అన్నారు.
పరిస్థితి మరింత తీవ్రమైతే అదనపు ఆంక్షలు విధించడానికి కూడా జపాన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ సంక్షోభానికి కారణం చెప్పిన భారత విదేశాంగ మంత్రి జయశంకర్
యుక్రెయిన్ సంక్షోభానికి అసలు కారణం ఏంటో భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ చెప్పారు.
"యుక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులకు మూలాలు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అనంతర రాజకీయాలు, నాటో విస్తరణతో పాటూ రష్యా, యూరప్ మధ్య సంబంధాల్లో కూడా ఉన్నాయని" ప్యారిస్‌లో జరిగిన ఒక థింక్‌టాంక్ కార్యక్రమలో పాల్గొన్న ఆయన చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌లో వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న రెండు ప్రాంతాలకూ స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తింపు ఇచ్చిన ఒక రోజు తర్వాత జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ప్రపంచం ఎన్నో రకాల సంక్షోభాలు ఎదుర్కుంటోందని, తాజా ఘటన అంతర్జాతీయ వ్యవస్థకు కొత్త సవాలుగా నిలిచిందని ఆయన ఈ కార్యక్రమంలో అన్నారు.
సోమవారం ఫ్రాన్స్ వార్తా పత్రిక లా ఫిగారోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జయశంకర్ అదే మాట చెప్పారు.
"గత 30 ఏళ్లుగా ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితుల పర్యవసానమే యుక్రెయిన్‌లో ప్రస్తుత స్థితి" అన్నారు. ఈ సంక్షోభానికి ఎక్కువ దేశాలు దౌత్యపరమైన పరిష్కారం కోరుకుంటున్నాయని చెప్పారు.
యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైనిక బలగాలను మోహరించడాన్ని భారత్ ఎందుకు ఖండించలేదనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
"ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, మీకు మంచి పరిష్కారం కావాలా? లేక మీరు మీ వైఖరితోనే సంతృప్తి చెందారా అనేదే. భారత్ మిగతా దేశాలతో కలిసి రష్యాతో చర్చలు జరపవచ్చు. భద్రతామండలిలో కూడా చర్చలు జరపవచ్చు. ఫ్రాన్స్ లాంటి దేశాల చొరవకు మద్దతు ఇవ్వవచ్చు" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారత్ మంగళవారం భద్రతామండలిలో దౌత్యపరమైన పరిష్కారాన్ని సూచించింది. కానీ రష్యా చర్యలను భారత్ విమర్శించకపోవడంపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు.
యుక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు పంపిన కెనడా
రష్యా పూర్తి స్థాయిలో దాడి చేయచ్చనే ఆందోళనలతో యుక్రెయిన్ గత కొన్ని వారాలుగా నాటో దేశాల నుంచి విమానాల్లో భారీగా వస్తున్న సైనిక పరికరాలు, ఆయుధాలను అందుకుంటోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తాజాగా ఆయుధాలకు సంబంధించిన రెండో డెలివరీని యుక్రెయిన్ పంపించినట్లు కెనడా రక్షణ మంత్రి ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు...
యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో తిరుగుబాటుదారుల అధీనంలోని రెండు ప్రాంతాల్లో రష్యా సైనిక దళాలను మోహరించడంతో రష్యాపై పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
యుక్రెయిన్ విషయంలో రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. యుక్రెయిన్‌లో జరుగుతున్న సంఘటనలు "యుక్రెయిన్‌పై రష్యా దాడికి నాంది" అని బైడెన్ వ్యాఖ్యానించారు.
"మేము అంతా గమనిస్తున్నాం. రష్యాకు ప్రపంచవ్యాప్తంగా అందుతున్న ఆర్థిక సహాయాన్ని ఆపడానికి ప్రయత్నాలు జరుగుతాయి" అని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా రష్యాపై అమెరికా ఆంక్షలు ప్రకటిస్తుందని బైడెన్ చెప్పారు. రష్యాతో పోరాడే ఉద్దేశం తనకు లేదని, అయితే నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటానని జో బైడెన్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
యుక్రెయిన్‌లో రష్యా చేపట్టిన చర్యలు ఆమోదయోగ్యం కాదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అన్నారు. ఈ విషయంలో అన్ని వర్గాలూ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని ఆయన అన్నారు.
యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైందని బ్రిటన్ వ్యాఖ్యానించింది. ఆ దేశంపై రష్యా చర్య చాలా సిగ్గుచేటని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు.
యుక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వెళ్లిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం 242 మంది ప్రయాణికులతో భారత్‌కు చేరుకుంది.
యుక్రెయిన్ విదేశాంగ మంత్రిని కలిసిన జో బైడెన్
యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుక్రెయిన్ సమగ్రత, సౌర్వభౌమాధికారం పట్ల తమ నిబద్ధతను పునరుద్ధాటించారు.
యుక్రెయిన్‌లో వేర్పాటుదారుల నియంత్రణలోని లుహాన్స్క్, దోనెస్క్ ప్రాంతాలకు 'శాంతి పరిరక్షణ' దళాలను తరలించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించడంపై అమెరికా తీసుకున్న నిర్ణయాలను బైడెన్ కులేబాకు వివరించారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
బైడెన్, కులేబా సమావేశంలో రష్యాపై కొత్త ఆంక్షలు ప్రకటించారు. యుక్రెయిన్‌కు రక్షణపరమైన సాయం, ఆర్థిక సాయం పంపించడం కొనసాగించాలని అమెరికా నిర్ణయించింది.
రష్యా యుక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడితే మిత్రదళాలతో కలిసి దానికి సమాధానం ఇవ్వడానికి అమెరికా సంసిద్ధంగా ఉంటుందని బైడెన్ ఈ సమావేశంలో పునరుద్ఘాటించారు.

ఫొటో సోర్స్, EVN
పుతిన్ యుద్ధాన్ని ఇప్పటికీ తప్పించవచ్చు
యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్‌తో కూడా సమావేశం అయ్యారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికైనా తన తీరు మార్చుకుని యుద్ధాన్ని తప్పించవచ్చని అమెరికా రక్షణ మంత్రి అన్నారు.
అమెరికా తన మిత్రదళాలతో కలిసి ఈ ఘర్షణను తప్పించే మార్గం వెతుకుతోందని పెంటగాన్‌లో యుక్రెయిన్ విదేశాంగ మంత్రితో సమావేశానికి ముందు ఆస్టిన్ చెప్పారు.
యుక్రెయిన్‌పై యుద్ధానికి దిగడం వల్ల అక్కడి శాంతిభద్రతలకు, సంక్షేమానికి విఘాతం కలగడంతోపాటూ మొత్తం అట్లాంటిక్ సమాజానికే ముప్పు వస్తుందన్నారు.
రష్యాపై ఇప్పటివరకూ ఎవరు ఎలాంటి ఆంక్షలు విధించారు?
అమెరికా సహా మరికొన్ని పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు ప్రకటించాయి. వీటిలో రష్యాకు చెందిన ఆర్థిక సంస్థలు వీఈబీ, రష్యా మిలిటరీ బ్యాంక్‌పై జో బైడెన్ విధించినవి తాజా ఆంక్షలు. రష్యాలోని ఉన్నత వర్గాలు, వారి కుటుంబాలపై కూడా ఆంక్షలు విధించవచ్చని బైడెన్ అన్నారు.
అమెరికా తన మిత్రదేశాలతో జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటోందని బైడెన్ చెప్పారు. నిజానికి తాను విధించిన ఆంక్షలు అంతకు ముందు యూరోపియన్ దేశాలు విధించిన ఆంక్షలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్
రష్యాకు చెందిన ఐదు బ్యాంకులపై, ముగ్గురు బిలియనీర్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
బ్రిటన్‌లో రష్యాకు చెందిన ముగ్గురు బిలియనీర్ల ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నారు. వారిని బ్రిటన్ కూడా రాకుండా అడ్డుకుంటారు.
బ్రిటన్ ఆంక్షలు విధించిన రష్యా బ్యాంకుల్లో రోసియా, ఐఎస్ బ్యాంక్, జనరల్ బ్యాంక్, ప్రామ్స్‌వ్యాజ్ బ్యాంక్, బ్లాక్ సీ బ్యాంక్ ఉన్నాయి. ఆంక్షలకు గురైన ముగ్గురు ప్రముఖుల్లో గెనెడీ టిమ్చెంకో, బోరిస్ రోటెన్‌బర్గ్, ఐగర్ రోటెన్‌బర్గ్ ఉన్నారు.
బ్రిటన్ ప్రధాని ప్రకటన తర్వాత రష్యాపై ఈ ఆంక్షలు సరిపోవని కొంతమంది ఎంపీలు అన్నారు. దీంతో పరిస్థితి మరింత దిగజారితే మరిన్ని ఆంక్షలు కూడా విధించే అవకాశం ఉందని బోరిస్ జాన్సన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
జర్మనీ
రష్యాతో నార్డ్ స్ట్రీమ్-2 పైప్‌లైన్ ప్రారంభించే ప్రక్రియను జర్మనీ నిలిపివేసింది. ఈ పైప్‌లైన్ ద్వారా రష్యా నుంచి జర్మనీ గ్యాస్ సరఫరా జరగాల్సి ఉంది.
యుక్రెయిన్‌లో రష్యా చర్యలకు సమాధానంగా తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కాల్జ్ బెర్లిన్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఈ పైప్ లైన్ ద్వారా రష్యా నుంచి యూరప్‌కు వారికి అవసరమైన 40 శాతం గ్యాస్ లభిస్తుంది. ఇది రష్యా తూర్పు ప్రాంతం నుంచి యూరప్‌లోని వివిధ దేశాల వరకూ సరఫరా అవుతుంది.
యూరోపియన్ యూనియన్
యూరోపియన్ యూనియన్ రష్యాపై తాము మొదట తీసుకున్న చర్యలను ఏకగ్రీవంగా ఆమోదించింది. యుక్రెయిన్‌పై చర్యలకు అంగీకరించిన రష్యా పార్లమెంటు సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం వీటిలో ఒకటి.
ఈయూ ఆర్థిక మార్కెట్లలో రష్యా బ్యాంకుల చేరికపై కూడా ఆంక్షలు విధించారు.
ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రష్యాను ఏకాకి చేయవచ్చని, అది డాలర్ల లావాదేవీలు జరపకుండా నిరోధించవచ్చని, రష్యా ఎలాంటి ఎగుమతులు దిగుమతుల చేసుకోకుండా ఆంక్షలు విధించవచ్చని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- దుబాయ్‌లో 13 రోజుల సహవాసం, మాల్దీవుల్లో, మెక్సికోలో డేటింగ్, ఇండియాలో పెళ్లి
- కస్తూర్బా గాంధీ: శరీరం భస్మమైంది, ఆమె 5 గాజులు మిగిలే ఉన్నాయి
- యుక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై భద్రతామండలి అత్యవసర సమావేశం: భారత్, చైనా ఏమన్నాయంటే..
- లఖీంపుర్ ఖీరీ: ‘ప్రభుత్వం డబ్బు తిరిగి తీసుకున్నా మంచిదే కానీ మాకు న్యాయం కావాలి’
- తల్లి కళ్లెదుటే కూతురి హత్య: ప్రేమించట్లేదని గొంతు కోశాడు, ప్రాణం పోయేదాకా ఎవర్నీ దగ్గరకు రానివ్వలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










