యుక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు: తూర్పు యుక్రెయిన్‌లోకి వెళ్లాలని సైనిక బలగాలకు పుతిన్ ఆదేశం, దాడికి ఇదో ఎత్తుగడ అన్న అమెరికా

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్ సంక్షోభం మరింతగా ముదిరింది. ఆ దేశంలోని తూర్పు భాగంలో.. యుక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాలను తాము 'స్వతంత్ర దేశాలు'గా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.

రష్యా మద్దతున్న తిరుగుబాటుదారులు ఆ ప్రాంతాల్లో 2014 నుంచి యుక్రెయిన్ సైనిక బలగాలతో పోరాడుతున్నారు. తిరుగుబాటుదారులు తమ ప్రాంతాలను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ డోనెస్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ లుహాన్స్ పేరుతో స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్నారు. వాటిని గుర్తిస్తున్నట్లు ఇప్పుడు పుతిన్ ప్రకటించారు.

ఈ రెండు ప్రాంతాల్లో ‘శాంతి పరిరక్షణ కార్యకలాపాలు’ నిర్వహించటానికి వెళ్లాలంటూ రష్యా సైనిక బలగాలను పుతిన్ ఆదేశించారు. దీంతో దౌత్య మార్గాల్లో సంక్షోభాన్ని పరిష్కరించే అవకాశాలు సన్నగిల్లాయి.

యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలోకి రష్యా బలగాలు ప్రవేశించటానికి ఇది దారి ఇస్తుందని పశ్చిమ శక్తులు ఆందోళన చెందుతున్నాయి.

రష్యా సైనిక చర్య విస్తృతి ఎంత అనేది అస్పష్టంగానే ఉంది. కానీ సైనిక బలగాలు సరిహద్దు దాటినట్లయితే.. తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతాలకు రష్యా సైనికులు అధికారికంగా ప్రవేశించటం ఇదే మొదటిసారి అవుతుంది.

వీడియో క్యాప్షన్, రష్యాకు యుక్రెయిన్ ఎందుకంత కీలకమో చెప్పే మూడు కారణాలు

యుక్రెయిన్ విషయంలో పుతిన్ ఏమన్నారు?

ఈ వేర్పాటు ప్రాంతాలతో ఒప్పందాలకు రష్యా పార్లమెంటు ఆమోదముద్ర వేయనుంది. తద్వారా డోనెస్క్, లుహాన్క్ ప్రాంతాల్లో రష్యా తన సైనిక స్థావరాలను నిర్మించుకునేందుకు హక్కు లభిస్తుంది.

ఇటీవలి సంవత్సరాల్లో ఈ రెండు ప్రాంతాల్లోని ప్రజలకు పెద్ద సంఖ్యలో రష్యా పాస్‌పోర్టులు ఇచ్చారు. ఇప్పుడు తన పౌరులను రక్షించే మిషతో రష్యా తన సైనిక బలగాలను ఈ ప్రాంతాల్లోకి పంపిస్తుందని పశ్చిమ మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.

తిరుగుబాటు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు సోమవారం ప్రకటించిన పుతిన్.. ఆ తర్వాత గంట సేపు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో ప్రసంగించారు.

యుక్రెయిన్ అనేది ‘‘ప్రాచీన రష్యా భూమి’’ అంటూ.. ఆధునిక యుక్రెయిన్‌ను సోవియట్ రష్యా ‘‘సృష్టించింది’’ అని చెప్పారు.

1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిన సమయంలో రష్యాను ‘‘దోపిడీ’’ చేశారన్నారు. యుక్రెయిన్‌ను కీలుబొమ్మ ప్రభుత్వం నడిపిస్తోందని, ఆ దేశం ‘‘అమెరికా కాలనీ’’గా ఉందని ఆరోపించారు.

యుక్రెయిన్ ప్రస్తుత నాయకత్వం కింద ప్రజలు బాధలు పడుతున్నారన్నారు. యుక్రెయిన్‌లో రష్యా అనుకూల నాయకుడిని కూలదోసిన 2014 నిరసనలు ఒక కుట్ర అని పుతిన్ అభివర్ణించారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌‌‌ను రష్యా ఏం చేయబోతోంది

‘‘చీకటి సూచిక’’

పుతిన్ చర్యను అమెరికా తక్షణమే ఖండించింది. యుక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాల్లో అమెరికన్ల పెట్టుబడులను, వాణిజ్యాన్ని, నిధులు అందించటాన్ని నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు.

యుక్రెయిన్‌ మీద రష్యా ఇంకా ముందుకెళ్లి దాడి చేస్తే పశ్చిమ దేశాలు విస్తృత ఆంక్షలు విధించటానికి సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్ష భవనం పేర్కొంది.

రష్యా చర్యలు.. యుక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను బాహాటంగా అతిక్రమించటమేనని, ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించటమేనని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మండిపడ్డారు. ‘‘ఇది చాలా చీకటి సూచిక’’ అని ఆయన అభివర్ణించారు.

రష్యా మీద బ్రిటన్ కొత్త ఆంక్షలను మంగళవారం ప్రకటిస్తుందని విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ చెప్పారు.

యుక్రెయిన్‌తో సంఘీభావంగా తాము సమైక్యంగా, నిక్కచ్చిగా, దృఢచిత్తంతో ప్రతిస్పందిస్తామని యూరోపియన్ యూనియన్ ప్రతినబూనింది.

స్వతంత్రం ప్రకటించుకున్న యుక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో రష్యా బలగాలు శాంతిని కాపాడతాయనటం ‘‘నాన్‌సెన్స్’’ అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ అభివర్ణించారు. ‘‘ఇది అవాంఛితం. అనుచితం’’ అన్నారాయన.

పుతిన్ చర్యతో యుక్రెయిన్ సంక్షోభం మరింత తీవ్రంగా ముదిరింది. ఆ దేశ సరిహద్దుల్లో 1,50,000 మందికి పైగా రష్యా సైనికులు చుట్టుముట్టి ఉన్నారు.

యుక్రెయిన్‌ మీద సైనిక దాడికి ప్రణాళిక రచిస్తున్నామనే వాదనను రష్యా తిరస్కరించింది. అయితే రష్యా దాడి చేసి తీరుతుందని అమెరికా నమ్ముతోంది.

లిండా

ఫొటో సోర్స్, Reuters

రష్యా 'శాంతి పరిరక్షణ' బూటకం.. యుక్రెయిన్ మీద దాడికి ఎత్తుగడ: అమెరికా

యుక్రెయిన్ సంక్షోభం మీద చర్చించటానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం నాడు న్యూయార్క్‌లో అత్యవసర సమావేశం నిర్వహించింది.

తూర్పు యుక్రెయిన్‌లో తిరుగుబాటుదారుల ఆధీనంలోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించిన రష్యా నిర్ణయాన్ని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ ఖండించారు.

ఇది యుక్రెయిన్‌తో పాటు, యూరప్ వ్యాప్తంగా, ప్రపంచమంతటా తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు.

రష్యా సైనిక చర్య మరింత ముందుకు సాగితే మానవ ప్రాణాలు మూల్యం చెల్లించటం మరింతగా పెరుగుతుందన్నారు.

తూర్పు యుక్రెయిన్‌లో అంతర్గత ఘర్షణలను ఆపటానికి, రాజకీయ పరిష్కారాన్ని కనుగొనటానికి 2014-15లో చేసుకున్న శాంతి ఒప్పందాలను ప్రస్తావిస్తూ.. మిన్క్ ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పీలికలుగా చింపేశారని, ఆయన అక్కడితో ఆగుతారని అమెరికా భావించటం లేదని లిండా విమర్శించారు.

తూర్పు యుక్రెయిన్‌లో ''శాంతి పరిరక్షణ'' కోసం సైనికులను మోహరించాలని ఆదేశించటం 'నాన్‌సెన్స్' అని ఆమె అభివర్ణించారు.

లుహాన్క్, డోనెస్క్‌లను స్వతంత్రంగా గుర్తించటం.. యుక్రెయిన్ మీద మరింతగా సైనికదాడి చేయటానికి రష్యా వేసిన ఎత్తుగడ అని ఆమె ఆరోపించారు.

తిరుమూర్తి

ఫొటో సోర్స్, TS Tirumurti

యుక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలపై భారత్ ఏమందంటే..

యుక్రెయిన్ విషయంలో అన్ని దేశాలు సంయమనం పాటించాలని భారత్ విజ్ఞప్తి చేసింది.

యుక్రెయిన్‌లో తాజా పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

యుక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడం ఆందోళనకరమని, ఈ పరిణామాలు ఆ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగిస్తాయని భారత్ అభిప్రాయపడింది.

అన్ని దేశాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. యుక్రెయిన్-రష్యా వివాదం దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతుందని పేర్కొంది. ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత్ సూచించింది.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

అన్ని పక్షాలూ సంయమనం పాటించాలన్న చైనా

అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని, పరిస్థితులు మరింతగా దిగజారే చర్యలను నివారించాలని ఐరాసలో చైనా రాయబారి ఝాంగ్ జున్ భద్రతామండలి సమావేశంలో సూచించారు.

సంక్షోభానికి దౌత్య పరిష్కారం కోసం జరిగే ప్రతి ప్రయత్నాన్నీ చైనా ఆహ్వానిస్తోందన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

యుక్రెయిన్ దురాక్రమణ నుంచి ఆ ప్రాంతాలకు రక్షణ కావాలి: రష్యా

మరోవైపు.. స్వతంత్ర ప్రాంతాల మీద యుక్రెయిన్ దురాక్రమణకు పాల్పడుతోందని, దాని నుంచి వేర్పాటు ప్రాంతాలను రక్షించాల్సిన అవసరం ఉందని ఐరాసలో రష్యా రాయబారి వాసిలి నెబెన్జ్యా వాదించారు.

ఆయన భద్రతామండలి అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ ''డోన్బాస్‌లో సరికొత్తగా రక్తపాతానికి అనుమతివ్వటం మా ఉద్దేశం కాదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

దౌత్య చర్చలకు రష్యా ఇంకా సుముఖంగానే ఉందన్నారు. మిన్స్క్ ఒప్పందానికి యుక్రెయిన్ ఇంకా కట్టుబడే ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ఎనిమిదేళ్లుగా సాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకటానికి, వేరుపడిన ప్రాంతాల హోదాను పరిష్కరించటానికి చేపట్టాల్సిన చర్యలను ఆ ఒప్పందం నిర్దేశిస్తోంది.

మా సరిహద్దులు మారవు: యుక్రెయిన్ అధ్యక్షుడు

రష్యా చర్యలు.. యుక్రెయిన్ సార్వభౌమత్వం, సమగ్రతను అతిక్రమించటమేనని యుక్రెయిన్ అధ్యక్షుడు వాలోద్‌మిర్ జెలెన్స్కీ తప్పుపట్టారు. ఆయన మంగళవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు.

రష్యా ఎలాంటి ప్రకటనలు ఇచ్చినప్పటికీ.. యుక్రెయిన్ అంతర్జాతీయ సరిహద్దులు యధాతధంగా ఉంటాయని పేర్కొన్నారు.

శాంతి ప్రయత్నాలను, ప్రస్తుత అంతర్జాతీయ సంప్రదింపుల ప్రక్రియను రష్యా చర్యలు ధ్వంసం చేస్తున్నాయని ఆయన తప్పుపట్టారు.

యుక్రెయిన్ శాంతిని కోరుకుంటోందని, రాజకీయ, దౌత్య పరిష్కారానికి మద్దతిస్తోందని చెప్పారు.

''మేం భయపడటం లేదు'' అని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ భాగస్వాములు స్పష్టమైన, ప్రభావవంతమైన మద్దతు చర్యలు చేపడతాయని తమ దేశం ఆశిస్తున్నట్లు తెలిపారు. యుక్రెయిన్ ఎవరికీ, ఏమీ ఇవ్వబోదని స్పష్టంచేశారు.

వీడియో క్యాప్షన్, రష్యా, అమెరికా సంఘర్షణల్లో యూరప్ ఎవరివైపు ఉంటుంది? కారణాలేంటి?

యుక్రెయిన్‌లో ఆందోళన, ఆగ్రహం

సారా రెయిన్‌ఫోర్డ్, బీబీసీ తూర్పు యూరప్ ప్రతినిధి

ఇక్కడ యుక్రెయిన్‌లో ప్రస్తుతం ఆందోళన, ఆగ్రహాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి.

దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ తన భద్రతా మండలితో సమావేశమయ్యారు. ఇతర రాజకీయనాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా సైనిక దాడి ఆగటం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోందంటూ.. రష్యాను నిలువరించాలని యుక్రెయిన్ మిత్రదేశాలను వారు కోరారు.

ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చునని కూడా కొందరు హెచ్చరించారు. పశ్చిమ దేశాల పట్టుదలను రష్యా పరీక్షిస్తున్నట్లయితే.. యుక్రెయిన్‌కు సంబంధించినంత వరకూ దాని మిత్రదేశాలు ప్రతిస్పందించాల్సిన కీలక సమయం ఇది.

యుక్రెయిన్

తూర్పు యుక్రెయిన్‌లో తిరుగుబాటు ప్రాంతాలు

యుక్రెయిన్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉండిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా తనలో కలుపుకుంది. అదే ఏడాది.. తూర్పు ప్రాంతంలోని డోనెస్క్, లుహాన్క్ ప్రాంతాలు తమను స్వతంత్ర దేశాలుగా పీపుల్స్ రిపబ్లిక్‌లుగా ప్రకటించుకున్నాయి.

డోన్బాస్ అని పిలిచే ఈ ప్రాంతంలోని చాలా భూభాగం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. తిరుగుబాటుదారులకు రష్యా ఆయుధాలను, సాయుధులను పంపించటం ద్వారా ఈ ప్రాంతంలో అశాంతిని రెచ్చగొడుతోందని యుక్రెయిన్, దాని పశ్చిమ మిత్రపక్షాలు పదేపదే ఆరోపిస్తూ వచ్చాయి.

ఈ ఆరోపణలను రష్యా ఎల్లప్పుడూ తిరస్కరిస్తూ వచ్చింది.

2014-15లో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశారు. కానీ వాటివల్ల పోరాటం పూర్తిగా ఆగిపోలేదు. గత కొద్ది రోజులుగా షెల్లింగ్ కాల్పులు గణనీయంగా పెరిగాయి.

తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతాల నుంచి వేలాది మంది జనం వీడిపోయారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో దాదాపు 40 లక్షల మంది జనం నివసిస్తున్నట్లు భావిస్తున్నారు. 2014 నుంచి చాలా మంది పౌరులు సహా 14,000 మంది చనిపోయినట్లు అంచనా.

జపాన్ స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఆసియా స్టాక్ ఎక్సేంజిలు పతనం.. పెరిగిన చమురు ధరలు

యుక్రెయిన్, రష్యా ఉద్రిక్తతలు కొన్ని వారాలుగా అంతకంతకూ ముదురుతూ ఉంటే ఆసియా ఇన్వెస్టర్లు ఉత్కంఠతో గమనిస్తున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్.. తమ సైనిక బలగాలను యుక్రెయిన్‌లోకి ప్రవేశించాలని ఆదేశించగానే మంగళవారం నాడు జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, హాంకాంగ్ సహా ఆసియా స్టాక్ మార్కెట్లు గణనీయంగా పతనమయ్యాయి.

ఇటువంటి సంక్షోభ సమయంలో మదుపుదారులు జపనీస్ యెన్, బంగారం వంటి తాము సురక్షితమని భావించే రంగాల్లో పెట్టుబడులు పెట్టటానికి మొగ్గుచూపుతారు. దీంతో అవి బలపడుతున్నాయి.

మరోవైపు ఇంధనం, ఇతర నిత్యావసరాల సరఫరాలకు ఆటంకాలు ఎదురవుతాయని వ్యాపారులు ఆందోళన చెందటంతో చమురు ధరలు పెరిగాయి.

అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం సెలవు కావటంతో తెరుచుకోలేదు. అయితే.. మంగళవారం ప్రారంభమవటానికి ముందు స్టాక్ ఫ్యూచర్స్ కదలికలు నష్టాలను సూచిస్తున్నాయి.

ఎయిర్ ఇండియా

ఫొటో సోర్స్, Ani

యుక్రెయిన్‌లోని భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమాన సర్వీసులు

యుక్రెయిన్‌లోని పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిరిండియా ప్రత్యేక విమానం అక్కడికి వెళ్లిందని ప్రసారభారతీ న్యూస్ సర్వీస్ పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఒక విమానం ఇవాళ అంటే ఫిబ్రవరి 22న యుక్రెయిన్‌కు బయలుదేరి వెళ్లింది. ఫిబ్రవరి 24న మరొక విమానం, 26న ఇంకో విమానం యుక్రెయిన్‌కు వెళ్తాయి. అక్కడున్న భారతీయులను స్వదేశం తీసుకొస్తాయని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

యుక్రెయిన్‌లోని భారతీయులు ఇండియా రావాలనుకుంటే ఎయిర్ ఇండియా బుకింగ్ ఆఫీస్, వెబ్‌సైట్, కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఏఎన్ఐ తెలిపింది.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? రష్యా ఏం చేస్తోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)