1857 సిపాయిల తిరుగుబాటు: చపాతీలే బ్రిటిష్ పాలన అంతానికి నాంది పలికాయా?

1857 తిరుగుబాటు

ఫొటో సోర్స్, Alamy

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని 19వ శతాబ్దంలో ఒక విచిత్రమైన అనుమానం వేధించింది. రహస్య సందేశాలను పంచుకోవడానికి భారతీయులు చపాతీలను ఉపయోగిస్తున్నారా? ఈ ప్రశ్న అప్పట్లో బ్రిటిష్ వారిని తీవ్రంగా వేధించింది.

1857వ సంవత్సరంలో భారత్‌లో ఆశ్చర్యకర సంఘటనలు జరగడం ప్రారంభమైంది.

భారత ఇళ్లలోని సంప్రదాయ వంటకమైన చపాతీలను ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి తరలింపు జరుగుతోంది. ఈ చపాతీలను తీసుకెళ్లే వ్యక్తి, గ్రామ పెద్దకు వాటిని అప్పగించేవారు. చపాతీలను అందుకున్న గ్రామపెద్ద, వాటిని మరొక గ్రామానికి పంపించేవారు. ఈ ప్రక్రియ ఇలా సాగుతూనే ఉండేది.

ఈ పద్ధతిలో ఉత్తర భారతంలోని మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ నుంచి గ్వాలియర్ వరకు... అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ గుండా రోహిల్‌ఖండ్‌కు చపాతీలు చేరుకునేవి.

ఆ కాలంలోని మెయిల్ సర్వీసుల కన్నా వేగంగా.. ఒకే రాత్రిలో 160 నుంచి 200 మైళ్ల దూరం ఈ చపాతీలు ప్రయాణించేవి అని బ్రిటీష్ మిలిటరీ నాయకులు అంచనా వేశారు.

వీడియో క్యాప్షన్, టిప్పు సుల్తాన్‌ను చంపేశాక బ్రిటిషర్లు కొల్లగొట్టిన సంపద ఈ కోటలో...

చపాతీలతో పాటు ఒక్కోసారి తామర పువ్వులు, మేక మాంసం కూడా పంపిణీ అయ్యేవి. కానీ అధికంగా కేవలం చపాతీలను మాత్రమే సరఫరా చేసేవారు.

అంతకుముందు సరిగ్గా 100 సంవత్సరాల క్రితం... ఈశాన్య భారతంలో జరిగిన ఫ్లాసీ యుద్దంలో బెంగాల్ నవాబుతో పాటు ఆయన ఫ్రెంచ్ మిత్ర కూటమిపై బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ విజయాన్ని సాధించింది. ఇందులో రణరంగంతో పాటు యుద్ధరంగం అవతల కూడా ఈస్టిండియా కంపెనీ యుక్తిని ప్రదర్శించింది.

భారత్‌పై ఆధిపత్యం వహించేందుకు ఈస్టిండియా కంపెనీకి ఈ విజయం బాటలు పరిచింది. దీనితర్వాత మొగల్ భూభాగాల నుంచి పన్నుల వసూళ్ల రూపంలో ఈస్టిండియా కంపెనీ దౌర్జన్యాలకు తెగబడింది.

వందేళ్ల తర్వాత కూడా భారత్ వారి పీడనలోనే ఉండిపోయింది.

ఇండోర్‌లో కలరా విజృంభించింది. అంతకుముందు సంవత్సరమే ఈస్టిండియా కంపెనీ, అవధ్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని, పదవీచ్యుతుడైన నవాబును కోల్‌కతాకు పంపించింది.

మరోవైపు కొన్ని పుకార్లు కూడా వ్యాపించాయి. ఆవులు, పందుల ఎముకల పొడితో పిండిని కలుషితం చేస్తున్నారని కొందరు బ్రిటీష్ వారిపై ఆరోపణలు చేశారు. మరికొందరు బ్రిటీష్ వారు, మందులను తమ ఉమ్మితో కల్తీ చేస్తున్నారని పేర్కొన్నారు. (ఢిల్లీ యూనివర్సిటీలోని చరిత్ర విభాగంలో గెస్ట్ లెక్చర్ సందర్భంగా చరిత్రకారుడు హీనా అన్సారీ ఈ అంశం గురించి మాట్లాడారు. బ్రిటీష్ అధికారుల బృందంలోని ఒకరు, ఉమ్మితో ఔషధాలు కల్తీ చేశారనే పుకార్లు రావడంతో ఆసుపత్రుల్లోని రోగులు మందులను తీసుకునేందుకు తిరస్కరించిన ఘటనను లక్నోలోని ఉర్దూ వార్తా పత్రిక 'టిలిజం-ఎ-లక్నో' ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.)

రచయిత, చారిత్రక అనువాదకుడు రానా సఫ్వీ ఈ అంశంపై మరో వివరణ ఇచ్చారు. ''ప్లాసీ యుద్ధం 100వ వార్షికోత్సవం సందర్భంగా విదేశీ పాలన ముగుస్తుందనే పుకారు కూడా వచ్చింది'' అని ఆయన చెప్పారు. ఈ పుకార్లు, కథలు అన్నీ కలిసి... దేశాన్ని క్రైస్తవంలోకి మార్చేందుకు బ్రిటిష్ వారు ప్రయత్నిస్తున్నారనే భావన ప్రజల్లో ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో చపాతీ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఈ ఉద్యమం బ్రిటిష్ వారిని పూర్తిగా గందరగోళంలోకి నెట్టింది.

1756లో 27 ఏళ్ల వయస్సులో సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ అయ్యారు. ఒక సంవత్సరం పాలించిన తర్వాత ఈస్టిండియా కంపెనీ ఆయన్ను తొలగించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1756లో 27 ఏళ్ల వయస్సులో సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ అయ్యారు. ఒక సంవత్సరం పాలించిన తర్వాత ఈస్టిండియా కంపెనీ ఆయన్ను తొలగించింది

అయోమయంలో ఉన్న అధికారులు ఈ అంశం గురించి ఒకరికొకరు లేఖలు పంపుకున్నారు. ఉద్యమ ప్రారంభంలో ఈ చపాతీల సరఫరా గురించి అనుమానం వ్యక్తం చేసిన అధికారులకు... సమయం గడిచిన కొద్దీ ఈ చపాతీల వెనుక ఏదో రహస్యం దాగి ఉందనే అభిప్రాయం బలపడింది.

''ప్రస్తుతం, భారతదేశ వ్యాప్తంగా అత్యంత రహస్యమైన వ్యవహారం నడుస్తోంది'' అని ఈస్టిండియా కంపెనీలో సర్జన్‌గా పనిచేసిన గిల్బర్ట్ హాడో, 1857 మార్చిలో తన సోదరికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

''ఈ చపాతీల వెనుక ఉద్దేశం ఏమిటో ఇంకా ఎవరికీ తెలిసినట్లు లేదు. ఇది ఎక్కడ పుట్టిందో, దీన్ని ఎవరు ప్రారంభించారో, ఏ ఉద్దేశంతో వీటిని పంపుతున్నారో అర్థం కావట్లేదు. ఇది ఏదైనా మతపరమైన కార్యక్రమమా లేదా సమాజహితం కోసం రహస్యంగా నడుపుతోన్న కార్యక్రమమా తెలియట్లేదు. దీన్ని 'చపాతీ ఉద్యమం'గా పేర్కొంటూ భారతీయ వార్తా పత్రికల్లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి'' అని ఆయన లేఖలో వివరించారు.

ఆ సమయంలో మథుర నగరానికి మేజిస్ట్రేట్‌గా ఉన్న మార్క్ థోర్న్‌హిల్... ''గ్రామానికి వచ్చిన ఒక వ్యక్తి, వాచ్‌మెన్‌కు చపాతీలు ఇచ్చారు. ఇలాంటి మరో నాలుగు చపాతీలు చేసి పక్కనున్న గ్రామాల్లోని వాచ్‌మెన్‌లకు ఇవ్వాలని, వారిని కూడా ఇలాగే చపాతీలు చేసి పొరుగు గ్రామాలకు వితరణ చేయమని చెప్పాలని సదరు వాచ్‌మెన్‌ను ఆదేశించారు. ఇలా తొమ్మిది రోజులు జరిగిన తర్వాత ఈ అంశం గురించి మాట్లాడటం మానేశారు'' అని రాసుకొచ్చారు.

నిజానికి భారత చరిత్రలో ఇలాంటి వస్తువులను రహస్య సందేశాలుగా వాడటానికి సంబంధించిన అనేక ఉదంతాలు ఉన్నాయి.

''వ్యాధులు, పండగలు, తిరుగుబాటుకు సంబంధించిన అంశాల్లో సమూహాలను సమీకరించడానికి బాణాలు, గిరిజన ప్రాంతాల్లో లభించే వివిధ రకాలు ఆకులు, కొబ్బరి, మట్టి కుండలు తదితర వస్తువులను రహస్య సందేశాలుగా వినియోగించేవారని'' యూకేలోని నాటింగ్‌హామ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ చెప్పారు.

1831-32 కాలంలో తూర్పు భారత్‌కు చెందిన కోల్ జాతి ప్రజలు తమ సందేశాలను చేరవేయడానికి బాణాలను ఉపయోగించినట్లు అరుణ్ కుమార్ వివరించారు. 1857కు ముందు సమష్టి చర్యకు పిలుపునివ్వడానికి సంతాల్ ప్రజలు ఎర్రని సింధూరంను లేదా 'సాల్' అనే చెట్టు కొమ్మలను పంపుకునేవారని ఆయన భావిస్తున్నారు.

చపాతీ ఉద్యమంతో పోలిస్తే మిగతావన్నీ చాలా చిన్న స్థాయి సంఘటనలు అని అరుణ్ తెలిపారు. ''ఉత్తర భారతదేశంలో రోజూవారీ ఆహారమైన చపాతీ... మొత్తం గ్రామీణ సమాజాన్నిఆకర్షించగల విలువను కలిగి ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర వస్తువైన 'ఉప్పు'ను ఉద్యమ వస్తువుగా గాంధీ ఎలా ఉపయోగించుకున్నారో ఈ సందర్భంగా ఆయన వివరించారు.

వేల ఏళ్లుగా చపాతీలు ప్రధాన ఆహారంగా ఉన్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేల ఏళ్లుగా చపాతీలు ప్రధాన ఆహారంగా ఉన్నాయి

చపాతీల వ్యాప్తి గురించి ఆ సమయంలో పహార్‌గంజ్‌లో పోలీసు అధికారిగా ఉన్న ముయినుద్దీన్ హసన్ ఖాన్ మాట్లాడారని సఫ్వీ చెప్పారు.

''తర్వాతి నెల అంటే ఫిబ్రవరిలో మళ్లీ చపాతీల విస్తరణ కార్యక్రమం వేగంగా జరిగింది. ఇది ఒక అశుభసూచకం'' అని 1898లో చార్లెస్ మెట్‌కాల్ప్ రాసిన 'టూ నేటివ్ నరేటీవ్స్ ఆఫ్ ద మ్యుటినీ ఇన్ ఢిల్లీ' పుస్తకంలో పేర్కొన్నారు.

చపాతీ ఉద్యమం గురించి ఖాన్ ఇలా వివరించారు. ''ఆ సమయంలో నేను పహార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు థానేదార్‌గా ఉన్నాను. ఒకరోజు ఉదయం పూట ఇంద్రపుత్ గ్రామానికి చెందిన కాపాలాదారుడు నా దగ్గరకు వచ్చారు. సెరాయి గ్రామానికి చెందిన కాపాలాదారుడు ఫరూఖ్ ఖాన్ చపాతీలను తీసుకొచ్చినట్లు ఆయన నాతో చెప్పారు. అంతేకాకుండా తనను కూడా అలాంటివే ఐదు చపాతీలు తయారు చేసి, వాటిని పొరుగున ఉన్న ఐదు గ్రామాల్లో ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. ఈ చపాతీలు అందుకున్న ఆయా గ్రామాల వారు కూడా ఐదు చపాతీలు తయారు చేసి... వాటి పొరుగు గ్రామాల్లో పంచాల్సిందిగా కోరాలని ఫరూఖ్‌ ఖాన్ తనతో చెప్పినట్లు ఆ కాపాలాదారుడు నాకు వివరించారు'' అని ఖాన్ తెలిపారు.

''ప్రతీ చపాతీని బార్లీ, గోధుమ పిండితో చేయాలి. అవి అరచేతి పరిమాణంలో ఉండి, కేవలం 20 గ్రాముల బరువే ఉండాలి అని ఆ కాపాలదారుడు నాతో చెప్పారు. ఆయన చెప్పింది విన్న తర్వాత నేను ఆశ్చర్యపోయాను. కానీ ఆయన చెప్పినదంతా నిజమే అనే నమ్మకం నాకు కలిగింది. ఈ చర్య ద్వారా ఏదో విపత్తు రానున్నట్లు నేను భావించాను'' అని ఖాన్ తెలిపినట్లుగా ఆ పుస్తకంలో రాసుకొచ్చారు.

వీడియో క్యాప్షన్, జలియన్‌వాలా బాగ్ వీడియో

వివాదాస్పద రాజకీయవేత్త, రైట్ వింగ్ లీడర్ వినాయక్ సావర్కర్ రాసిన 'ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857' అనే పుస్తకంలో ఉద్యమానికి చిహ్నంగా చపాతీని వినియోగించారనే అంశాన్ని ప్రస్తావించారు.

బ్రిటిష్ పాలనలో అసంతృప్తితో రగిలిపోతోన్న భారతీయుల్లో చపాతీ ఉద్యమంతో ఒక ఊపు వచ్చిందని ఆ పుస్తకంలో సావర్కర్ పేర్కొన్నారు.

అదే సమయంలో మరో పుకారు కూడా చెలరేగింది. యుద్ధంలో ఉపయోగించేందుకు భారత సైనికులకు బ్రిటిష్ వారు అందించిన ఎన్‌ఫీల్డ్ రైఫిళ్లలోని కార్ట్‌రిడ్జ్ (మందుగుండ్లు)పై పంది కొవ్వును పూసినట్లు సమాచారం వ్యాప్తి చెందింది.

సైనికులు పంటితో బుల్లెట్లకు పూసిన కొవ్వును తొలగించి వాటిని రైఫిళ్లలో దించి కాల్చాలి. సైన్యంలో ఎక్కువమంది హిందువులు, ముస్లింలే. ఇది వారి మత విశ్వాసాలకు విరుద్ధం. దీంతో తమ మతం, కులానికి ముప్పు వాటిల్లుతుందని భయపడిన భారత సైనికులు... ఆవు, పంది కొవ్వును పూసిన బుల్లెట్లను వాడటానికి నిరాకరించారు. ఈ నిరాకరణ బ్రిటీష్ వారి ఆగ్రహానికి కారణమైంది. దీనితో పాటు ఇతర చాలా అంశాలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చెలరేగడానికి దోహదపడ్డాయి.

ఈస్టిండియా కంపెనీ

ఫొటో సోర్స్, Getty Images

బుల్లెట్లకు పందికొవ్వు వాడటం... సిపాయిల తిరుగుబాటుకు మాత్రమే కాకుండా వలస రాజ్యాల ప్రజల ప్రతిఘటనకు కూడా కారణమైంది. దిల్లీలో బహదూర్ షా, కాన్పూర్‌లో నానా సాహిబ్ (మరాఠా పీష్వా బాజీరావు దత్త పుత్రుడు), ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి, లక్నోలో మౌలావి అహ్మదుల్లా షా, జనరల్ భక్త్ ఖాన్, మధ్య భారతంలో తాంతియా తోపే వంటి నాయకులు ఉద్భవించారు. మే నుంచి సెప్టెంబర్ మధ్య భయంకరమైన యుద్ధాలు జరిగాయి. దిల్లీలో బ్రిటీష్ వారి క్రూరమైన ప్రతీకార హత్యలతో ఇవి ముగిశాయి.

దీనంతటికీ కారణం చపాతీ ఉద్యమమేనా?

''చపాతీ మిస్టరీ అనేది 1857లో వ్యాపించిన ఒక పుకారు. రైఫిళ్లలోని బుల్లెట్లపై ఆవు, పంది కొవ్వును వినియోగిస్తున్నారనే సందేశాన్ని హిందుస్తానీలకు చేరవేయడం కోసం దీన్ని వాడుకున్నారు'' అని సఫ్వీ చెప్పారు.

''చపాతీ పంపిణీ గురించి ప్రస్తావించిన చాలా మంది కూడా ఈ కార్యక్రమం ఎందుకు జరిగిందో తెలియదని చెబుతున్నందున.. తిరుగుబాటులో దీని పాత్ర ఉన్నట్లుగా అనిపించడం లేదు'' అని ఆయన చెప్పారు.

నిజానికి అనేక వినోద కార్యక్రమాల రూపంలో తిరుగుబాటుకు పిలుపునిచ్చారని పలువురు చరిత్రకారులు నమ్ముతారు. లావనియాస్, తమాషా (ప్రసిద్ధ జానపద, సంగీత సంప్రదాయ కార్యక్రమాలు), తోలుబొమ్మలాట లాంటి వినోద కార్యక్రమాలతో పాటు ఉత్తరాలు, వార్తాపత్రికలు, కరపత్రాలు, ప్లకార్డులు వంటి వాటి ద్వారా తిరుగుబాటుకు పిలుపునిచ్చినట్లుగా వారు చెబుతుంటారు.

''తిరుగుబాటుదారులు నినాదాలతో పాటు రోటీ, తామర పూల పంపిణీ వంటి సంప్రదాయ పద్ధతుల ద్వారా వారి ఆలోచనలను వ్యాప్తి చేశారు. తిరుగుబాటుదారులు ఆధునిక పద్ధతులను కూడా వినియోగించారని చెప్పడానికి ముద్రించబడిన, చేతితో రాసిన ఆధారాలు అనేకం ఉన్నాయి. తిరుగుబాటు నేతలు జారీ చేసిన అనేక ఆదేశాలు, ప్రకటనలు నేషనల్ ఆర్కైవ్స్‌లో ఉన్నాయి. వీటితో పాటు వారు ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. దిల్లీ నగరంలో ఒక కోర్టును కూడా స్థాపించారు'' అని అన్సారీ వివరించారు.

ఎన్‌ఫీల్డ్ రైఫిల్ కార్ట్‌రిడ్జ్‌లపై ఆవు, పంది కొవ్వును వినియోగించినట్లు పుకార్లు వచ్చాయి

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, ఎన్‌ఫీల్డ్ రైఫిల్ కార్ట్‌రిడ్జ్‌లపై ఆవు, పంది కొవ్వును వినియోగించినట్లు పుకార్లు వచ్చాయి

ది గ్రేట్ అప్‌రైజింగ్ ఆఫ్ 1857' గ్రంథాన్ని చదివిన దిల్లీ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్‌ సయీదీ జహీర్ హుసేన్ జాఫ్రీ ఆ వాదనను అంగీకరిస్తూ, "1857 ఉద్యమం కచ్చితంగా అచ్చయిన అక్షరం ప్రేరణతోనే వచ్చింది. తిరుగుబాటుదారులు పంచిన దాదాపు 74 కరపత్రాలను చరిత్రకారులు గుర్తించారు. వాటిలో కరపత్రాలతో పాటు స్థానిక జమీందార్లు, నవాబులు, రాజులు, రాణులు జారీ చేసిన ఆదేశాలు కూడా ఉన్నాయి. చపాతీని ఒక సంకేతంగా సూచిస్తూ సావర్కర్ రాసింది 20వ శతాబ్దంలోనే. కానీ, దాని నేపథ్యం ఏమిటన్నది ఆయన చెప్పలేదు" అని అన్నారు.

అయితే, వలస పాలకులు దీని గురించి ఇచ్చిన అనేకానేక వివరణల్లో ఈ సాక్ష్యాధారాలన్నింటినీ విస్మరించారు. వలసపాలకులు కావాలనే వీటిని నమోదు చేయలేదని చరిత్రకారులు కొందరు నమ్ముతున్నారు. ఉద్యమ చైతన్యాన్ని, ప్రత్యేకతను తగ్గించి చూపడం కోసమే వారు అలా చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. ఆ విధంగా ఉద్యమకారుల ఆందోళనకు చట్టపరమైన గుర్తింపు లేకుండా చేయడం కోసమే అలా చేశారని కూడా చెబుతున్నారు.

1857 నాటి ఘటనల కూర్పుతో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎలా ఉండిందో మరింత బాగా అర్థమవుతుంది. దేశమంతటా నిఘా వ్యవస్థలు వేగవంతంగా విస్తరించిన రోజుల నుంచి ఏం జరిగిందో వీటి ద్వారా తెలుస్తుంది. ప్రాంతీయ భాషల ప్రచురణ చట్టం -1878 వంటివి తేవడం ద్వారా తమపై మరిన్ని తిరుగుబాట్లు లేవకుండా వాళ్లు ప్రయత్నాలు చేశారు. ఆ చట్టం వల్ల బ్రిటిష్ విధానాలను విమర్శిస్తూ భారతీయ భాషల్లో ఏమీ ప్రచురించడానికి వీల్లేకుండా పోయింది. ఆ చట్టం కేవలం స్థానిక మీడియాకు మాత్రమే వర్తింపచేశారు.

ఆ పరిస్థితుల్లో ఆ ఏడాది ఒక మామూలు చపాతీ ఒక జ్వాలను రాజేసింది. అది ఈస్టిండియా కంపెనీ వినాశనానికి నాంది పలికింది. ఫలితంగా దాని అధికారాలు బ్రిటన్ రాచ కుటుంబానికి బదిలీ అయ్యాయి.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)