టీ స్టార్టప్‌లు: అల్లం టీ, యాలకుల టీ, తులసి టీ, గ్రీన్ టీ మాత్రమే కాదు.. సరికొత్త రుచుల్లో భారతీయ తేనీరు

ఫొటో సోర్స్, Dweller
- రచయిత, ప్రీతి గుప్త, బెన్ మోరిస్
- హోదా, బీబీసీ బిజినెస్
మణిపూర్‌కు చెందిన బీనా నాంగ్‌థోమ్‌బం అడవిలో దొరికిన పళ్ళు, పూలను స్థానిక మార్కెట్‌లో అమ్ముతూ ఉండేవారు.
కానీ, ఆమె జీవితం గడవడం కష్టంగా ఉండేది. "నేను రోజంతా మార్కెట్ లో కూర్చున్నా కూడా తినడానికి సరిపడే ఆదాయం వచ్చేది కాదు" అని చెప్పారు.
కొన్ని తరాలుగా వారి కుటుంబాలు ఇదే తరహా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు.
కానీ, ఆమె అమ్ముతున్న ఉత్పత్తులను చూసి ఆకర్షితురాలైన ఆమె కస్టమర్ 2018లో ఆమెకొక ఉద్యోగాన్నిచ్చారు. దీంతో, ఆమె జీవితం మారిపోయింది.
అప్పటి నుంచి ఆమె ఉత్పత్తులను "డ్వెల్లర్ టీస్" అనే సంస్థ కోసం సేకరిస్తున్నారు. తేనీరు, ఇతర ఉత్పత్తుల్లో వాడేందుకు మర్చిపోయిన, అసాధారణమైన భారతీయ మొక్కలు, పూలతో వ్యాపారం చేసే ఒక స్టార్టప్ ఈ సంస్థ.
నాంగ్‌థోమ్‌బం ఆలివ్, రోసెల్, సుమాక్ బెర్రీలు లాంటి వాటిని సేకరించేందుకు పొద్దునే గ్రామాలకు వెళతారు. వీటిని కొన్ని రైతులు పండిస్తారు. మరి కొన్ని అడవుల్లో దొరుకుతాయి.
తనకు కావల్సిన ఉత్పత్తులను సేకరించేందుకు కొన్ని మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు ఆమె బస్సుల్లో వెళతారు. వాటిని కొని ఆటోలో కానీ, మూడు చక్రాల ట్యాక్సీలో కానీ వెనక్కి తీసుకుని వస్తారు.
"ఇలా అడవిలో పూలు, పళ్ళను సేకరించడం నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. మేము చిన్నప్పటినుంచీ వీటిని సేకరిస్తున్నాం. వీటి గురించి ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తప్ప ఎవరికీ తెలియదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Dweller Teas
ఎలి యాంబెం 2016లో డ్వెల్లర్ టీస్ అనే సంస్థను 25000 డాలర్ల (సుమారు రూ. 18లక్షల) పెట్టుబడితో స్థాపించారు. ఆమెకిప్పుడు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మూడు కెఫెలు ఉన్నాయి.
"తేయాకు ఈ ప్రాంతంలో ఒక బలమైన పంట" అని ఆమె అంటారు. "ఇక్కడ చాలా దేశీయ మొక్కలు కూడా ఉన్నాయి. వీటిని ప్రపంచానికి తెలియచేసి వాటి మనుగడను కొనసాగించేలా చేయాలి" అని అన్నారు.
"దేశీయ మొక్కల గురించి సంప్రదాయ పరిజ్ఞానం, వాటి జ్ఞాపకాలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. ఈ దేశీయ సంస్కృతులను పరిరక్షించి, వాటిలో దాగిన మేలును, వినూత్నమైన రుచులను అందరికీ పంచాలని అనుకుంటున్నాను".
నోంగ్ మాంగ్ఖా అనే వేరు గురించి యాంబెంకు చిన్నప్పుడు విన్నట్లు గుర్తుంది. దీనిని మణిపూర్‌లో సంప్రదాయ యాంటీ వైరల్ లక్షణాలున్న మొక్కగా పరిగణిస్తారు. ఈ వేరు ఆకులను మరిగించి చేసిన కషాయాన్ని దగ్గు, జలుబు, జ్వరానికి ఔషధంగా మా నానమ్మ ఇవ్వడం నాకు గుర్తుంది".

ఫొటో సోర్స్, Dweller
కనీసం 70% టీ ఆకులున్న ఉత్పత్తులను మాత్రమే తేయాకుగా పరిగణిస్తున్నట్లు టీ బోర్డు ఆఫ్ ఇండియా చెబుతోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో వినూత్నమైన టీ, మూలికలతో కూడిన ఉత్పత్తులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి.
"టీ వ్యాపారంలో ఉత్సాహం అంతా ఈ ఉత్పత్తుల్లోనే దాగి ఉంది" అని టీ బోర్డు చైర్మన్ ప్రభాత్ బెజ్‌బౌరా చెప్పారు. ఇది చాలా పోటీ తత్వంతో కూడిన వ్యాపారం" అని చెప్పారు.
"ఇందులో చాలా స్టార్ట్ అప్స్ మొదలైన కొన్ని రోజులకే మూత పడతాయి. కానీ, ఉత్పత్తులకున్న ప్రాముఖ్యం, ప్రజల్లో ఉన్న ఆమోదాన్ని బట్టీ బిలియన్ డాలర్ల విలువైన సంస్థలుగా మారే అవకాశం కొన్ని సంస్థలకే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
విజయానికి కీలకం ఏంటి?
"సంప్రదాయ పానీయాన్ని కొత్తగా ప్రదర్శిస్తే చూడాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వినియోగదారుల అంచనాలను అందుకోగల్గితే బ్రాండ్ విజయం ఆధారపడి ఉంటుంది" అని బెజ్‌బౌరా చెప్పారు.
రంజిత్ , డాలీ శర్మ బరువా దంపతులు ఇలాంటి విజయం కోసమే ఆశిస్తున్నారు. వారు 2018లో టీ సంస్థ అరోమికాను స్థాపించారు. వారు చిన్న చిన్న తేయాకు తోటల నుంచి తేయాకును సేకరించి కొన్ని ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పే వినూత్నమైన మొక్కలు, పూలతో మేళవిస్తారు.

ఫొటో సోర్స్, Aromica
ఘోస్ట్ చిల్లీ, బ్లాక్ టీ రకాలను దగ్గు, జలుబుకు సూచిస్తారు. ఈ ఉత్పత్తులు కోవిడ్ సమయంలో బాగా అమ్ముడయ్యాయని చెప్పారు.
ఆరోమికా సంస్థ కూడా శంఖం పూలను, గ్రీన్ టీతో కలిపి నీలం రంగులో ఉండే తేనీటి పానీయాన్ని తయారు చేస్తారు.
ఆరోగ్యం గురించి ఆలోచించే వినియోగదారులను ఇటువంటి ఉత్పత్తులు ఆకర్షిస్తాయి. ఈ తరహా వినియోగదారులే వెల్‌నెస్ పరిశ్రమను శక్తివంతం చేశారని చెప్పవచ్చు .
"ఈ వ్యాపారంలో వెల్ నెస్, హెల్త్ డ్రింక్స్‌కు చాలా ప్రముఖ స్థానముంది" అని బరువా అన్నారు.
"ఈ మార్కెట్ ఎందుకు శోధించకూడదని అనుకున్నాం. ఇది మాకు చాలా అవకాశాలనిచ్చింది".
"వెల్‌నెస్ పరిశ్రమ కొత్తదేమీ కాదు. ఇప్పటికే టీ పరిశ్రమలో దిగ్గజాలైన టాటా టీ కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టింది.
ఇది భారతదేశంలో అతి పెద్ద టీ బ్రాండ్లలో రెండవది.
"కొత్త రకాల సమ్మేళనాలను ప్రయోగించేందుకు వినియోగదారులు కూడా ముందుకొస్తున్నారు" అని టాటా సంస్థ చెబుతోంది. ఈ సంస్థ గుడ్ ఎర్త్, టీ పిగ్స్ బ్రాండ్స్ లో పెట్టుబడులు పెట్టడంతో పాటు, భారతదేశంలో టాటా శ్రేణిని కూడా విస్తరిస్తోంది.
ఈ రంగంలోకి పెద్ద సంస్థలు అడుగు పెట్టడంతో, పోటీని తట్టుకునేందుకు విభిన్నమైన ఉత్పత్తులను సరఫరా చేయాలని చిన్న స్టార్ట్ అప్స్‌కు తెలుసు.
అడవుల నుంచి ఉత్పత్తులను సేకరించేందుకు జీవిత కాలాన్ని వెచ్చిస్తున్న నాంగ్‌థోమ్‌బం ఇది మరిన్ని సంవత్సరాల వరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.
"నేను ఎలిజబెత్‌ను కలిసిన రోజు అదృష్టమైన రోజుగా భావిస్తాను. నా శక్తిని అర్ధం చేసుకుని నన్ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. నాకిప్పుడు జీతం వస్తోంది. నా కష్టానికి ప్రశంస లభిస్తోంది. ఇది నా జీవితాన్ని మలుపు తిప్పింది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:
- బప్పి లహిరి మరణానికి కారణమైన ఈ నిద్ర జబ్బు ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి?
- ఈ దోశ పూర్తిగా తింటే రూ. 71,000 మీవే
- హిప్పోక్రటిస్ ప్రమాణం ఏంటి? దీనికీ చరక శపథానికీ తేడా ఏంటి?
- గుడ్ మార్నింగ్ ధర్మవరం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటనల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమంటున్నారు?
- ‘నదీ జలాల్లో పారాసెటమాల్, నికోటిన్, కెఫీన్, డయాబెటిస్ మందుల ఆనవాళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











