Andhra Pradesh: పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఆ 11 సంస్థలు ఏమయ్యాయి.. వాటి పరిస్థితి ఏమిటి?

విద్యార్థులు
ఫొటో క్యాప్షన్, విద్యార్థులు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆమోదం పొంది ఎనిమిదేళ్లు దాటింది. ఆ చట్టంలోని 13వ షెడ్యూల్ సెక్షన్ 93 ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ లో సమాన విద్యావకాశాలు కల్పించేందుకు వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వాటిని 12, 13వ ప్రణాళికా కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్రణాళికలు రద్దుకావడం, నీతి అయోగ్ అమలులోకి వచ్చినప్పటికీ 10 ఏళ్లలో అంటే 2024 నాటికి వాటిని పూర్తి చేయాల్సి ఉంది. నిర్ణయించిన గడువుకి ఇంకా రెండేళ్ల లోపు మాత్రమే సమయం ఉంది. ఈ కాలంలో ఆయా విద్యాసంస్థల పరిస్థితి ఎలా ఉందన్నది బీబీసీ పరిశీలించింది.

విభజన చట్టం ప్రకారం ఏపీలో ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, ఎన్ ఐ టీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రో యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు కావల్సి ఉంది. ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ కూడా ఏపీలో సిద్ధం చేయాలని చట్టంలో పేర్కొన్నారు. ఏపీతో పాటుగా తెలంగాణాలో కూడా ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కూడా ఏపీలో రావాలి. తెలంగాణాలో ఉద్యానవన విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు కావాలి.

ఆంధ్రప్రదేశ్ కి 11 విద్యాసంస్థలు రావాల్సి ఉండగా అవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది చూడాల్సి ఉంది.

ఐఐటీ తిరుపతి

ఫొటో సోర్స్, UGC

1. ఐఐటీ తిరుపతి

ఏపీకి కేటాయించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ని తిరుపతి సమీపంలో ఏర్పాటుకి పూనుకున్నారు.

548.11 ఎకరాల స్థలం కేటాయించారు. మూడు దశల్లో నిర్మాణం పూర్తి చేయాలని ప్రణాళికలు వేశారు. తొలిదశ పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు.

2015-16లోనే క్లాసులు ప్రారంభమయ్యాయి. 106గురు విద్యార్థులతో తొలి విద్యాసంవత్సరం ప్రారంభించారు. 2020-21 విద్యాసంవత్సరంలో 1250 మందికి పెరిగారు.

తిరుపతి- రేణిగుంట రోడ్డులో తాత్కాలిక భవనాల్లో తొలుత క్యాంపస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం క్యాంపస్ భవనాలు నిర్మాణదశలో ఉన్నాయి. కొన్ని భవనాలు పూర్తి చేశారు. అందుకు తగ్గట్టుగా కొన్ని కార్యకలాపాలు శాశ్వత సొంత భవనాల్లో నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిగా సొంత భవనాల్లో నిర్వహిస్తామని చెబుతున్నారు.

ఐఐఎం విశాఖపట్నం

2. ఐఐఎం విశాఖపట్నం

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) విశాఖపట్నంలో ప్రారంభించారు. 2015లోనే కార్యకలాపాలు మొదలయ్యాయి.

విశాఖ నగరానికి సమీపంలో గంభీరం గ్రామ పరిధిలో 241 ఎకరాల భూమి కేటాయించారు. క్యాంపస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం తాత్కాలికంగా క్లాసులు, హాస్టల్ కూడా ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నాలుగు బ్యాచ్ లు తాత్కాలిక క్యాంపస్ నుంచే పాస్ అవుట్ కావడం విశేషం.

2022-23 విద్యాసంవత్సరం సొంత భవనాల్లో నిర్వహించాలని భావించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు అందుకు తగ్గట్టుగా జరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు.

విద్యార్థులు
ఫొటో క్యాప్షన్, విద్యార్థులు

3. ఐఐఐటీడీఎం కర్నూలు

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యూఫాక్చరింగ్ (ఐఐఐటీడీఎం) కర్నూలులో ఏర్పాటయ్యింది.

తొలుత తమిళనాడులోని కాంచీపురం ఉన్న ఐఐఐటీడీఎంలో భాగంగా 2015లో ప్రారంభించారు. 2018లో కర్నూలుకి తరలించారు. కర్నూలులో ఈసంస్థ కోసం ఏపీ ప్రభుత్వం 151 ఎకరాలు కేటాయించింది. వివిధ పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. క్లాసులు సొంత భవనాల్లో జరుగుతున్నాయి. కానీ వసతి మాత్రం తాత్కాలికంగా ప్రైవేటు సంస్థలకు చెందిన భవనాల్లో ఏర్పాటు జరిగింది. త్వరలోనే వాటిని పూర్తి చేసి శాశ్వత భవనాల్లోకి మారుస్తామని చెబుతున్నారు.

ఎన్ఐటీ తాడేపల్లిగూడెం
ఫొటో క్యాప్షన్, ఎన్ఐటీ తాడేపల్లిగూడెం

4. ఎన్ఐటీ తాడేపల్లిగూడెం

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ (ఎన్ఐటీ)ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేశారు.

తొలుత అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు. 2016లో శాశ్వత భవనాలకు శంకుస్థాపన జరిగింది. తొలి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

మొత్తం ఈ విద్యాసంస్థలన్నింటిలోనూ పూర్తిగా ఓ రూపం కనిపిస్తున్న సంస్థ ఇదే.

సుమారుగా రూ. 416 కోట్లను వెచ్చించి క్లాసులు, హాస్టళ్లతో పాటు ఇతర వసతుల కల్పన కొంత వరకూ జరిగింది. రెండోదశలో మరో రూ. 750 కోట్ల సుమారుగా నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఆమేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్టు ఎన్ఐటీ తాడేపల్లిగూడెం డైరెక్టర్ సీఎస్సీ రావు బీబీసీకి తెలిపారు.

ఎన్ఐటీ తాడేపల్లిగూడెం డైరెక్టర్ సీఎస్సీ రావు
ఫొటో క్యాప్షన్, ఎన్ఐటీ తాడేపల్లిగూడెం డైరెక్టర్ సీఎస్సీ రావు

ఎన్ఐటీ తాడేపల్లిగూడెంలో 2600 మంది వరకూ విద్యార్థులున్నారు. వారిలో 150 మంది విదేశీ విద్యార్థులు సైతం ఉన్నారు. 2019 నుంచి సొంత భవనాల్లో క్లాసులు జరుగుతున్నాయి. రెండో దశ నిర్మాణ పనులు పూర్తయితే ఆధునిక పరిశోధనశాలలతో పాటుగా ఇతర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నారు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంద్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంద్రప్రదేశ్

5. ఐఐఎస్ఈఆర్ తిరుపతి

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ని తిరుపతిలో ప్రారంభించారు.

ఈ విభాగంలో దేశంలో ఏడో సంస్థ ఇది. 2015లోనే తాత్కాలిక అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించారు. ఏర్పేడు మండలంలోనే ఐఐటీ తిరుపతికి సమీపంలో శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు. 2020లో నిర్మాణ పనులు వేగవంతమయినట్టు అధికారికంగా ప్రకటించారు. 540 మంది విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, హాస్టల్ వసతి కూడా సిద్ధమయినట్టు తెలిపారు. ప్రస్తుతం తరగతులు సొంత భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

వీడియో క్యాప్షన్, చంద్రంపాలెం హైస్కూల్: కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ బడికి పంపిస్తున్నారు

6. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అనంతపురంలో ఏర్పాటు చేశారు.

2015 నుంచి తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. జేఎన్టీయూకి చెందిన భవనంలో క్లాసులు, హాస్టల్ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ సమస్యలతో విద్యార్థులు పలుమార్లు ఆందోళనలకు పూనుకున్నారు.

శాశ్వత భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 491 ఎకరాల భూమిని 2019లో ఏపీ ప్రభుత్వం అప్పగించింది. కానీ కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయింపులు ఆశించినట్టుగా కనిపించడం లేదు. దాంతో ఈ యూనివర్సిటీలో విద్యార్థులు అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీ నిర్మాణం పూర్తిచేయాలంటే రూ. 1500కోట్లు సుమారుగా కేటాయించాలి. కానీ 2020-21 బడ్జెట్ లో రూ. 60.35 కోట్లు కేటాయించింది అందులో ఖర్చు చేసింది రూ 20.11 కోట్లు. అంతకుముందు బడ్జెట్లో రూ. 4.85కోట్లు వచ్చాయి. అది నిర్వహణ ఖర్చులకే సరిపోయింది ఈసారి బడ్జెట్ లో రూ. 56.66 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు. వాస్తవ కేటాయింపులు అందులో సగం కూడా ఉండవు. ఈ లెక్కన యూనివర్సిటీ సిద్ధంకావాలంటే ఇరవై ఏళ్లు పడుతుంది అంటూ విద్యార్థిని ఎస్ సాయిలక్ష్మి బీబీసీతో అన్నారు.

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అరకొర వసతి, తాగునీటి కొరత వంటి పలు సమస్యలున్నాయని ఆమె వివరించారు.

విద్యార్థులు

7. ఐఐపీఈ, వైజాగ్

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ)ని విశాఖకి కేటాయించారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ రంగ ఆయిల్, నేచురల్ గ్యాస్ సంస్థలు నడిపే సంస్థ ఇది. అటానమస్ విద్యాసంస్థగా ఉంటుంది. 2016లో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ సంస్థ ఇన్నేళ్ల తర్వాత కూడా శాశ్వత భవనాలు రూపుదిద్దుకోలేదు. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలోనే తాత్కాలికంగా నడుపుతున్నారు. క్యాంపస్ నిర్మాణం కోసం సబ్బవరం సమీపంలో 210 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదనలు వచ్చాయి. ఎట్టకేలకు గత నెలలో సబ్బవరం మండలి వంగలి గ్రామ పరిధిలో 156.36 ఎకరాల భూమి కేటాయించారు.

పెట్రో యూనివర్సిటీగా పేర్కొనే ఈ సంస్థకు సొంత భవనాలు, ఇతర సదుపాయాల కల్పన దశగా ఇప్పటి వరకూ అడుగులు పడలేదు. ప్రయత్నాలు జరిగినా అవి ఫలితాన్నివ్వకపోవడంతో ఐఐపీఈ వైజాగ్ పూర్తి రూపం సంతరించుకోవడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. భూమి కేటాయింపులు జరగడంతో ఇక నిర్మాణ పనులు జరుగుతాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఇటీవల విశాఖ పర్యటనలో మీడియాకు తెలిపారు.

8. అగ్రికల్చర్ యూనివర్సిటీ

అగ్రికల్చర్ యూనివర్సిటీ ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లో ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ 1964లో ఏర్పాటు చేశారు. అది తెలంగాణ పరిధిలో ఉండటంతో రాష్ట్ర విభజన తర్వాత దాని పేరును ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ అని మార్చారు.

ఏపీలో అప్పటికే గుంటూరుజిల్లా లామ్ వద్ద వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉంది. అందులోనే వ్యవసాయ యూనివర్సిటీ ప్రారంభించారు. తరగతులు జరుగుతున్నాయి.

2015లో పలు భవనాలకు శంకుస్థాపన జరిగింది. కొన్ని భవనాలు అందుబాటులోకి వచ్చాయి.

ఎయిమ్స్ మంగళగిరి
ఫొటో క్యాప్షన్, ఎయిమ్స్ మంగళగిరి

9. ఎయిమ్స్ మంగళగిరి

ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ని మంగళగిరిలో ప్రారంభించారు. 2015 నుంచి కొంతకాలం తాత్కాలికంగా విజయవాడలో నిర్వహించారు. గత ఏడాది మెడికల్ కాలేజీ నిర్వహణ, హాస్టల్ కూడా సొంత భవనంలోకి మార్చారు. భవనాలను సిద్ధం చేశారు. ఇక మెడికల్ సేవలకు సంబంధించి ఓపీ అందుబాటులోకి వచ్చింది. కొన్ని పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

‘‘పూర్తిస్థాయిలో ఎయిమ్స్ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం కార్యకలాపాలు జరుగుతున్నాయి. సొంత భవనాలు సిద్ధమయ్యాయి. ఇన్ పేషెంట్లకు అనుమతించాలంటే మరిన్ని సదుపాయాలు అవసరం. వాటిని సిద్ధం చేస్తున్నాము. ఓపీకి డిమాండ్ కనిపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి సైతం వస్తున్నారు. వీలయినంత త్వరగా ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నాం’’ అని ఎయిమ్స్ మంగళగిరి అసిస్టెంట్ ప్రొఫెసర్, మీడియా రిలేషన్స్ అధికారి శంకరన్ బీబీసీకి తెలిపారు.

వీడియో క్యాప్షన్, హరియాణా స్కూళ్లలో తెలుగు బోధన

10. ట్రైబల్ యూనివర్సిటీ

ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటులో తీవ్ర గందరగోళం ఏర్పడింది. తొలుత కొత్తవలస సమీపంలో 526 ఎకరాల భూమిని కేటాయించారు. కొన్ని పనులు కూడా చేశారు. కానీ గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. దానికి తగ్గట్టుగా పంపించిన ప్రతిపాదనల ఆమోదానికి జాప్యం జరిగింది. చివరకు విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో యూనివర్సటీ ఏర్పాటుకి కేంద్రం ఆమోదం లభించింది. దుగ్గి సాగరం గ్రామ సమీపంలో 354 ఎకరాల విస్తీర్ణం భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది

2019లో యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విజయనగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ సెంటర్ లో ప్రస్తుతం క్లాసులు జరుగుతున్నాయి. తాత్కాలిక వసతి కారణంగా అరకొర సదుపాయాలతో నెట్టుకురావాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.

ఏపీకి కేంద్రం కేటాయిచిన విద్యాసంస్థల్లో ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభమే ఆలస్యమయ్యింది. భూముల కేటాయింపు, కేంద్రం అనుమతి వంటి ప్రక్రియ మరింత ఆలస్యమయ్యింది. ఇక త్వరలో శాశ్వత భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని యూనివర్సటీ అధికారులు చెబుతున్నారు. దాంతో కొత్త భవనాలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

ఆంధ్రా యూనివర్సిటీ
ఫొటో క్యాప్షన్, ఆంధ్రా యూనివర్సిటీ

11. ఎన్ఐడీఎం సదరన్ క్యాంపస్

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఎన్ఐడీఎం) సదరన్ క్యాంపస్ పేరుతో ఏపీకి సంస్థను కేటాయించారు. గన్నవరం సమీపంలోని కొండపావులూరు గ్రామంలో ఈ సంస్థ నిర్మాణం కోసం 2018లోనే శంకుస్థాపన చేశారు. కానీ పనులు ముందుకు సాగలేదు. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి అక్కడ కార్యకలాపాలు మొదలవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీలో ఈ సంస్థ కార్యాలయం ఉంది. శిక్షణ కార్యక్రమాలు కూడా కొన్ని నిర్వహించారు.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి కేటాయించిన 11 సంస్థలకు గానూ దాదాపుగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తాడేపల్లిగూడెంలోని ఎన్ఐటీ, మంగళగిరిలోని ఎయిమ్స్ మాత్రం దాదాపుగా రూపుదిద్దుకున్నాయి. గుంటూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా అదే రీతిలో కనిపిస్తోంది. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీడీఎం కర్నూలు, ఐఐసీఈఆర్ తిరుపతి వంటివి సొంత భవనాల్లో కార్యకలాపాలు కొంత మేరకు నిర్వహిస్తున్నాయి. ఐఐఎం విశాఖపట్నం తాత్కాలిక భవనాల్లో సాగుతూ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధుల లేమి కనిపిస్తోంది. విశాఖలోని పెట్రో యూనివర్సిటీ, విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్ వర్సిటీ నిర్మాణాలకు ఇటీవలే భూములు కేటాయించారు. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఎన్ఐడీఎం కూడా నిర్మాణ దశలోనే ఉంది.

వీడియో క్యాప్షన్, మారుమూల ప్రాంత విద్యార్థుల కోసం ముగ్గురు యువకులు నెలకొల్పిన పాఠశాల

‘సెంట్రల్ సంస్థల ప్రతిష్టతకు అనుగుణంగా ఉండాలి’

‘‘కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలంటే ప్రతిష్టాత్మకంగా ఉండాలి. కానీ అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ, విజయనగరం ట్రైబల్ వర్సిటీ, ఏయూలోని పెట్రో యూనివర్సిటీ వంటి వాటి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. పదేళ్లలో పూర్తికావాల్సిన సంస్థల నిర్మాణ పనులు కూడా ఇంకా కొన్ని ప్రారంభించలేదు. పనులు మొదలుపెట్టినప్పటికీ, వాటిని కూడా ఎప్పటికి పూర్తి చేస్తారో స్పష్టత లేదు. విద్యా సంస్థల మీద నిర్లక్ష్యం తగదు. కేంద్రం వాటిని పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలి’’ అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కే ప్రసన్నకుమార్ కోరుతున్నారు

ఈ సంస్థలన్నీ పూర్తికావాలంటే సుమారుగా రూ. 15వేల కోట్లు అవసరం అవుతాయని, కానీ ఇప్పటి వరకూ కేవలం రూ. 2వేల కోట్లు సుమారుగా కేంద్రం నుంచి విడుదల కావడం చూస్తుంటే విద్యాసంస్థల పట్ల ప్రభుత్వ తీరు స్పష్టమవుతోందని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో భాగంగా ఏపీకి అనేక విధాలుగా నిధులు కేటాయిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా దాదాపుగా అన్నీ అందుబాటులోకి వచ్చాయని, నిర్మాణాలు పూర్తి చేసి త్వరలోనే సదుపాయాలు మెరుగుపరుస్తారని ఆయన బీబీసీకి తెలిపారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)