విజయవాడలో హిజాబ్ వివాదం, ఆంధ్ర లయోలా కాలేజీలో అసలేం జరిగింది

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
బురఖా ధరించి కాలేజీకి వచ్చిన ఇద్దరు విద్యార్థినులను కరస్పాండెంట్ అడ్డుకున్నారు. వారు కాలేజీకి ఆలస్యంగా వచ్చినందుకు నిలదీసినట్టు యాజమాన్యం చెబుతోంది.
తమ సంప్రదాయ దుస్తులను తొలగించాలని ఆదేశించారని విద్యార్థినులు ఆరోపించారు. నిర్దేశించిన యూనిఫాంతో మాత్రమే క్లాసులకు హాజరుకావాల్సి ఉంటుందని కరస్పాండెంట్ చెబుతున్నారు. చాలాకాలంగా అనుసరిస్తున్న దానికి ఇప్పుడే అడ్డుచెబుతున్నారని విద్యార్థినులు అంటున్నారు.
ఈ వ్యవహారంలో ముస్లిం మత పెద్దలు జోక్యం చేసుకున్నారు. పోలీసులు రంగంలో దిగారు. చివరకు విద్యార్థినులను తమ సంప్రదాయ దుస్తులలోనే క్లాసులకు అనుమతించారు.
విజయవాడ నగరంలోని ఆంధ్ర లయోలా కాలేజీలో జరిగిన ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే హిజాబ్ చుట్టూ వివాదం సాగుతున్న తరుణంలో తాజా ఆంక్షలు కలకలం రేపాయి.
గురువారంనాడు వారిని క్లాసులకు అనుమతించినప్పటికీ ఈ వివాదం పూర్తిగా ముగిసినట్టు కనిపించడం లేదు. నిబంధనలు పాటించాల్సిందేనని కరస్పాండెంట్ చెబుతుండగా, సంప్రదాయ హిజాబ్ వివాదం రాజేసి కర్ణాటక మాదిరిగా రచ్చకు అవకాశం ఇవ్వొద్దని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు.

'ఆలస్యంగా రావడంతోనే వివాదం'
ఆంధ్రా లయోలా కాలేజీ విద్యాసంస్థలు క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. విజయవాడలో డిగ్రీ కాలేజీని 1954లో ప్రారంభించారు. ఇది ప్రైవేటు సంస్థగా నడుస్తోంది.
ఈ సంస్థ ఆధ్వర్యంలో వివిధ కాలేజీలు, పలు కోర్సులు అందిస్తున్నాయి. అన్ని కాలేజీలలోకి సంప్రదాయ దుస్తులతో వస్తున్న వారిపట్ల ఎటువంటి ఆంక్షలు లేవు. కొందరు బురఖాలు వేసుకుని క్లాసులకు హాజరుకావడం, అత్యధికులు హిజాబ్ ధరించి రావడం చాలాకాలంగా జరుగుతోంది.
గురువారం ఉదయం క్లాసులకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు బీఎస్సీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు క్లాసు రూమ్ బయట నిలబడి ఉండగా కరస్పాండెంట్ కిషోర్ కుమార్ వారిని చూశారు.
బురఖాలతో ఉన్న ఇద్దరిని క్లాసులోకి అనుమతించడానికి ఆయన అభ్యంతరం చెప్పారు. వెయిటింగ్ రూంకి వెళ్లి, బురఖా తొలగించి క్లాసుకి వెళ్లాలని ఆయన వారిని ఆదేశించారు.
బురఖాతో పాటుగా హిజాబ్ కూడా తీసేయాలని ప్రిన్సిపల్ ఆదేశించారంటూ విద్యార్థిని పఠాన్ సాధిఖ్ ఉన్నీసా చెబుతోంది.
'మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే డ్రస్సులో వస్తున్నాం. మా ఐడీ కార్డులు కూడా అలానే తీసుకున్నాం. ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఈరోజు మాత్రం బురఖా ఉందని క్లాసులకు వద్దన్నారు. కరస్పాండెంట్ ఫాదర్ కిషోర్ కుమార్ అడ్డు చెప్పారు.
ఇటీవల కర్ణాటకలో వివాదం అయినప్పటి నుంచి మేము వేసుకొస్తున్నామని ఆయన అన్నారు. మొదటి నుంచి మేము ఇలానే వస్తున్నామని చెప్పినా ఆయన వినలేదు. ఆయన ఆంక్షలు పెట్టడం కుదరదని చెప్పాం' అంటూ ఆమె వివరించారు.

'బురఖాతో పాటు హిజాబ్ కూడా తీసేయాలన్నారు'
'ముస్లిం మతాచారాల ప్రకారం సంప్రదాయ దుస్తుల్లో వస్తున్నారు. ఇది ఇవాళ కొత్తకాదు. హిజాబ్ కూడా వద్దన్నారు. దానికి వ్యతిరేకంగా యాజమాన్యం మాట్లాడారు. హిజాబ్ వద్దంటే పిల్లలు చదువులకు కూడా రాలేరు. అది లేకుండా ముందుకెళ్లలేని పరిస్థితి మా ఆచారంలో ఉంది'
'ముస్లింలతో పాటుగా అందరూ స్కార్ఫ్ ధరిస్తున్నారనే విషయం గుర్తించాలి. ఆలస్యంగా వస్తే రేపటి నుంచి అలా రాకుండా చర్యలు తీసుకోవాలి. దానికి తగిన రీతిలో వ్యవహరించాలి. కానీ ఆలస్యంగా వచ్చారనే కారణంగా హిజాబ్ అంశాన్ని ముందుకు తీసుకురావడం సరికాదు'
'అందుకే మేము జోక్యం చేసుకున్నాము. ఆ తర్వాత క్లాసులకు అనుమతించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి' అంటూ విజయవాడ నగరపాలక సంస్థ కార్పోరేటర్ రిహానా నహీద్ బీబీసీకి తెలిపారు.
విద్యార్థినులను బురఖా కారణంగా క్లాసులకు అనుమతించలేదనే సమాచారం అందుకున్న కొందరు ముస్లిం మత పెద్దలు కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఆందోళనకు దిగుతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. చివరకు పలువురు నేతలు చర్చించిన తర్వాత విద్యార్థినులను అనుమతించడంతో వివాదం తాత్కాలికంగా ముగిసింది.

'నిబంధనలు పాటించాల్సిందే'
'కాలేజీలో చేరినప్పుడే నిబంధనలు పాటిస్తామని అంగీకరించారు. విద్యార్థినులతో పాటుగా తల్లిదండ్రులు కూడా వాటి మీద సంతకాలు పెట్టారు. కానీ ఇప్పుడు సంప్రదాయ దుస్తులంటే మా నిబంధనలు అనుమతించవు. అందుకే క్యాంపస్‌కి బురఖాతో వచ్చినప్పటికీ క్లాసులకు మాత్రం వాటిని తొలగించే వస్తున్నారు'
'చాలాకాలంగా అదే జరుగుతోంది. అలానే రావాలని చెప్పాము. దానిని కొందరు వివాదంగా మార్చాలని చూశారు. నిబంధనలు అనుసరించి యూనిఫాం పాటించాలి. అలా చేస్తే అభ్యంతరం ఉండదు' అంటూ కరస్పాండెంట్ కిషోర్ కుమార్ బీబీసీతో అన్నారు.
బురఖా తీసి క్లాసులకు వెళ్లాలనే తాను చెప్పానని, దానికి తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వస్తాయని చెప్పడంతో వారిని తీసుకుని రావాలని పిల్లలకు చెప్పినట్టు ఆయన వివరించారు. ఆ సందర్భంగా విద్యార్థినులు తీసుకొచ్చిన వారి కారణంగా సమస్య ఏర్పడిందని ఆయన తెలిపారు.
మిగిలిన క్లాసు రూముల్లో బురఖా, హిజాబ్ ధరించిన విద్యార్థులు ఉండడాన్ని బీబీసీ గమనించింది. దాని మీద కరస్పాండెంట్‌ని ప్రశ్నించగా ఇప్పుడు వాటి మీద మాట్లాడలేనని, ప్రస్తుతం సమస్య పరిష్కారమయ్యిందని మాత్రం తెలిపారు.
నిబంధనలు పాటించాల్సిందేనని ఆయన చెబుతుండడం, సంప్రదాయ దుస్తులను అనుమతించాలని ముస్లిం సంఘాలు కోరుతుండడం మూలంగా లయోల కాలేజ్ వివాదం ఎటు మళ్లుతుందోననే అంశం ఆసక్తిగా మారింది.
పోలీసుల జోక్యం
హిజాబ్ వివాదం ఏర్పడిందనే అంశం పోలీసుల దృష్టికి రాగానే విజయవాడ నగర కమిషనర్ జోక్యం చేసుకున్నారు. కాలేజీ వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. డీసీపీ హర్షవర్థన్ నేరుగా కాలేజీకి వచ్చారు. కరస్పాండెంట్‌తో మాట్లాడారు. నగరంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో సెక్యూరిటీ పనుల్లో ఉన్న పోలీసులు ఈ వివాదం ప్రస్తుతానికి ముగిసినట్టేనని వెల్లడించారు.
ఇప్పటికే కర్ణాటకలో హిజాబ్ వివాదంపై అక్కడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తీర్పు వెలువడే వరకూ యధాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఏ మతస్తులు కూడా ఆయా మతసూచికలతో విద్యాలయాలకు రాకూడదని స్పష్టం చేసింది.
అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పు తర్వాతనే తాము జోక్యం చేసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇదే సమయంలో బురఖా, హిజాబ్ వివాదం ఏపీలో కూడా తెరమీదకు రావడం చర్చనీయాంశం అవుతోంది.

ఇవి కూడా చదవండి:
- ‘యుక్రెయిన్‌లో ఉండొద్దు, ఇండియా వెళ్లిపోండి’ - భారత పౌరులకు రాయబార కార్యాలయం సూచన
- న్యూడ్ వీడియో కాల్స్: ‘మీ ఇంట్లో కలుస్తారా? మా లొకేషన్‌కు వస్తారా…’
- యుక్రెయిన్: రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన ఈ నగరంలో ఇప్పుడు ఏం జరుగుతోంది?
- అరుంధతీ రాయ్: 'బీజేపీ ఒక నియంత పార్టీ, మోదీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఫాసిజం వైపు నడిపిస్తోంది'
- భారీ విగ్రహాలను చైనా నుంచే ఎందుకు తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేయలేరా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















