Statue Of Equality - రామానుజాచార్యులు: భారీ విగ్రహాలను చైనా నుంచే ఎందుకు తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేయలేరా

హైదరాబాద్‌లోని రామానుజాచార్య విగ్రహం కూడా చైనాలో చేసిందే

ఫొటో సోర్స్, @KTRTRS

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని రామానుజాచార్య విగ్రహం కూడా చైనాలో చేసిందే
    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో ఇటీవలే ఆవిష్కరించిన రామానుజాచార్యుడి విగ్రహాన్ని తయారు చేసింది ఓ చైనా కంపెనీ. ఇందుకు 7వేల టన్నుల పంచలోహలను ఉపయోగించారు.

అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణంలో కూడా చైనా కంపెనీల పాత్ర ఉంది.

తెలంగాణలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం కోసం 2017లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఒక బృందాన్ని చైనాకు పంపించింది తెలంగాణ ప్రభుత్వం.

విజయవాడలో ఏర్పాటు చేయనున్న అంబేడ్కర్ భారీ విగ్రహం కోసం చైనా కంపెనీలనే సంప్రదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి భారీ విగ్రహాలు అనగానే అందరూ చైనా వైపే ఎందుకు చూస్తున్నారు? భారత్‌లో వాటిని తయారు చేయడం సాధ్యం కాదా?

గుజరాత్‌లో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గుజరాత్‌లో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం

భారీ విగ్రహాల తయారీకి చైనానే ఎందుకు?

అత్యంత ఎత్తైన లేదా భారీ విగ్రహాలను తయారు చేయడంలో చైనా కంపెనీలకు మంచి నైపుణ్యం ఉందనేది నిపుణుల మాట. ప్రధానంగా భారీ కాంస్య విగ్రహాలను నిర్మించడంలో వాటికి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది.

సంప్రదాయ క్యాస్టింగ్ పద్ధతులకు ఆధునిక టెక్నాలజీని కలిపి భారీ స్థాయి విగ్రహాలను తయారు చేస్తున్నాయి చైనా కంపెనీలు. అత్యంత ఎత్తైన విగ్రహాలకు సంబంధించిన విడి భాగాలను సులభంగా పోత పోసేందుకు చైనాలోని ఫౌండ్రీలు అనువుగా ఉంటాయి.

పెద్ద పెద్ద ఫౌండ్రీల వల్ల తక్కువ సమయంలోనే విడి భాగాలను తయారు చేసే వీలు ఉంటుంది. చైనా కంపెనీలు ఎంతో కాలంగా భారీ విగ్రహాలను రూపొందిస్తున్నాయి. అవి నిర్మించిన ' స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ' వంటి భారీ విగ్రహాలు ఆ దేశ వ్యాప్తంగా మనకు కనిపిస్తాయి.

ఇలాంటి కారణాల వల్లే చైనా కంపెనీల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

తెలంగాణలో తలపెట్టిన భారీ అంబేడ్కర్ విగ్రహం కూడా చైనా నుంచి తెప్పిస్తున్నారు (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో తలపెట్టిన భారీ అంబేడ్కర్ విగ్రహం కూడా చైనా నుంచి తెప్పిస్తున్నారు (ఫైల్ ఫొటో)

డిజైన్ ఇన్ ఇండియా... మేడ్ ఇన్ చైనా

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని డిజైన్ చేసింది ఇండియాలోనే. అయితే 216 అడుగుల ఈ భారీ విగ్రహ నిర్మాణాన్ని ఓ చైనా కంపెనీకి అప్పగించారు. అలాగే సర్దార్ పటేల్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీని డిజైన్ చేసింది ప్రముఖ శిల్పి రామ్ వాంజీ సుతార్.

సుమారు 597 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం కోసం బ్రాంజ్ క్లాడింగ్‌ కాంట్రాక్ట్‌ను చైనా కంపెనీకి మెయిన్ కాంట్రాక్టర్ కంపెనీ ఎల్ అండ్ టీ అప్పజెప్పింది.

అయితే, ఆధునిక టెక్నాలజీలో భారీ స్థాయి విగ్రహాల విడిభాగాలను తయారు చేయడం చైనాలో సులభమే అయినా, వీటి తయారీలో మాత్రం భారతీయులే గైడ్ చేస్తారు.

ఎవరైతే చైనా కంపెనీలకు ఆర్డరు ఇచ్చారో వాళ్లే స్థపతు (శిల్పి)లను చైనాకు పంపుతారు. స్థపతుల ఆధ్వర్యంలోనే చైనా కంపెనీలు విడి భాగాలను తయారు చేయడం, తరలించడం, అనుసంధానం చేయడం లాంటివి చేస్తాయి.

ఇటీవలే ఆవిష్కరించిన రామానుజాచార్యుడి విగ్రహం విషయంలో జరిగింది ఇదే.

పార్లమెంటు సమీపంలో గాంధీ విగ్రహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్లమెంటు సమీపంలో గాంధీ విగ్రహం

ఇండియాలో సాధ్యం కాదా?

లోహాలతో విగ్రహాలను తయారు చేయడమనేది భారత్‌లో ఎప్పటి నుంచో ఉంది. సింధూ నాగరికత కాలం నాటి కాంస్య విగ్రహాలు తవ్వకాలలో లభించాయి.

నేటికీ లోహాలతో పోత పోసిన దేవతా విగ్రహాలు భారతదేశంలో భారీ స్థాయిలోనే తయారవుతుంటాయి. విదేశాలకు సైతం వాటిని ఎగుమతి చేస్తుంటారు.

కాకపోతే ఇవన్నీ సైజులో చాలా చిన్నవి. ఇంట్లో పెట్టుకోవడానికి మాత్రమే వీలుగా ఉంటాయి.

వందల అడుగుల ఎత్తులో తయారు చేయాలంటే ప్రత్యేకమైన టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. భారత్‌లో ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలకు తీవ్రమైన కొరత ఉందని రాజ్‌కుమార్ వడయార్ వంటి శిల్పులు అంటున్నారు.

ప్రభుత్వాలు ప్రోత్సహించి, సరైన సదుపాయాలు కల్పిస్తే భారీ విగ్రహాల నిర్మాణం ఇక్కడ కూడా పూర్తిగా సాధ్యమేనని ఆయన చెప్పుకొచ్చారు.

కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు చేపట్టగలిగే ఆర్థిక వనరులు భారతీయ శిల్పుల దగ్గర ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఆర్డర్లు ఇచ్చే వారు చూస్తున్నారని, అది కూడా చిన్నచిన్న సంస్థలకు అవరోధంగా మారుతోందని వడయార్ వివరించారు.

విగ్రహాల తయారీ భారతదేశంలో ఉన్నా, భారీ విగ్రహాల తయారీకి సరిపడా సౌకర్యాలు లేవు

ఫొటో సోర్స్, @narendramodi

ఫొటో క్యాప్షన్, విగ్రహాల తయారీ భారతదేశంలో ఉన్నా, భారీ విగ్రహాల తయారీకి సరిపడా సౌకర్యాలు లేవు

భారీ విగ్రహాలను ఎలా తయారు చేస్తారు?

లోహాలతో చేసే భారీ విగ్రహాలను ఒకేసారి పోత పోయడం సాధ్యం కాదు. విడివిడిగా భాగాలు తయారు చేసి, విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్న ప్రదేశానికి వాటిని తరలించి అసెంబుల్ చేస్తారు. పెద్ద విగ్రహాలు కాబట్టి, విడి భాగాలు భారీ సైజులో ఉంటాయి.

విగ్రహానికి సంబంధించి డిజైన్ పూర్తయిన తరువాత ఒక మోడల్‌ను తయారు చేస్తారు. దాన్ని 3డీ స్కానింగ్ చేసి కంప్యూటర్ డిజైనింగ్ ద్వారా కోరుకున్న సైజుకు ఇమేజ్‌ను పెంచుతారు.

కాలివేళ్ల నుంచి కంటి పాపల వరకు విగ్రహంలోని ప్రతి భాగం కొలతను కచ్చితంగా కాలిక్యులేట్ చేస్తారు. ఆ తరువాత ఆ కొలతల ఆధారంగా ఆయా భాగాలను పోత పోస్తారు.

అలా పోత పోసిన విడి భాగాలను షిప్‌ల ద్వారా తరలిస్తారు. చివరకు వాటిని అసెంబుల్ చేసి, మెరుగు పెట్టడంతో విగ్రహ నిర్మాణం పూర్తవుతుంది.

విగ్రహం సైజు, అందులో వాడే లోహాలు, తరలించే దూరం ఆధారంగా విగ్రహం ఖర్చు మారుతూ ఉంటుంది. ముచ్చింతల్‌లోని రామానుజాచార్యుడి విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.130 కోట్లు ఖర్చయింది.

వీడియో క్యాప్షన్, ఒక భారతీయ సైనికుడి విగ్రహాన్ని బ్రిటన్‌లో ఎందుకు పెట్టారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)