మహాత్మా గాంధీ: భారత జాతిపిత కరెన్సీ నోట్లు, అలంకార వస్తువులకే పరిమితం కానున్నారా?

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాంధీ విగ్రహానికి తుదిమెరుగులు దిద్దుతున్న కళాకారుడు
    • రచయిత, శుభజ్యోతి ఘోష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అహింసా, సత్యాగ్రహం అనే ఆయుధాలతో భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముందుండి నడిపించిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీకి జాతిపితగా గౌరవం లభించింది.

కానీ నేటి భారతదేశంలో ముఖ్యంగా గత ఏడున్నర సంవత్సరాల బీజేపీ పాలనలో గాంధీ ఆలోచనలు, ఆదర్శాలు ఎంతవరకు పాటిస్తున్నారనే ప్రశ్న పదే పదే తలెత్తుతోంది.

తాజాగా, జాతిపిత 150వ జయంతి ఉత్సవాలు సాధాసీదాగా ముగిశాయి.

మరోవైపు గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను బహిరంగంగా స్తుతిస్తూ, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కొన్ని హిందుత్వ శక్తులు, ఓ బీజేపీ ఎంపీ కూడా గాడ్సేను కీర్తించడంలో పాలుపంచుకున్నారు. ఈ ఏడాది గాంధీ జయంతి రోజున గాడ్సే బయోపిక్‌ను రూపొందించనున్నట్టు బాలీవుడ్ కూడా ప్రకటించింది.

నేటి భారతదేశంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, జాతిపిత గుర్తింపు అంతరించిపోతోందా?

నాథూరామ్ గాడ్సే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఢిల్లీలోని హిందూ మహాసభ కార్యాలయంలో నాథూరామ్ గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు

గాడ్సేకు విగ్రహం

గాంధీ హత్యకు కుట్రదారులుగా ఉన్న హిందూ మహాసభ ఇప్పటికీ మధ్య భారతదేశంలోని గ్వాలియర్‌లో చురుకుగా ఉంది. దీని ప్రభావం కూడా ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ.

ఏడాది క్రితం గ్వాలియర్‌లోని హిందూ మహాసభ కార్యాలయంలో గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

1949 నవంబర్ 15న, గాంధీ హత్యకు పాల్పడిన నారాయణ్ ఆప్టే, నాథూరామ్ గాడ్సేలను అంబాలా సెంట్రల్ జైలులో ఉరితీశారు.

ప్రతి సంవత్సరం ఈ రోజును హిందూ మహాసభ 'బలిదాన్‌ దివస్‌' (త్యాగ దినం)గా జరుపుతోంది. ఆలయంలో పూజలు కూడా జరుగుతాయి. వీరి విగ్రహాలకు పాలు, నెయ్యితో అభిషేకం చేస్తారు.

హిందూ మహాసభ ఆ రోజు మీడియాకు ఫోన్ చేసి 'షహీద్' నారాయణ్ ఆప్టే, 'షహీద్' నాథూరామ్ గాడ్సేలపై తమ గౌరవాన్ని తెలియజేయడానికి గుడి కట్టడం గర్వంగా ఉందని చెప్పడం కొసమెరుపు.

భారతదేశంలో విగ్రహారాధన శిక్షార్హమైన నేరం కానప్పటికీ, భారతదేశ జాతిపితను హత్యచేసిన వ్యక్తికి బహిరంగంగా నివాళులర్పించడం కొన్నేళ్ల క్రితం వరకు ఊహించలేనిది.

అయితే ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గాడ్సే వల్ల దేశానికి ఎంత మేలు జరిగిందో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టే

ఫొటో సోర్స్, BETTMANN

ఫొటో క్యాప్షన్, విచారణ సమయంలో నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టే (వరుసగా ఎడమ నుండి మొదటి, రెండవ వ్యక్తులు)

గాడ్సే 'దేశభక్తుడు' అంటూ కితాబు

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో, భోపాల్ నుండి బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గాడ్సేను 'దేశభక్తుడు' అనడానికి వెనుకాడలేదు.

ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎంపీగా, పార్లమెంటరీ డిఫెన్స్ అఫైర్స్ ప్యానెల్‌ సభ్యురాలిగా పని చేశారు.

గాడ్సే గురించి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన ఆ ప్రకటనను తాను ఎప్పటికీ క్షమించనని ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, వాస్తవానికి ఆమెపై ఎటువంటి చర్య తీసుకోలేదు.

ప్రస్తుతం ఎంపీగా ఉన్న ప్రజ్ఞా సింగ్, ఆ తర్వాత పార్లమెంట్‌లో లేచి నిలబడి గాడ్సేను దేశభక్తుడంటూ కొనియాడారు.

''గొప్ప వ్యక్తి నాథూరామ్ గాడ్సే గాంధీ హత్య ఆరోపణలపై కోర్టు ముందు తన వాదనలను ఎలా వినిపించారో తెలుసా'' అంటూ ఫేస్‌బుక్‌ పోస్టులు లేదా వాట్సాప్‌లో నిరంతరం షేర్ అవుతూనే ఉన్నాయి.

ఇక బీజేపీ హయాంలో హిందూ మహాసభ నాయకులు వినాయక్ దామోదర్ సావర్కర్‌కు జాతీయ హీరో హోదా ఇస్తున్నారు.

దశాబ్దం క్రితం అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం పేరును 'వీర్ సావర్కర్'గా మార్చింది.

బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్

'గాడ్సే అభిమానులు బీజేపీ వారు కాదు'

గాడ్సేను పొగిడే వారికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ పాలసీ రీసెర్చ్ సెల్ సభ్యులు, విధాన రూపకర్త అనిర్బన్ గంగూలీ పేర్కొన్నారు.

"గాడ్సేకి సమ్మతి తెలిపే లేదా అభిమానించే ఓ వర్గం ఎప్పుడూ ఉంటుంది" అని ఆయన బీబీసీకి తెలిపారు.

"గాంధీని ఎందుకు చంపాల్సివచ్చిందో గాడ్సే తన వాదనను చెప్పారు. కొందరు ఆయనతో ఏకీభవించవచ్చు, కొందరు వ్యతిరేకించవచ్చు".

''గాడ్సేను దేశభక్తునిగా పరిగణిస్తారా లేదా అనేది ప్రజల ఇష్టం. కానీ ఈరోజుల్లో సోషల్ మీడియాతో ఇలాంటివి కూడా అందరికీ తెలిసిపోతున్నాయి. ఇంతకుముందు ప్రజలకు ఇలాంటి విషయాలు తెలిసేవి కావు".

"బీజేపీ ఎప్పుడూ గాడ్సేను పూజించలేదు. గాడ్సే స్వయంగా హిందూ మహాసభను లేదా సావర్కర్‌ను కూడా తన జీవితాంతం తిరస్కరించారు".

వీడియో క్యాప్షన్, గాంధీ ఆశ్రమం... గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం

'గాడ్సే​కి మద్దతిచ్చేవారిది బీజేపీ డీఎన్‌ఏనే'

బీజేపీ-ఆర్ఎస్ఎస్-జన సంఘ్-హిందూ మహాసభలు, గాడ్సే-సావర్కర్ల తత్వాలు, వాస్తవానికి ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని మాజీ బ్యూరోక్రాట్, ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జవహర్ సర్కార్ అన్నారు.

"గాడ్సే తొలుత ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యులు, కానీ తరువాత తీవ్రవాద సంస్థ అయిన హిందూ మహాసభకు మారారు" అని ఆయన చెప్పారు.

"గాడ్సేకి రెండు డీఎన్‌ఏలు ఉన్నాయి. అవి ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ. సావర్కర్ ఆ సమయంలో హిందూ మహాసభ పనులను స్వయంగా చూసుకున్నారు" అని జవహర్ సర్కార్ అన్నారు.

''బీజేపీ డీఎన్‌ఏ సావర్కర్‌కు లేదా గాడ్సేకు అనుకూలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సావర్కర్ విగ్రహాన్ని చూసినప్పుడల్లా వంగి వంగి మోదీ పూజలు చేయడానికి కారణం ఇదే''.

''సావర్కర్ రచనలు, ప్రకటనలు చదివితే, ఆయన గాంధీ వ్యతిరేకి, శాంతి వ్యతిరేక వ్యక్తి అని మీకు అర్థమవుతుంది'' అని జవహర్ సర్కార్ తెలిపారు.

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్లమెంట్‌లో సావర్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన ప్రధాని మోదీ

గాంధీ స్పూర్తితో.. రైతుల ఉద్యమం

నాథూరామ్ గాడ్సేపై ప్రశంసలు సామాజికంగా ఆమోదం పొందుతున్నాయంటే, దేశం మహాత్మా గాంధీని కూడా మరిచిపోతోందా?

దేశంలోనే ప్రముఖ చరిత్రకారిణి, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మాజీ అధిపతి మృదులా ముఖర్జీ ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చారు.

గత ఏడాది కాలంగా గాంధీ చూపిన సత్యాగ్రహ, అహింసాయుత మార్గాన్ని ఈ దేశ రైతులు అనుసరిస్తున్నారంటే గాంధీని వారు స్మరించుకుంటున్నారని అర్థమవుతుందని ఆమె తెలిపారు.

గాంధీ ఆదర్శాలు అందరూ ఆచరించాలని లేదు. కానీ, ఆయన్ని హత్య చేసిన వ్యక్తిని నేడు అభిమానించడాన్ని మాత్రం మృదులా ముఖర్జీ అంగీకరించడానికి సిద్ధంగా లేరు.

"కోర్టులో ఉరిశిక్ష పడిన హంతకుడిని ఎలా పూజిస్తారు? అలాంటప్పుడు గాంధీ హత్యను సమర్థించినట్టు కాదా? మరి గాడ్సేని పొగిడే వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా?" అని ఆమె ప్రశ్నించారు.

ఈ ఘటనలపై భారతదేశంలో ఎక్కడా ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని గాంధీ మునిమనవడు, రచయిత తుషార్ గాంధీ అన్నారు.

''ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, నరేంద్ర మోదీలు ఒకే ఆలోచన, భావజాలం నుంచి వచ్చారని తెలిసిన వారు ఆశ్చర్యపోనక్కర్లేదు'' అని తుషార్ గాంధీ బీబీసీ బంగ్లాతో చెప్పారు.

"ఇంతకుముందు కూడా గాడ్సేని రహస్యంగా పూజించేవారు. కానీ దేశంలో అధికార ప్రభుత్వం కూడా ఆయన సిద్ధాంతాన్ని అనుసరిస్తుందని తెలిసినప్పుడు, వారు ఇక బహిరంగంగా ఆ పని చేస్తున్నారు. పిరికివాళ్ళు ఎప్పుడూ ఇలాగే చేస్తారు" అని తుషార్ గాంధీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, BJP

ఫొటో క్యాప్షన్, గాంధీ 150వ జయంతి సందర్భంగా బాలీవుడ్ తారలతో ప్రధాని మోదీ

గాంధీ, గాడ్సే.. బాలీవుడ్

జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బాలీవుడ్ తారలతో మోదీ కనిపించారు.

అమీర్ ఖాన్-షారుక్ ఖాన్ నుండి కంగనా రనౌత్, ఆలియా భట్, సోనమ్ కపూర్ వరకు అందరూ ఆ రోజు ప్రధాని పిలుపుతో ఒకే తాటిపైకి వచ్చారు.

గాంధీ సిద్ధాంతాలపై సినిమా తీయాలని నరేంద్ర మోదీ బాలీవుడ్‌ను కూడా కోరారు. కానీ ఆయన పిలుపు తర్వాత ఒక్క సినిమా కూడా రాలేదు.

దీనికి భిన్నంగా ఈ ఏడాది గాంధీ జయంతి నాడు బాలీవుడ్ నిర్మాత మహేష్ మంజ్రేకర్ గాడ్సే జీవితంపై సినిమా తీయనున్నట్టు ప్రకటించారు. ఆయన సావర్కర్ బయోపిక్ కూడా తీశారు.

నాథూరామ్ గాడ్సే కథ తనకు ఎప్పుడూ ఇష్టమన్నారు. గాడ్సే"మంచి వ్యక్తా, కాదా" అనేది తన సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు నిర్ణయం తీసుకోవాలని మహేష్ మంజ్రేకర్ కోరారు.

గాడ్సే బయోపిక్‌ను రూపొందించడానికి గాంధీకి ఇష్టమైన "రఘుపతి రాఘవ రాజా రామ్" అనే గీతాన్ని వీడియోలో వాడి ట్వీట్‌ చేశారు.

అయితే గాంధీ లేదా గాడ్సే ఎవరి దృక్కోణంలో సినిమా తీయడానికి ప్రయత్నిస్తారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

వీడియో క్యాప్షన్, వీడియో: దక్షిణాఫ్రికాలో గాంధీజీ వారసులు

రాజకీయ ప్రయోజనానికే గాంధీ జపం

మోహన్‌దాస్ గాంధీ గుజరాతీ గుర్తింపును నరేంద్ర మోదీ అసలు పట్టించుకోరని జవహర్ సర్కార్ అభిప్రాయపడ్డారు.

గాంధీపేరు జపించడం వల్ల రాజకీయ ప్రయోజనం ఉన్నందున వారు గాంధీని పూర్తిగా వదిలించుకోలేరని జవహర్ చెప్పారు.

"రెండవ కారణం మోదీ గుజరాత్ పట్ల పక్షపాతం. ఆయన దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ, ఆ రాష్ట్రంలో అంతా బాగానే ఉందంటూ గుజరాత్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తారు. గాంధీ కూడా గుజరాతీ కాబట్టి, మోదీ ఆయన ప్రస్తావనని ఒకేసారి పక్కన పెట్టడం కుదరదు".

"గాంధీ 150వ జయంతిని కూడా వారు అత్యంత సాదాసీదాగా జరిపారు. నేను సాంస్కృతిక శాఖలో ఉన్నప్పుడు ప్రభుత్వం రవీంద్రనాథ్-వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించింది. దీనితో పోల్చితే గాంధీ జయంతి విషయంలో ఒక్క శాతం కూడా జరగలేదు" అని జవహర్ సర్కార్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, మహాత్మాగాంధీకి, పొందూరు ఖాదీకి ఉన్న అనుబంధం ఏంటి?

గాంధీకి బీజేపీ గౌరవం

అయితే గత ఏడున్నరేళ్లలో గాంధీ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం ఏమైనా చేసిందా అనే ప్రశ్నకు అనిర్బన్ గంగూలీ బదులిస్తూ.. వాస్తవానికి గాంధీ పట్ల గత కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే తామే అధికంగా గౌరవం ఇచ్చామని తెలిపారు.

"దేశంలో గాంధీ సందర్శించిన లేదా బస చేసిన అన్ని ప్రాంతాలను సంరక్షించడానికి కాంగ్రెస్ ఏమి చేసింది? కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని గాంధీ కోరారు" అని ఆయన అన్నారు.

స్వచ్ఛ భారత్ మిషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్వచ్ఛ భారత్ మిషన్ లోగో మహాత్మా గాంధీ కళ్ల జోడులానే తయారు చేశారు

''1917లో గాంధీజీ పరిశుభ్రత గురించి మాట్లాడుతూ మన పరిసరాలు, ఇళ్లు, నగరాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోలేకపోతే స్వరాజ్యాన్ని సాధించలేమని పేర్కొన్నారు''.

ఆయనకు నివాళిగా బీజేపీ ప్రభుత్వం 'స్వచ్ఛ భారత్ అభియాన్'ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది.

"లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించడానికి గాంధీజీ సబర్మతీ ఆశ్రమాన్ని ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వమే దీన్ని ప్రారంభించింది".

పరిశుభ్రత ప్రచారానికి సంబంధించిన 'లోగో'లోనే కాకుండా, గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించి, ఖాదీ బ్రాండ్‌కు కొత్త జీవం పోసి బీజేపీ జాతిపితకు మరింత గౌరవాన్ని కల్పించిందని అనిర్బన్ గంగూలీ పేర్కొన్నారు.

"గాంధీ ఎప్పుడూ టాయిలెట్లను స్వయంగా శుభ్రం చేయడం గురించి మాట్లాడేవారు. ఆయన ఫీనిక్స్, సబర్మతి లేదా వార్ధా ఆశ్రమాలలో ఈ నియమం ఉండేది".

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మరుగుదొడ్ల నుండి మురికి నీరు రావడం చూసిన మహాత్మా గాంధీ అక్కడ శుభ్రం చేసే విధానాన్ని ప్రారంభించారని అనిర్బన్ గంగూలీ గుర్తు చేశారు.

"అయితే ఆయన సిద్ధాంతాల జెండాను మోసేది తామే అని చెప్పుకునే పార్టీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దేశంలోని మారుమూల ప్రాంతాలలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లను ఎందుకు నిర్మించలేకపోయిందని ఎవరూ అడగడం లేదు" అని ఆయన అన్నారు.

"మరి ఖాదీనే చూడండి.. మనం 'ఫ్రీడమ్ ఫ్యాబ్రిక్' అని పిలుచుకునే ఖాదీ వస్త్రాలను అసలు ఎవరూ పట్టించుకునేవారు కాదు. గాంధీజీకి పర్యాయపదంగా ఉండే ఖాదీ వస్త్ర దుకాణాలు కనుమరుగయ్యే స్థితి నుంచి ఇప్పుడు ఎలా నడవగలుగుతున్నాయి? నేడు కోట్లాది మంది ఖాదీ వస్త్రాలను ప్రతి రోజూ ధరిస్తున్నారు. లక్షల్లో వ్యాపారం జరుగుతోంది''.

ఖాదీ బ్రాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత కొన్ని సంవత్సరాలుగా ఖాదీ బ్రాండ్ బాగా ప్రాచుర్యం పొందింది

బీజేపీ దారి గాంధీకి వ్యతిరేకమా?

''అభివృద్ది కార్యక్రమాల్లో అన్ని కులాలు, మతాల వారిని కలుపుకునిపోవాలనే గాంధీజీ భావజాలానికి వ్యతిరేక దిశలో దేశం నడుస్తోంది'' అని తుషార్‌ గాంధీ అన్నారు.

"గాంధీని జాతిపిత అనే వాస్తవం పూర్తిగా అర్థరహితంగా మారింది" అని ఆయన చెప్పారు.

"భారతదేశంలో చాలా కొద్ది మంది మాత్రమే గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. ఆయన ఆశయాలకు భిన్నంగా నడుచుకోవడం ఇదే మొదటిసారి కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మరింత అస్థిరంగా మారిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు".

"గాంధీ తన గుజరాతీ మూలాల గురించి గర్వపడ్డారు. కానీ, ఆ గుర్తింపుతోనే ఆయన మొత్తం ప్రపంచానికి మానవత్వాన్ని పరిచయం చేశారు" అని తుషార్ గాంధీ అన్నారు.

"ఈ రోజు, ప్రధానమంత్రి తాను కూడా గాంధీ లాంటి గుజరాతీనని ఓవైపు గర్వంగా చెబుతున్నారు. మరోవైపు, దేశ ప్రజల్లో ఒక వర్గాన్ని ప్రోత్సహించడానికే ఆయన ప్రభుత్వం పరిమితమైంది. ఇలా మరెవరైనా చేస్తారని నేను అనుకోవడం లేదు".

ఇంతకంటే గాంధీ వ్యతిరేక చర్య మరొకటి ఉండదని తుషార్ గాంధీ పేర్కొన్నారు.

'నర్మదా బచావో ఆందోళన' నాయకురాలు, గాంధేయవాది మేధా పాట్కర్ కూడా బీజేపీ ప్రభుత్వ మార్గం అహింసతో కూడుకున్నదని, సత్యాగ్రహ మార్గానికి ఆమడ దూరంలో పాలన ఉందని భావిస్తున్నారు.

భారతదేశంలో 'మోదీ వర్సెస్ గాంధీ' పోరాటం ఎప్పుడూ జరుగుతూనే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

"ఈ ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ లేదా సామాజిక విధానాలు గాంధీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయి".

"అహింసను కాదని హింసను ఎంచుకున్నప్పుడు నేను వారిని గాంధీ మద్దతుదారులుగా ఎలా పిలవగలను. ఆయన ఎల్లప్పుడూ సత్యానికి బదులుగా అసత్యాన్ని ఆచరిస్తున్నారు?" అని మేధా పాట్కర్ అన్నారు.

కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రాలు

గాంధీ సెక్యులరిజంపై దాడి

జాతిపితకి బీజేపీ చేసిన అతిపెద్ద ద్రోహం మతవాద రాజకీయాలేనని జవహర్ సర్కార్ అభిప్రాయపడ్డారు.

మతాలకు అతీతంగా దేశాన్ని సెక్యులర్‌గా ఉంచాలన్న గాంధీ ఆశయం నేడు భారతదేశంలో అంతరించిపోయే దశలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఈ దేశంలో మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా గాంధీ అత్యంత బలమైన వైఖరిని తీసుకున్నాడరనడంలో ఎలాంటి సందేహం లేదు. నెహ్రూ మతానికి దూరంగా ఉన్నారు. కానీ గాంధీ ఒక మతాన్ని అవలంభిస్తూనే, సెక్యులర్‌గా ఉండవచ్చని చూపించారు" అని జవహర్ సర్కార్ అన్నారు.

''విదేశాల్లో సెక్యులరిజం అంటే మతాన్ని వదులుకోవడం. కానీ భారత్‌లో మాత్రం తమ మతాన్ని నమ్ముకుని, ఇతర మతాల పట్ల సహనంతో ఉండడం. ఇది విచిత్రమైన భారతీయ లక్షణమని చెప్పొచ్చు''.

"నెహ్రూ పాశ్చాత్య సెక్యులర్, మత వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి. ఇది భారతదేశంలో అమలు చేయడం సాధ్యం కాదు. కానీ, భారత దేశ మూలాలు మతాలతో ముడిపడినవి కావడంతో, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడమే గాంధీ మార్గం'' అని జవహర్ సర్కార్ చెప్పారు.

"రఘుపతి రాఘవ రాజారాం భజన పాడినా.. రాముడి పేరుతో మసీదు కూల్చివేతను ఏనాడూ గాంధీ సమర్ధించలేదు".

"భారతదేశ రాజకీయాలు, సమాజం, ఆర్థిక వ్యవస్థల్లో గాంధీ ఆశయాలు పాటించేవారు తగ్గుతున్నారు. మరోవైపు, నాథూరామ్ గాడ్సే-సావర్కర్‌ల మద్దతుదారులు మరింత ఎక్కువగా గొంతు పెంచుతూ బహిరంగంగా మాట్లాడుతున్నారు".

''భారత జాతిపిత కేవలం ప్రభుత్వ కార్యాలయాల గోడలపై, కరెన్సీ నోట్లకు మాత్రమే పరిమితమయ్యే సమయం ఎంతో దూరంలో లేదు" అని జవహర్ సర్కార్ అన్నారు.

వీడియో క్యాప్షన్, గాంధీజీని విమర్శించడం కొందరికి అలవాటైపోయింది: గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)