మహాత్మా గాంధీ పాకెట్ గడియారానికి రూ. 11.82 లక్షలు

గాంధీ గడియారం

ఫొటో సోర్స్, EAST BRISTOL AUCTIONS

మహాత్మా గాంధీ వాడిన పాకెట్ గడియారం బ్రిటన్‌లో జరిగిన ఒక వేలం పాటలో 11,82,375 రూపాయలకు (12,000 పౌండ్లు) అమ్ముడుపోయింది. ఈ గడియారం కాస్త పగిలిపోయి ఉంది.

1944లో ఒక వ్యక్తి తన పట్ల చూపిన ప్రేమకు కృతజ్ఞతగా గాంధీ ఈ వాచీని ఇచ్చారు. ఆ వ్యక్తి మనవడు తాజాగా వాచీని వేలానికి పెట్టాడు.

ఈ వాచీ 10,000 పౌండ్లు (9,85,313 రూపాయిలు) వరకు విలువ చేస్తుందని అంచనా వేశారు. కానీ, ఈస్ట్ బ్రిస్టల్‌లో శుక్రవారం జరిగిన వేలం పాటలో అంచనాకు మించిన ధర వచ్చింది.

అమెరికాకు చెందిన ఒక వ్యక్తి దీనిని దక్కించుకున్నారని వేలం వేసిన ఆండ్రూ స్టో చెప్పారు.

ఆగస్టులో గాంధీ ధరించిన కళ్ళద్దాలను వేలం వేయగా రూ. 2,56,18,140 (2,60,000 పౌండ్లు) ధర పలికాయి.

ఈ వాచీకి ఊహించని విధంగా ధర వచ్చిందని స్టో చెప్పారు.

"ఆగస్టులో గాంధీ కళ్లద్దాలు అమ్మిన తర్వాత, ఆయనకు సంబంధించిన ఇతర వస్తువుల గురించి మాకు లెక్కలేనన్ని అభ్యర్ధనలు వచ్చాయి. అందులో చాలా కాయిన్లు, ఫొటోగ్రాఫులు, చిత్రాలు ఉన్నాయి. అయితే వాచీని చూసి మేము చాలా అబ్బురపడ్డాం" అని ఆయన చెప్పారు.

బ్రిటన్లో 11,82,375 లక్షల రూపాయలకు అమ్ముడయిన మహాత్మా గాంధీ వాడిన పాకెట్ గడియారం

ఫొటో సోర్స్, EAST BRISTOL/AUCTION

అరుదైన వస్తువు

ఈ గడియారం ఒకప్పుడు గాంధీ అనుచరుడైన మోహన్ లాల్ శర్మ అనే ఒక వడ్రంగిది. 1936లో ఆయన గాంధీ వద్దకు వెళ్లి స్వచ్ఛందంగా సేవలు అందించారు.

ఆయన చూపిన ప్రేమకు కృతజ్ఞతగా గాంధీ ఈ పాకెట్ గడియారాన్ని 1944లో ఆయనకు బహూకరించారు. 1975లో ఆయన ఆ గడియారాన్ని తన మనుమడికి ఇచ్చారు.

"ఇది చరిత్రలో ఒక అరుదైన వస్తువు. పగుళ్లతో దాని అందం మరింత మెరుగవుతోంది" అని స్టో చెప్పారు.

"ఈ గడియారాన్ని గాంధీ చాలా రోజులు వాడి, దానిని ఒక నమ్మకమైన స్నేహితునికి ఇవ్వడం, ఆయన దానిని జాగ్రత్తగా దాచుకోవడం అద్భుతం" అని స్టో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)