విరాట్ కోహ్లీ: ‘చాలా రిలీఫ్‌గా ఉంది.. అది మాత్రం ఎప్పటికీ మారదు.. అలా లేకపోతే నేను ఆడలేను’

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

టీ20 జట్టు కెప్టెన్‌గా తాను తప్పుకున్నప్పటికీ, క్రికెట్ పట్ల తనకున్న అంకితభావం, తీవ్రత మాత్రం మారదని విరాట్ కోహ్లీ అన్నాడు.

టీ20 ప్రపంచకప్‌లో నమీబియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడాడు.

విరాట్ కోహ్లీ భారత జట్టుకు మొత్తం 50 మ్యాచ్‌ల్లో టీ20 కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 30 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 16 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. రెండు మ్యాచ్‌లు టై కాగా, మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ విజయాల శాతం 64.58. ఎంఎస్ ధోనీ విజయాల శాతం (59.28) కంటే ఇది ఎక్కువ.

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం తనకు ఉపశమనంగా ఉందని విరాట్ చెప్పాడు.

''ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంతకు ముందే చెప్పినట్లుగా కెప్టెన్సీని గౌరవంగా భావిస్తున్నా. కానీ ఏది జరగాల్సిన సమయంలో అది జరగాలి. నా వర్క్‌లోడ్‌ను సమర్థంగా నిర్వహించుకునేందుకు ఇదే సరైన సమయం.''

''దాదాపు ఆరేడు సంవత్సరాలుగా చాలా తీవ్రతతో కూడిన క్రికెట్‌ను ఆడుతున్నాం. ఒక్కసారి మైదానంలో దిగాక చాలా ఒత్తిళ్లు, అంచనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మేం చాలా సరదాగా, సమష్టిగా, అద్భుతంగా రాణించాం.''

''ఈ ప్రపంచకప్‌లో ఎక్కువ దూరం వెళ్లలేకపోయామనేది మాకు తెలుసు. కానీ టీ20ల్లో కొన్ని మంచి ఫలితాలు సాధించాం. కలిసి ఆడటాన్ని ఆస్వాదించాం. కానీ మీరు మొదటి రెండు మ్యాచ్‌ల్లో కనీసం రెండు ఓవర్ల పాటైన ఇలాంటి పోరాటతత్వం గురించి మాట్లాడుతుంటారు. కానీ అప్పటి పరిస్థితులు వేరు. మేం అంత ధైర్యం చేయలేకపోయాం. ఈ సంగతి ముందు కూడా చెప్పాను. టాస్‌ను సాకుగా చూపి తప్పించుకునే జట్టు కాదు మాది.''

''టీమిండియాకు ఇప్పటివరకు సహాయక సిబ్బందిగా సేవలందించిన వారికి చాలా ధన్యవాదాలు. మా జట్టుకోసం వాళ్లు చాలా అద్భుతంగా పనిచేశారు. వారు టీమ్‌లో మంచి వాతావరణాన్ని సృష్టించారు. మా జట్టులో వారు కూడా భాగమే. భారత క్రికెట్‌కు ఎనలేని కృషి చేశారు. మా జట్టు అందరి తరఫున వారందరికి బిగ్ థ్యాంక్యూ.''

''కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, నాలో తీవ్రత ఏమాత్రం తగ్గదు. అలా చేయలేని పక్షంలో నేనసలు ఆడను. నేను కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోకముందు కూడా ఆట ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉండేవాడిని. మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేనలా ఏమీ చేయకుండా (హావభావాలు ప్రదర్శించకుండా) నిలబడి ఉండలేను.''

''సూర్యకు ఆడేందుకు ఎక్కువ సమయం దొరకలేదు. ఇది ప్రపంచకప్ కాబట్టి అతన్ని ఆ స్థానంలో ఆడించి తనకు మంచి అనుభూతిని ఇవ్వాలనుకున్నా. యువ క్రికెటర్లందరూ ప్రపంచకప్ ద్వారా మంచి జ్ఞాపకాలను పోగేసుకోవాలి అనుకుంటారు'' అని తాను ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగకపోవడానికి కారణాన్ని కోహ్లి చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలిచిన తర్వాత మాట్లాడుతూ..

భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటం తనకు దక్కిన గౌరవమని విరాట్ కోహ్లి అన్నాడు. నమీబియాతో మ్యాచ్‌కు ముందు మాట్లాడిన అతను జట్టు కెప్టెన్సీని మరొకరికి అప్పగించడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు.

భారత టీ20 కెప్టెన్‌గా నమీబియాతో జరుగుతోన్న మ్యాచే విరాట్‌కు చివరిది. ఈ మ్యాచ్ అనంతరం టీ20 కెప్టెన్‌గా కోహ్లి తప్పుకోనున్నాడు. వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్‌గా వైదొలుగుతానని కోహ్లి సెప్టెంబర్‌లోనే ప్రకటించాడు.

''భారత కెప్టెన్సీ అతిపెద్ద గౌరవం. ఆ అవకాశం నాకు దక్కింది. కెప్టెన్‌గా నేను నా అత్యుత్తమ ఆటతీరును కనబరిచా. ఇప్పుడు దాన్ని మరొకరికి అప్పగించాల్సిన తరుణం వచ్చింది. జట్టు ఇప్పటివరకు ఆడిన తీరు పట్ల నేను చాలా గర్విస్తున్నా. ఈ జట్టు మరింత ముందుకు వెళ్లడానికి ఇదే సరైన సమయం. దీన్ని చూసుకోవడానికి ఇప్పుడు రోహిత్ ఉన్నాడు.''

''ఈ మ్యాచ్‌లో మొదట మేం బౌలింగ్ చేస్తాం. ఇక్కడ టాస్ చాలా కీలకంగా మారింది. కాబట్టి నేను ఇక్కడ రెండుసార్లు టాస్ గెలిచినప్పుడు... మేం ముందుగా ఏం చేయాలి అని నిర్ణయించుకున్నామో దాని ప్రకారమే నడుచుకున్నాం' అని కోహ్లి అన్నాడు.

కోహ్లి

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC

‘మంచి జట్టున్నా మేజర్ ట్రోఫీలు దక్కలేదు’

2017లో కోహ్లి పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. భారత హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి కూడా అదే సంవత్సరంలో నియమితులయ్యారు. శాస్త్రికి కూడా భారత కోచ్‌గా ఇదే చివరి టోర్నమెంట్.

రవిశాస్త్రి స్థానంలో భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ నియమించింది.

గణాంకాలను పరిశీలిస్తే కెప్టెన్‌గా విరాట్ కోహ్లి, కోచ్‌గా రవిశాస్త్రి అద్భుతంగా పనిచేసినట్లు తెలుస్తుంది. వారిద్దరి విజయాల శాతం చాలా మెరుగ్గా ఉంది అని మాజీ ఐపీఎల్ ప్లేయర్ అభిషేక్ జున్‌జున్‌వాలా అన్నారు.

''ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం కోహ్లికి నిరాశ కలిగిస్తుంది. కానీ ఎంఎస్ ధోని ఈ విషయంలో తనను తాను రుజువు చేసుకున్నాడు.''

''కోహ్లికి మంచి జట్టు లభించింది. మంచి జట్టున్నా మేజర్ ట్రోఫీలు దక్కకపోవడం అతనికి ప్రతికూలంగా మారింది. జట్టును కోహ్లి ముందుండి నడిపించాడు. ఫిట్‌నెస్ పరంగా భారత క్రికెట్‌కు కోహ్లి నాయకుడు. ఓవరాల్‌గా అతను చాలా మెరుగ్గా రాణించాడు'' అని ఆయన పేర్కొన్నారు.

విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి

ఫొటో సోర్స్, Getty Images

‘ఆ క్రెడిట్ మొత్తం అతనికే దక్కాలి..’ - రవిశాస్త్రి

మరోవైపు, భారత కోచ్‌గా తనకు అద్భుతంగా గడిచిందని రవిశాస్త్రి అన్నారు. భారత కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు తనదైన మార్పు చూపించాలని అనుకున్నట్లు శాస్త్రి చెప్పుకొచ్చారు.

''నేను అనుకున్నట్లే అన్నీ చేయగలిగాను. కొన్నిసార్లు జీవితంలో మనం ఏం సాధించామో అది ముఖ్యం కాదు... మనం దేన్ని అధిగమించామో అది ముఖ్యం. ఈ ఐదేళ్ల కాలంలో ఈ కుర్రాళ్లు దేన్ని అధిగమించారో అది ముఖ్యం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని ఫార్మాట్లలో మా ప్రదర్శన... క్రికెట్ చరిత్రలోని గొప్ప జట్లలో మమ్మల్ని ఒకటిగా నిలుపుతుంది. అందులో నాకేలాంటి సందేహం లేదు.''

''అన్ని ఫార్మాట్లలోనూ మేం రాణించాం. ఎరుపు బంతితో ప్రపంచవ్యాప్తంగా విజయాలు సాధించాం. పరిమిత ఓవర్లలోనూ విదేశాలకు వెళ్లి అక్కడ వారిపై ఆధిపత్యం ప్రదర్శించాం. 'సొంతగడ్డపైనే భారత్ రాణించగలదు' అంటూ మమ్మల్ని అందరూ విమర్శించేవారు. కానీ ఈ జట్టు వాటికి సరిగ్గా బదులిచ్చింది.''

''రాహుల్ ద్రవిడ్ తన అనుభవంతో భారత క్రికెట్ స్థాయిని మరింతగా పెంచుతారు. నాయకుడిగా విరాట్ అద్భుతంగా పనిచేశాడు. టెస్టు క్రికెట్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించాడు. టెస్టుల విషయంలో అతనికే ఈ క్రెడిట్ మొత్తం దక్కాలి.''

''నేను మానసికంగా అలసిపోయా. దానికి నా వయస్సు ప్రభావం కావచ్చు. కానీ ఈ కుర్రాళ్లు మాత్రం శారీరకంగా, మానసికంగా అలసిపోయారు. ఐపీఎల్‌కు ఈ టోర్నీకి మధ్య ఎక్కువ సమయముంటే బావుండేది. ఆరు నెలలు బబుల్‌లోనే గడపడం చాలా కష్టం. మాకు ఓడిపోతామనే భయం లేదు. ప్రతీ మ్యాచ్ గెలవడానికే ప్రయత్నిస్తే ఆటను కోల్పోతాం'' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)