భూమిపైనే నరకాన్ని చూస్తున్న అఫ్గాన్లు.. ‘గుప్పెడు రొట్టెల పిండి కూడా దొరకట్లేదు’

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, జాన్ సింప్సన్
- హోదా, బీబీసీ న్యూస్, సెంట్రల్ అఫ్గానిస్తాన్
ఇప్పుడిప్పుడే నిజమైన ఆకలి భయం కమ్ముకుంటున్న దేశం అది.
వాతావరణంలోనూ మార్పులు ప్రారంభమయ్యాయి. శరదృతువు వెచ్చదనం పోయి చలిగాలులు వీస్తున్నాయి.
అనేక ప్రాంతాలు కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.
ఇప్పటికే అక్కడ నెలకొన్న విపత్కర పరిస్థితులకు ఇవన్నీ తోడవుతున్నాయి.
కాబుల్‌కు పశ్చిమాన 50 మైళ్ల దూరంలో ఉన్న మైదాన్ వార్దక్‌లో ఒక అధికారిక పంపిణీ కేంద్రం వద్ద వందలాది మంది పురుషులు గుమికూడారు.
ఆ కేంద్రం నుంచి కొంచెమైనా పిండి దొరుకుతుందనే ఆశతో క్యూలు కట్టారు. ఈ పిండిని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) అందిస్తోంది.
వారందరూ నిశ్శబ్దంగా ఉండేలా తాలిబాన్ సైనికులు నియంత్రిస్తున్నారు.
కానీ, పిండి పొందడానికి అర్హులు కారని తెలిసిన కొందరు కోపంతో, భయంతో వణికిపోతున్నారు.
"చలికాలం దగ్గర పడుతోంది. రొట్టెలు చేసుకోవడానికి పిండి దొరకకపోతే రోజులు ఎలా గడుస్తాయో తెలియట్లేదు" అని ఒక వృద్ధుడు అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
'ఊహించిన దానికన్నా దారుణమైన పరిస్థితులు'
అఫ్గానిస్తాన్‌లో 2.2 కోట్లకు పైగా ప్రజలకు సహాయం చేయాలంటే డబ్ల్యూఎఫ్‌పీ సరఫరా పెంచాల్సి ఉంటుంది.
నిపుణులు అంచనా వేస్తున్నట్లుగా ఈ శీతాకాలంలో చలి బాగా పెరిగిపోతే, పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటారని, కరువు పరిస్థితులు విస్తరిస్తాయని అంచనా.
"మీరు ఊహించినదనికన్నా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వాస్తవానికి, భూమిపై అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం" అని డబ్ల్యూఎఫ్‌పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లీ అన్నారు.
"తొంభై అయిదు శాతం ప్రజలకు తినడానికి తగినంత తిండి లేదు. 2.3 కోట్లమంది ఆకలితో అలమటించే పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. వచ్చే ఆరు నెలల్లో పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. భూమిపై నరకం కనిపిస్తుంది."
ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేపట్టడానికి ముందు, అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం విదేశీ సహాయంతో ఈ చలికాలాన్ని నెట్టుకొస్తుందనే నమ్మకం ఉండేది.
కానీ, ఘనీ ప్రభుత్వం కూలిపోవడంతో అఫ్గాన్‌కు విదేశీ సహాయం పూర్తిగా నిలిచిపోయింది.
మహిళలను విద్యకు దూరం చేస్తూ, షరియా చట్టాన్ని అవలంబించే ప్రభుత్వానికి మద్దతు అందిస్తున్నట్లు కనబడడం పశ్చిమ దేశాలకు ఇష్టం లేదు. దాంతో, అఫ్గానిస్తాన్‌కు తమ సహాయాన్ని నిలిపివేశాయి.
'అంతర్జాతీయ సమాజం సహాయం అందించాలి'
అయితే, ఇప్పుడు కూడా ఆ దేశాలన్నీ ఓ పక్కన నిల్చుని, కోట్లమంది అమాయక ప్రజలు ఆకలికి బలైపోవడం చూస్తూ ఉండిపోతాయా?
అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రభుత్వాలు, ధనవంతులు అఫ్గాన్ ప్రజలకు తక్షణ సహాయాన్ని అందించాలని బీస్లీ పిలుపునిచ్చారు.
"ప్రపంచ నాయకులకు, కోటీశ్వరులకు.. మీ పాపో, బాబో లేదా మీ మనుమలో ఆకలితో చావబోతున్నారు అనుకోండి. మీరు వెంటనే చేయగలిగినదంతా చేస్తారు కదా. భూమిపై 400 ట్రిలియన్ డాలర్ల (రూ. 2,96,18,72,000 కోట్లు) సంపద ఉంది. మనం సిగ్గుపడాలి."
"పిల్లలు ఆకలి చావులు చస్తున్నారు. ఇది సిగ్గుచేటు. ఆ పిల్లలు ఏ దేశానికి చెందినవారన్నది అనవసరం" అని బీస్లీ అన్నారు.
కటిక పేదరికంలో మగ్గుతున్న ప్రజలు
మధ్య ఆఫ్గానిస్తాన్‌లోని బమియాన్ నగరంలో ఫాతేమా అనే మహిళను కలిశాం. ఆమె భర్త క్యాన్సర్‌తో చనిపోయి ఎంతో కాలం కాలేదు. ఆమెకు ఏడుగురు పిల్లలు. వారంతా మూడు నుంచి పదహారు సంవత్సరాలలోపు వారే.
ఫాతెమా కుటుంబం కటిక పేదరికాన్ని అనుభవిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో, ఫాతెమాకు క్రమం తప్పకుండా పిండి, నూనె అందుతుండేవి. తాలిబాన్ల రాకతో వాటి పంపిణీ ఆగిపోయింది.
పొలాల్లో కలుపు తీస్తూ ఫాతెమా కొంత సంపాదిస్తుండేవారు. కానీ, ఇప్పుడు కరువు తాండవిస్తుండడంతో పంటలు పండట్లేదు. ఆమెకు పని దొరకట్లేదు.
"చాలా భయంగా ఉంది. పిల్లలకు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. ఇక బయటికెళ్లి బిచ్చమెత్తుకోవాల్సిందే" అని ఆమె అన్నారు.
కొంతమంది తమ కూతుర్లకు బాల్యవివాహాలు జరిపించి భారం తగ్గించుకున్నారు. కానీ, అలా చేయడానికి ఫాతెమాకు మనసొప్పలేదు.
అయితే, ఆహార పంపిణీ తిరిగి ప్రారంభం కాకపోతే ఫాతెమా, ఆమె పిల్లలు ఆకలి చావులు చూడడం ఖాయం.
సమీపంలో ఉన్న పర్వతాలపై మంచు పేరుకుపోతోంది. దాంతో చలిగాలులు తీవ్రమయ్యాయి.
శీతాకాలం ముంచుకొస్తోంది. ఫాతెమా లాంటి ఎన్నో కుటుంబాలు అతలాకుతలం కానున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచం ఏమనుకున్నా 'ఆత్మాహుతి దాడి చేసేవారు మాకు హీరోలే' - తాలిబాన్లు
- పెగాసస్ వివాదం: ‘జాతీయ భద్రత అని కేంద్ర ప్రభుత్వం చెప్పినంత మాత్రాన మేం చూస్తూ కూర్చోం’ - సుప్రీం కోర్టు
- బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది
- కశ్మీర్లో 'టార్గెట్ కిల్లింగ్స్'.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనాల ప్రస్తావన ఎందుకొస్తోంది
- 'అర్ధరాత్రి వచ్చిన ఆ ఫోన్ కాల్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది'
- ‘రూ.37 వేలకు ఈ పాపను అమ్మేశాను.. ఎందుకంటే’
- ‘13 ఏళ్ల నా చెల్లెలిని బలవంతంగా పెళ్లి చేసుకుంటామని తాలిబాన్లు మెసేజ్ పంపించారు’
- తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే కంటెంట్‌ను కంట్రోల్ చేయడంలో ఫేస్‌బుక్ చేతులెత్తేసిందా?
- చైనా కొత్త సరిహద్దు చట్టంతో భారత్‌కు సమస్యలు పెరుగుతాయా
- పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా... పాక్ రూపాయి పడిపోవడానికి అదే కారణమా?
- ప్రాణభయంతో సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేస్తున్న యూజర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













