అఫ్గానిస్తాన్: తాలిబాన్‌లకు భయపడి సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేస్తున్న యూజర్లు

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఖుదైనూర్ నాసర్
    • హోదా, బీబీసీ, ఇస్లామాబాద్

గత నెలలో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం చేపట్టడాని కంటే ముందు అక్కడ సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న చాలామంది తాలిబాన్‌ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు.

కానీ ఆగస్ట్ 15 తర్వాత వీరు గతంలో తాము పోస్ట్‌ చేసిన ఫోటోలను, ట్వీట్లను తొలగిస్తున్నారు. ఇక కొందరైతే తాలిబాన్లకు భయపడి ఏకంగా సోషల్‌మీడియాలోని తమ అకౌంట్లనే తొలగిస్తున్నారు.

గతంలో తమకు వ్యతిరేకంగా పోరాడిన, గత ప్రభుత్వంలో పనిచేసిన అఫ్గాన్‌లందరికీ తాలిబాన్లు సాధారణ క్షమాభిక్షను ప్రకటించినా వారి హామీపై చాలామందికి నమ్మకం లేదు.

‘తాలిబాన్ల మాటలను మేం విశ్వసించం’’ అని దేశం నుంచి పారిపోతున్న కొందరు బీబీసీతో చెప్పారు.

తాలిబాన్ ఫైటర్లు

ఫొటో సోర్స్, Getty Images

రాజధాని కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబాన్లు పౌరులను చంపినట్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వార్తలొచ్చాయి.

గత వారం, తాలిబాన్ రక్షణ మంత్రి మొహమ్మద్ యాకూబ్ విడుదల చేసిన ఆడియో సందేశంలోనూ ఈ విషయం అంగీకరించారు. తాలిబాన్ ఫైటర్లు కొందరు ప్రతీకార హత్యలకు పాల్పడినట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. అంతకుమించి ఆయన వివరాలేమీ వెల్లడించలేదు.

అయితే, యాకూబ్ ఆడియో సందేశం తరువాత.. గతంలో తాలిబాన్ వ్యతిరేక పోస్టులు పెట్టినవారిలో భయం మరింత పెరిగింది.

తాలిబాన్ల రాక తరువాత ఫేస్‌బుక్ కూడా అఫ్గానిస్తాన్ వరకు కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. సులభంగా ప్రొఫైల్‌ లాక్ చేసుకునే వీలు కల్పించడంతో పాటు తమ ప్రొఫైల్‌లోని కంటెంట్‌ని ఇతరులు యాక్సెస్‌ చేయకుండా కూడా ఓ ఫీచరును అఫ్గానిస్తాన్ ఫేస్ బుక్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ అంశంపై బీబీసీ కాబుల్‌, మరో అఫ్గాన్‌ నగరానికి చెందిన ఇద్దరు ఫేస్‌బుక్ యూజర్లతో మాట్లాడింది.

వీరికి సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోయర్లు ఉన్నారు. తాలిబాన్లు అధికారంలోకి రాకముందు సోషల్ మీడియాలో ప్రభావవంతమైన వ్యక్తులుగా ఉండేవారు వీరు.

తాలిబాన్లకు టార్గెట్ అవుతారేమో అనే భయంతో వీరిద్దరూ తమ ఖాతాలను డిలీట్‌ చేశారు. అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ కథనంలో వారి పేర్లు మార్చాం.

జబీహుల్లా ముజాహిద్

ఫొటో సోర్స్, Reuters

'దొరికితే తలపై కాల్చి చంపేస్తాం'

కాబుల్‌లో నివసించే ఫిదా అనే అఫ్గాన్ వ్యక్తి తాలిబాన్‌లకు వ్యతిరేకంగా, వారి విధానాలు, ప్రవర్తనను తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు.

కానీ ఫిదా ఇప్పుడు తన ఫేస్‌బుక్ ఖాతాను డిలీట్‌ చేసేశారు. పాశ్చాత్య దేశాల సహాయంతో విదేశాలలో ఆశ్రయం పొందారు.

ఫిదా, బీబీసీతో మాట్లాడుతూ.. తాలిబాన్లు కాబుల్‌పై పట్టుసాధించిన తర్వాత, వారికి వ్యతిరేకంగా వ్యవహరించిన తనకు ప్రమాదం పొంచి ఉందని బంధువులు చెప్పారన్నారు.

"సాధారణ క్షమాభిక్ష ఉన్నప్పటికీ... ప్రజలు క్షమించబోరని తాలిబాన్లు నా బంధువులకు హెచ్చరించారు" అని ఆయన చెప్పారు."దొరకగానే తలపై కాల్చి చంపేస్తాం" అంటూ తాలిబాన్లు ఒక జాబితా ప్రకటించారు. అందులో ఆయన పేరు కూడా ఉంది.

రాజధానిని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న మరుసటి రోజు, ఆగస్టు 16న, ఆయన తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ డిలీట్‌ చేసేశారు.

తన చివరి ఫేస్‌బుక్ పోస్ట్ కూడా తాలిబాన్లకు వ్యతిరేకంగా పెట్టిందేనని.. తాను ఇకపై అఫ్గానిస్తాన్‌లో నివసించాలనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.

"ఇప్పుడు ఇక్కడ నివసించడం కంటే చనిపోవడం నయం" అన్నారాయన.

తాలిబాన్ ఫైటర్లు

ఫొటో సోర్స్, Reuters

'ఇది ప్రారంభం మాత్రమే'

మరో నగరంలో తాలిబాన్ పాలనలో నివసిస్తున్న హారిస్ బీబీసీతో మాట్లాడారు. కాబుల్ స్వాధీనానికి రెండు రోజుల ముందు తన సోషల్ మీడియా ఖాతాలను డిలీట్‌ చేశానని చెప్పారు.

"తాలిబాన్ పాలన వస్తోంది. ప్రజాస్వామ్యం పోయింది" అని ఆయన పేర్కొన్నారు.

ఇతర దేశాల్లో ఆశ్రయంపొందాలని భావిస్తున్న వందలాది మంది అఫ్గాన్‌లలో ఒకరైన హారిస్, తాను ఎవరో చెబితేనో లేక డబ్బు కోసమో ఏ రోజూ పోస్టులు చేయలేదని చెప్పారు.

"నేను ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉన్నాను. ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీకి కాదు" అని హారిస్ అన్నారు. ఆయన ఘనీపైనా విమర్శలు చేశారు.

అఫ్గాన్‌ ప్రజలందరికీ తాలిబాన్లు క్షమాభిక్షను ప్రకటించినా, ఎందుకు దేశం విడిచి వెళ్లాలని అనుకుంటున్నారని అడిగినప్పుడు, తాను ఇక్కడ సురక్షితంగా ఉండగలనని భావించడం లేదని చెప్పారు.

"తాలిబాన్లు ఇప్పటికీ కొంత మంది ప్రజలను లక్ష్యంగా చేసుకుని, వారి కోసం వెతికి, చంపుతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే, వేచి ఉండండి" అని ఆయన అన్నారు.

రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా షరియా లేదా ఇస్లామిక్ చట్టాలతో కఠినమైన ఆంక్షలను తాలిబాన్లు విధిస్తారని హారిస్ చెప్పారు.

"విద్యావంతులైన అఫ్గాన్‌‌లు ఎవరూ ఇక్కడ ఉంటారని నేను అనుకోవడం లేదు" అని ఆయన చెప్పారు.

దేశాన్ని విడిచి వెళ్లొద్దని తాలిబాన్లు పదే పదే అఫ్గాన్‌లకు చెబుతున్నారు. విద్యావంతులు ఇతర దేశాల్లో పని చేయడానికంటే, సొంత దేశంలోనే తమతోపాటూ జాతీయ సంస్థల్లో కలిసి పని చేస్తూ దేశానికి సేవ చేయాలన్నారు.

అయితే, తాలిబాన్లపైగానీ, లేదా వారు చేస్తున్న వాగ్దానాలపైగానీ తమకు విశ్వాసం లేదని, వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని యోచిస్తున్నట్టు చాలామంది యువ అఫ్గాన్‌లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)