అఫ్గానిస్తాన్: తాలిబాన్‌లు వద్దన్నా ఆ టీచర్ అమ్మాయిలకు పాఠాలు ఎలా చెప్పగలుగుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫిరౌజె అక్బేరియన్
- హోదా, బీబీసీ పర్షియన్
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చాక బాలికల విద్యపై ఆంక్షలు విధించారు. అమ్మాయిలు స్కూలుకు వెళ్లవద్దని, ఇంటి వద్దే ఉండాలని ఆదేశించారు. దీంతో లక్షలమంది బాలికలకు స్కూలు విద్య దూరమైంది.
కొన్నాళ్ల తర్వాత ఈ ఆంక్షలను సడలిస్తామని తాలిబాన్లు చెప్పినా, ఆ సూచనలు కనిపించడం లేదు. దీంతో విదేశాలలో ఉంటున్న ఓ అఫ్గానిస్తానీ మహిళ తన దేశ బాలికల కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆన్‌లైన్ స్కూలు ప్రారంభించారు.
ఏంజెలా ఘాయూర్ నడుపుతున్న ఈ స్కూల్లో ఇప్పుడు 1,000 మంది విద్యార్ధులు, స్వచ్ఛందంగా చదువు చెప్పే 400 మందికి పైగా టీచర్లు ఉన్నారు.
1992లో అఫ్గానిస్తాన్‌లో అంతర్యుద్ధం చెలరేగినప్పుడు ఏంజెలా వయసు ఎనిమిదేళ్లు. ఆమె కుటుంబం దేశంలోని పశ్చిమ హెరాట్ నుంచి ఇరాన్‌కు పారిపోయింది. ఆమె కుటుంబానిది టెంపరరీ వీసా కావడంతో ఆ తర్వాత అయిదు సంవత్సరాల పాటు ఏంజెలా స్కూలుకు వెళ్లలేక పోయారు.
''సరైన వీసా పత్రాలు లేకపోతే ఇరాన్‌కు పారిపోయిన అఫ్గాన్ పిల్లలు స్కూలుకు వెళ్లలేరు'' అన్నారు ఏంజెలా. ప్రస్తుతం ఆమె యూకేలోని బ్రైటన్‌లో ఉంటున్నారు.
అయిదు సంవత్సరాల తర్వాత ఏంజెలా తండ్రి అవసరమైన పత్రాలను సంపాదించగలిగారు. 13 సంవత్సరాల వయసులో తిరిగి ఆమె స్కూలుకు వెళ్లగలిగారు.
రోజూ స్కూలు నుంచి ఇంటికి వచ్చాక ఇరాన్‌లో ఉంటున్న 14మంది అఫ్గానిస్తాన్ చిన్నారులకు ఆమె క్లాసులు చెప్పేవారు. వారంతా సరైన పత్రాలు లేని కారణంగా పాఠశాలకు వెళ్లలేకపోయిన వారే.
ఏంజెలా తండ్రి ఇరాన్‌లో తోటమాలిగా పని చేసేవారు. ఆమె ఒక మంచి పార్కును చూసి, పిల్లల్ని పిలిచి క్లాసులు తీసుకునే వారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం లాంటివి నేర్పేవారు.
తర్వాత కొన్నాళ్లకు తాలిబాన్లు అధికారం కోల్పోవడంతో ఆమె తిరిగి అఫ్గానిస్తాన్ వచ్చారు. అక్కడ సెకండరీ స్కూల్ టీచర్‌గా సర్టిఫికెట్ పొంది తర్వాత నెదర్లాండ్, ఆపై బ్రిటన్ వెళ్లారు.

ఫొటో సోర్స్, Derrick Evans
కలత చెంది...
బ్రిటన్‌లో ఉంటున్న అనేకమంది అఫ్గానిస్తాన్ జాతీయుల్లాగే ఆమె కూడా తన దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి కలత చెందారు. 20 ఏళ్ల యుద్ధం తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో తాలిబాన్‌లు మళ్లీ అధికారంలోకి వచ్చారు.
అంతకు ముందు రెండు దశాబ్దాలుగా ఆటంకం లేకుండా సాగిన స్త్రీ విద్య మరోసారి ప్రమాదంలో పడింది.
అయితే, చదువుకునే వారిపై, ఉద్యోగాలు చేసే వారిపై ఆంక్షలు తాత్కాలికమేనని తాలిబాన్లు ప్రకటించారు. కానీ, ఇరాన్‌లో తనకు ఎదురైన అనుభవాలతో బాలికలకు మళ్లీ చదువు దూరమవుతుందని ఏంజెలా భయపడ్డారు.
మూడు నెలల తర్వాత ఆంక్షలు సడలిస్తామని తాలిబాన్లు చెప్పినప్పటికీ, ఈ హామీలు నిజమయ్యే సూచనలు కనిపించకపోవడంతో ఆమె తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆన్‌లైన్ హెరాట్ స్కూల్ పేరుతో ఏంజెలా ఒక స్కూల్‌ను ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Derrick Evans
అనుభవజ్జులైన ఉపాధ్యాయులు కావాలంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దాదాపు 400 మంది వలంటీర్లు ముందుకొచ్చారు. టెలిగ్రామ్ లేదా స్కైప్ ద్వారా, వారు మ్యాథ్స్ నుంచి సంగీతం వరకు, వంట నుంచి పెయింటింగ్ వరకు ఆన్‌లైన్ లో బోధిస్తారు.
వీరిలో చాలా మంది ఉపాధ్యాయులు ఇరాన్‌కు చెందినవారు. వీరు రోజుకు రెండు నుంచి ఎనిమిది గంటల పాటు బోధిస్తారు. "నా బాధలు, నా వేదనలు, అనుభవాల ఫలితమే ఈ స్కూల్'' అన్నారు ఏంజెలా. " గన్ను కాదు పెన్ను అన్నది మా నినాదం" అన్నారామె.
ఈ వలంటీర్లు దాదాపు 1000 మందికి చదువులు చెబుతున్నారు.
అలా చదువుకుంటున్న వారిలో 13 ఏళ్ల నస్రీన్ ఒకరు. అయిదుగురు అక్కచెల్లెళ్లలో ఒకరైన నస్రీన్ కాబూల్ వాసి.
తాలిబాన్ అధికారం చేపట్టినప్పటి నుండి ఏడేళ్ల వయసు దాటిన బాలికలు సూలుకు వెళ్లడాన్ని నిషేధించారు. దీంతో ఈ అయిదుగురు అక్కచెల్లెళ్లు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పరిస్థితి లేదు.
వీరంతా ఇంట్లోనే చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, యూనివర్సిటీలో ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న ఇద్దరు అక్కలకు మాత్రం సమస్యగా మారింది.
"నా కలలన్నీ భగ్నమయ్యాయి. స్కూళ్లు తెరిచినా, పాత రోజులు తిరిగి రావు" అని నస్రీన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "నేను పైలట్ కావాలనుకున్నా. కానీ ఇది జరగదు. అమ్మాయిలు పైలట్‌లు కావడాన్ని తాలిబాన్లు ఒప్పుకోరు'' అన్నారు నస్రీన్.
కానీ, ఏంజెలా నడుపుతున్న ఆన్‌లైన్ స్కూలు ఇలాంటి వారికి ఆశాదీపంలా కనిపిస్తోంది.
నస్రీన్ ఇప్పుడు ఒక వలంటీర్ దగ్గర టర్కీ భాష నేర్చుకుంటున్నారు. ఏదో ఒక రోజు తాను ఇస్తాంబుల్‌లో స్థిరపడాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఆన్‌లైన్ పాఠాలు ఆమెను మళ్లీ కలలు కనేలా చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితులు మారతాయా?
ఇటీవలి కాలంలో అఫ్గానిస్తాన్ 34 ప్రావిన్సుల్లోని 5 ప్రావిన్సులలో బాలికలు స్కూలుకు రావడంపై ఆంక్షలు సడలించారన్న వార్తలు వినిపించాయి. ప్రైవేట్ యూనివర్శిటీలలో యువతులకు అనుమతిస్తున్నారు. కానీ, ప్రభుత్వ విద్యాలయాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. .
కాబూల్‌లో ఉండే నస్రిన్, ఆమె అక్కచెల్లెళ్లు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంతకు ముందు నస్రీన్‌కు చదువు చెప్పిన టీచర్లు కూడా ఆంక్షల కారణంగా స్కూలుకు రావడం లేదు. మళ్లీ ఎప్పుడు స్కూళ్లకు అనుమతిస్తారన్నది తాలిబాన్లు ఇంత వరకు ప్రకటించ లేదు.
ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం, అఫ్గానిస్తాన్‌లో అర్హత గలిగిన ఉపాధ్యాయులలో 70శాతం మంది మహిళలే. ఇప్పుడు వారంతా విధులకు దూరం కావడంతో అబ్బాయిలకు చదువులు చెప్పే స్కూళ్లలో కూడా బోధనా సిబ్బంది కొరత కనిపిస్తోంది.
తాలిబాన్‌లు తిరిగి అధికారం చేపట్టడానికి ముందు కూడా అఫ్గానిస్తాన్‌లో సరైన విద్య అందుబాటులో లేదు. 2019లో రూపొందిన ఒక నివేదిక ప్రకారం, 15 సంవత్సరాలు పైబడిన వారిలో మూడింట ఒకవంతు కంటే ఎక్కువమంది నిరక్షరాస్యులు.
ఇప్పుడు ఎక్కువ మంది బాలికలు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఈ గణాంకాలలో నిరక్షరాస్యుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఫొటోలు: డెరిక్ ఇవాన్స్
ఇవి కూడా చదవండి:
- హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఏం జరగబోతోంది?
- 18 రోజుల తర్వాత తాళం వేసి ఉన్న ఇంట్లో దొరికిన నాలుగేళ్ల చిన్నారి
- నిత్యావసర సరుకులను నిల్వ చేసుకోవాలని ప్రజలను కోరిన చైనా, కారణమేంటి?
- ఫేస్‌బుక్: ‘ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను ఇక ఉపయోగించం’
- టీఆర్పీలు, ఆదాయం కోసం ఐసీసీ వేసిన ప్లాన్ భారత్ కొంపముంచిందా?
- చరిత్ర: దీపావళి టపాసులు భారత్‌లోకి ఎలా వచ్చాయి?
- డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
- టీ20 వరల్డ్‌కప్ : ఐపీఎల్ ప్రభావం టీమ్ ఇండియాపై పడిందా?
- ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
- ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత ‘బలవంతమా.. బాగు కోసమా’
- చైనా కొత్త సరిహద్దు చట్టంపై భారత్ అభ్యంతరాలు.. డ్రాగన్ స్పందన ఏంటి?
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








