ఫేస్‌బుక్: ‘ఫేషియల్ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌‌ను ఇక ఉపయోగించం’

ఫేషియల్ రికగ్నిషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫోటోలు, వీడియోల్లోని ముఖాలను గుర్తుపట్టేందుకు ఉపయోగించే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను ఇకపై ఉపయోగించబోమని ఫేస్‌బుక్ వెల్లడించింది.

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగంపై ఇటీవల కాలంలో నైతిక పరమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరోవైపు వ్యక్తిగత గోప్యత, జాతి వివక్ష, కచ్చితత్వం లాంటి సవాళ్లు కూడా ఉన్నాయి.

‘‘ఈ టెక్నాలజీ విషయంలో ప్రభుత్వ సంస్థలు స్పష్టమైన నిబంధనలు విడుదల చేయడంలేదు. అసలు దీన్ని ఎలా ఉపయోగించవచ్చో స్పష్టం చేయడం లేదు’’అని ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ టెక్నాలజీ వినియోగంపై ఫేస్‌బుక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగించాలని యూజర్లు భావిస్తే, వారి ముఖ కవళికలను ఈ టెక్నాలజీతో స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వారి ఫోటోలను వేరే ఎవరైనా అప్‌లోడ్ చేస్తే, వారికి నోటిఫికేషన్ వస్తుంది.

‘‘అయితే, ఈ టెక్నాలజీ విషయంలో అనిశ్చితి నెలకొంది. ఈ టెక్నాలజీని ప్రస్తుతం ఉపయోగించడం సముచితం కాదని మేం భావిస్తున్నాం’’అని ఫేస్‌బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటి బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

ఫేషియల్ రికగ్నిషన్

ఫొటో సోర్స్, Getty Images

‘‘కచ్చితత్వం లేదు’’

ఐరోపా వాసుల ముఖాలతో పోల్చినప్పుడు, ఆఫ్రికన్-అమెరికన్, ఆసియా ముఖాలను గుర్తుపట్టడంలో ఈ ఆల్గారిథమ్‌లు అంత కచ్చితత్వంతో పనిచేయడం లేదని 2019లో అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.

ముఖ్యంగా ఆఫ్రికన్-అమెరికన్ మహిళల ముఖాలను ఈ టెక్నాలజీ తప్పుగా గుర్తుపడుతోందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాండార్డ్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనంలో తేలింది.

ఫోటోలను స్కాన్ చేయడం, ట్యాగ్ చేయడంపై ఏళ్ల నుంచీ నలుగుతూ వస్తున్న ఓ కోర్టు కేసు విషయంలో గత ఏడాది ఫేస్‌బుక్ రాజీ కుదుర్చుకుంది.

ఇది 2015నాటి కేసు. ఇల్లినాయిస్‌లో గోప్యతా నిబంధనలను ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉల్లంఘిస్తోందని కొందరు ఇల్లినాయిస్ వాసులు కోర్టులో కేసు వేశారు. దీంతో 550 మిలియన్ డాలర్లు (రూ.4,100 కోట్లు) చెల్లించేందుకు ఫేస్‌బుక్ అంగీకరించింది.

జుకర్‌బర్గ్

ఫొటో సోర్స్, Getty Images

అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలానే...

ఫేషియల్ రికగ్నిషన్ విషయంలో వరస వివాదాలు చుట్టుముట్టడంతో.. ఈ టెక్నాలజీ ఉపయోగాన్ని అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్నాలజీ దిగ్గజాలు ఇప్పటికే నిలిపివేశాయి.

ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా నెట్‌వర్క్ అయిన ఫేస్‌బుక్‌పై ఇప్పటికే ప్రభుత్వ సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టా, వాట్సాప్‌ల విషయంలోనూ కొత్త సవాళ్లు వస్తున్నాయి.

అమెరికాకు చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌తోపాటు కొన్ని ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే ఫేస్‌బుక్‌పై కేసులు వేశాయి.

మరోవైపు గత నెలలో ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి.. సంస్థ అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఆరోపణలు చేశారు. సంస్థ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన కొన్ని పత్రాలను ఫ్రాన్సెస్ హ్యూజెన్ బయటపెట్టారు. దేశాల భద్రతను ప్రమాదంలోకి నెట్టి సంస్థ లాభాలను అర్జించాలని అనుకుంటోందని ఆయన అన్నారు.

అయితే, తమ సంస్థను పేరు ప్రతిష్ఠలను మసకబార్చేందుకు జరుగుతున్న కుట్రలో ఫ్రాన్సెస్ ఆరోపణలు కూడా భాగమని ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ ఆరోపించారు.

సంస్థపై నెగెటివ్ కథనాలు వచ్చిన నేపథ్యంలో... తమ మాతృ సంస్థ పేరును మెటాగా మారుస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.

‘‘నేడు మనం అందిస్తున్న అన్ని సేవలకు ప్రస్తుతమున్న పేరు ప్రాతినిధ్యం వహించడం లేదు. అందుకే భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పేరెంట్ కంపెనీ పేరు మారుస్తున్నాం’’అని జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)