చించొర్రో సంస్కృతికి యునెస్కో గుర్తింపు: 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'

ఫొటో సోర్స్, COURTESY UNIVERSITY OF TARAPACÁ
- రచయిత, జేన్ ఛాంబర్స్
- హోదా, అరికా, చిలీ
"మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం కొంతమందికి వింతగా అనిపించవచ్చు. కానీ, మాకు అలవాటైపోయింది" అంటారు అనా మరియా నెయిటో.
చిలీ దేశంలో పోర్ట్ సిటీ అయిన అరికాలో నివసిస్తున్నారు ఆమె.
పెరూ సరిహద్దుల్లో అటకామా ఎడారి ఇసుక దిబ్బలపై ఉన్న ఈ తీరప్రాంత పట్టణం 16వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చింది.
అయితే, అంతకు పూర్వమే ఇక్కడ చించొర్రో ప్రజలు నివసించేవారు.
ఈ తెగవారు సంరక్షించిన మమ్మీలను ఈ ఏడాది జులైలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది.
దాంతో చించొర్రో నాగరికత, సంస్కృతి వార్తల్లోకెక్కింది.
చించొర్రో మమ్మీల గురించి తొలిసారిగా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి మాక్స్ ఉహ్లే.
జర్మన్ పురావస్తు శాస్త్రవేత్త అయిన ఉహ్లే 1917లో బీచ్ ఒడ్డున భద్రపరిచిన కొన్ని మమ్మీలను కనుగొన్నారు.
అయితే, వాటి వయసు కనిపెట్టడానికి కొన్ని దశాబ్దాల పాటు పరిశోధన చేయాల్సి వచ్చింది.
చివరికి, రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా ఈ మమ్మీలు 7,000 సంవత్సరాల కంటే పురాతనమైనవని కనుగొన్నారు.
అంటే మనకు బాగా తెలిసిన ఈజిప్ట్ మమ్మీల కన్నా రెండు వేల సంవత్సరాల పురాతనమైనవి.

ఫొటో సోర్స్, EYE UBIQUITOUS
చించొర్రో సంస్కృతి
- సిరామిక్ పూర్వ (ప్రీ-సిరామిక్) సంస్కృతి. క్రీ.పూ 7,000 నుంచి 1,500 వరకు విలసిల్లింది.
- వీరంతా ప్రధానంగా మత్స్యకారులు, వేటగాళ్లు.
- ఉత్తర చిలీలో, పెరూకు దక్షిణం వైపు నివసించేవారు.
- చనిపోయినవారి మృతదేహాలను అత్యంత అధునాతన పద్ధతుల్లో మమ్మీలుగా భద్రపరిచేవారు.
- మరణించినవారి జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు వారిని మమ్మీలుగా భద్రపరిచే పద్ధతి మొదలైందని చెబుతారు.

ఫొటో సోర్స్, COURTESY UNIVERSITY OF TARAPACÁ
అత్యంత పురాతన మమ్మీలు
ఇప్పటివరకు ప్రపంచానికి తెలిసిన మమ్మీలలో చించొర్రో మమ్మీలు అత్యంత పురాతనమైనవి.
చించొర్రో తెగ ప్రజలు చాలా పద్ధతిగా మమ్మీలను భద్రపరిచేవారని ఈ తెగపై పరిశోధనలు చేసిన ఆంత్రపాలజీ నిపుణులు బెర్నార్డో అరియాజా తెలిపారు.
పొడి వాతావరణంలో మృతదేహాలు సహజంగా మమ్మీలుగా మారే ప్రక్రియ కాకుండా, ఒక ప్రత్యేక పద్ధతిలో వాటిని భద్రపరిచారని ఆయన వివరించారు. అయితే, సహజంగా మమ్మీలుగా మారిన కొన్ని మృతదేహాలు కూడా ఆ ప్రాంతంలో కనిపించాయి.
ముందుగా, చనిపోయినవారి శరీరాలకు చిన్న చిన్న రంధ్రాలు చేసి, లోపలి అవయవాలను జాగ్రత్తగా బయటికి తీసేవారు. అనంతరం చర్మాన్ని తొలగించేవారు.
తరువాత, సహజంగా దొరికే గడ్డి, నార, కర్రపుల్లతో శరీరాన్ని నింపేవారు. దానివలన శరీరం వంగి పోకుండా, నిటారుగా ఉంటుంది.
చివరిగా, రెల్లుతో చర్మాన్ని శరీరానికి తిరిగి కుట్టేవారని అరియాజా వివరించారు.
మమ్మీ తలకు నల్లటి దట్టమైన జుట్టు కూడా తగిలించేవారు. ముఖాన్ని మట్టితో కప్పి, కళ్లు, నోరు కనిపించేలా ఒక మాస్కు తొడిగేవారు.
ఇదంతా పూర్తయ్యాక, చివరిగా శరీరానికి విలక్షణమైన నలుపు లేదా ఎరుపు రంగులను పూసేవారు. దీనికోసం ఖనిజాలు, ఎర్ర మన్ను, మాంగనీస్, ఐరన్ ఆక్సైడ్‌ల నుంచి వర్ణద్రవ్యాలను సేకరించేవారు.
మృతదేహాలను భద్రపరిచే విధానం (మమ్మిఫికేషన్)లో ఈజిప్షియన్ల పద్ధతులకన్నా చించొర్రో పద్ధతులు చాలా భిన్నమైనవని అరియాజా వెల్లడించారు.
ఈజిప్షియన్లు నూనె, పట్టీలు వాడేవారు. అంతేకాకుండా ఉన్నతవర్గాలకు చెందినవారు మరణిస్తే మాత్రమే మమ్మిఫికేషన్ చేసేవారు.
కానీ చించొర్రో ప్రజలు చనిపోయిన అందరినీ మమ్మీలుగా భద్రపరిచారు. వారి స్థితిగతులతో సంబంధం లేకుండా ఆడ, మగ, పిల్ల, పెద్ద అందరి మృతదేహాలనూ భద్రపరిచారు. ఆఖరికి పిండాలను కూడా మమ్మిఫికేషన్ చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మరణించినవారి అవశేషాలతో సహజీవనం
గత శతాబ్ద కాలంగా అరికా సహా పలు ప్రాంతాల్లో వందలాది చించొర్రో మమ్మీలను కనుగొన్నారు.
అక్కడి స్థానికులు ఈ అవశేషాలతోనే కలిసి జీవించడం నేర్చుకున్నారు.
కొన్నిసార్లు ఇళ్లు, భవనాల కింద మమ్మీలు బయటపడేవి.
ఏదైనా భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు మమ్మీల భాగాలు బయటపడడం లేదా కుక్కలు వాసన చూసి భూమి లోపల ఉన్న మమ్మీలను పసిగట్టడం అక్కడి స్థానికులకు అలవాటైపోయింది.
అయితే, చాలా కాలం వరకూ వీటి ప్రాముఖ్యతను తెలుసుకోలేకపోయారు.
"పిల్లలు తమకు దొరికిన పుర్రెలతో ఫుట్‌బాల్ ఆడుకునేవారని, మమ్మీల నుంచి దుస్తులు లాగేసేవారని స్థానికులు మాకు చెప్పేవారు. కానీ, ఇప్పుడు వాళ్లకి వాటి విలువ తెలిసింది. మమ్మీల అవశేషాలు కనిపించిన వెంటనే, వాటిని తాకకుండా మాకొచ్చి చెబుతున్నారు" అని ఆర్కియాలజిస్ట్ జనీనా కాంపోస్ ఫ్యూయెంటెస్ వెల్లడించారు.
చించొర్రో సంస్కృతిని యునెస్కో గుర్తించడం చాలా ఉద్వేగం కలిగించిందని అనా మరియా నీటో, పావోలా పిమెంటెల్ లాంటి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చించొర్రో సంస్కృతి పట్ల స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడంలో ఈ మహిళలిద్దరూ, స్థానిక తరపక యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందంతో కలిసి పనిచేస్తున్నారు. మమ్మీలను సంరక్షించేందుకు సంఘాలు నడుపుతున్నారు.
తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాలకు పక్కనే చించొర్రో మ్యూజియం ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సందర్శకులు చూసేందుకు వీలుగా మమ్మీల అవశేషాలను గాజు అద్దాల్లో ఉంచుతారు.
తమ వారసత్వ సంపదను ప్రపంచ పర్యటకులకు గర్వంగా చూపించుకునేందుకు ఇదొక మంచి అవకాశమని స్థానికులు భావిస్తున్నారు.
మూడొందలకు పైగా దొరికిన చించొర్రో మమ్మీలలో ప్రస్తుతం అతి కొద్ది అవశేషాలను మాత్రమే ప్రదర్శనకు ఉంచారు. వాటిలో చాలా వాటిని శాన్ మిగ్యుల్ డి అజర్పా ఆర్కియలాజికల్ మ్యూజియంలో పెట్టారు.
ఈ మ్యూజియం తరపక యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తోంది. అరికా నుంచి కార్లో 30 నిముషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఇక్కడ మమ్మిఫికేషన్ విధానాన్ని ఆకట్టుకునే రీతిలో ప్రదర్శనకు ఉంచారు.

మమ్మీలను భద్రపరిచేందుకు మరిన్ని నిధులు అవసరం
దొరికిన అవశేషాలన్నింటినీ ప్రదర్శనకు ఉంచేందుకు వీలుగా పెద్ద మ్యూజియంను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే, అవశేషాలు పాడైపోకుండా జాగ్రత్తగా భద్రపరిచేందుకు నిధులు అవసరం అని స్థానికులు అంటున్నారు.
అరికా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా వెలుగు చూడని అపారమైన సంపద ఉందని శాస్త్రవేత్తలు అరియాజా, జనీనా కాంపోస్ విశ్వసిస్తున్నారు. వాటిని వెలికి తీసేందుకు మరిన్ని వనరులు అవసరమని భావిస్తున్నారు.
యునెస్కో గుర్తింపుతో ఈ ప్రాంతానికి సందర్శకులు పెరుగుతారని, టూరిజం అభివృద్ధి చెందుతుందని, తద్వారా నిధులు సమకూరుతాయని నగర మేయర్ గెరార్డో ఎస్పిండోలా రోజాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, అభివృద్ధి సక్రమమైన మార్గంలో జరగాలని, అందుకు స్థానిక కమ్యూనిటీలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, పురావస్తు తవ్వకాలు జరిపిన ప్రాంతాలను సంరక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
"అరికా ప్రజలు మానవ అవశేషాల పైన నివసిస్తున్నారు. ఈ మమ్మీలను భద్రపరిచాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
ఇళ్లు, భవనాల నిర్మాణ సమయంలో అపురూపమైన అవశేషాలు చెక్కుచెదరకుండా ఉండేందుకు అర్బన్ ప్లానింగ్ చట్టాలు కచ్చితంగా అమలు జరిగేట్టు చర్యలు తీసుకుంటున్నామని, ఆర్కియాలజిస్టులు పక్కనే ఉండి పర్యవేక్షిస్తున్నారని మేయర్ తెలిపారు.
చిలీలోని మిగతా ప్రాంతాల్లా కార్పొరేట్ సంస్కృతి పెచ్చుమీరకుండా, అరికా వారసత్వ సంపద స్థానిక ప్రజల చేతుల్లోనే ఉండాలని, స్థానిక సమాజానికి మేలు చేయాలని మేయర్ గెరార్డో భావిస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా వచ్చిన గుర్తింపు మేలు చేస్తుందని నైబర్‌హుడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనా మరియా ఆశాభావం వ్యక్యం చేశారు.
"ఇది చిన్న పట్టణమే కానీ ఇక్కడి వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యటకులు, శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి అద్భుతమైన చించొర్రో సంస్కృతి గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మేమంతా ఎన్నో ఏళ్లుగా వీటితోనే సహజీవనం చేస్తున్నాం" అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మృతదేహాలతో పాటు బంగారు కళాకృతుల్ని పాతిపెట్టిన ఈ సమాధుల చరిత్ర ఏంటి?
- రబ్బర్ పరిశ్రమ... భయంకర రక్తచరిత్ర
- సావర్కర్ క్షమాపణ పత్రంలో ఏం రాశారు? విడుదలయ్యాక ఏం చేశారు
- లెస్బియన్ కవయిత్రి సాఫో: మగవాళ్లు చూడని కొత్త ప్రపంచాన్ని చూపించిన ప్రేమిక
- 175 ఏళ్ల కిందట అనెస్థీషియా ఎలా పుట్టింది? పూర్వకాలంలో మత్తు మందు లేకుండా ఆపరేషన్లు ఎలా చేసేవాళ్లు? తొలినాళ్లలో వాడిన 4 మత్తు మందులు, వాటి సైడ్ ఎఫెక్ట్స్
- ముస్లింలు విదేశీ పాలకులైతే మౌర్యులు స్వదేశీ పాలకులా?
- చే గువేరా: క్యూబా మంత్రి హోదాలో భారత్ వచ్చినప్పుడు తన రిపోర్టులో ఏం రాశారు?
- ఈస్టిండియా కంపెనీ: వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘భారతదేశం ముస్లిం పాలకుల బానిస’.. ఈ వాదనలో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








