హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

నలుగురు పిల్లలు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. ఈ నలుగురు పిల్లలలో ఒకరు మగ, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.

27 ఏళ్ల అఫ్రీన్ హైదరాబాద్‌ మెహదీపట్నంలోని మీనా ఆసుపత్రిలో అక్టోబర్ 26న సాయంత్రం 5 గంటలకు ఈ పిల్లలకు జన్మనిచ్చారు. ఆమెకు బీపీ ఎక్కువగా ఉండటంతో సిజేరియన్ చేయాల్సివచ్చింది.

తను ఇంతకుముందు చూపించుకున్న ఆసుపత్రి వారు చివరి నిమిషంలో ఆపరేషన్ చేయడానికి నిరాకరించడంతో, మీనా ఆసుపత్రి డాక్టర్ సాహిబ్ షుకూర్ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారని అఫ్రీన్ కుటుంబ సభ్యులు చెప్పారు.

నలుగురు పిల్లలు

"సిజేరియన్ అంటే 30 లేదా 40 నిమిషాలలో చేసేస్తాం. కానీ ఈ ఆపరేషన్ చేయడానికి ౩ గంటలు సమయం పట్టింది. రక్తస్రావం విపరీతంగా కావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి. గత రెండు వారాల్లో రెండుసార్లు కవల పిల్లలను జన్మనిచ్చిన తల్లులకి సిజేరియన్ ఆపరేషన్ చేశాను. గతంలో ఒకేసారి ముగ్గురు పిల్లలను డెలివరీ చేసిన అనుభవం కూడా ఉంది. కానీ నలుగురు పిల్లల డెలివరీ ఇదే తొలిసారి"అని డాక్టర్ సాహిబ్ షుకూర్ బీబీసీతో అన్నారు.

పిల్లలు, తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని, పిల్లలకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని సాహిబ్ వివరించారు.

''ఆపరేషన్ చేసేటప్పుడు ఆమెకు అధిక రక్త స్రావం కావడంతో బీపీ బాగా పడిపోయింది. కానీ ఆమెకు రక్తం ఎక్కించి ఆపరేషన్ పూర్తి చేశాం. అలానే పిల్లలలో ఒకరు మోషన్ పాస్ చేయడంతో ఆపరేషన్ సమయంలో ఇబ్బంది తలెత్తింది. అయితే, ఆ అవరోధాలను ఎదుర్కొని ఆపరేషన్ పూర్తి చేశాం. ఇద్దరు పిల్లలు సుమారు 1.5 కేజీలు ఉండగా.. మిగితా ఇద్దరు 1 .3 , 1.4 కేజీల బరువు ఉన్నారు.''

నలుగురు పిల్లలు

అయితే ఈ పిల్లలకి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. అఫ్రీన్‌కు గతంలో రెండు నార్మల్ డెలివెరీలు అయ్యాయి.

''నలుగురు పిల్లలు పుట్టారనే సంతోషం ఒక వైపు ఉన్నప్పటికీ, మా చెల్లికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయోనన్న భయం కూడా ఇంట్లో అందరికి వెంటాడుతోంది''అని అఫ్రీన్ అన్న అజీజ్ చెప్పారు .

ప్రస్తుతం అఫ్రీన్ భర్త దుబాయ్‌లో పని చేస్తున్నారు. ఆయన ఇంకా ఈ పిల్లల్ని చూడలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)