సోషల్ మీడియా ఆల్గారిథంలు అణుబాంబుల్లాంటివా, పేలకుండా ఆపేదెలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పౌలా ఆడమో ఐడియోటా
- హోదా, బీబీసీ న్యూస్, బ్రెజిల్
ప్రొఫెసర్ స్టూవర్ట్ రస్సెల్ బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో దశాబ్దాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బోధిస్తున్నారు. అంతేకాదు, ఏఐకి ఆయన మంచి విమర్శకుడు కూడా.
ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ మానవ మనుగడకు ముప్పని రస్సెల్ హెచ్చరించారు.
అయితే, ఆయన వ్యక్తం చేసిన ఆందోళన, హాలీవుడ్ సినిమాల్లో ఈ టెక్నాలజీ మనుషుల మీద తిరగబడిన కథాంశాల వంటిది కాదు.
డెవలపర్లు దీన్ని ప్రోగ్రామ్ చేస్తున్న తీరు పైనే ఆయన ప్రధాన ఆందోళన. మనుషుల అన్ని అవసరాలను తీర్చేందుకు దేనికైనా సిద్ధమనే ధోరణిలో ఈ ప్రోగ్రాంలను తయారు చేయడంపైనే ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అల్లావుద్దీన్ అద్భుత దీపం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సమస్యల గురించి బీబీసీతో మాట్లాడిన రస్సెల్, అల్లావుద్దీన్ అద్భుత దీపం కథను ఉదహరించారు.
''మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని చేయమని దాన్ని అడుగుతారు. అది చేస్తుంది. కానీ, దాని కోసం ప్రపంచంలో మిగతా ఎవరూ అలా లేకుండా చేస్తుంది'' అన్నారు రస్సెల్.
''ఏఐ లో మనం స్టాండర్డ్ మోడల్స్‌ను తయారు చేస్తాం. అవి ఎలా పని చేయాలో ఆప్టిమైజ్ చేస్తాం. అవి బెస్ట్ సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇవి మనుషులకు అత్యంత ప్రమాదకరం'' అని రస్సెల్ అంటారు.
"ఒక టార్గెట్ కోసం మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను రూపొందించినట్లయితే, అది ఒక రకమైన మానసిక రోగిలా పని చేసుకుంటూ పోతుంది. తన లక్ష్యం కోసం మిగతా వాటినన్నింటినీ వదిలేస్తుంది. మనం ఆపినా ఆగదు''అన్నారు రస్సెల్.
దీనికి మన కళ్ల ముందు కనిపించే ఉదాహరణ సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ అని రస్సెల్ వివరించారు. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఆరు గంటలపాటు నిలిచిపోయాయి.
ఈ ఆల్గారిథమ్స్ ప్రధాన విధి సోషల్ నెట్‌వర్క్‌లలో వినియోగదారు అనుభవాన్ని మెరుగు పరచడం. ఉదాహరణకు, ఒక యూజర్ గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించడం, వారి ప్రాధాన్యాలు, ఇష్టాయిష్టాలకు తగినట్లుగా కంటెంట్‌ను అందించడం. తద్వారా అవి యూజర్ ఎక్కువసేపు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.
ఒకవేళ ఇది యూజర్‌కు ప్రమాదకరమైనా అది తన సెర్చ్‌ను కొనసాగిస్తూనే ఉంటుంది.
"సోషల్ మీడియా అనేది ఒక వ్యసనంగా, డిప్రెషన్‌కు కారణంగా, సామాజికంగా విచ్ఛిన్నానికి దారితీసే ప్రమాదంగా, తీవ్రవాదం, సొసైటీ పోలరైజేషన్‌కు, తప్పుడు సమాచార వ్యాప్తికి కూడా కారణమవుతుంది'' అని రస్సెల్ చెప్పారు.
"ఈ ఆల్గారిథంలు ఒక లక్ష్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి రూపొందిస్తారన్నది స్పష్టం. యూజర్లు దీనిని క్లిక్ చేశాక, వారు కంటెంట్‌తోనే ఎక్కువ సేపు గడిపేలా చేయడం వీటి లక్ష్యం'' అని ఆయన అన్నారు. ఇలాంటి వాటివల్ల సమాజానికి నష్టం కలుగుందని రస్సెల్ అన్నారు.
''సోషల్ నెట్‌వర్క్‌లు తప్పుడు విషయాలను ఆప్టిమైజ్ చేయడమే కాకుండా, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఎంత తప్పుదోవ పట్టిస్తే అంత ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది'' అన్నారాయన.
గత వారం ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ ఈ వాదనను బలపరుస్తూ మాట్లాడారు. అమెరికా కాంగ్రెస్ ముందు ఈ మేరకు ఆమె సాక్ష్యం చెప్పారు.
సోషల్ మీడియా పిల్లల పాలిట ప్రమాదకరంగా మారిందని, ఇది ప్రజల మధ్య విభజనకు కారణమవుతోందని, ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తుందని హౌగెన్ అన్నారు. అయితే, ఈ విషయాలను వివరించేంత జ్ఞానం హౌగెన్‌కు లేదని ఫేస్‌బుక్ వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images
మానవీయ విలువలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అక్టోబర్ 13న బ్రెజిలియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వర్చువల్ సమావేశంలో రస్సెల్ తన సిద్ధాంతాలను వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానీవయ విలువలతో ఉండాలని ఆయన వాదించారు.
"మనకు ఇప్పుడున్న దానికి పూర్తిగా భిన్నమైన ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవసరం" అని రస్సెల్ చెప్పారు.
ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనకు కొన్ని పరిమితులు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంది. లేదంటే అది ఎప్పటికీ తన లక్ష్యాలను చేరుకోలేదని ఆయన అన్నారు.
"ఈ ఇంటెలిజెన్స్‌ను పూర్తిగా భిన్నమైన రీతిలో ప్రవర్తించేలా చేయగలను. అది మరింత జాగ్రత్తగా, మనకేం కావాలో దానికి అర్ధం కాకపోతే మన అనుమతి తీసుకుని ఆ పని చేసేలా చేయవచ్చు. ఒకవేళ మనకు ప్రమాదకరమైన విషయం ఏదైనా ఉంటే అది స్విచ్ఛాఫ్ అయిపోయేలా ఉండాలి. అది నేను కోరుకుంటున్నది'' అన్నారు రస్సెల్.

ఫొటో సోర్స్, Reuters
అయితే, రస్సెల్ సిద్దాంతాన్ని ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వ్యతిరేకించే వారంతా ఆమోదించడం లేదు.
కొన్నేళ్ల కిందట మార్క్ జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్‌ల మధ్య జరిగిన సంభాషణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి చెడులకు సంబంధించిన రెండు వాదనలకు బలమైన ఉదాహరణగా నిలిచాయి.
న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం 2014లో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్‌ల మధ్య ఈ అంశంపై చర్చ వచ్చింది.
''ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులను లొంగదీసుకుంటుందన్న వాదనను నేను నమ్ముతాను'' అని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు.
అయితే మస్క్ భయస్తుడని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.
అదే సంవత్సరం, ఓ ఇంటర్వ్యూలో, ''కొందరు వ్యక్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అనవసరమైన, ఆందోళన కలిగించే భయాలను వ్యాప్తి చేస్తున్నారు'' అని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు.
''భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులకు హాని చేస్తుందని ఎవరైనా అంటే నేను వాళ్లకు ఒక విషయం చెబుతాను. టెక్నాలజీని మంచి కోసం, చెడు కోసం రెండింటికీ ఉపయోగించుకోవచ్చు. దానిని ఎలా రూపొందించారో, ఎలా వాడుకోవాలో జాగ్రత్తలు పాటించాల్సింది మనమే. కానీ, నిరోధించాలని అనుకోవడం మాత్రం అర్ధరహితం'' అన్నారు.
అయితే, ఎలాన్ మస్క్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అణు వార్‌హెడ్ లతో సమానమని వాదించారు.

ఫొటో సోర్స్, Reuters
కనిపించని విధ్వంసకారి
మస్క్ వాదనను రస్సెల్ సమర్ధించారు.
''ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదకరమన్న వాదనను టెక్ స్పెషలిస్టులు చాలామంది అంగీకరిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా ఏళ్లుగా ఒక ప్రమాదకరమైన టెక్నాలజీని అనుసరిస్తూ వస్తున్నాం. కొంతమంది దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల వ్యతిరేకత అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు'' అన్నారు రస్సెల్.
''మస్క్ వాదనను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు వ్యతిరేకమని జుకర్‌బర్గ్ భావించడం హాస్యాస్పదం. ఇది ఎలాంటిదంటే, అణుబాంబు పేలుతుందని హెచ్చరించడం అసలు ఫిజిక్స్‌కే వ్యతిరేకం అనుకోవడం లాంటిది. మనం ఒక శక్తివంతమైన ఆయుధాన్ని తయారు చేశాం. అయితే, దానికి ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి ఉంది'' అని రస్సెల్ వ్యాఖ్యానించారు.
''మనం చెర్నోబిల్, ఫుకుషిమా లాంటి అణు ప్రమాదాలపై విమర్శలు చేస్తున్నాం. ఎందుకంటే వాటి విషయంలో సరైన జాగ్రత్తలు పాటించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అలాంటి ప్రమాదకరమైనదే. దానితో జాగ్రత్తగా ఉండాలి'' అన్నారాయన.
సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ పై సరైన కంట్రోల్ లేకపోవడం వల్ల అణు విధ్వంసంలాంటి ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా పొంచి ఉందని రస్సెల్ హెచ్చరించారు.
మరి దీన్ని ఎలా నివారించాలి? దీనికి రస్సెల్ చెబుతున్న సమాధానం ''సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ ను పూర్తిగా మార్చేయడం''
ఫేస్‌బుక్‌లో యూజర్‌లు చూసే కంటెంట్‌ను క్రమబద్ధీకరించే ఆల్గారిథమ్‌ను యాక్సెస్ చేసే అవకాశం సోషల్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించే స్వతంత్ర కౌన్సిల్‌కు కూడా పూర్తిగా లేదని రస్సెల్ అభిప్రాయపడ్డారు.
"అందుకే అన్నీ మొదటి నుంచి ప్రారంభించాలని నేను అంటున్నాను. అవసరమైనవి, అవసరం కానివి ఏవో ముందుగానే గుర్తించవచ్చు'' అన్నారాయన.
''ఉదాహరణకు పిల్లల చదువు విషయంలో వారికి మంచి జ్జానం అలవడాలంటే మనం వారికి కొన్ని మభ్యపెట్టే మాటలు చెబుతాం. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అదే టెర్రరిస్టుల పిల్లలకు కూడా అలాగే టెర్రరిజం గురించి మభ్యపెట్టే మాటలు చెప్పి వారిని తీవ్రవాదం వైపు తీసుకెళ్లడం సరికాదు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. అయితే, ఇది చాలా కష్టమైన పని. సోషల్ మీడియాలు ఇలాంటి ప్రశ్నలు వేస్తే, దీనికి తత్వవేత్తలు కూడా సమాధానం చెప్పలేరు'' అన్నారు రస్సెల్
ఇవి కూడా చదవండి:
- కొన్ని హిందూ ఆలయాల్లో మద్యం, మాంసాలను నైవేద్యంగా ఎందుకు పెడతారు
- చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను 'దక్షిణ టిబెట్' అని ఎందుకు అంటోంది
- భర్తలను ఎంచుకోవడంలో పొరపాటు వల్లే మాకు, పిల్లలకు ఈ గతి - ఐఎస్ తీవ్రవాదుల భార్యలు
- 'భార్యల సంపాదన, భర్తల సంపాదన కన్నా ఎందుకు తక్కువ'.. కొత్త అధ్యయనం ఏం తేల్చింది?
- బైసెక్సువల్ సూపర్ మ్యాన్
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19 వ్యాక్సీన్: మొత్తం టీకాల్లో సగానికిపైగా చైనా నుంచే వచ్చాయా
- ‘వ్యాక్సీన్ వేసుకోను అన్నందుకు నా ఉద్యోగం తీసేశారు’
- అఫ్గానిస్తాన్: సేనల ఉపసంహరణ తర్వాత తొలిసారి తాలిబాన్లతో అమెరికా చర్చలు
- చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?
- భారత్-పాక్ యుద్ధం 1971: చెరువులో నీటి అడుగున దాక్కొని ప్రాణాలు కాపాడుకున్న భారత సైనికుడి కథ
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








