రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించిన రోబో చేయి, అసలు సవాళ్లను అందుకోగలదా?

ఫొటో సోర్స్, OPENAI
- రచయిత, డేవ్ లీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక తెలివైన రోబోట్ రూబిక్ క్యూబ్‌ను ఒంటి చేత్తో పరిష్కరించగలిగింది. రోబోట్స్ ఎంత అడ్వాన్స్ అయ్యాయో చూపించింది.
కానీ, నిపుణులు మాత్రం రోబోటిక్స్ దిశగా, మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాలని చెబుతున్నారు.
క్యూబ్‌ను సరిచేసే రోబోట్‌కు ఆ కిటుకులు నేర్పించేందుకు ఓపెన్ ఏఐ సిస్టమ్స్ ఒక కంప్యూటర్ సిములేషన్ ఉపయోగించింది.
అంటే ఒక మామూలు మనిషి నేర్చుకోడానికి 10 వేల సంవత్సరాలు పట్టే కిటుకులను దానికి ఫీడ్ చేసింది.
అన్ని కిటుకులు నేర్చుకున్న ఆ రోబోట్ క్యూబ్‌ను మార్చగలిగేలా, దానిని పట్టుకునేందుకు సాయం చేసేలా వారు ఆ యంత్రానికి చిన్న చిన్న మార్పులు చేశారు.
అది రూబిక్ క్యూబ్‌ను పూర్తి చేసిన సమయం రకరకాలుగా ఉంది. కానీ అది అన్నిసార్లూ తన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి దాదాపు నాలుగు నిమిషాలు పట్టింది.
మెషీన్‌కు రోబోటిక్స్ నేర్పించి ఇంతకు ముందు కూడా రూబిక్ క్యూబ్ పరిష్కరించారు. 2018 మార్చిలో ఎంఐటీ ఇంజనీర్స్ తయారుచేసిన ఒక మెషిన్ రూబిక్ క్యూబ్‌ను 38 సెకన్లలో పరిష్కరించింది.

ఫొటో సోర్స్, OPENAI
రోబో చేతికి క్లిష్టమైన సవాళ్లు
ఓపెన్ ఏఐ తన ప్రయత్నంలో ముఖ్యంగా మల్టీ పర్పస్ రోబోట్‌ను ఉపయోగించింది. ఇక్కడ అది మెషీన్ బదులు రూబిక్ క్యూబ్‌ను పట్టుకోగలిగేలా ఒక హాండిల్ తయారు చేయడానికి ఒక మనిషి చేతిలాంటి డిజైన్ ఉపయోగించింది.
"నిజానికి, ఒక రోబో చేతితో రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించడం చాలా కష్టం" అని ఓపెన్ ఏఐ రోబోటిక్స్ టీమ్ లీడర్ మతియస్ ప్లప్పెర్ట్ బీబీసీకి చెప్పారు.
"రూబిక్ క్యూబ్ పరిష్కరించడానికి మనకు మన వేళ్లపై చాలా కచ్చితమైన అదుపు అవసరం. మనం మధ్యలో గందరగోళానికి గురికాకుండా దానిని సుదీర్ఘంగా చేయాల్సుంటుంది. ఆ ప్రక్రియలో చాలా జరుగుతుంటాయి" అన్నారు.
రోబో చేయి రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించే ప్రక్రియలో క్రమంగా సమస్యలు ఎదురయ్యేలా చేసిన టీమ్ విధానాన్ని ప్లప్పెర్ట్ ప్రశంసించారు. మధ్యలో నకిలీ అవరోధాలు కల్పించడం వల్ల క్యూబ్‌ను పూర్తి చేయడానికి రోబోట్ వాటికి బలవంతంగా అలవాటు పడుతుంది.
"ఒక కంప్యూటర్ ఊహించి, అనుకరించేదాన్ని మించి చుట్టుపక్కల వచ్చే మార్పులను కూడా తట్టుకోగలిగేలా రోబో చేతికి స్థిరమైన, క్లిష్టమైన సామర్థ్యం అందించేందుకు 'ఆటోమేటిక్ డొమైన్ రాండమైజేషన్' (ఏడీఆర్) అనే టెక్నిక్ ఉపయోగించాం" అని ఆ టీమ్ చెప్పింది.

ఫొటో సోర్స్, OpenAI
ఆకట్టుకునే చర్య మాత్రమే
మంగళవారం పోస్ట్ చేసిన ఒక వీడియోలో రోబోట్‌కు సమస్యలు ఎలా సృష్టించామో ఓపెన్ ఏఐ చూపించింది. అంటే రోబో చేతిలోని క్యూబ్‌ను ఒక బొమ్మతో కొడుతూ వచ్చారు. క్యూబ్‌ను పూర్తి చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో కాకుండా.. దానిని ఒక నల్ల పేపరుతో కూడా కప్పేశారు.
(అయితే, ఈ రోబో చేతికి వంద శాతం రికార్డ్ లేదని పరిశోధకులు చెబుతున్నారు.)
మనిషి చెయ్యి అన్ని పనులూ చేస్తుంది. ముఖ్యంగా చేత్తో వస్తువులను పట్టుకోవడం, వాటిని అటూఇటూ చేయడం లాంటివి సహజంగా జరుగుతుంది. కానీ, రోబోటిక్స్‌లో అది ఒక పెద్ద సవాలు. వ్యాపారాల్లో, ఇళ్లలో అత్యాధునిక రోబోటిక్స్‌కు స్థానం కల్పించాలంటే అవి ఈ సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది.
"మనిషి అన్ని పనులకూ చేతులు ఉపయోగిస్తాడు. రూబిక్ క్యూబ్స్ సాల్వ్ చేయడానికి మనం చేతులు ఉపయోగిస్తున్నాం. కానీ మనం వాటినే వంట చేయడానికి కూడా ఉపయోగిస్తున్నాం. మేం రోబోటిక్ చేతిని ఎంచుకోడానికి అది కూడా ఒక కారణం. ఎందుకంటే మామూలు రోజువారీ పనులకు ఉపయోగించే రోబోట్ల తయారీకి అది ఒక భరోసాను అందిస్తుంది" అని ఓపెన్ ఏఐ టీమ్ లీడర్ పీటర్ వెలిండర్ చెప్పారు.
"ఇక్కడ రోబో చేతికి ఎదురైన పెద్ద అడ్డంకి వస్తువును పట్టుకుని తారుమారు చేయడమే. అందుకే దానిని ఎంతవరకూ సరిచేయవచ్చో తెలుసుకోడానికి మేం రూబిక్ క్యూబ్‌ను ఒక ఉదాహరణగా తీసుకున్నాం" అన్నారు.
కానీ యూసీ బర్కిలీ ప్రొఫెసర్ కెన్ గోల్డ్‌బర్గ్ దీనిని ఒక 'ఆకట్టుకునే చర్య'గా వర్ణించారు. "ఓపెన్ ఏఐ పరిశోధనలో దానిని ఎక్కువ చేసి చూపిస్తున్నారు. సగటు మనిషిలో రూబిక్ క్యూబ్ పరిష్కరించేంత సామర్థ్యం ఉండదు" అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, OpenAI
మరింత పరిశోధన అవసరం
"ఒక రోబోట్ రూబిక్ క్యూబ్ సరిచేయడం ఎవరైనా చూసినప్పుడు, అరే.. ఇది మనిషికంటే బాగా చేస్తోంది అంటారు. కానీ అది మోసం చేయడం లాంటిదే. ఎందుకంటే గేమ్స్ అనేవి వాస్తవం కాదు" అని గోల్డ్‌బర్గ్ అన్నారు.
"ఓపెన్ ఏఐ రూపొందించిన ఏడీఆర్ టెక్నిక్ ఒక నిజమైన పురోగతి. కానీ రూబిక్ క్యూబ్ కంటే కష్టమైన, అనూహ్యమైన వస్తువులను పట్టుకోవడంలో రోబోట్లపై మరింత పరిశోధన అవసరం" అన్నారు గోల్డ్‌బర్గ్.
"ఒక రోబోట్ పేకముక్కల కట్టను తీసుకుని, వాటిని కాసినోలో అనుభవజ్ఞుడైన ముక్కలు కలిపే వ్యక్తిలా కలపగలదా? అలా చేయడానికి మరో పది, ఇరవై ఏళ్లు పట్టచ్చు. వంటగదిలో కూరగాయలు తరిగే లేదా గిన్నెలు కడిగే వాళ్లకు ప్రత్యామ్నాయం తీసుకురావడానికే మనం చాలా దూరంలో ఉన్నాం. అవన్నీ చాలా కష్టమైన పనులు" అని ఆయన చెప్పారు.
ఓపెన్ ఏఐ తయారుచేసిన రోబోట్ పనితీరును బీబీసీ స్వతంత్రంగా పరిశీలించలేదు. బీబీసీతో మాట్లాడిన నిపుణుల వాదనలు వివాదాస్పదంగా లేకపోవడంతో ఓపెన్ ఏఐ రీసెర్చ్ పత్రాలను కూడా సమీక్షించలేదు.
2015లో ప్రకటించిన ఓపెన్ ఏఐకు తెల్సా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్, స్టార్టప్ స్పెషలిస్ట్ శామ్ ఆల్ట్ మాన్, మరికొందరు పెట్టుబడిదారులు నిధులు అందిస్తున్నారు (మస్క్ ఎక్కువ కాలం కొనసాగలేదు). 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'పై మరింత పరిశోధనలే దీని లక్ష్యం. అది 'రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్' అనే టెక్నిక్‌తో ఏఐకు పునరావృత లక్ష్యాలు ఇవ్వడం, ఫలితాలను సరిదిద్దినందుకు బహుమతులు ఇవ్వడంపై దృష్టి పెడుతుంది. ఓపెన్ ఏఐను గూగుల్ డీప్‌మైండ్‌కు ప్రధాన పోటీదారుగా చూస్తున్నారు.
ఇవి కూడా చూడండి/చదవండి.
- రోబోలతో ఉద్యోగాల్లో కోత పడుతుందా?
- భూమిని సూర్యుడే కబళిస్తాడా?
- చంద్రయాన్-2: విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు ఇస్రోకు మళ్లీ సాధ్యమేనా
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- ఒరాంగుటాన్ శాండ్రా: ఇది జంతువు కాదు, మానవ హక్కులున్న మనలాంటి మనిషే'
- ఒకదాన్నొకటి కాపాడుకునే ప్రయత్నంలో మొత్తం ఆరు ఏనుగులు మృతి
- మోదీ -షీ జిన్‌పింగ్: చైనా అధ్యక్షుడి భారత పర్యటనలో పంచెకట్టులో కనిపించిన ప్రధాని మోదీ
- సిరియాలో కుర్దులపై టర్కీ 'సైనిక చర్య' ఎందుకు? దీనివల్ల జరగబోయేది ఏమిటి?
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- విరాట్ కోహ్లీ: బ్రాడ్‌మన్, సచిన్, సెహ్వాగ్‌ల రికార్డ్ బ్రేక్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









