కోటమైసమ్మ ఆలయం: కొన్ని హిందూ ఆలయాల్లో మద్యం, మాంసాలను నైవేద్యంగా ఎందుకు పెడతారు

దేవాలయాల్లో మద్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేశారు. సినిమా షూటింగ్ కోసం వరంగల్‌ వెళ్లిన ఆయన.. కోటమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించారు.

దీంతో అమ్మవారికి విస్కీని నైవేద్యంగా పెట్టడంపై మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది.

దేవాలయాల్లో మద్యాన్ని నైవేద్యంగా పెడతారా? ఈ ఆచారం కేవలం ఈ దేవాలయానికే పరిమితమా? అసలు ఈ ఆచారం ఎలా మొదలైంది? తదితర అంశాలపై చర్చ జరుగుతోంది.

దేవాలయాల్లో మద్యం

ఫొటో సోర్స్, Twitter/RamGopalVarma

మద్యంతో అభిషేకం..

దేవాలయాల్లో మద్యాన్ని నైవేద్యంగా పెట్టే సంప్రదాయం కేవలం కోటమైసమ్మ ఆలయానికి మాత్రమే పరిమితం కాదు.

‘‘ఇక్కడ చుట్టుపక్కల చాలా దేవాలయాల్లో ఇలా మద్యాన్ని నైవేద్యంగా పెడుతుంటారు. ఉదాహరణకు అబ్బనగుంట మైసమ్మ ఆలయాన్ని తీసుకోండి. అక్కడ అమ్మవారికి కాళ్ల దగ్గర పాత్రలో మద్యాన్ని పోసి పెడతారు. మేం మాత్రం మద్యంతో అభిషేకం చేస్తుంటాం’’అని కోటమైసమ్మ దేవాలయ ప్రధాన పూజారి కోటగండి అయ్యప్ప చెప్పారు.

ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని అయ్యప్ప వివరించారు. ‘‘రాజుల కాలం నుంచీ ఈ సంప్రదాయం ఉంది. మొదట్లో ప్రత్యేకంగా తీసిన కల్లును నైవేద్యంగా పెట్టేవాళ్లం. కల్లు అందుబాటులో లేనప్పుడు మద్యం పెట్టేవాళ్లం. అలా ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది’’అని ఆయన వివరించారు.

‘‘దేవాలయాల్లోనే కాదు.. గ్రామాల్లో జరిగే జాతర్లలోనూ అమ్మవారికి, పోతురాజులకు ఇలా మద్యాన్ని నైవేద్యంగా పెడుతుంటారు’’అని ఆయన చెప్పారు.

మరోవైపు ఈ ఆలయానికి ప్రతివారం వచ్చే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘‘భక్తులు తమ మొక్కులతోపాటు మద్యాన్ని కూడా అమ్మవారికి సమర్పిస్తారు. కొంతమంది విదేశాల నుంచి వచ్చేవారు దిగుమతి చేసుకున్న ఆల్కహాల్‌ను కూడా తీసుకొస్తుంటారు. రోజూ హారతి కూడా మద్యంతోపాటే కలిపి ఇస్తారు’’అని అన్నారు.

ఆలయాల్లో మద్యం

ఫొటో సోర్స్, Getty Images

కాశీలోనూ..

తెలంగాణతోపాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో దేవుళ్లకు ఇలా మద్యాన్ని నైవేద్యంగా పెట్టే సంప్రదాయం ఉంది.

కాశీలోని ప్రధానమైన విశ్వనాథ్ ఆలయానికి పది నిమిషాల నడక దూరంలో విశ్వేశ్వర గంజ్‌లో ఉండే కాలభైరవ్ దేవాలయంలోనూ ఇలానే మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నామినేషన్‌ను సమర్పించే ముందు, ఈ ఆలయాన్ని సందర్శించారు.

మరోవైపు దిల్లీ, అహ్మదాబాద్‌, ఉజ్జయినిలలోని కాలభైరవ్‌ ఆలయాల్లోనూ మద్యాన్ని నైవేద్యంగా పెడతారు.

కొన్ని దేవాలయాల్లో మద్యంతోపాటు పొగాకును కూడా నైవేద్యాల్లో భాగంగా పెడుతుంటారు. వీటిలో కోయంబత్తూరులోని భద్రకాళీ అమ్మవారికి కాపలాగా ఉండే మునియప్పన్‌ ఆలయం మొదటిది.

కేరళలోని పరస్సినికడవు ముథప్పన్ దేవాలయంలో మద్యంతో పాటు చేపను కూడా నైవేద్యంగా పెడతారు.

ఆలయాల్లో మద్యం

ఫొటో సోర్స్, Drink of Immortality

ఇంతకీ ఈ ఆచారం ఎలా మొదలైంది

దేవాలయాల్లో మద్యాన్ని నైవేద్యంగా పెట్టే సంప్రదాయం వేదాల కాలం నుంచి ఉందని చరిత్రకారుడు ద్విజేంద్ర నారాయణ్ ఝా చెబుతారు.

వేదకాలంలో ఈ ఆచారంపై ‘‘డ్రింక్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ: ఎస్సేస్ ఆన్ డిస్టిలేషన్ అండ్ ఆల్కహాల్ యూస్ ఇన్ ఆన్షియెంట్ ఇండియా’’ పేరుతో ఆయన ఒక పుస్తకం రాశారు.

‘‘వేద కాలంనాటి దేవుళ్లలో సోమ కూడా ఒకరు. ఆయన పేరుతో ఉండే వృక్షం నుంచి తయారుచేసే మద్యం పేరు కూడా సోమ. దీన్ని దేవుళ్లకు నైవేద్యంగా పెట్టేవారని రుగ్వేదంలో ఉంది. సుర కూడా మద్యమే. అయితే, దాన్ని సామాన్య ప్రజలు తాగేదిగా చెబుతారు. ఇంద్ర, వరుణ లాంటి దేవుళ్లకు సోమను నైవేద్యంగా పెట్టినట్లు రుగ్వేదం చెబుతోంది.’’

‘‘దేవతల సురాపానం.. భారతీయ పౌరాణిక, ఇతిహాసాల్లో తరచూ ప్రస్తావనకు వస్తుంటుంది.’’

ఆలయాల్లో మద్యం

ఫొటో సోర్స్, Getty Images

‘‘వాజ్‌పేయ యజ్ఞాన్ని చేసేవారు కూడా ముందుగా 17 కప్పుల సోమ, 17 కప్పుల సురలను 34 మంది దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు.

వేదాలతోపాటు రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు; పురాణాల్లోనూ ప్రధాన పాత్రలు మద్యపానం చేసినట్లు ఉంది.

చాలా దేవుళ్లకు ప్రియమైన వాటిలో మద్యం కూడా ఒకటి. వారిని పూజించేటప్పుడు, నైవేద్యాలు పెట్టేటప్పుడు మద్యం లేకపోతే సంపూర్ణం కాదు’’అని ఆయన పేర్కొన్నారు.

ఝా వాదనతో విశ్రాంత జర్నలిస్టు గడియారం ధ్రువకుమార్ మైత్రేయ కూడా ఏకీభవించారు. ‘‘ఈ ఆచారం వేద కాలం నుంచీ ఉంది. సురాపానం గురించి మనం వినే ఉంటాం. అప్పట్లో ఈతచెట్టు, తాటిచెట్టు, ఖర్జూరం తదితర ఆరు రకాల వృక్షాల కల్లును నైవేద్యంగా పెట్టేవారు. మూలికలు, పూలతో కూడా చేసిన కల్లును నైవేద్యంగా పెట్టేవారు’’అని ధ్రువకుమార్ వివరించారు.

ఆలయాల్లో మద్యం

ఫొటో సోర్స్, Getty Images

మాంసం కూడా..

కొన్ని దేవాలయాల్లో జంతువులను బలి ఇస్తూ.. ఆ మాంసాన్ని కూడా ప్రసాదంగా పంచుతుంటారు. ఈ ఆచారం కూడా వేద కాలం నుంచీ ఉందని ధ్రువకుమార్ చెప్పారు.

‘‘ప్రాచీన కాలంలో యజ్ఞాల్లో జంతువులను బలి ఇచ్చేవారు. ఆ మాంసాన్ని అందరికీ పంచేవారు. ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.

ఇప్పటికీ చాలా గ్రామ దేవతల ఆలయాల్లో ఈ సంప్రదాయం ఉంటుంది. పండగల సమయంలో దేవతలకు జంతువులను బలిగా ఇస్తూ.. ఆ మాంసాన్ని నైవేద్యంగా పంచుతుంటారు’’అని ఆయన వివరించారు.

మదురైలోని మునియండి దేవాలయంలో ఏటా మునియండి వేడుకలు నిర్వహించే సమయంలో, జనవరి మూడో వారంలో చికెన్, మటన్ బిర్యానీలను ప్రసాదంగా పంచుతుంటారు. మునియండిని శివుడి అవతారంగా ఇక్కడి ప్రజలు చెబుతారు.

కొన్ని తూర్పు రాష్ట్రాల్లో నవరాత్రుల్లో జంతువులను బలి ఇస్తుంటారు. ఈ జంతు బలులు కేవలం హిందూ సంప్రదాయానికి మాత్రమే పరిమితం కాదు. బక్రీద్‌ సమయంలో ముస్లింలు కూడా జంతువులను బలి ఇస్తుంటారు.

ఇలాంటి బలులను అడ్డుకొనేందుకు అవసరమైన సదుపాయాలు తమ వద్ద లేవని 2018లో కలకత్తా హైకోర్టుకు మమతా బెనర్జీ ప్రభుత్వం తెలిపింది.

కేరళలో అయితే, ఆలయాల ప్రాంగణాల్లో జంతువులను బలి ఇవ్వకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, ఇక్కడ దేవుడి కోసం జంతువులను బలి ఇవ్వడం మాత్రమే నేరం. అయితే, పూజలో జంతు బలి కూడా భాగమంటూ కొందరు ఈ చట్టాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, ఈ చట్టానికి కోర్టు మద్దతు పలికింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఆలయాల్లో మద్యం

ఫొటో సోర్స్, Alamy

ఇప్పుడు ఎలా కనుమరుగైంది?

ఒకప్పుడు విరివిగా ఉండేవిగా చెబుతున్న ఈ సంప్రదాయాలు ఎలా కనుమరుగు అయ్యాయో ధ్రువకుమార్ వివరించారు.

''మనకు గ్రామ దేవతల గుళ్లలో ఇలాంటి ఆచారాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, చాలాచోట్ల ఈ ఆచారాలు క్రమంగా కనుమరుగు అవుతూ వస్తున్నాయి.

ఎందుకంటే, మొదట్లో ఈ గ్రామ దేవతలు ఒక్కో వర్గానికి ఒక్కొక్కరిగా ఉండేవారు. ఈ గ్రామదేవతకు పూజలుచేసే వారు కూడా ఆ వర్గానికి చెందినవారే ఉండేవారు. వారి జీవితంలో ఎలాంటి చిక్కులు ఎదురైనా, శుభ పరిణామాలు సంభవించినా ఆ వర్గం వారు మొత్తం అక్కడికే వెళ్లారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఈ గుళ్లలో పూజలు చేసేవారు కూడా ఉన్నత వర్గాల నుంచి వస్తున్నారు. దీంతో క్రమంగా ఇక్కడి ఆచారాలు, సంప్రదాయాలూ మారుతూ వస్తున్నాయి.

దేవుడికి నైవేద్యంగా మద్యం

ఫొటో సోర్స్, KondaSurekha

ఇక రెండో విషయం ఏమిటంటే.. ఉదాహరణకు ఒకప్పుడు హైదరాబాద్‌లో కొత్త ఇంట్లోకి మారేటప్పుడు అందరూ ఎల్లమ్మ, పెద్దమ్మ, మైసమ్మ లాంటి దేవతల పూజలు చేసుకునేవారు. కానీ నేడు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టడం అంటే, సత్యనారాయణ వ్రతం తప్పనిసరిగా మారింది. ఇలా చాలామంది ప్రధాన దేవుళ్లవైపు చూస్తున్నారు. ఈ దేవుళ్ల విషయంలో సంప్రదాయాలు ఏళ్లకు ముందే మారిపోయాయి''అని ఆయన వివరించారు.

మరోవైపు దేవుళ్లకు మద్యం, మాంసాలను నైవేద్యంగా పెట్టడాన్ని మనం ప్రత్యేక కోణంలో చూడాల్సిన పనిలేదని తెలంగాణకు చెందిన రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు.

‘‘ఇది ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. ప్రజలు ఏం తింటే అదే నైవేద్యంగా పెట్టుకుంటారు. అదే మద్యం లేదా మాంసం ఏదైనా అవ్వొచ్చు. ప్రధాన సంస్కృతి, సంప్రదాయాలకు దూరంగా ఉండే గిరిజన జనాభా ఎక్కువగా ఉండేచోట ఇలాంటివి మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి.’’అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)