అన్నమయ్య: తిరుమల వెంకటేశ్వరస్వామికి తాళ్లపాక వంశస్థులే ఎందుకు కన్యాదానం చేస్తారు

అన్నమయ్య
    • రచయిత, శంకర్. వి
    • హోదా, బీబీసీ కోసం

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలిసిన వారందరికీ అన్నమయ్య పేరు సుపరిచితమే.

తన కీర్తనల్లో ఆయన ఆలయ విశిష్టతను వివరించిన తీరు, వెంకటేశ్వర స్వామి పట్ల తన భక్తిని చాటుకున్న తీరు అందరినీ ఆకట్టుకుటుంది.

తాళ్లపాక అన్నమాచార్యులు వేంకటేశుని స్తుతిస్తూ భక్తి పారవశ్యంతో చేసిన సంకీర్తనలు తెలుగునాట వాడవాడలా వినిపిస్తాయి. 600 ఏళ్లుగా అవి వన్నె తరగకుండా మారుమోగుతూనే ఉన్నాయి.

కేవలం భక్తికి సంబంధించినవే కాకుండా శృంగార, జ్ఞాన, వైరాగ్య సంకీర్తనలకు ఆయన పెట్టింది పేరు.

అందుకే ఆయన రచనలను తరతరాలుగా తెలుగువారు ఆస్వాదిస్తున్నారు.

'చందమామ రావే' అంటూ చిన్నపిల్లలకు గోరుముద్దలు తినిపించడం కోసం ఆలపించే పాటల నుంచి అనేక రకాల పాటలను నిత్యం వింటున్నారు.

నేటికీ తిరుమల ఆలయంలో వంశపారంపర్యంగా కైంకర్య సేవలు నిర్వహించే అవకాశం అన్నమయ్య వారసులకు దక్కుతోంది. వారు కీలకమైన సేవల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకూ తిరుమల ఆలయ ప్రాంగణమంతా అన్నమయ్య సంకీర్తనలతో మారుమోగుతూ ఉంటుంది.

తిరుమల గర్భగుడిలోనూ అన్నమయ్య కీర్తనలతో సుప్రభాత సేవ మొదలు సకల సేవలు సాగుతాయి.

సుప్రభాత సేవలో 'మేలుకో శృంగారరాయ' సంకీర్తనతో కైంకర్యం మొదలవుతుంది. ఆ సమయంలో భగవంతుడు ఓ గురువుగా, అన్నమయ్య శిష్యుడిగా కైంకర్య సేవ సాగుతుంది.

మధ్యాహ్నం జరిగే 'నిత్య కళ్యాణం పచ్చ తోరణం' కైంకర్య సేవలో అన్నమయ్య సంకీర్తనల ఆలాపన జరుగుతుంది.

ఇక రాత్రి పూట ఏకాంత సేవలోనూ శయన మండపంలో ఉయ్యాలలూపుతూ పలు సంకీర్తనలు ఆలపిస్తారు. చిన్నబిడ్డలను ఉయ్యాలలో వేసి ఊపిన విధంగా లాలి పాటలను సంకీర్తనలుగా వినిపిస్తారు.

తోమాల సేవ నుంచి అన్ని సందర్భాల్లోనూ అన్నమయ్య కీర్తనల ఆలాపన ఆనవాయితీ.

అలసిసొలసిపోయిన వెంకటేశ్వరుడిని 'షోడస కళానిధికి..' అంటూ అన్నమయ్య సంకీర్తనలతో కొనియాడడం నిత్య కార్యక్రమంగా ఉంటుంది.

వెంకటేశ్వరుని నిత్యోత్సవాల్లో వైశాఖ మాసాన తిరుమాడ వీధుల్లో జరిగే ఊరేగింపు సందర్భంగా అన్నమయ్య సంకీర్తనలు వినిపించడం సంప్రదాయంగా వస్తోంది.

సంగీత కచేరీ

కన్యాదానం చేసే అవకాశం తాళ్లపాక వారిదే.

తిరుమలలో జరిగే కల్యాణోత్సవంలో వెంకటేశ్వర స్వామిని అన్నమయ్య వారింటి అల్లుడిగా భావిస్తారని ప్రస్తుతం భగవంతుని కైంకర్య సేవల్లో పాల్గొంటున్న తాళ్లపాక కుటుంబీకుడు తాళ్లపాక హరినారాయణాచార్యులు చెప్పారు.

"అభిజిత లగ్నంలో శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. ఆ సమయంలో శ్రీదేవి, భూదేవిలను తాళ్లపాక వారింటి ఆడపడుచులుగా భావిస్తాం.

వెంకటేశ్వర స్వామిని అన్నమయ్య వారింటి అల్లుడిగా కీర్తిస్తాం. అందుకే స్వామివారి కల్యాణోత్సవంలో అన్నమయ్య వారసులు కన్యాదానం చేస్తారు. నేటికీ కైంకర్య సేవల్లో అన్నమయ్య వారసులుగా మాకు ఆ అవకాశం లభిస్తోంది.

అన్నమాచార్యులు, పెద తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యులు, తిరువెంగనాచార్యులు, అప్పలాచార్యులు, కొన్నప్పాచార్యులు, శేషాచార్యులు, రాఘవాచార్యులు, కృష్ణమాచార్యులు, అనంతాచార్యులు. శేషాచార్యులు, రామాచార్యులు.. ఇలా కైంకర్య సేవలో తరతరాలుగా కొనసాగుతున్నాం" అంటూ ఆయన వివరించారు.

చిన్నన్న రచనలే ఆధారం..

అన్నమయ్య జీవిత విశేషాలకు సంబంధించి ఆయన మనుమడి రచనలే ఆధారంగా ఉన్నాయి.

తాళ్లపాక చిన్నన్నగా పిలిచే చిన తిరువెంగళనాథుడు అన్నమయ్య చరిత్రపై ద్విపద కావ్యం రచించారు.

దానిని 1948లో పుస్తక రూపంలో ముద్రించారు. ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అన్నమయ్య జీవిత విశేషాలను ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం కడప జిల్లా రాజంపేట డివిజన్ కేంద్రానికి సమీపంలో ఉన్న తాళ్లపాక గ్రామంలో నారాయణసూరి, లక్కమాంబ అనే దంపతులకు అన్నమయ్య జన్మించారు.

భాగవత సేవా పరాయణులైన నారాయణ సూరి దంపతులకు చాలా కాలం పిల్లలు కలుగలేదు.

అనేక ప్రయత్నాల తర్వాత చివరకు, తిరుమల దర్శనం అనంతరం వారికి అన్నమయ్య జన్మించినట్టు చిన్నన్న రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.

వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో అన్నమయ్య జన్మించినట్టుగా పేర్కొనడంతో.. దాని ఆధారంగా 1408వ సంవత్సరం మే 22వ తేదీని అన్నమయ్య జన్మదినంగా నిర్ధరించారు.

చిన్ననాటి నుంచి వెంకటేశ్వరుని కొలుస్తూ పాటలు పాడే అలవాటు ఉన్న అన్నమయ్యకు తన 16వ ఏట నుంచి రోజుకో సంకీర్తన చొప్పున అలవోకగా రాయగలిగే సామర్థ్యం వచ్చిందని ఆ పుస్తకంలో ప్రస్తావించారు.

అన్నమయ్య

అదే సమయంలో, తమ గ్రామం మీదుగా తిరుమల కొండకు వెళుతున్న యాత్రికులతో కలిసి ఏడుకొండల వైపు పయనమయినట్టు పేర్కొన్నారు.

తిరుమల దర్శనం చేసుకుని శ్రీనివాసుని కీర్తిస్తూ అన్నమయ్య పాడుతున్న సంకీర్తనలకు అంతా మంత్రముగ్థులై ఆయన్ను ఆదరించినట్టుగా రాశారు.

ఇంట్లో చెప్పకుండానే తిరుమల పయనమైపోయిన అన్నమయ్య జాడ తెలుసుకుని తల్లిదండ్రులు మళ్లీ తాళ్లపాకలోని తమ ఇంటికి తీసుకొచ్చినప్పటికీ ఆయన మాత్రం భక్తి పారవశ్యంతో సంకీర్తనల ఆలాపన చేస్తూనే ఉండేవారని వివరించారు.

ఆయనకు తిమ్మక్క, అక్కమ్మ అనే వారితో వివాహం జరిగింది. ఆ తర్వాత తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకుని అన్నమయ్య తిరుమల యాత్ర చేశారని తెలిపారు.

అన్నమయ్యను బంధించిన రాజు విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయులకు పూర్వీకుడైన సాళ్వ నరసింగరాయులు.

పెనుగొండ ప్రాంతానికి రాజుగా పదవీస్వీకారం చెసిన తర్వాత అన్నమయ్యను తమ రాజ్యానికి ఆహ్వానించాడు.

రాజు కోరిక మేరకు అన్నమయ్య తన కుటుంబంతో కలిసి రాజ ఆస్థానానికి చేరారు.

ఆ సమయంలోనే అన్నమయ్య సంకీర్తనలు కన్నడ నాట కూడా ప్రాచుర్యం పొందాయి.

తన మీద కూడా ఓ సంకీర్తన రాసి ఆలపించమని రాజు అన్నమయ్యను ఆదేశించాడు.

అందుకు నిరాకరించిన అన్నమయ్యను చెరసాలలో బంధించినట్లు చిన్నన్న పుస్తకంలో ఉన్న వివరాలను బట్టి తెలుస్తోంది.

చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నమయ్య పూర్తిగా తిరుమల కొండలకే పరిమితమయ్యారు.

అక్కడే ప్రకృతిలో మమేకమవుతూ వివిధ రకాల కీర్తనలను అలవోకగా గానం చేసేవారు.

పండితులు, పామరులనే తేడా లేకుండా ఆ సంకీర్తనలు అందరినీ మంత్రముగ్దులు చేయడంతో వాటికి విశేష ఆదరణ లభించిందని చెబుతారు.

చివరకు ఫల్గుణ మాస బహుళ ద్వాదశి నాడు అంటే 1503 ఫిబ్రవరి 23న ఆయన మరణించినట్టు రాగిరేకుల ఆధారాలున్నాయని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ బీబీసీకి తెలిపారు.

అన్నమయ్య "32 వేల సంకీర్తనలు" రచించినట్లుగా చిన్నన్న రాసిన పుస్తకంలో పేర్కొనడంతో అన్నమాచార్య ప్రాజెక్టు పేరుతో చేసిన పరిశోధనలో ఆ లెక్కనే ఖాయం చేశారు.

అయితే ఇప్పటి వరకూ అందులో కేవలం 14వేల సంకీర్తనలను మాత్రమే అందుబాటులోకి తీసుకు రాగలిగారు.

1503లో అన్నమయ్య మరణించడంతో ఏటా తెలుగు క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అన్నమయ్య వర్థంతి సందర్భాన్ని పురస్కరించుకొని అన్నమాచార్య ప్రాజెక్టు కూడా ఏటా వివిధ కార్యక్రమాలు చేపడుతోంది.

త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి అనేకమంది వాగ్గేయకారులకు అన్నమయ్య ఆద్యుడని చెబుతుంటారు.

అందుకే 'తెలుగు పద కవితా పితామహుడి'గా అన్నమయ్యను ప్రస్తుతిస్తారు.

తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే అనేక పాటలు అన్నమయ్య రాసినవే. నేటికీ అవి ప్రజల నోట నానుతూనే ఉన్నాయి.

అన్నమయ్య

'చందమామరావే జాబిల్లి రావే' అంటూ లాలించినా, 'జో అచ్యుతానంద జో జో ముకుందా' అంటూ జోలపాట వినిపించినా.. అన్నింటా అన్నమయ్య ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు అంటూ సామాన్య పల్లె వాసులు కూడా ఆలపించేందుకు అనువుగా ఉండే వైవిధ్యం ఆయన సంకీర్తనల్లో కనిపిస్తుంది.

'అదివో అల్లదివో శ్రీహరివాసము', 'కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు' వంటి కీర్తనలు వినని తెలుగువారు ఉండరంటే ఆశ్చర్యమే.

వెంకటేశ్వరుని కీర్తిస్తూ ఆయన రాసిన సంకీర్తనలు ఏడు కొండల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.

అయితే, అన్నమయ్య సంకీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ ఇంకా వెలుగులోకి రాని కీర్తనలు వేల కొలదీ ఉన్నాయి.

వాటిలో కొన్నింటికి బాణీ కట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య సింగరావు దక్షిణామూర్తి శర్మ తెలిపారు.

"త్యాగరాజ కీర్తనలు సంగీత ప్రధానం. అన్నమయ్య కీర్తనలు సాహిత్య ప్రధానం. అలాంటి పద సాహిత్యంపై పరిశోధన చేసి, ప్రచురించి, ప్రచారం చేసేందుకు మా ప్రాజెక్టు తరుపున కృషి చేస్తున్నాం. ఇప్పటికే సత్ఫలితాలు వచ్చాయి. 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్‌ను టీటీడీ ప్రారంభించింది. నాటి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వేటూరి ప్రభాకరశాస్త్రి ఆధ్వర్యంలో అన్నమయ్య సాహిత్యంపై పరిశోధనా ప్రయత్నాలు మొదలయ్యాయి. దానికి ముందే సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ వంటి వారు మహంతుల పాలనలోనే అన్నమయ్య రచనల కోసం అనేక రకాల కృషి చేశారు. అన్నమయ్యకు సంబంధించి లభించిన ఆధారాలను సేకరించారు. ఆనాటి మద్రాసులో ఉన్న ముద్రణాలయం నుంచి కొన్నింటిని సేకరించాం. అహోబిళం నుంచి కొన్నింటిని తీసుకున్నాం. అయితే ఆధారాలు లభించని సాహిత్య సంపద ఇంకా ఎంతో మరుగున పడి ఉంది" అంటూ ఆయన వివరించారు.

అన్నమయ్య సాహిత్యం

అన్నమయ్య కుటుంబానికి ఉన్న ప్రత్యేకత

అన్నమయ్య పద సాహిత్యానికి ఎంతో విశిష్టత ఉంది. ఆయనతో పాటుగా అన్నమయ్య వంశీకులలో అనేకమంది తెలుగు సాహిత్యానికి సేవలందించారు.

అన్నమయ్య తండ్రి భాగవతంలో సిధ్దహస్తులు. తల్లి సంగీతకళానిధి అని చెబుతారు.

ఇక అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రిగా గుర్తింపు పొందారు. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు, చిన తిరువెంగళాచార్యులు రెండు శతాబ్దాల పాటు తెలుగు సారస్వత సేవలో తరించారు.

అలాంటి వంశ పరంపర చాలా అరుదు అని చరిత్ర పరిశోధకులు ఎం విశ్వనాథం అంటున్నారు.

"అన్నమయ్య రచనల్లో సాహిత్యం ప్రధానమైనది. ఆయన రచనల్లో కడప జిల్లా మాండలీకం పదాలుంటాయి. ఆ పదాల అర్థం తెలుసుకుని అన్నమయ్య సంకీర్తనలు ఆలపించాల్సి ఉంటుంది. బ్రహ్మ కడిగిన పాదము అనే సంకీర్తనలో పామిడి తురగపు పాదము అని అంటారు. తురగము అంటే గుర్రం అని అర్థమవుతుంది. పామిడి అంటే ఏమిటి అనేది కూడా తెలియాలి. వాటికోసం రవ్వా శ్రీహరి గారు రచించిన అన్నమయ్య పదకోశం బాగా ఉపయోగపడుతుంది. చైతన్యపూరితమైన, ఎంతో అర్థవంతమైన సందేశాలు వారి కీర్తనల్లో ఉంటాయి. సామాజిక స్పృహను చాటే విధంగా రాసిన 'బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే' కీర్తనలో 'నిండారా రాజు నిద్రించు నిద్ర ఒక్కటే' అంటూ అంతా సమానమేననే సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటివి నేటి సమాజానికి కూడా ఎంతో అవసరం" అని ఆయన వివరించారు.

తాళ్లపాక పద సాహిత్యం

అన్నమయ్య కీర్తనలతో అనేక మంది..

అన్నమయ్య సంకీర్తనలను 29 సంపుటాలుగా ముద్రించి పంపిణీ చేస్తున్నట్టు అన్నమాచార్య ప్రాజెక్టు నిర్వాహకులు చెప్పారు.

ఆయా సంకీర్తనల్లోని ప్రతీ పదానికి అర్థం, తాత్సర్యంతో సహా ముద్రించాలనే సంకల్పంతో ఉన్నట్టు దక్షిణా మూర్తి శర్మ తెలిపారు.

అన్నమయ్య కీర్తనలను ఆలాపించడం ద్వారా అనేకమంది దేశ, విదేశాల్లో కీర్తి గడించారు.

అందులో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ప్రముఖులు.

'వినరో భాగ్యము విష్ణుకథ..', 'జగడపు చనువుల జాజర..', 'పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు..' వంటి సుప్రసిద్ధ కీర్తనలకు బాణీలు కట్టి ఘనత ఆయనది.

టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రారంభంలోనే గాయకుడిగా చేరి ఉన్నతస్థాయికి ఎదిగారు.

ప్రముఖ గాయని శోభారాజు కూడా అన్నమయ్య కీర్తనలు జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడానికి కృషి చేశారు. వేల కొలదీ కచేరీలు చేసి అన్నమయ్య కీర్తనలు ఆలపించారు.

అన్నమాచార్య ప్రాజెక్టులోనే గాయనిగా ప్రవేశించి, ఆతర్వాత అన్నమాచార్య భావనా వాహిని అనే సంస్థను సొంతంగా ప్రారంభించారు.

కొండవీటి జ్యోతిర్మయి, సత్తిరాజు వేణుమాధవ్, బుచ్చిరాయాచార్యులు వంటి అనేక మంది అన్నమయ్య కీర్తనలను వాడవాడలా ప్రచారం చేసినవారిలో ఉన్నారు.

అనేకమందికి అన్నమాచార్య కీర్తనల ద్వారానే మంచి గుర్తింపు దక్కింది.

అక్కినేని నాగార్జున హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య సినిమా విశేష జనాదారణ పొందింది.

అన్నమాచార్యుని జీవిత కథను తెరకెక్కిస్తూ ఎంఎం కీరవాణీ సంగీత సారధ్యంలో వచ్చిన కీర్తనలు అనేకమందిని ఆకట్టుకున్నాయి.

అన్నమయ్య

అన్నమయ్యకు 108 అడుగుల విగ్రహం

టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకలో ఓ మందిరం నిర్మించారు. అక్కడ ఏటా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అన్నమయ్య 600వ జయంతి సందర్భంగా, రాజంపేట నుంచి తాళ్లపాక వెళ్లే మార్గంలో 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు.

అయితే ఆ ప్రాంగణం నిర్వహణ పట్ల మరింత శ్రద్ధ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. అన్నమయ్యను గుర్తిస్తూ విగ్రహం ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. నిర్వహణ బాధ్యత కూడా తీసుకోవాలని వారంటున్నారు.

తాళ్లపాక సందర్శనకు వచ్చే వారంతా విగ్రహ ప్రాంగణం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

టీటీడీ ఆ బాధ్యత తీసుకోవాలని రాజంపేటకు చెందిన మేడా రమేష్ రెడ్డి అన్నారు.

తెలుగువారు అత్యధికంగా అభిమానించే అన్నమయ్య సంకీర్తనలకు ఆదరణ పెంచేందుకు టీటీడీ మరింతగా కృషి చేయాలని తాళ్లపాక గ్రామస్తులు రజనీకుమారి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)