రామతీర్థంలో సోము వీర్రాజు, పలువురు బీజేపీ కార్యకర్తల అరెస్టు

రామతీర్థం వద్ద బీజేపీ కార్యకర్తల అరెస్టు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రామతీర్థం వద్ద బీజేపీ కార్యకర్తల అరెస్టు

విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన చేపట్టిన రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తంగా మారింది.

ఆలయం వద్దకు వెళ్లకుండా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్టు చేశారు. సోము వీర్రాజును, పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి నెల్లిమర్ల స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

విశాఖలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, విశాఖలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు

విశాఖలో తనిఖీలు, నేతల గృహ నిర్బంధం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని కొండపై ఇటీవల కోదండరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రాష్ట్రస్థాయిలో పెద్ద దుమారమే రేగింది.

అధికార, విపక్ష పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలకు పబ్లిసిటీ రాకుండా చూసేందుకు విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

విగ్రహ ధ్వంసంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భాజపా, జనసేన సంయుక్తంగా రామతీర్థ ధర్మయాత్ర తలపెట్టాయి.

ఈ ధర్మయాత్రకు సిద్ధమవుతున్న పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, అర‌కు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప‌రశురామ‌ రాజు, గాజువాక నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి క‌ర‌ణం న‌ర్సింగ‌రావు, దుర్గరాజు, బుద్దా ల‌క్ష్మీనారాయ‌ణ‌, రామ‌రాజు తదితరులను గృహనిర్బంధంలో ఉంచారు.

మరో 25 మంది బీజేపీ నేతలకు ముందస్తు నోటీసులు ఇచ్చి గృహనిర్బంధం చేశారు. గృహ నిర్బంధంపై కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. పోలీసుల సాయంతో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖలోని బీజేపీ కార్యాలయం నుంచి రామతీర్థంకు బయలు దేరిన ఆ పార్టీ నేతలు సీఎం రమేష్, కామినేని శ్రీనివాసరావులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలు రామతీర్థం వెళ్లకుండా భీమిలి బీచ్‌ రోడ్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వాహనాలను ఎక్కడికక్కడ తనిఖీ చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, విజయవాడలో సీతాదేవి విగ్రహం ధ్వంసం

దేవాలయాలతో రాజకీయాలు చేస్తే ఊరుకోం: మంత్రి వెల్లంపల్లి

''రామతీర్థానికి చాలా మంది వెళ్తున్నారు. వారు వెళ్లడంలో ఎలాంటి సమస్యాలేదు. కానీ శాంతి, భద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకొనేది లేదు''అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

''మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండని మీడియా ద్వారా అభ్యర్థించాం. కానీ అక్కడికి వెళ్తామంటే.. అక్కడి ప్రజలకు కష్టంగా ఉంటుంది. దేవాలయాలతో రాజకీయాలు చేస్తామంటే.. చూస్తూ ఊరుకునేది లేదు''

''ఈ ఆలయాల ధ్వంసం వెనుక.. ఎవరున్నా సహించేది లేదు. చంద్రబాబు అయినా లేదా వేరే ఏ పార్టీ అయినా ఊరుకోం. ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశాం. కొంత మందికి శిక్షలు విధించాం. ఇంకా కఠినమైన శిక్షలు విధిస్తూ.. ఇలాంటి ఘటనలు జరగకుండా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం''.

మంత్రి వెల్లంపల్లి

''మీ (టీడీపీ) హయాంలో తాడేపల్లిగూడెం రథం తగులబెడితే... కనీసం ఫిర్యాదు అయినా ఇచ్చారా? రథాన్ని పునర్నిర్మించడానికి బీజేపీ కృషి చేసిందా? మంత్రి మాణిక్యాల రావు ఊళ్లోనే ఘటన జరిగింది. అప్పుడు సోము వీర్రాజు ఏం చేశారు? ఆ రోజు ధర్నాలు ఎందుకు చేయలేదు?''

''60ఏళ్ల వయసున్న సోము వీర్రాజును అరెస్టు చేయడం దారుణమని అంటున్నారు. కరోనా పరిస్థితుల్లో 60ఏళ్ల వ్యక్తి అసలు బయటకే రాకూడదు. ఏం జరిగిందని వస్తున్నారు? ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా రాజకీయ డ్రామాలు ఎందుకు చేస్తున్నారు? కరోనా వ్యాప్తి నడుమ చలో రామతీర్థం అని పిలుపును ఎందుకు ఇస్తున్నారు? హిందుత్వాన్ని దూషించిన పవన్ కల్యాణ్‌ను వెనకేసుకువస్తారా? ఇప్పటివరకు బీజేపీకి గౌరవం ఉండేది. జనసేనతో కలిసిన తర్వాత అది కూడా పోయింది''.

''బండి సంజయ్ తెలంగాణ వ్యక్తి. అక్కడి వ్యవహారాలు ఆయన చూసుకుంటే చాలు. ఈ రాష్ట్రంతో ఆయనకేమీ పనిలేదు. ఆయన తెలంగాణ ప్రజలను చూసుకోమనండి చాలు''అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)