తిరుమల: ఎస్వీబీసీ మెయిల్‌లో పోర్న్ లింకులు, కొండపై భక్తుడి కిడ్నాప్... టీటీడీ చుట్టూ వరుస వివాదాలు

తిరుమల

తిరుమలలో ఇటీవల సాధారణ దర్శనాలకు అనుమతి ఇవ్వడంతో కొండ మీద రద్దీ పెరుగుతోంది. రోజుకు 30వేల మందికి పైగా భక్తులు దర్శనాలకు వస్తున్నారు.

అదే సమయంలో టీటీడీని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) ఈ వివాదాలకు కొన్ని సార్లు కేంద్ర బిందువు అవుతోంది.

ఇప్పటికే ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేస్తున్న సమయంలో సినీ నటుడు పృథ్వీరాజ్‌కు సంబంధించిన ఓ వ్యవహారంపై పెను దుమారం రేగింది. ఫలితంగా చివరికి ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక తాజాగా అదే చానెల్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ద్వారా భక్తులకు పోర్న్ వీడియో లింకులు చేరడం కలకలం రేపింది.

వరుసగా జరుగుతున్న ఈ వివాదాస్పద ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. కానీ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యవహారాలపై టీటీడీ నిఘా వైఫల్యం కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, చిన్న వివాదాలను కూడా రాజకీయ ఉద్దేశాలతో కొందరు పెద్దవి చేసి చూపుతున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి.

తిరుమల

ఫొటో సోర్స్, Getty Images

పోర్న్ వీడియోలతో పట్టుబడిన సిబ్బంది

ఆలయ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఎస్వీబీసీ చానెల్‌ని 2008లో ప్రారంభించారు. టీటీడీ ఆధ్వర్యంలో 24 గంటల ప్రసారాలు అందిస్తూ, ఈ చానెల్ నడుస్తోంది. కన్నడ, హిందీ భాషల్లోకి చానెల్‌ను విస్తరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

ఎస్వీబీసీ చానెల్ నిర్వహణ కోసం పనిచేస్తున్న సిబ్బంది టీటీడీ ఆధ్వర్యంలోనే ఉంటారు. ఆలయంలోని వివిధ కార్యక్రమాలకు ఇతర మీడియా చానళ్లను అనుమతించకుండా కేవలం ఎస్వీబీసీ సిబ్బందితో మాత్రమే చిత్రీకరణ చేస్తూ ఉంటారు. ఎస్వీబీసీ ఇచ్చిన విజువల్స్‌నే ఇతరులు వినియోగించుకోవాల్సి ఉంటుంది.

చానెల్ కార్యక్రమాల కోసం ఆఫీసులో పనిచేస్తున్న హరికృష్ణ అనే ఉద్యోగి ఇటీవల ఓ భక్తుడికి పోర్న్ లింకులు పంపడం వివాదానికి కారణమైంది. అధికారిక మెయిల్ నుంచి, నేరుగా కార్యాలయం నుంచే పోర్న్ వీడియోలు లింకులు రావడంతో సదరు భక్తుడు ఫిర్యాదు చేశారు. రోజూ ఉదయం. 10గం. లనుంచి గంట పాటు నిర్వహించే కార్యక్రమం శతమానంభవతిలో పలువురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. దానికి అవసరమైన వివరాలు భక్తులు పంపిస్తే వాటిని చానల్‌లో ప్రసారం చేస్తారు. ఏ వివరాలు అవసరమంటూ ఆరా తీస్తూ భక్తుడు ఈమెయిల్ పంపగా, దానికి పోర్న్ లింకులున్న మెయిల్ సమాధానంగా వచ్చింది.

దీనిపై ఫిర్యాదు రావడంతో చానెల్ యాజమాన్యం అప్రమత్తమయ్యింది.

టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలో దిగింది. సైబర్ టీమ్ సోదాలు జరిపింది.

ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది కంప్యూటర్‌లో పోర్న్ వీడియోలను గుర్తించారు. ఐదు హార్డ్ డిస్కులు, మూడు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వీడియో లింకులు పంపించిన హరికృష్ణ అనే ఉద్యోగితో పాటుగా మరో ముగ్గురి కంప్యూటర్లలో పోర్న్ వీడియోలతో డేటా మొత్తం నిండిపోయిందని గుర్తించారు. వారితో పాటుగా చానెల్ కార్యాలయంలో 24 మంది ఉద్యోగులు పోర్న్ వీడియోలను చూసినట్లు కనుగొన్నారు. హరికృష్ణను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

"ఫిర్యాదు రాగానే అప్రమత్తమయ్యాం. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను అంగీకరించేది లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని కంప్యూటర్లూ పరిశీలించి, పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. ఎస్వీబీసీ చానెల్ నిర్వహణలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూస్తాం. నిఘా పెంచుతాం. నిబంధనల ప్రకారం పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో చానెల్ నిర్వహణ జరిగేలా చూస్తాం" అంటూ చానెల్ చైర్మన్‌ వీబీ సాయికృష్ణ యచేంద్రం బీబీసీతో చెప్పారు.

ఆయన ఇటీవలే ఈ పదవిలో నియమితులయ్యారు. త్వరలోనే పూర్తి వ్యవహారాలపై దృష్టి పెడతానని తెలిపారు.

పృథ్వీరాజ్

ఫొటో సోర్స్, facebook/PrudhviRajOfficial

పృథ్వీరాజ్ వివాదం

ఇదివరకు ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న సినీ నటుడు పృథ్వీరాజ్ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. చానెల్ సిబ్బందితో పృథ్వీరాజ్ సరస సంభాషణలు వైరల్ అయ్యాయి. చివరకు ఆయన చైర్మన్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.

ఆయన బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఆయన వైదొలిగిన తర్వాత దాదాపు 10 నెలల పాటు ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఖాళీగా ఉంచారు.

ఈ వ్యవహారంలో తనపై కుట్ర జరిగిందంటూ అప్పట్లో పృథ్వీరాజ్ ప్రత్యారోపణలు కూడా చేశారు.

'అందరికీ చెడ్డపేరు వస్తోంది'

కొందరు వ్యక్తులు చేస్తున్న తప్పిదాలతో మొత్తం సిబ్బంది అందరికీ చెడ్డపేరు వస్తోందని టీటీడీ ఉద్యోగులు వాపోతున్నారు. తాజాగా ఎస్వీబీసీ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీటీడీ ఉద్యోగుల సంఘం ఇప్పటికే అధికారులకు లేఖలు రాసింది.

"ఇలాంటి ధోరణికి అడ్డుకట్ట వేయాలి. టీటీడీ కీర్తిని పెంచేలా సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాం. కొందరి వల్ల అక్కడక్కడా జరిగే తప్పిదాలతో అందరికీ సమస్య అవుతుంది. ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. ఇప్పటికే సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఉద్యోగుల సంఘం తరుపున కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆలయ పవిత్రతను కాపాడేందుకు అనుగుణంగా అందరినీ సన్నద్ధం చేస్తున్నాం. చిన్న చిన్న తప్పిదాలను భూతద్దంలో చూడడం వల్ల వస్తున్న సమస్యలు ఇవి" అని టీటీడీ ఉద్యోగుల సంఘం నాయకుడు రామేశ్వర రావు బీబీసీతో అన్నారు.

తిరుమల

ఫొటో సోర్స్, FACEBOOK

కొండపై కిడ్నాప్ కలకలం

ఎస్వీబీసీలో పోర్న్ వీడియోలు వివాదం అయిన ఈ సమయంలోనే తిరుమల కొండపై ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసే ప్రయత్నం జరగడం మరో అలజడిని రేపింది.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన హనుమంతరావు తిరుమల దర్శనానికి వచ్చిన సమయంలో ఆయన్ని నలుగురు వ్యక్తులు కలిసి కిడ్నాప్ చేశారు. కొండపై కిడ్నాప్ చేసి కారులో తరలిస్తుండగా కొండ దిగేలోపు వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కరోనా లాక్‌డౌన్ తదనంతరం దర్శనాలకు టికెట్లు ఉన్న వారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తుండగా, ఎటువంటి టికెట్ లేకుండా కిడ్నాపర్లు కొండపైకి ఎలా వెళ్లారన్నది అనుమానాలకు తావిచ్చింది.

ప్రస్తుతం వాహనాల్లో వెళ్లే భక్తులను అలిపిరి చెక్ పోస్ట్ వద్ద, కాలినడకన వెళ్లే వారిని ప్రారంభంలోనే తనిఖీ చేసి మాత్రమే అనుమతిస్తున్నారు.

అయితే అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతానికి చెందిన ఆ నలుగురు నిందితులు తమ వాహనంలో నేరుగా కొండపైకి వెళ్లడం వెనుక ఎవరి పాత్ర ఉందన్నది ఆరా తీస్తామని ఏఎస్పీ మునిరామయ్య బీబీసీతో చెప్పారు. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు సభ్యుడైన ఓ వ్యక్తి పాత్ర ఉందనే అనుమానాలున్నాయని, వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు.

'ఆలయ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు'

తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో ఇటీవల కాలంలో పలు వివాదాలు తెరమీదకు వచ్చాయి. బస్సు టికెట్లపై అన్యమతముద్రలున్నాయని, టీటీడీ ఆస్తులు అమ్మేస్తున్నారని, అయోధ్య రామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని ఇలా పలు ఆరోపణలు, అభ్యంతరాలు... సప్తగిరి పత్రికలో ప్రచురితమైన ఓ కథ కూడా వివాదాస్పదమయ్యాయి. కొన్ని సందర్భాల్లో బాధ్యులపై నామమాత్రపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు కూడా వచ్చాయి.

''ధర్మ ప్రచారం విషయంలో ఎస్వీబీసీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎస్వీబీసీని ప్రక్షాళన చేయండి. 250 మంది ఉద్యోగులకు కోట్ల రూపాయల జీతాలు ఎందుకు ఇస్తున్నారు. అవసరం లేకున్నా వేల జీతాలు ఇచ్చి తిరుమల ప్రతిష్టను దిగజార్చుతారా? అసభ్యకరమైన దృశ్యాలు భక్తులకు పంపిన వారిపై చర్యలు తీసుకొని శాశ్వతంగా తొలగించాలి. టీటీడీనే దాడులు చేయించి, దాదాపు 30 మందిని గుర్తించిన తర్వాత కూడా ఎందుకు తొలగించడం లేదు. ఈ రకమైన పనులు చేసిన సిబ్బందిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టడంలేదు. అసభ్య చిత్రాలు పంపిన వారిని శాశ్వతంగా ఉద్యోగుల నుంచి తొలగించండి'' అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.

వైవీ సుబ్బారెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/IAMYVSUBBAREDDY

ఫొటో క్యాప్షన్, వైవీ సుబ్బారెడ్డి

'అవసరానికి మించి సిబ్బందిని నియమించారు'

ఎస్వీబీసీ చానెల్‌లో అవసరం లేకున్నా అదనపు సిబ్బంది నియామకాలు జరిగినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను ఉపక్షేంచబోమని బీబీసీతో అన్నారు.

"సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. ఎస్వీబీసీలో అవసరం లేకున్నా ఎక్కువ మంది సిబ్బందిని నియమించారు. పనిలేకపోవడంతో కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారు. వారందరినీ తొలగించబోతున్నాం. ఇప్పటికే నలుగురు ఉద్యోగులను బాధ్యులుగా గుర్తించాం. పోర్న్ వీడియాల లింకులు దొరికిన అందరిపైనా చర్యలుంటాయి. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించే వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. నిఘా పెంచి, అన్ని రకాలుగానూ ఆలయ ప్రాంగణం, చానెల్ నిర్వహణ అంతా ప్రక్షాళన జరుగుతుంది" అని ఆయన చెప్పారు.

'రాజకీయ కారణాలతోనే వివాదాలు'

టీటీడీ పరిధిలో వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, చిన్న దోషాలను కూడా భూతద్దంలో చూపించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోందని తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆదిమూలం శేఖర్ అభిప్రాయపడ్డారు.

"తిరుమల ఆచారాలకు భంగం కలిగించే పని ఉద్దేశపూర్వకంగా ఎక్కడా జరగదు. పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్న చోట ఒకరిద్దరు చేసే దోషాలను మొత్తం వ్యవస్థకు ఆపాదించడం తగదు. టీటీడీ చుట్టూ వివాదాలు రాజేయాలనే సంకల్పంతో కొందరున్నారని ఇటీవల పలు సందర్భాల్లో స్పష్టమయ్యింది. ఎస్వీబీసీలో అదనపు సిబ్బంది ఉన్న మాట నిజమే. చానెల్‌ని మరింత ప్రజారంజకంగా మార్చాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా చర్యలుండాలి. సిబ్బందిని తొలగించకుండా వారిని ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించాలి. చానెల్‌కి ఏటా రూ.25 కోట్లు వెచ్చిస్తున్నారు. దానికి తగ్గట్టుగా మంచి కార్యక్రమాలతో టీటీడీ కీర్తిని పెంచే దిశలో ప్రయత్నాలు జరగాలి. అప్పుడప్పుడూ చిన్న చిన్న విషయాలు వెలుగులోకి వస్తున్నా, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగడమే తప్ప వాటి చుట్టూ వివాదాలు రాజేయడం శ్రేయస్కరం కాదు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)