మంగ్లీ: బోనాల పాటతో అమ్మవారిని అవమానించారా, ఏమిటీ వివాదం?

మంగ్లీ

ఫొటో సోర్స్, Mangli Official/twitter

ఫొటో క్యాప్షన్, మంగ్లీ
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

బోనాల పండుగ కోసం మంగ్లీ విడుదల చేసిన ఒక పాటలో కొన్ని పదాలపై హిందూ సంఘాలు అభ్యంతరం చెప్పాయి. అమ్మవారిని మోతుబరిలాగా కూర్చున్నావు, చుట్టంలా కూర్చున్నావు అనడం తప్పు అని వారి వాదించారు. అంతేకాదు. దీనిపై బీజేపీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

ఈ వివాదం కారణంగా మంగ్లీ ఆ పాటను మార్చాల్సి వచ్చింది. ఇంతకీ మంగ్లీ పాడిన పాటలోని తప్పేంటి? పోలీసుల ఫిర్యాదు, సోషల్ మీడియాలో వివాదం అయ్యేంత అయ్యేంత ఇబ్బందికర పదాలేంటి?

చెట్టుకింద కూసున్నవమ్మ సుట్టం లెక్క ఓ మైసమ్మ

చెట్టు సుట్టు మేం తిరుగుతుంటే, చేతులెత్తి నీకు మేం మొక్కుతుంటే,

మొక్కినా వరమీయకుండా, మోతెబరిలెక్క కూసుకున్నవమ్మ

ఇది మొదటి వెర్షన్.

చెట్టుకింద కూసున్నవమ్మ చల్లగా చూడే ఓ మైసమ్మ,

చెట్టు చుట్టు మేం తిరుగుతుంటే, చేతులెత్తి నీకు మొక్కుతుంటే,

మోరలు విని వరాలిచ్చి, సుట్టమునువ్వే కాసినవమ్మ.

ఇది మార్చిన వెర్షన్.

మొదటి వెర్షన్లో మోతెబరిలా కూర్చుని మాకు వరాలు ఇవ్వడం లేదు అని అమ్మవారిని పాట రచయిత నిష్ఠురమాడారు. అయితే, అది వివాదం కావడంతో తరువాత దాన్ని మార్చారు.

మంగ్లీ

ఫొటో సోర్స్, Mangli Singer/fb

ఫొటో క్యాప్షన్, పాటలో భావాన్ని అర్ధం చేసుకోకుండా విమర్శిస్తున్నారని మంగ్లీ అన్నారు

ఈ పాట రాసిందెప్పుడు?

ఈ పాట రచయిత కమతం రామస్వామి. దళిత కులానికి చెందిన వ్యక్తి. బడి చదువులు పెద్దగా చదువుకోలేదు. ఆయన దాదాపు 300కి పైగా జానపద గేయాలు రాశారు. పాలమూరు రామస్వామిగా ఆయన ఫేమస్.

మహబూబ్ నగర్ జిల్లా పెద్ద గుత్త పల్లి సొంతూరు. స్వతహాగా రైతు అయినా, వర్షాలు లేక సాగు గిట్టుబాటు కాక తాపీ పని నేర్చుకుని మేస్త్రీ అయ్యారు రామస్వామి. మహబూబ్ నగర్ లో ఇప్పటికీ వ్యాప్తిలో ఉన్న కోలాటాల్లో చాలా పాటలు ఆయన రాసినవే.జంగాలు చేసే పలకల భజన పాటలు కూడా ఆయన రాశారు.

ఆయన ఊరికి దగ్గరలోని నాయినేనిపల్లి గ్రామంలో ఒక మైసమ్మ అమ్మవారి గుడి ఉంది. ఆ దేవతపై దాదాపు 70-80 వరకూ పాటలు రాశారు రామస్వామి. అప్పట్లో ఆయన క్యాసెట్లు కూడా విడుదల చేశారు.

ఈ పాటను సీడీల రూపంలో మొదటిసారి 2008లో సునీల్ కుమార్ రికార్డు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. డిస్కో రికార్డింగ్ కంపెనీ బోనాల జాతర పాటల పేరుతో ఆ సీడీని విడుదల అయింది.

ఆ తరువాత మళ్లీ మంగ్లీ ఇప్పుడు ఆ పాటను ఉపయోగించుకున్నారు. తన వీడియోలో కూడా రామస్వామిని చూపించారు.

''మా నాన్న ఎన్నో పాటలు రాశారు. ఇది కోలాటం పాట. వందల పాటలు జనంలోకి వెళ్లాయి. అమ్మవారి మీద, పాలమూరు పరిస్థితుల మీద ఆయన రాసిన పాటలను అందరూ ఆదరించారు. ఈ పాటలో కూడా మోతెబరి అనే పదం తప్పేమీ కాదు. అది గౌరవప్రదమైన పదమే. ఈ పాట రాసి దాదాపు 30 ఏళ్లు అవుతుంది. అప్పటి నుంచీ అలానే పాడుతున్నారు. ఎక్కడా వివాదం రాలేదు.'' అని రామస్వామి కుమారుడు శివ బీబీసీతో అన్నారు.

80 ఏళ్ల రామస్వామి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు.

''ఆ పాటను 2008లో మేం రికార్డు చేశాం. ఇప్పటికీ ఆ పాట మా యూట్యూబ్ చానెల్లో ఉంది. మోతుబరి అంటే పెత్తందారి అని అర్థం. అందులో తప్పేమీ లేదు'' అని ఈ పాటను మొదట రికార్డు చేసిన గాదరి సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు.

మోతుబరి అంటే ఎక్కువ భూమి ఉన్నవాడు, ధనవంతుడు, పెత్తందారు అన్న అర్థాలు ఉన్నాయి. కోస్తాలో ఈ పదం పెద్ద రైతు అనే అర్థంలో వాడుతుండగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వ్యంగ్యంగా పెద్దరికం చేస్తూన్న వాళ్లను, స్థాయికి మించిన లేని సామర్థ్యానికి మించిన పెద్ద మాటలు చెప్పేవారికి కూడా వాడుతుంటారు. ఇది హిందుస్తానీ భాష నుంచి వచ్చిన పదం.

''మోతుబరి అంటే ఎక్కువ ఆస్తి ఉన్నవాడు, సంపన్నుడు అనే అర్థం ఉంది. కానీ వ్యవాహారికంలో ఎవరైనా పెత్తనం చేస్తున్నా, గట్టిగా మాట్లాడుతున్నా, మోతుబరి కబుర్లు చెప్పకు అని తెలంగాణలో అంటుంటారు. తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో ఓ 50 ఎకరాల రైతును మోతుబరి అంటారు. అయితే, భక్తిలో ఇవన్నీ మామూలే. నేను మంగ్లీ పాట విన్నాను. అందులో నాకు తప్పేమీ అనిపించలేదు'' అని తెలుగు ఆచార్యులు పులికొండ సుబ్బాచారి అన్నారు. జానపద సాహిత్యంపై ఆయన విస్తృత అధ్యయనం చేశారు.

''హిందూ దేవుళ్లను అరే, ఒరే అంటాం. బైండ్ల కులస్తులు అంటు వ్యాధులప్పుడు కట్టుకట్టే సమయంలో తిట్లు కూడా వాడతారు'' అన్నారు సుబ్బాచారి.

నిజానికి జానపద పాటల్లో ఇలాంటి పదాలు చాలానే కనిపిస్తుంటాయి. మాయదారి మైసమ్మ పాటలో మాయదారి పదం మోతుబరి కంటే ఎక్కువ నెగిటివ్ భావాన్ని ఇచ్చేదే. కానీ ఆ పాటను జనం ఆదరించారు.

అమ్మవారిని అలా సంబోధించడం తప్పని బీజేపీకి మద్దతిచ్చే కొందరు వ్యక్తులు, హిందూ సంస్థల వారు అంటున్నారు. దీనిపై రాచకొండ పోలీసులకు బీజేపీ నాయకులు ఫిర్యాదు కూడా చేశారు.

''అమ్మవారిని బొమ్మ అని చులకన చేశారు. ఈ పాట ప్రొడక్షన్ ఒక ముస్లిం చేశారు. ఒక కమ్యూనిస్టు ఈ పాట డైరెక్ట్ చేశారని ఎంత మందికి తెలుసు?'' అని సోషల్ మీడియాలో ఆర్.జె.కిరణ్ యూజర్ ప్రశ్నించారు. ఆమె బీజేపీకి, హిందుత్వకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు.

పాటను సమర్థించే వారు మాత్రం అది నిందాస్తుతి అంటూ రామదాసు కీర్తనతో పోల్చారు. దానిపై కూడా కిరణ్ స్పందించారు. ''డబ్బుల కోసం ఏది పడితే అది పాడే మంగ్లీని రామదాసుతో పోల్చవద్దు'' అన్నారామె.

మంగ్లీ
ఫొటో క్యాప్షన్, పాట రచయిత రామస్వామి, ఆయన కుటుంబ సభ్యులతో మంగ్లీ

నిందా స్తుతి అంటే?

పైకి తిడుతున్నట్టు, విమర్శిస్తున్నట్టు, గేలి చేస్తున్నట్టున్నా, అంతర్గతంగా పొగడడమే నిందాస్తుతి లేదా వ్యాజస్తుతి. సంస్కృత అలంకారాల్లో వ్యాజస్తుతి పేరుతో ఒక అలంకారం కూడా ఉంది.

దేవుడు లేదా దేవతను నిష్టూరం ఆడుతూ రచనలు చేయడం తెలుగు, సంస్కృత సాహిత్యాల్లో పూర్వం నుంచీ ఉంది. ఆధునిక సినిమా సాహిత్యంలో కూడా ఆ ప్రక్రియ ఉంది.

త్యాగరాజు తన కీర్తనల్లో రాముడు, కృష్ణుడు మీద, శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో గోదాదేవి పాత్ర చేత శ్రీమహావిష్ణువు మీద, భల్లా పేరయ కవి భద్రాచలం రాముని మీద, గోగులపాటి కూర్మనాథ కవి సింహాచలం నరసింహ స్వామి మీద, శేషప్ప కవి ధర్మపురి నరసింహ స్వామి మీద, ఆడిదము సూర కవి గంగా దేవి మీద, అప్పర్ (తిరునావుక్కరసర్) అనే నాయనార్ శివుడి మీద ఈ నిందా స్తుతి చేశారు.

భరత నాట్యంలో కూడా నిందాస్తుతి గీతాలకు ఆడుతారు. నీకున్ మాంసము వాంఛయేని.. పద్యంలో నీకు మాంసమే కావాలంటే నీకేం కఱువు అంటూ ధూర్జటి శివుడిపై రాశారు.

ముస్లిం దండయాత్రలను ప్రస్తావిస్తూ వేంకటాచల విహార శతకంలో, తిరుపతి గోవిందరాజ స్వామి చేతకానివాడిలా నిద్రపోతున్నాడని రాశారు.

తెలుగులో నిందా స్తుతిలో పూర్తిగా శతకం రాసిన వ్యక్తి కాసుల పరుషోత్తమ కవి. కృష్ణా జిల్లా శ్రీకాకుళంలోని ఆంధ్ర విష్ణువుపై ఆయన రాసిన పద్యాలన్నీ విష్ణువును తిడుతున్నట్టే ఉంటాయి.

విష్ణు మూర్తి పనీ పాట లేక పాల సముద్రంలో శేషుడి మీద పడుకున్నాడనీ, ఆయన ఒక భార్య భూదేవిగా భారం మోస్తుంది. మరో భార్య సంపదలిస్తుంది. ఒక కొడుకు అయిన బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు. కుమార్తె గంగ జనాల పాపం కడుగుతుంది. ఇదంతా భార్యా పిల్లలు తెచ్చిన ప్రతిభ తప్ప నీవు ముందు నుంచీ దామోదరుడవే. ఇక్కడ దామోదరుడు అంటే విష్ణువు అనే అర్థం ఉంది, అప్రయోజకుడు అనే అర్థం ఉంది. (ఆలు నిర్వాహకురాలు భూదేవియై పద్యం). అంతేకాదు విష్ణువు తన భక్తులు అన్ని కష్టాలూ పడ్డాక చాలా ఆలస్యంగా కాపాడాడని కూడా పద్యాల్లో రాశాడు పురుషోత్తమ కవి.

మరో పద్యంలో రాముణ్ణి వెఱ్ఱివాడు, అవివేకి అని రాసిన ఈయనకు పశ్చిమ గోదావరిలో ఒక విగ్రహం కూడా పెట్టారు. ఇలా ఈయన నిందాస్తుతిలో రాసిన పద్యాలు వందల్లో ఉంటాయి. కృష్ణావతారంలో అమ్మానాన్నలను జైల్లో వదిలేసి పారిపోయావు, నీది గయ్యాళితనం అంటూ విష్ణుపై ఎన్నెన్నో రాశాడు పురుషోత్తమ కవి.

ఇక శ్రీనాథుడు చాటు పద్యాల్లో ''డబ్బున్న కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు ఉన్నారు. భిక్షాటన చేసే నీకు ఇద్దరు భార్యలు ఎందుకు? పార్వతి చాలు నీకు, గంగను విడచి పెట్టు'' అని రాశాడు. (ఒక ప్రాంతంలో నీటి కరువు చూసి పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ అంటూ శ్రీనాథుడు ఈ పద్యం రాశాడు.)

సుప్రసిద్ద గాయని సుశీలతో మంగ్లీ

ఫొటో సోర్స్, Mangli Singer/fb

ఫొటో క్యాప్షన్, సుప్రసిద్ద గాయని సుశీలతో మంగ్లీ

ఎవడబ్బ సొమ్మన్న రామదాసు

రామదాసు కీర్తనల్లోని ‘ఇక్ష్వాకు కులతిలకా’ అనే కీర్తనలో తాను రామునికి అందమైన ఆలయం, సీతారామాలక్ష్మణులకు అనేక ఆభరణాలు చేయించానని, కానీ అలా చేసినందుకు శిక్షను అనుభవిస్తున్నాని, తనను రక్షించాలంటూ ‘‘నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా’’ అని రాముని నిందిస్తాడు.

తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్లా గ్రామ దేవతల ఆరాధనలో స్వయంగా దేవతను తిట్లు తినే ఆచారం ఉంది. రాయలసీమలో ఈ ఆచారం ఇప్పటికీ స్పష్టంగా చూడవచ్చు. ఉత్సవాల కోసం దేవతను ప్రతిష్టించేప్పుడు ఇలా చేస్తారు.

గ్రామ దేవతలే కాదు, తిరుమలలో ఏటేటా జరిగే ప్రణయ కలహోత్సవంలో కూడా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు వేంకటేశ్వరుణ్ణి నిందాస్తుతి చేసే ఘట్టం నిర్వహిస్తారు.

మంగ్లీ ఏమన్నారు?

దీనిపై మంగ్లీ స్పందించారు. సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టారు.

''ఈ పాట నేపథ్యం తెలుసుకోకుండా నిందిస్తున్నారు. గ్రామదేవతలను ఎలా కొలుస్తారు, మైసమ్మ కొలుపు పాటలు, నిందాస్తుతి సాహిత్యం గురించి తెలుసుకొని విమర్శలు చేస్తే విజ్ఞతగా ఉండేది. ఈ పాటపై విమర్శలు వచ్చిన రోజే పాటను మార్చే అవకాశం ఉన్నప్పటికీ, పాటకోసం ప్రాణంపెట్టిన 80 ఏళ్ల వృద్ద రచయిత రామస్వామిగారిని తక్కువ చేయవద్దనే ఉద్దేశ్యంతో, ఆయనను గౌరవించి ఈ నిర్ణయం తీసుకోలేకపోయాను'' అన్నారు మంగ్లీ.

‘‘దీన్ని మరింత వివాదం చేసి ఆ పెద్ద మనిషిని కూడా కించపరుస్తున్నారు. అందుకే ఆయన కుటుంబ సభ్యుల అనుమతితో లిరిక్స్ లో మార్పులు చేశాము’’ అన్నారామె.

ఈ పాటపై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసిన మల్కాజ్ గిరి బీజేపీ కార్పొరేటర్ ఊరపల్లి శ్రవణ్ తో బీబీసీ మాట్లాడారు. పాట మార్చినందుకు ఫిర్యాదు వెనక్కు తీసుకుంటున్నాం అని ఆయన చెప్పారు. అయితే పాటలో ఉన్న నిందాస్తుతి గురించి ప్రస్తావించినప్పుడు, దానిపై ఆయనేమీ సమాధానం ఇవ్వలేదు.

పాట మార్చినందుకు మంగ్లీకి కృతజ్ఞతలు తెలిపిన ఆర్జే కిరణ్, భక్తిని ఆడంబరంగా చేసుకునే వేడుకలో కొన్ని పదాలు ప్రయోగించడం శుభ పరిణామం కాదు అని అన్నారు.

మంగ్లీ వెనుకబడిన కులానికి చెందిన మహిళ కాబట్టే ఇలా ఇబ్బంది పెట్టారనీ, అగ్ర కుల రచయితలు ఇలా రాసినప్పుడు ఎవరూ ఏమీ అనలేదంటూ సోషల్ మీడియాలో ఇంకొందరు వ్యాఖ్యలు చేశారు.

వీడియో క్యాప్షన్, ఫోక్ సింగర్ కనకవ్వ:

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)