వాతావరణ మార్పులు: కాప్-26లో భారత్, చైనా చేతులు కలిపి అమెరికానే ప్రతిఘటిస్తాయా?

వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 2019లో ముంబైలో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఒక యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 2019లో ముంబైలో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఒక యువతి
    • రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
    • హోదా, పర్యావరణ ప్రతినిధి, బీబీసీ వరల్డ్ సర్వీస్

భారత్ కోసం పునరుద్పాదక ఇంధన (రిన్యువబుల్ ఎనర్జీ) ప్రణాళికలను అమెరికా వాతావరణ రాయబారి జాన్ కెర్రీ గత వారం రూపొందించారు. అయితే నెట్ జీరో ఎమిషన్స్ (నికర సున్నా ఉద్గారాలు) లక్ష్యాన్ని సాధించడానికి భారత్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తుందన్నది మాత్రం స్పష్టం కాలేదు.

వాతావరణంపై అమెరికా నాయకత్వం కోరుకుంటున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, అధికంగా కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాలలో దానినికి తగ్గించే ప్రణాళికలను అమలు చేయించేలా కెర్రీ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఇతర వివాదాల నుంచి వాతావరణాన్ని వేరు చేయడానికి కెర్రీ చేసిన ప్రయత్నాలను చైనా తిరస్కరించింది. "వాతావరణ సహకారాన్ని చైనా-యుఎస్ సంబంధాల 'ఒయాసిస్' గా మార్చాలని అమెరికా భావిస్తోంది. కానీ 'ఒయాసిస్' చుట్టూ 'ఎడారి' ఉంటే, 'ఒయాసిస్' త్వరలో లేదా తర్వాతైనా ఎడారిగా మారుతుంది" అని విదేశాంగ మంత్రి వాంగ్ యి, కెర్రీతో చెప్పారు.

క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్ (సీఏఎఫ్ఎండీ)ని కెర్రీ రెండోసారి(మొదటిది ఏప్రిల్‌లో ప్రకటించారు) ప్రకటించినందుకు భారత్ సంతోషంగా ఉంది. ఇది ప్రధానంగా భారతదేశం 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది.

కానీ, అవసరమైన స్థాయిలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం ఎలా ప్రణాళికలు రూపొందిస్తుందనేదానిపై స్పష్టత లేదు.

భారత పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో కెర్రీ

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, భారత పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో కెర్రీ

ఎందుకీ ఒప్పందం?

నెట్ జీరో ఎమిషన్స్ అంటే సాధ్యమైనంత వరకు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం. వాతావరణం నుండి సమానమైన మొత్తాన్ని గ్రహించడం ద్వారా తదుపరి విడుదలను సమతుల్యం చేయడం. ఉదాహరణకు చెట్లను నాటడం వంటి కార్యక్రమాలను చేపట్టడం.

ప్రపంచంలోనే అతి పెద్ద కార్బన్ ఉద్గార దేశమైన చైనా, 2060 నాటికి కార్బన్ ఉద్గారాలను తటస్థ స్థితికి తీసుకువస్తామని ఇది వరకే ప్రకటించింది. 2030లోపు ఉద్గారాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని తెలిపింది. అయినా మళ్లీ కొత్త బొగ్గు కర్మాగారాలను నిర్మించినందుకు విమర్శలపాలైంది.

రెండవ అతిపెద్ద ఉద్గారాలను విడదల చేసే దేశమైన అమెరికా, నెట్ జీరోకి చేరుకోవడానికి 2050ని గడువుగా నిర్ణయించింది. 2035 నాటికి విద్యుత్ రంగాన్ని డీకార్బోనైజ్ చేస్తామని చెప్పింది.

ప్రపంచంలో మూడో అతి పెద్ద ఉద్గార దేశం ఇండియా. నెట్ జీరో సాధించడానికి ఇన్ని సంవత్సరాలు అన్న గడువును ఇంకా నిర్ణయించలేదు. అంతే కాకుండా పారిస్ ఒప్పందం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన కార్బన్ తగ్గింపు లక్ష్యాల కోసం విడుదల చేయాల్సిన వాతావరణ ప్రణాళికను కూడా ఐక్య రాజ్య సమితికి సమర్పించలేదు.

అయితే, ఈ ఒప్పందంలో పాల్గొన్న 191 దేశాల్లో ఇప్పటివరకు 113 మాత్రమే మెరుగైన ప్రణాళికలతో ముందుకు వచ్చాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

ఇప్పటి వరకు సమర్పించిన వాతావరణ ప్రణాళికల విశ్లేషణ ప్రకారం, 2030 నాటికి ఉద్గారాలు 16 శాతం పెరుగుతాయి. ఇది పారిశ్రామికీకరణకు ముందున్న స్థాయిల కంటే 2.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగడానికి దారి తీస్తుంది.

ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువకు పరిమితం చేయడాన్ని పారిస్ వాతావరణ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రమాదకర వాతావరణ మార్పులను నివారించడానికి పారిశ్రామికీకరణకు ముందున్న స్థాయిల కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా ఉంచేందుకు అనుమతిస్తోంది. .

అప్పటి నుండి ప్రపంచం ఇప్పటికే 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడెక్కిందని, పారిస్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2030 నాటికి ప్రపంచ కార్బన్ ఉద్గారాలను 45% తగ్గించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాతావరణ మార్పులపై ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) ఇటీవలి నివేదిక ప్రకారం, ఉష్ణోగ్రత పెరగడం వల్ల భూమికి సంబంధించిన కొన్ని వాతావరణ వ్యవస్థలు ఇప్పటికే ప్రమాదకరంగా దెబ్బతిన్నాయి.

భారతదేశంలో అనూహ్యం రీతిలో వర్షాలు కురవడం సర్వసాధారణంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో అనూహ్యం రీతిలో వర్షాలు కురవడం సర్వసాధారణంగా మారింది

భారత్ ఏం చేయబోతోంది?

గ్లాస్గోలో జరగబోయే వాతావరణ శిఖరాగ్ర సమావేశం కాప్-26కి ముందు, నేషనల్లీ డిటర్‌మైన్డ్ కంట్రిబ్యూషన్(ఎన్‌డీసీ) సవరించిన ప్రణాళికలను భారతదేశం సమర్పించాల్సివుంది. దీంతో ఇప్పుడు చాలా మంది కళ్లు భారతదేశంపైనే ఉన్నాయి.

గత వారం తన దిల్లీ పర్యటనలో కెర్రీ ఈ విషయంలో భారతదేశంపై దృష్టి పెట్టలేదు. కనీసం బహిరంగంగా కూడా మాట్లాడలేదు. కానీ ఆయన నెట్ జీరో ఎమిషన్‌ ఎజెండా గురించి మాత్రం నొక్కి చెప్పారు.

" పునరుత్పాదక శక్తిని విస్తరించడమే కాకుండా, నెట్ జీరో ట్రాన్సిషన్ కోసం కీలకమైన సాంకేతికతలను మనం అభివృద్ధి చేయాలి" అని సీఏఎఫ్ఎండీ ప్రారంభం సందర్భంగా కెర్రీ వ్యాఖ్యానించారు.

అదే కార్యక్రమంలో, నెటో జీరో గురించిగానీ, కార్బన్ రిడక్షన్‌కపై కొత్త లక్ష్యాల గురించిగానీ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడలేదు.

"అనేక స్వతంత్ర సంస్థల అంచనాలలో భారతదేశ వాతావరణ చర్యలకు మంచి రేటింగ్ వచ్చింది. భారతదేశ ఎన్‌డీసీ, రెండు డిగ్రీల సెల్సియస్‌కు అనుకూలమైనదిగా రేటింగ్ వచ్చింది" అని ఆయన భారతదేశపు ప్రస్తుత వాతావరణ ప్రణాళికను మంత్రి సమర్థించారు.

మొదటి ఎన్‌డీసీలో, భారతదేశం 2030లోపు 2005 స్థాయిల నుండి 33-35 శాతం వరకు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కట్టుబడి ఉంది. దేశం ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉందని భారత అధికారులు చెబుతున్నారు.

కర్బన ఉద్గారాలలో చైనా ఒకటో స్థానంలో ఉండగా, అమెరికా , భారత్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కర్బన ఉద్గారాలలో చైనా ఒకటో స్థానంలో ఉండగా, అమెరికా , భారత్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి

వివిద దేశాల ఎన్‌డీసీలలోని కార్బన్ రిడక్షన్ అగ్రిమెంట్లు, పారిస్ వాతావరణ లక్ష్యాన్ని సాధించడానికి చాలవని, వాటి మధ్య భారీ అంతరం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.

అందువల్ల సమీప భవిష్యత్తులో కార్బన్ ఉద్గారాల తగ్గింపుతో, దీర్ఘ కాల నెట్ జీరో ఎమిషన్ ఉద్గార లక్ష్యాలను సాధించవచ్చని వారు అన్నారు.

కానీ అభివృద్ధి చెందిన దేశాల్లాగా తనకు పెద్ద మొత్తంలో కార్బన్ కోతలను విధించరాదని భారత్ వాదిస్తోంది. దేశం ఇంకా పేదరికంతో పోరాడుతోందని, విద్యుత్ కోసం ఇంకా శిలాజ ఇంధనాలపైనే ఆధారపడుతున్నామని వివరించింది.

పునరుత్పాదక ఇంధనాల్లో ముఖ్యంగా సౌర శక్తిపై భారత్ దృష్టి సారించినప్పటికీ, కోవిడ్ అనంతర పరిస్థితులలో భాగంగా బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికలను ప్రకటించింది.

''వాతావరణ రాయబారి జాన్ కెర్రీని కలవడం సంతోషంగా ఉంది. వాతావరణ సమతుల్యానికి తీసుకోవాల్సిన చర్యలపై మేం చర్చించాం’’ అని గత వారం కెర్రీని కలిసిన తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్వీట్ చేశారు.

తన పర్యటన ముగిసే సమయానికి, కెర్రీ పునరుత్పాదక శక్తిపై భారతదేశ ట్రాక్ రికార్డును ప్రశంసించారు. కానీ నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాలకు భారత దేశం కట్టుబడి ఉందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

"కాప్[26]కి వెళ్లేలోగా భారతదేశం ఒక ప్రకటన చేస్తుందని అనుకుంటున్నాను. ఈ విషయంలో చాలా దేశాలు ఇంకా మౌనంగానే ఉన్నాయి. వాటి నుంచి కూడా స్పష్టమైన ప్రణాళికలను ఆశిస్తున్నాను’’ అని కెర్రీ వ్యాఖ్యానించినట్లు భారతీయ వార్తా పత్రికలు పేర్కొన్నాయి.

కెర్రీ ప్రణాళికలను భారత్ అమలు చేస్తే, ప్రపంచ వాతావరణ నాయకత్వంపై తిరిగి అమెరికా పట్టు సాధించడానికి పరోక్షంగా భారత్‌ సహాయ పడినట్లవుతుంది. వాతావరణం విషయంలో సానుకూలంగా లేని చైనాను ఎదుర్కొవడానికి అమెరికాకు ఇది అవకాశంగా మారుతుంది.

ఒక వేళ ఇండియా అలా చేయకూడదని నిర్ణయించుకుంటే ? అలాగే, చైనా "కేవలం వాతావరణం అయితే, సహకారం లేదు" అనే స్థితిని కొనసాగిస్తే?

భారత్‌, చైనాల మధ్య ఉన్న సమస్యలను పక్కన బెట్టి, గత వాతావరణ చర్చల సమయంలో మాదిరిగానే అభివృద్ధి చెందిన దేశాలను ఈ రెండు దేశాలు ప్రతిఘటిస్తాయా? ఇందుకు సమాధానాలు లేవు.

కానీ భారతదేశం, చైనా చర్యలు ప్రపంచ వాతావరణంపై అపారమైన ప్రభావాన్ని చూపుతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)